చట్టమే గెలవాలి...!
ABN, Publish Date - Dec 12 , 2024 | 05:08 AM
సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ రోజునుంచి ప్రార్థనాస్థలాల (ప్రత్యేక నిబంధనలు)చట్టం–1991మీద దాఖలైన పిటిషన్లను విచారించబోతోంది. స్వాతంత్ర్యం సిద్ధించిన 1947 ఆగస్టు 15నాటికి దేశంలోని ఆయా ప్రార్థనాస్థలాల మతస్థితిని యథాతథంగా
సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ రోజునుంచి ప్రార్థనాస్థలాల (ప్రత్యేక నిబంధనలు)చట్టం–1991మీద దాఖలైన పిటిషన్లను విచారించబోతోంది. స్వాతంత్ర్యం సిద్ధించిన 1947 ఆగస్టు 15నాటికి దేశంలోని ఆయా ప్రార్థనాస్థలాల మతస్థితిని యథాతథంగా పరిరక్షిస్తూ, వాటి స్వరూప స్వభావాలను మార్చే అన్ని ప్రయత్నాలను ఈ చట్టం నిషేధిస్తున్నది. అయోధ్యలో రామజన్మభూమి–బాబ్రీ మసీదు వివాదం నేపథ్యంలో, పీవీ నరసింహారావు ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టం ఆ ఒక్క వివాదాన్ని మాత్రం మినహాయిస్తూ మిగతా ప్రార్థనాస్థలాల జోలికి ఎవరూ పోకుండా అడ్డుకొనే ప్రయత్నం చేసింది. ఈ చట్టం రాజ్యాంగవిరుద్ధమనీ, కొట్టివేయాలనీ కోరుతూ దాఖలైన ఆరుపిటిషన్లపై న్యాయస్థానం చేపడుతున్న ఈ విచారణ భవిష్యత్ భారతంలో లౌకికవాదం, శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ముఖ్యమైనది. అయోధ్య వివాదం పరిష్కారంతో ఇక ఈ తరహా ఘర్షణలకు తెరపడుతుందనీ, సయోధ్య వెల్లివిరుస్తుందనీ అంతా అనుకున్నారు. కానీ, కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు వరుసగా రేపుతున్న మరిన్ని వివాదాలు మతవైషమ్యాలు పెంచుతున్న తరుణంలో, ఈ చట్టం ఉనికిమీద సర్వోన్నత న్యాయస్థానం రాబోయేరోజుల్లో ఏమి చెబుతుందోనని దేశప్రజలు ఎదురుచూస్తున్నారు.
పిటిషన్‌దారులలో సుబ్రహ్మణ్యస్వామి, న్యాయవాది అశ్విన్ ఉపాధ్యాయ పేర్లు ముఖ్యంగా చెప్పుకోవాలి. మధ్యయుగాల్లో కొందరు మతోన్మాదులు చేసిన అకృత్యాలకు ఈ నవయుగంలో జనం తన్నుకుచావకూడదన్న లక్ష్యంతో ఈ చట్టం రూపొందితే, దాని ఉద్దేశాన్ని వీరు తప్పుబడుతున్నారు. ఆనాటి దండయాత్రికుల దురాగతాలను ప్రశ్నించనివ్వకుండా, ఆ దురాక్రమణలను సవాలు చేయనివ్వకుండా ఈ చట్టం అడ్డుపడుతున్నదని వారి ఆరోపణ. యథాతథస్థితి పేరిట న్యాయస్థానాలనుంచి ప్రార్థనాస్థలాల వివాదాలకు పరిష్కారం దక్కనివ్వకుండా చేస్తున్నదనీ, అప్పటి చారిత్రక, సాంస్కృతిక అకృత్యాలకు ఇప్పుడు మరమ్మతులు జరగాల్సిందేనని వారి వాదన. అయోధ్య వివాదం దేశాన్ని ఎంతగా కుదిపేసిందో తెలిసిందే. దానికి న్యాయస్థానం అందించిన పరిష్కారంమీద భిన్నాభిప్రాయాలున్న విషయాన్ని అటుంచితే, అగ్గి అక్కడితో ఆరిపోకుండా దావానలంలాగా వ్యాపిస్తూండటం విచారకరం. పురాతన ఆలయాలను కూల్చి మసీదులు కట్టారనీ, అర్చనకు అనుమతించాలంటూ స్థానిక న్యాయస్థానాల్లో పిటిషన్లు వేస్తూండటం, అవి సరేననడం చూస్తున్నదే. మసీదు అడుగున ఏమున్నదో తేల్చడానికి దిగువకోర్టులు సర్వేలకు అనుమతిస్తుంటే, హైకోర్టులు సమర్థిస్తుంటే, సుప్రీంకోర్టు ఆట నియమాలను స్వల్పంగా మార్చి కానివ్వమనడం జరిగిపోతోంది. వారణాసిలో జ్ఞానవాపి, మధురలో షాహీ ఈద్గా, సంభాల్‌లో షాహీ జామా..ఇలా వివాదాలు సాగిపోతున్నాయి.
సుప్రీంకోర్టు 2019నాటి అయోధ్య తీర్పులో ఈ చట్టాన్ని ఘనంగా ప్రశంసించింది. అలనాటి ఘోరాలు, చారిత్రక అన్యాయాలను సరిదిద్దవలసిందేనంటూ వర్తమానంలో ఆయా మతస్థలాల రూపురేఖలను మార్చేందుకు చేసే ఏ ప్రయత్నాన్నీ అనుమతించకుండా, ఆదిలోనే అడ్డుపడుతూ ఈ చట్టం ఎంతో మంచిపనిచేసింది.. దేశప్రజల శాంతియుత సహజీవనానికి ఇది అత్యావశ్యకం అని గొప్పగా వ్యాఖ్యానించింది. కానీ, అదే న్యాయస్థానం ఈ చట్టాన్ని పరోక్షంగా బలహీనపరిచింది. అడుగున మందిరాలున్నాయన్న వాదనతో మసీదులను దెబ్బతీసే ప్రయత్నాలను నిలువరించలేదు. మూలాలు తెలుసుకుంటామని అంటున్నారు కానీ, స్వరూపాన్ని మారుస్తామనలేదు కదా అంటూ మాజీ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ రెండేళ్ళక్రితం జ్ఞానవాపి వివాదంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై కేంద్రప్రభుత్వం తన వైఖరి తెలియచేయకుండా, సర్వోన్నతన్యాయస్థానం తనకుతానుగా చొరవచూపకుండా, మరోపక్క దిగువకోర్టులను నియంత్రించకుండా ఒక జగన్నాటకం ఇంతకాలం సాగింది. అయోధ్యతో సరి, ఇక భవిష్యత్తులో సామాజిక అశాంతి రేగకూడదన్న ఈ చట్టం లక్ష్యం నెరవేరకుండా పోయింది. సంభాల్‌లో ఇటీవల జరిగిన హింస దేశ భవిష్యత్ పరిణామాలకు సంబంధించిన ఓ బలమైన హెచ్చరిక. బాబ్రీ కూల్చివేతకు ఒక ఏడాదిముందుగా, ఎంతో ముందుచూపుతో తయారైన ఈ మూడుదశాబ్దాలనాటి చట్టాన్ని నిలబెట్టుకోవడం దేశానికి శ్రేయస్కరం.
Updated Date - Dec 12 , 2024 | 05:08 AM