ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పంటలపై కోతులు, వీధుల్లో కుక్కలు!

ABN, Publish Date - Aug 23 , 2024 | 05:50 AM

తెలంగాణ ప్రజలు రోజువారీ జీవితంలో ఎదుర్కొంటున్న అతి ప్రధాన సమస్యలు ఏమిటి అని ప్రశ్నించుకుంటే మొదటి ఐదింట్లో ఖచ్చితంగా కోతులు, కుక్కల వల్ల ఎదురవుతున్న ఇబ్బందుల ప్రస్తావన వస్తుంది. సమస్య తీవ్రతను గుర్తెరిగి నేను

తెలంగాణ ప్రజలు రోజువారీ జీవితంలో ఎదుర్కొంటున్న అతి ప్రధాన సమస్యలు ఏమిటి అని ప్రశ్నించుకుంటే మొదటి ఐదింట్లో ఖచ్చితంగా కోతులు, కుక్కల వల్ల ఎదురవుతున్న ఇబ్బందుల ప్రస్తావన వస్తుంది. సమస్య తీవ్రతను గుర్తెరిగి నేను శాసనమండలిలో దీన్ని లేవనెత్తాను, సత్వరమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించాను. జంతువులు వైరస్‌ని తీసుకువెళతాయి. అవి మనుషులకు సోకితే జరిగే విపత్కర పరిణామాలకు అంతు ఉండదు. దీన్నో సామాజిక సమస్యగా గుర్తించాలి. రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు, ప్రజా సంఘాలు కలిసికట్టుగా కృషి చేయాలి.

కోతుల బెడద పంటలపై కూడా ప్రభావం చూపుతున్నది. కొన్ని ప్రాంతాల్లో రైతులు పంటల తీరును మార్చుకున్నారు. వేరుశెనగ, పచ్చి శెనగలు, కూరగాయలు, ఇంటి తోటలు, ఇళ్లలోని పండ్ల చెట్లు వంటి పంటలను కోతులకు భయపడి రైతులు వదులుకున్నారు. ఈ జంతువులు ఇప్పుడు ధాన్యం ఏర్పడే ప్రారంభ దశలో వరిని తింటున్నాయి. చాలామంది రైతులు తాము కోరుకున్న పంటలను సాగు చేయలేకపోతున్నారు. సాగు చేస్తున్న పంటల ఉత్పాదకతను కోల్పోతున్నారు. కోతులు, ఇతర జంతువుల కారణంగా వ్యవసాయ ఉత్పాదకత మొత్తం నష్టం సంవత్సరానికి కనీసం రూ.5వేల కోట్ల నుంచి రూ.10వేల కోట్ల వరకు ఉండవచ్చు. ఉదాహరణకు వేరుశెనగ ఉత్పత్తి విలువ రూ.2000కోట్లకు దగ్గరగా ఉంటుంది. కోతుల బెడదతో చాలామంది రైతులు ఆ పంటను చాలా ప్రాంతాల్లో వదిలేశారు. ఈ జంతువులు పత్తి పంటను కూడా వదలడం లేదు. కాబట్టి ఈ జంతువుల వల్ల ఆర్థిక నష్టం దాదాపు రూ.10వేల కోట్లకు చేరువలో ఉంటుంది. రైతులకు ఎంత నష్టం వాటిల్లిందో అంచనా వేయడానికి సరైన సర్వే చేపట్టాలి.


తెలంగాణలో కోతుల కాటు కారణంగా ప్రతి ఏటా అనేక మరణాలు కూడా నమోదవుతున్నాయి. హైదరాబాద్ నగరంతో సహా గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా కోతులు, కుక్కలు మనుషులపై దాడులు చేస్తూనే ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికి వెళ్లడానికి జంకుతున్నారు. వృద్ధులు వీధుల్లో ఒంటరిగా నడవడం లేదు. వీటి బెడద సాధారణ జనజీవనానికి ఇబ్బందిగా మారింది. కోతుల, కుక్కల నుంచి రక్షణ కోసం రాష్ట్రంలో ప్రతీ వ్యక్తి ఎంతో కొంత ఖర్చు పెట్టాల్సి వస్తున్నది. కోతుల నుండి రక్షించడానికి ఇంటి చుట్టూ సోలార్ ఫెన్సింగ్ వేసుకోవాల్సి వస్తున్నది. సోలార్ ఫెన్సింగ్ వేలాది రూపాయల ఖర్చుతో కూడుకున్నదైనప్పటికీ, కొన్నిసార్లు ఫలితం కూడా ఇవ్వదు. కొన్ని చోట్ల కోతులను బెదిరించి పంపడానికి కొండెంగలను కూడ తీసుకొచ్చారు కానీ, ఆ ప్రయోగం కూడా పెద్దగా ఫలించలేదు. ఈ సమస్యకు తక్షణ, దీర్ఘకాలిక పరిష్కారం వెతకడం అనివార్యం.

ఈ ముప్పును నివారించే చర్యలను ప్రారంభించే ముందు ప్రభుత్వం కొన్ని పనులు చేయాలి. వివిధ జిల్లాల్లో సమస్య తీవ్రత, ప్రభావంపై సర్వే నిర్వహించాలి. సమస్యను పరిష్కరించేందుకు అన్ని రాజకీయ పార్టీలు కమిటీలో ఉండేలా అన్ని పార్టీల శాసనసభా పక్ష బృందాన్ని ఏర్పాటు చేయాలి. ఈ కమిటీ క్రమం తప్పకుండా పరిస్థితిని సమీక్షించాలి. సరైన అధికారాలతో ప్రత్యేక మంకీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి. ఈ సమస్యను తొలగించే వరకు దానిని ఎదుర్కోవడానికి నిధులను అందిచాలి. సర్వే పూర్తయిన తర్వాత ఆడ, మగ కోతులకు సామూహిక స్టెరిలైజేషన్‌ చేయించాలి. స్టెరిలైజేషన్ తర్వాత సదరు కోతి, కుక్కకు గుర్తింపు సంఖ్య ఇవ్వాలి. మళ్లీ అదే కుక్క, కోతి పట్టబడితే మళ్లీ స్టెరిలైజ్ చేయాల్సిన అవసరం ఉండదు. రేబిస్ మరియు ఇతర వ్యాధులను తగ్గించడానికి టీకాలు ఏకకాలంలో వేయాలి. ప్రతి మండలానికి కనీసం ఒకటి చొప్పున సురక్షితమైన పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలి. స్టెరిలైజ్ చేసిన కోతులను ఓపెన్ ఎన్‌క్లోజర్‌లలో ఉంచవచ్చు, తద్వారా ఆసక్తి ఉన్న వ్యక్తులు వాటిని సందర్శించి ఆహారం ఇవ్వవచ్చు. కుక్కల యాజమానులపైన కూడా నియంత్రణను అమలులోకి తీసుకురావాలి. కుక్కను పెంపుడు జంతువులుగా ఉంచుకోవాలనుకుంటే దాని యజమాని ఇతరులకు ఎటువంటి గాయం కాకుండా ఉండేందుకు నియమాలు, నిబంధనలను అనుసరించటాన్ని తప్పనిసరి చేయాలి. తెలంగాణ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేవి వీధికుక్కలు. అందుకే వీధుల్లో కుక్కలు కనిపించకపోవడమే లక్ష్యంగా పనిచేయాలి.

తెలంగాణలో కోతుల, కుక్కల సమస్యకు కచ్చితమైన పరిష్కారం కనుక్కోవాల్సిన తక్షణ ఆవశ్యకత ఉంది. దీన్నో సామాజిక సమస్యగా గుర్తించాలి. పరిష్కారానికి అన్ని పార్టీలు, సామాజిక సంస్థలు, ప్రజా సంఘాలు కలిసికట్టుగా కృషి చేయాలి.

తక్కెళ్లపల్లి రవీందర్‌రావు

శాసనమండలి సభ్యులు

Updated Date - Aug 23 , 2024 | 05:50 AM

Advertising
Advertising
<