ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

క్రీడల కుంభమేళా కల!

ABN, Publish Date - Nov 12 , 2024 | 12:16 AM

ప్రతిష్ఠాత్మక ఒలింపిక్‌ పోటీలు నిర్వహించాలన్న స్వప్నం సాకారం చేసుకునే దిశగా భారత్‌ తొలి అడుగువేసింది. 2036లో ఒలింపిక్స్‌ నిర్వహించేందుకు తమకు ఆసక్తి...

ప్రతిష్ఠాత్మక ఒలింపిక్‌ పోటీలు నిర్వహించాలన్న స్వప్నం సాకారం చేసుకునే దిశగా భారత్‌ తొలి అడుగువేసింది. 2036లో ఒలింపిక్స్‌ నిర్వహించేందుకు తమకు ఆసక్తి ఉన్నదంటూ భారత ప్రభుత్వం అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ)కి అధికారికంగా ఓ లేఖ పంపింది. దీంతో సాధారణ ఒలింపిక్స్‌, ఆ వెంటనే జరిగే పారాలింపిక్స్‌ నిర్వహణను దక్కించుకునేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించబోతున్నదన్న విషయం స్పష్టమైంది. ఈ క్రీడల ఆతిథ్యం కోసం పోటీ తీవ్రంగా ఉండనుంది. హక్కుల కైవసానికి పోటీపడే దేశాల సంఖ్య రెండంకెల్లో ఉందట. వీటిలో సౌదీ అరేబియా, ఇండోనేసియా, కతార్‌, తుర్కియే నుంచి భారత్‌కు గట్టిపోటీ ఎదురవవచ్చు. దీనికి ముందు 2030లో జరిగే యూత్‌ ఒలింపిక్స్‌కు సైతం మనమే వేదికగా నిలవాలని మోదీ ఆకాంక్షించారు.


మన ప్రయత్నాలు సఫలమై భారత్‌కు ఒలింపిక్స్‌ కేటాయిస్తే అవి ఏ నగరంలో జరుగుతాయన్న విషయమై ఇప్పటికే ఓ స్పష్టత వచ్చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం అహ్మదాబాద్‌కు ప్రధాన వేదికగా అవకాశం ఇస్తారన్న విషయమూ అవగతమైంది. భారత క్రీడాప్రాథికార సంస్థకు చెందిన మిషన్‌ ఒలింపిక్‌ సెల్‌ (ఎంఓసీ) సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ భారత ఒలింపిక్‌ స్వప్నాన్ని ఆవిష్కరించారు. మోదీ ఆకాంక్ష నెరవేరితే భారత్‌ ఈ ఘనతను అందుకున్న నాలుగో ఆసియా దేశంగా గణుతికెక్కుతుంది. ఇంతకుముందు చైనా, దక్షిణ కొరియా, జపాన్‌ దేశాల్లో ఒలింపిక్స్‌ జరిగాయి. అన్నీ కలిసివచ్చి భారత్‌కు ఆ భాగ్యం దక్కితే.. మన దేశంలో ప్రజాదరణ పొందిన కొన్ని క్రీడల్ని జాబితాలో చేర్చడం దాదాపు ఖరారైనట్టే. వాటిలో టీ20 క్రికెట్‌, యోగా, కబడ్డీ, ఖో–ఖో, చెస్‌, స్క్వాష్‌లను పొందుపరుస్తారని భావిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చిలో ఐఓసీకి ఎన్నికలు జరిగిన అనంతరం మాత్రమే వేదిక ఖరారవుతుంది. ఇక 2036 కంటే ముందు 2028లో అమెరికా, 2032లో ఆస్ర్టేలియాలో ఒలింపిక్స్‌ జరగనున్నాయి. మరోవైపు భారత్‌కు ఒలింపిక్స్‌ కేటాయింపు చేయరాదంటూ పాకిస్థాన్‌ ఓ వ్యతిరేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాలని యోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. పాక్‌ వేదికగా జరగాల్సిన ఛాంపియన్స్‌ ట్రోఫీ క్రికెట్‌ టోర్నీకి మన జట్టును పంపేందుకు భారత ప్రభుత్వం నిరాకరిస్తున్న నేపథ్యంలో దానికి పాక్‌ ప్రతీకారం తీర్చుకోవాలని యోచిస్తోందంట. ఈ మేరకు అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీని సంప్రదించి, భారత్‌కు నిర్వహణ అవకాశం ఇవ్వరాదని దాయాది దేశం కోరనుందట.


భారత్‌ వేదికగా 1951, 1982 సంవత్సరాల్లో ఆసియా క్రీడలు, ఆ తర్వాత 2010లో ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్‌ క్రీడలు జరిగాయి. కామన్వెల్త్‌ క్రీడలకు సంబంధించి లోపభూయిష్టమైన నిర్వహణ, అవినీతి ఆరోపణలు, భద్రతాపరమైన సమస్యలతో భారత్‌ ప్రతిష్ఠ మసకబారింది. కామన్వెల్త్‌ పోటీల నిర్వహణను అస్తవ్యస్తం చేసిన మన వ్యవస్థలు ఒలింపిక్స్‌ విషయంలో అత్యంత జాగరూకతతో వ్యవహరించాలి. క్రీడల కుంభమేళాగా చెప్పుకునే ఒలింపిక్స్‌ నిర్వహణలో ఖర్చు అంశం అన్నింటిలోకీ అత్యంత ప్రధానమైనది. అనుకున్న అంచనాలు అవధులు దాటడం సర్వసాధారణం. ఆటలు ముగిశాక ఆర్థికంగా కునారిల్లిన దేశాలను చూశాం. ఆటల పండుగను నిర్వహించే చాన్స్‌ లభిస్తే ఆయా నగరాల్లో కొంతమేర పర్యాటకం అభివృద్ధి చెందవచ్చునుగాక. అలాగే మౌలిక వసతులూ, అంతర్జాతీయ స్థాయి స్టేడియాలు సమకూరుతాయనడంలోనూ సందేహంలేదు. అయితే ఆ తర్వాతే అసలు సమస్య ఉత్పన్నమవుతుంది. అట్టహాసంగా నిర్మించిన స్టేడియాలు తెల్ల ఏనుగుల్లా మారిపోతాయి. స్టేడియాల ఆలనాపాలనా తలకుమించిన భారమవుతుంది. అంతేకాదు, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నది ఆర్థిక నిపుణుల అంచనా. తాజాగా జరిగిన పారిస్‌ ఒలింపిక్స్‌ కోసం ఆ దేశం సుమారు 77 వేలకోట్ల రూపాయలు ఖర్చుపెట్టింది. అయితే భారత్‌లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి వుంటుంది.


ఓ అధ్యయనం ప్రకారం ఒలింపిక్స్‌ను నిర్వహించిన అనంతరం ఆయా దేశాల ఆర్థిక ప్రగతి తీవ్రంగా మందగించింది. దీనికి ప్రధాన కారణం క్రీడలకు అవసరమైన మౌలిక సదుపాయాలపై పెట్టిన ఖర్చు పూర్తిగా నిరుపయోగంగా మారడమే. ఉదాహరణకు 1988 సియోల్‌ ఒలింపిక్స్‌ తర్వాతి ఏడాది దక్షిణ కొరియా జీడీపీ దారుణంగా పడిపోయింది. ఇక గ్రీసు, ఏథెన్స్‌, రియో క్రీడల తర్వాత ఆ దేశాల పరిస్థితి కూడా ఇదే. 2016 రియో క్రీడలకోసం ఉపయోగించిన స్టేడియాల్లో చాలావరకు ఇప్పటికీ నిరుపయోగంగానే ఉన్నాయి. 1976 ఒలింపిక్స్‌ నిర్వహించిన కెనడాకు ఆ అప్పులనుంచి బయటపడడానికి మూడు దశాబ్దాలు పట్టింది. ఆతిథ్య దేశాలు నిర్వహణ ఖర్చు విషయంలో అత్యంత ప్రణాళికబద్ధంగా వ్యవహరించినా బిలియన్‌ డాలర్ల నష్టాలు మామూలే. ఏదేమైనా పోటీల నిర్వహణ అవకాశం భారత్‌కు దక్కుతుందా లేదా అనేది నిర్ధారణ కావడానికి మరికొంత సమయముంది. ఆ అవకాశం భారత్‌కు దక్కితే గత పోటీల ఆతిథ్య దేశాల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాల్సివుంది. అనవసర ఖర్చులు, ఆడంబరాలకు పోకుండా నియంత్రించుకోవాలి. క్రీడా సంస్కృతి లోపించిన భారత్‌లో ఒలింపిక్స్‌ నిర్వహణతోనైనా ప్రజల్లో ఆ దిశగా కొంతమేర అవగాహన ఏర్పడినా అదే పదివేలు.

Updated Date - Nov 12 , 2024 | 12:16 AM