ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఫ్రీలాన్స్‌ జర్నలిజం... ‘సుప్రీం’ వ్యాఖ్యలు సబబేనా?

ABN, Publish Date - Nov 02 , 2024 | 06:13 AM

న్యాయవాద వృత్తిలో ఉంటూ జర్నలిస్టు వృత్తిలో ఎలా కొనసాగుతారంటూ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కమ్రాన్‌ అనే న్యాయవాది, బ్రజేష్‌ భూషన్‌ అనే ప్రజాప్రతినిధిపై

న్యాయవాద వృత్తిలో ఉంటూ జర్నలిస్టు వృత్తిలో ఎలా కొనసాగుతారంటూ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కమ్రాన్‌ అనే న్యాయవాది, బ్రజేష్‌ భూషన్‌ అనే ప్రజాప్రతినిధిపై వేసిన పరువునష్టం దావాపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో ఈ విషయమై ప్రస్తావన వచ్చింది. ఇదే అంశంపై జూలై 29న ‘‘అడ్వకేట్‌ వర్కింగ్‌ యాజ్ ఫ్రీలాన్సర్‌ ఈజ్‌ మిస్‌ కండక్ట్‌’’ అంటూ అడ్వకేట్‌ కమ్రాన్‌ విషయంపై విచారించాల్సిందిగా బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ)కి లేఖరాసింది. అయితే ఈ విషయానికి అప్పట్లో అంత ప్రాచుర్యం లభించలేదు. తాజాగా ‘‘మహ్మద్‌ కమ్రాన్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఉత్తరప్రదేశ్‌’’ కేసులో మళ్లీ అడ్వకేట్‌ డ్యుయల్‌ రోల్‌పై సుప్రీంకోర్టు కీలక ప్రకటన చేసింది. బీసీఐకి మరో లేఖ పంపినట్టు వార్తలు వచ్చాయి. న్యాయవాది రెండు వృత్తులను ఎలా నిర్వహిస్తారు అన్నది ఇక్కడ సుప్రీంకోర్టు అభ్యంతరం.

వాస్తవానికి జర్నలిస్టుకూ, ఫ్రీలాన్స్‌ జర్నలిస్టుకూ చాలా తేడా ఉంది. జర్నలిజం అనేది వృత్తి, కానీ ఫ్రీలాన్స్‌ జర్నలిజం కేవలం ప్రవృత్తి మాత్రమే. జర్నలిస్టులు/ రిపోర్టర్‌లు నిత్యం వార్త సేకరణ పనిలో ఉంటారు. వారు పని చేసే సంస్థలు వారికి ఇచ్చిన అసైన్‌మెంట్‌ పూర్తిచేసే పనిలో ఉంటారు. రెవెన్యూ, సర్క్యులేషన్‌ పెంచడం కూడా ఇటీవల వారి విధుల్లో భాగమైపోయింది. కానీ ఫ్రీలాన్స్‌ జర్నలిస్టుకు ఏ సంస్థతోనూ పూర్తిస్థాయి బాధ్యతాయుతమైన సంబంధాలు ఉండవు. వారు కేవలం కొన్ని విషయాలను మాత్రమే మక్కీకి మక్కి అందించాలి. ఎందుకంటే కొన్ని కొన్ని న్యూస్‌ ఏజన్సీలు మాత్రమే వీరిని వార్తల కోసం ఆశ్రయిస్తాయి. ప్రధాన స్రవంతి మీడియాలో వీరికి అవకాశాలు చాలా తక్కువ. ఫ్రీలాన్స్‌ జర్నలిస్టులు ఏ వ్యక్తికి లేదా సంస్థకు లేదా వ్యవస్థలకూ వ్యతిరేకంగా వార్తలు రాయరు. వివాదాల్లో తలదూర్చరు. ఏ సంస్థ పేరు మీద కూడా వ్యాపార ప్రకటనలు, లేదా ఇతర ఆర్థిక లావాదేవీలు జరిపే అవకాశం లేదు. వ్యాసకర్తలుగా సమాజంలో వస్తున్న ఆధునిక పోకడలు, విపత్తులు, మారుతున్న సామాజిక పరిస్థితులపై విశ్లేషణలు రాయడం వరకు ఫ్రీలాన్స్‌ జర్నలిస్టులకు సాధ్యమయ్యే పని. ఈ ప్రవృత్తిలో వీళ్లకు ఆర్థిక ప్రయోజనాలు ఉండే అవకాశాలు మృగ్యం. కానీ మహ్మద్‌ కమ్రాన్‌ విషయంలో జరిగింది పూర్తిగా విరుద్ధం. అతను ఫ్రీలాన్స్‌ జర్నలిస్టు ముసుగులో ఒక ప్రజాప్రతినిధిని టార్గెట్‌ చేయడంతో ఫ్రీలాన్స్‌ జర్నలిజాన్ని ఒక వృత్తిగా భావించి అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.



న్యాయవాది ఫ్రీలాన్స్‌ వ్యాసకర్తగా పని చేయడానికి వీల్లేదు అన్నప్పుడు న్యాయ విషయాలకు సంబంధించి, న్యాయస్థానాలకు సంబంధించి, వివిధ కోర్టు తీర్పులకు సంబంధించిన వార్తలు ఎవరు రాయాలీ అనే సందేహం కలగక మానదు. ఎందుకంటే సహజంగా రాసే వార్తలకూ న్యాయ పరిభాషలో రాసే వార్తలకూ కొంత వ్యత్యాసం ఉంటుంది. ఆయా జడ్జిమెంట్‌లను అర్థం చేసుకొని వార్త రూపంలో మలవాలంటే అది న్యాయవాద వృత్తిలో ఉంటూ భాష మీద పట్టు ఉన్నవాళ్లకు మాత్రమే సాధ్యమయ్యే విషయం. అలాగే రెండు వృత్తులు నిర్వహిస్తే రెండు వృత్తుల్లోనూ ఆర్థిక ప్రయోజనాలు ఉండాలి. కానీ ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేని వ్యాస రచనా ప్రవృత్తిని వృత్తిగా ఎలా గుర్తిస్తారనేది కూడా ఆలోచించాల్సిన విషయం. తాజాగా భారత ప్రధాన న్యాయమూర్తి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుప్రీంకోర్టు వార్తలు కవర్‌ చేయడానికి న్యాయవిద్య పూర్తిచేసి ఉండాల్సిన పని లేదని స్పష్టం చేశారు. న్యాయస్థానం వార్తలను కవర్‌ చేయాలి అంటే న్యాయవాది అయి ఉండాల్సిన పనిలేదన్న సీజేఐ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఈ వార్త సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది. సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

లీగల్‌ కంట్రిబ్యూటర్స్‌ ఫ్రీలాన్స్‌ జర్నలిస్టుల కిందికి వస్తారా లేక వాళ్లకు ఈ నియమం వర్తించదా? అన్న విషయానికి వద్దాం. లీగల్‌ కంట్రిబ్యూటర్స్‌ అన్న పదంలోనే కంట్రిబ్యూషన్‌ అనే మాట ఉంది. అంటే విరాళం అని అర్థం. న్యాయవాదులుగా పని చేస్తూ ఏదో ఒక పత్రికకు లీగల్‌ కంట్రిబ్యూటర్‌గా పనిచేస్తూ వాటికి లీగల్‌ అప్‌డేట్స్‌ అందించడం వీరి పని. శిక్షపడ్డ తీర్పులు, చెక్‌ కేసులు, ఐపీ దాఖలు వార్తలు, లోక్‌ అదాలత్‌ వార్తలు, కొత్తగా విధుల్లో చేరిన విషయాలపై వార్తలు, న్యాయాధికారుల ఇతర సిబ్బంది బదిలీ వార్తలు, న్యాయవాద సంఘాల కాన్ఫరెన్స్‌లు... ఇలా న్యాయస్థానానికీ, దాని అనుబంధ వర్గాలకూ సంబంధించిన వార్తలను మాత్రమే లీగల్‌ కంట్రిబ్యూటర్స్‌ అందిస్తారు తప్ప ఏ వ్యక్తికి గానీ వ్యవస్థలకు గానీ అనుకూలంగానో, ప్రతికూలంగానో రాసే అవకాశమే లేదు. ఇందుకు గానూ వీరికి ఏ రకమైన ఆర్థిక ప్రయోజనాలు ఉండవు. కేవలం కంట్రిబ్యూషన్‌ మాత్రమే. వీరి విలువైన సమయాన్ని కేటాయించి, సదరు కాన్ఫరెన్స్‌లకు, జడ్జి గారి ప్రెస్‌ మీట్‌లకు హాజరై వార్తలు, ఫోటోలు పంపించినందుకు వీళ్లకు దక్కేది కేవలం ఒక గుర్తింపు మాత్రమే.


ప్రస్తుతానికి మహ్మద్‌ కమ్రాన్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఉత్తరప్రదేశ్‌ కేసులో ఇంకా తుది తీర్పు రాలేదు. తీర్పు వెలువడ్డాక ఈ అంశంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. న్యాయవాద విషయ విరాళ సేవకులు తమ విలువైన సమయాన్ని కేటాయించి స్వచ్ఛంద సేవ చేయాలా లేక న్యాయవాద వృత్తికే పరిమితమవ్వాలా అనే విషయంపై లీగల్‌ కంట్రిబ్యూటర్లు పునరాలోచించుకోవాల్సిన సందర్భం ఇది.

వ్యాసకర్తలుగా సమాజంలో వస్తున్న ఆధునిక పోకడలు, విపత్తులు, మారుతున్న సామాజిక పరిస్థితులపై విశ్లేషణలు రాయడం వరకు ఫ్రీలాన్స్‌ జర్నలిస్టులకు సాధ్యమయ్యే పని.

ఈ ప్రవృత్తిలో వీళ్లకు ఆర్థిక ప్రయోజనాలు ఉండే అవకాశాలు మృగ్యం. కానీ మహ్మద్‌ కమ్రాన్‌ విషయంలో జరిగింది పూర్తిగా విరుద్ధం. అతను ఒక ప్రజాప్రతినిధిని టార్గెట్‌ చేయడంతో ఫ్రీలాన్స్‌ జర్నలిజాన్ని ఒక వృత్తిగా భావించి అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

l అయితగాని జనార్దన్

Updated Date - Nov 02 , 2024 | 06:13 AM