జార్ఖండ్‌లో వరాల వర్షం
ABN, Publish Date - Nov 06 , 2024 | 01:35 AM
జార్ఖండ్ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో, మంగళవారం ఇండియా కూటమి తన మేనిఫెస్టో విడుదల చేసింది. కూటమి పార్టీలైన జార్ఖండ్ ముక్తిమోర్చా (జెఎంఎం), కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఎం ఉమ్మడిగా ఏడుగ్యారంటీలతో..
జార్ఖండ్ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో, మంగళవారం ఇండియా కూటమి తన మేనిఫెస్టో విడుదల చేసింది. కూటమి పార్టీలైన జార్ఖండ్ ముక్తిమోర్చా (జెఎంఎం), కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఎం ఉమ్మడిగా ఏడుగ్యారంటీలతో ఈ మేనిఫెస్టోను ప్రకటించాయి. పదిలక్షలమంది యువతకు ఉపాధి, పదిహేను లక్షల రూపాయలవరకూ ఆరోగ్యబీమా, నాలుగువందల యాభైరూపాయలకే సిలండర్, మహిళలకు నెలకు రెండున్నరవేల రూపాయలు, ప్రతివ్యక్తికీ ఏడుకేజీల ఆహారధాన్యాలు, వరి కనీసమద్దతుధరను ఎనిమిదివందల రూపాయలు పెంచడం, వెనుకబడిన తరగతులవారికి ప్రత్యేక కమిషన్, మైనారిటీల హక్కుల పరిరక్షణ ఇందులో ఉన్నాయి. జార్ఖండ్‌లో ఉన్నవి 81 సీట్లే కానీ, అక్కడ రెండువిడతల్లో, ఈనెల 13, ౨0 తేదీల్లో పోలింగ్ జరపాలని ఎన్నికల సంఘం నిర్ణయించుకుంది. గత ఎన్నికల్లో బీజేపీ కంటే ఓ ఐదుసీట్లు ఎక్కువ తెచ్చుకున్న జెఎంఎం, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. స్థాయితో సంబంధం లేకుండా ప్రతీ చిన్న ఎన్నికనూ తీవ్రంగా తీసుకొనే బీజేపీ ఈ మారు జార్ఖండ్‌ను స్వాధీనం చేసుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తోంది.
బీజేపీ ఇప్పటికే విడుదల చేసిన మేనిఫెస్టోలో, తాను అధికారంలోకి రాగానే 2.87లక్షల ప్రభుత్వోద్యోగాలను భర్తీచేస్తానని, నెలకు రెండువేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇవ్వడంతోపాటు, మహిళలకు వివిధ పథకాలద్వారా దండిగానే ఆర్థికసాయం ప్రకటించింది. పదేళ్ళక్రితం బీజేపీ ఆదివాసీయేతరులను, ప్రధానంగా ఓబీసీలను దగ్గరచేర్చుకొని జార్ఖండ్‌లో అధికారంలోకి రాగలిగింది. ఆ ఎన్నికల్లో మోదీ హవా ఉధృతంగా ఉన్నందువల్ల కూడా ఆ ఎత్తుగడ సులువుగా పనిచేసింది, ఓబీసీ నాయకుడు రఘుబర్‌దాస్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడింది. కానీ, ఐదేళ్ళక్రితం బీజేపీయేతర శక్తులన్నింటినీ దగ్గరకు చేర్చుకోగలిగిన జెఎంఎంకు అనుకూలంగా గాలి తిరిగిపోయింది. ఆదివాసులను విస్మరించినందునే అధికారాన్ని చేజార్చుకున్నానని బీజేపీ నమ్ముతున్నందున ఈ మారు వారి ఓట్లను సైతం అధికంగా కొల్లగొట్టేందుకు విశేషమైన ప్రయత్నం చేస్తోంది. జార్ఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి (యూసిసి)ని అమలుచేస్తానని ప్రకటించిన ఆ పార్టీ దానినుంచి ఆదివాసులను మాత్రం మినహాయించింది. ఇందుకు పూర్తిభిన్నంగా జెఎంఎం ఆదివాసులకు 1932 నాటి ఖతియాన్ విధానం ఆధారంగా సర్నా మతనియమావళిని అమలుచేసి ఒక ప్రత్యేక ఆదివాసీ మత గుర్తింపునకు హామీ పడుతోంది. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం ఐదు ఎస్టీ రిజర్వుడు సీట్లనూ ఇండియా బ్లాక్ గెలుచుకున్న విషయం తెలిసిందే.
ఆదివాసుల ఓట్లకోసం బీజేపీ ఎంతగా కష్టపడుతోందో సోమవారం ఎన్నికల సభలో మోదీ చేసిన వ్యాఖ్యలు తెలియచెబుతాయి. రాష్ట్ర బీజేపీ ఉధృతంగా ప్రచారం చేస్తున్న అంశాలను ఆయన కాస్తంత హుందాగా చెప్పారంతే. బంగ్లాదేశీ అక్రమ వలసదారులు జార్ఖండ్ మూలమూలల్లోకి చొరబడ్డారని, వారికి దొంగసర్టిఫికేట్లు ఇచ్చి స్థిరపరచడం ద్వారా ఇండియా కూటమిలోని పార్టీలు అతిపెద్ద ఓటుబ్యాంకును తయారుచేసుకున్నాయని, ఆ చొరబాటుదారులు గిరిజన ఆడబిడ్డలమీద అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని, విద్యాసంస్థలకు మైనారిటీ గుర్తింపుతో ఆదివాసీ విద్యార్థులకు జెఎంఎం ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదని బీజేపీ విమర్శ. సంథాల్ పరగణాస్‌లో పెద్దసంఖ్యలో అక్రమ చొరబాటుదారులు స్థిరపడ్డారంటూ జార్ఖండ్ హైకోర్టులో ఒక పిల్ దాఖలు కావడం, దానిపై మీడియాలో విస్తృతంగా చర్చ జరుతూండటం ఎన్నికల మహత్యమే కావచ్చు. జెఎంఎం–కాంగ్రెస్ కూటమి ఏలుబడిలో అన్ని రకాలుగా అన్యాయమైపోయిన ఆదివాసుల ప్రయోజనాలను పరిరక్షించేది తానేనని బీజేపీ చెబుతోంది.
ఒక భూకుంభకోణంలో హేమంత్ సొరేన్ అరెస్టు, సుప్రీంచొరవతో విడుదల కావడం, హేమంత్ భార్య కల్పనా సొరేన్ తెరమీదకు రావడం ఇత్యాది పరిణామాలు నిజానికి జెఎంఎంకు కొత్తశక్తిని ఇచ్చాయి. మహిళా ఓటర్లను ఆమె బలంగా ఆకర్షించగలుగుతున్నదని అంటారు. అయితే, ఓబీసీలు, ఎగువకులాల ఓట్లు అధికంగా బీజేపీపక్షాన ఉన్నందున ఇండియా కూటమిని ఆదుకోవాల్సింది ప్రధానంగా రాష్ట్రజనాభాలో దాదాపు 27శాతంగా ఉన్న ఆదివాసులే. హేమంత్ సొరేన్ మీద కేసులు, అనంతరం చంపయ్ సొరేన్ బీజేపీలో చేరడం ఇత్యాది పరిణామాల మీద జార్ఖండ్ వాసులు ఏ తీర్పు ఇచ్చారో నవంబరు 23న తేలుతుంది.
Updated Date - Nov 06 , 2024 | 01:35 AM