ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sonia Gandhi : తెలంగాణ మాతృమూర్తి సోనియా

ABN, Publish Date - Dec 07 , 2024 | 12:36 AM

తెలంగాణ రాష్ట్రంపై సోనియాకు ఉన్న ప్రేమ ప్రత్యేకమైంది. ప్రత్యేక తెలంగాణ కోసం 1969 నుండి జరిగిన అనేక ఉద్యమాలు, బలిదానాలను దృష్టిలో ఉంచుకుని, తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేస్తామని 2004లో కరీంనగర్ వేదికగా సోనియాగాంధీ హామీ

Sonia Gandhi

తెలంగాణ రాష్ట్రంపై సోనియాకు ఉన్న ప్రేమ ప్రత్యేకమైంది. ప్రత్యేక తెలంగాణ కోసం 1969 నుండి జరిగిన అనేక ఉద్యమాలు, బలిదానాలను దృష్టిలో ఉంచుకుని, తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేస్తామని 2004లో కరీంనగర్ వేదికగా సోనియాగాంధీ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం 2009 డిసెంబర్ 9న హోం మంత్రి చిదంబరం ద్వారా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రకటింపజేశారు. అలా తెలంగాణ ప్రజల కలను నెరవేర్చడమే కాకుండా 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఆమె ఎనలేని కృషి చేశారు. తెలంగాణ ప్రజలకు ఆమె తల్లితో సమానం.

కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం... ప్రపంచానికే ఆదర్శం. అధికారం కోసం ఆమె రాజకీయాల్లోకి రాలేదు. రాజకీయ కుటుంబంలో ఉన్నా ఒక సాధారణ గృహిణిగానే పరిమితమైన ఆమెను విషాదకరమైన పరిస్థితులు రాజకీయాల్లోకి నడిపించాయి. వార్డు మెంబర్ పదవిని త్యాగం చేయడానికి కూడా సిద్ధపడని నేటి రోజుల్లో మూడుసార్లు ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసి కర్మయోగిలా రెండు విడతలలో మొత్తం 22 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఆమె సేవలు అందించారు. లౌకికవాదానికి కట్టుబడుతూ కులం, మతం, ప్రాంతం, భాష... ఇలా ఏ విషయంలోనూ వివక్ష చూపకుండా అన్ని వర్గాలను ఆదరించే నెహ్రూ–గాంధీ వారసత్వాన్ని ఆమె కొనసాగిస్తున్నారు.

‘‘దుఃఖాన్ని మర్చిపోలేం... అలాగని అధిగమించలేం. దానితో కలిసి బతకడం నేర్చుకోవాలి’’ అని సంజయ్ గాంధీ మరణించినప్పుడు ఇందిరాగాంధీ చెప్పిన మాటలను సోనియాగాంధీ తన జీవితానికి అన్వయించుకున్నారు. రాజకీయాల్లోకి రావాల్సి వస్తుందని సోనియా ఏనాడు ఊహించలేదు.

దురదృష్టవశాత్తు 1984 అక్టోబర్ 31న ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ హత్యతో సోనియాగాంధీ అంతులేని దిగ్ర్భాంతికి గురయ్యారు. అనంతరం రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రి అయ్యాక సోనియా ఎక్కువగా ఆయన్నే అంటిపెట్టుకుని ఉండేవారు. ఆయన కోసం పిల్లలతో గడిపే సమయాన్ని కూడా ఆమె త్యాగం చేశారు. రాజీవ్‌గాంధీ బయటికెళ్లాక ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చేవరకు తాను, పిల్లలు భయంతో ఉండేవాళ్లం అని ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన మాటలను బట్టి అప్పటి వారి వేదనను అర్థం చేసుకోవచ్చు.

1991 లోక్‌సభ ఎన్నిక ప్రచారానికి రాజీవ్‌ దేశవ్యాప్తంగా పర్యటించాల్సి ఉండడంతో, సోనియాగాంధీని అమేథి నియోజకవర్గం చూసుకోమని ఆయన చెప్పారు. ఆమె అమెథీ ప్రజలతో మమేకమై అక్కడ రాజీవ్‌గాంధీని అఖండ విజయంతో గెలిపించినా దురదృష్టవశాత్తు ఆ విజయాన్ని ఆస్వాదించడానికి ఆయన లేరు. రాజీవ్ గాంధీ గురించి ఆమె భయపడినట్టే తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆయన ఉగ్రవాదుల ఆత్మహుతి దాడిలో హత్యకు గురయ్యారు. ఏడేళ్ల వ్యవధిలో దేశం కోసం ఇద్దరు కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న సోనియాగాంధీ తీవ్ర నిరాశా నిస్పృహల్లోకి జారిపోయారు. రాజీవ్ మరణం తర్వాత కాంగ్రెస్ అధ్యక్షపదవి చేపట్టి, ప్రధానమంత్రి కావాలని యావత్ దేశం కోరినా సోనియాగాంధీ తిరస్కరించి, రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

దేశంలో కుల, మత రాజకీయాలు పెరిగిపోవడంతో లౌకికవాదంతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా బలహీనపడడంతో, పార్టీలోని సీనియర్ నాయకుల ఒత్తిడితో సోనియాగాంధీ 1997లో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అనంతరం 1998లో పార్టీ అధ్యక్ష పదవి చేపట్టారు. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ 114 స్థానాలు గెలవడంతో సోనియాగాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ప్రజల గొంతుకయ్యారు.

‘షైనింగ్ ఇండియా’ అంటూ గారడి మాటలతో గడిపిన వాజపేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతగా సోనియాగాంధీ అలుపెరగని పోరాటం చేశారు. 2004 ఎన్నికల సందర్భంగా ‘కాంగ్రెస్ కీ హాత్.. గరీబోంకీ సాత్’ (కాంగ్రెస్ హస్తం.. పేదల నేస్తం) అనే నినాదం ఇచ్చి దేశ ప్రజల మనస్సులను చూరగొనడమే కాకుండా 2004లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం చేపట్టడానికి ఆమె ఎంతో కృషిచేశారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించడానికి, లౌకికవాదాన్ని కాపాడడానికి ఆమె ప్రతిపక్ష పార్టీలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి యూపీఏ కూటమిని ఏర్పాటు చేశారు.

సోనియాగాంధీ 2003లో దేశవ్యాప్తంగా పర్యటించి దాదాపు 150 ర్యాలీల్లో పాల్గొన్నారు. దీంతో బెంబేలెత్తిన బీజేపీ ఆమెపై వ్యక్తిగత దూషణలు చేయడంతో ‘ఇది నా మెట్టినిల్లు. మట్టిలో కలిసిపోయే వరకు నేను భారతీయురాలినే. ఈ దేశం నా ప్రాణం కంటే ఎక్కువ’ అని వారి కుట్రలకు సమాధానం ఇచ్చారు.


వామపక్ష పార్టీల మద్దతుతో 2004లో సోనియాగాంధీకి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. కానీ ఓటమి చెందిన బీజేపీ ఆమెపై కక్షగట్టి అనేక రకాలుగా అడ్డుపడింది. విదేశీ మహిళ ప్రధానమంత్రి అయితే తాను గుండు గీయించుకుని తెల్లచీర కట్టుకుంటానని బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అయినా, ఆమెపైన ఎటువంటి కక్షను పెంచుకోకుండా సుష్మాస్వరాజ్ బతికున్నంత కాలం ఆమెతో సోనియాగాంధీ ఎంతో సన్నిహితంగా ఉండేవారు. తనకు పదవి కంటే దేశం సుభిక్షంగా ఉంటే చాలు అని తలచిన సోనియాగాంధీ ప్రధాని పదవిని త్యాగం చేశారు. వారి బెదిరింపులకు భయపడి ఆమె వెనకడుగు వేయలేదు. వారి విమర్శలను కూడా సానుకూలంగానే తీసుకున్నారు. ‘వారు నన్ను విదేశీయురాలిగా చూస్తున్నారని నేనెప్పుడూ అలా భావించలేదని, ఒక భారతీయురాలిగా దేశాభివృద్ధి కోసం కృషి చేస్తాను..’ అని ఎంతో సహనంతో పరిణతితో కూడిన సమాధానం ఇచ్చారు. దేశాభివృద్ధి కోసం అనుభవజ్ఞుడైన, నిజాయతీపరుడైన ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి పదవి చేపట్టేందుకు కృషి చేయడంతోపాటు ఆయనకు 10 సంవత్సరాలపాటు సంపూర్ణ మద్దతు అందజేశారు.

దేశ సమస్యలను పరిష్కరించేందుకు సోనియాగాంధీ నేతృత్వంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ ‘నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్’ అనేక సంస్కరణలపై అధ్యయనం చేసి, ఎన్.ఏ.సీ ద్వారా ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు, యూపీఏ ప్రభుత్వానికి అనేక సిఫార్సులు చేశారు. సమాచార హక్కు చట్టం, ఆహార భద్రత చట్టం, విద్యాహక్కు చట్టం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ వంటి ప్రపంచంలోనే సంచలనమైన పథకాలను యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టడంలో సోనియాగాంధీ కృషి వెలకట్టలేనిది.

సోనియాగాంధీ దేశం కోసం పలు విప్లవాత్మక నిర్ణయాలను తీసుకుంటుంటే ఓర్వేలేని బీజేపీ నిరాధార ఆరోపణలు చేస్తే ఆమె ఎన్.ఏ.సీ చైర్మన్ పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేసి, పదవులు తనకు తృణప్రాయమని మరోసారి నిరూపించారు. సోనియాగాంధీ యూపీఏ చైర్మన్‌గా ఉన్నప్పుడే చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టారు. ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నప్పుడే దేశానికి తొలి మహిళా రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్, తొలి దళిత మహిళా లోక్‌సభ స్పీకర్‌గా మీరా కుమార్ ఎంపిక మహిళలకు ఆమె ఇచ్చే ప్రాధాన్యతకు నిదర్శనం. పదవిపై ఎలాంటి ఆశల్లేని సోనియాగాంధీ 2009 ఎన్నికల సమయంలో డాక్టర్ మన్మోహన్ సింగే మళ్లీ ప్రధానమంత్రిగా ఉంటారని ప్రకటించి రెండోసారి యూపీఏ అధికారం రావడానికి కృషి చేశారు.


తెలంగాణ రాష్ట్రంపై సోనియాకు ఉన్న ప్రేమ ప్రత్యేకమైంది. ప్రత్యేక తెలంగాణ కోసం 1969 నుండి జరిగిన అనేక ఉద్యమాలు, బలిదానాలను దృష్టిలో ఉంచుకుని, తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేస్తామని 2004లో కరీంనగర్ వేదికగా సోనియాగాంధీ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం 2009 డిసెంబర్ 9న హోం మంత్రి చిదంబరం ద్వారా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని ప్రకటింపజేశారు. అలా తెలంగాణ ప్రజల కలను నెరవేర్చడమే కాకుండా 2014లో ప్రత్్యేక రాష్ట్రం ఏర్పడడానికి ఆమె కృషి చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన సోనియా గాంధీ ఈ ప్రాంత ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. తెలంగాణ ప్రజలకు ఆమె తల్లితో సమానం.

సెంటిమెంట్ పేరుతో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేయడంతో, తెలంగాణ కోసం కొట్లాడింది, ఇచ్చింది సోనియమ్మ నేతృత్వంలోని కాంగ్రెస్సే అని ప్రజలు విశ్వసించి తెలంగాణలో 2023లో కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారు.

దేశంలోనే అత్యున్నతి పదవైన ప్రధానమంత్రి పదవిని మూడుసార్లు త్యాగం చేసి సుదీర్ఘకాలం పార్టీ అధ్యక్షురాలిగా సేవలందించిన చరిత్ర ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ‘కొన్ని రోజుల కింద నా తండ్రే నా హీరో అని చెప్పాను. ఇప్పుడు నాకు ఇంకో హీరో కూడా ఉన్నారు. అది మా అమ్మ. మా నాన్నమ్మ, మా నాన్న చనిపోయిన తర్వాత అమ్మ పోరాటం చూశాను. ఆ తర్వాత ప్రత్యర్థులపై చేసిన పోరాటాన్ని చూశాను..’ అని 2004 విజయం తర్వాత రాహుల్‌గాంధీ మీడియాతో చెప్పిన మాటలు నాకింకా గుర్తే. నిజమే, రాహుల్‌గాంధీ మాట సత్యమే. ఎన్నో విషాదాలు, ఎన్నో విజయాలు, ఎన్నో అపజయాలు అంతకుమించి అత్యున్నత త్యాగాలను చేసిన సోనియాగాంధీ నిజజీవితంలో కూడా హీరోనే! ఇంతేకాకుండా సోనియాగాంధీ దేశం కోసం, ప్రజల కోసం చేసిన అనేక త్యాగాలను గమనిస్తే ఆమె జీవితం త్యాగాలకు చిరునామా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

బి.మహేశ్ కుమార్‌గౌడ్

టీపీసీసీ అధ్యక్షులు

(డిసెంబర్‌ 9: సోనియాగాంధీ పుట్టిన రోజు)

Updated Date - Dec 07 , 2024 | 12:36 AM