నిర్ణాయక ఘట్టం
ABN, Publish Date - Oct 02 , 2024 | 01:59 AM
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల చివరిదశ పోలింగ్ మంగళవారం ప్రశాంతంగా పూర్తయింది. మొత్తం తొంభైస్థానాల్లో నలభైస్థానాలు ఈ విడతలో ఉండగా, 24 జమ్మూడివిజన్‌లో, మిగతావి కశ్మీర్‌లోనివి. ఈ నలభై అసెంబ్లీ స్థానాల సగటు...
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల చివరిదశ పోలింగ్ మంగళవారం ప్రశాంతంగా పూర్తయింది. మొత్తం తొంభైస్థానాల్లో నలభైస్థానాలు ఈ విడతలో ఉండగా, 24 జమ్మూడివిజన్‌లో, మిగతావి కశ్మీర్‌లోనివి. ఈ నలభై అసెంబ్లీ స్థానాల సగటు పోలింగ్ 69శాతం మేరకు ఉన్నందున, తొలి రెండుదశలతో పోల్చితే భావి పాలకులు ఎవరో నిర్ణయించే ఈ కీలకమైన దశలో ప్రజాభాగస్వామ్యం మరీ బాగున్నట్టు. మొదటి విడత పోలింగ్ ఏడు జిల్లాల్లోని 24 స్థానాల్లో జరిగినప్పుడు 61శాతం వరకూ ఓట్లు పడినప్పటికీ, 2014 కంటే తక్కువే. రెండోదశ పోలింగ్ జరిగిన ప్రాంతాలు ఉగ్రవాద ప్రభావం వల్ల అనాదిగా తక్కువ రికార్డవుతున్నవే. అక్కడ 2014తో పోల్చితే ఈ మారు ఒకటిన్నరశాతం తక్కువ పోలింగ్ జరిగింది. మొత్తంగా మూడుదశల సగటు 63శాతానికి పైగా ఉన్నందున సంతోషించవలసిందే. పోలింగ్‌కు ముందు ఈ మూడుదశల్లోనూ కొన్ని ఉగ్రవాద చర్యలు జరిగినప్పటికీ, పోలింగ్‌ను నేరుగా దెబ్బతీసేందుకు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు నిర్దిష్టమైన ప్రయత్నాలేమీ లేకపోవడం ఊరటనిచ్చే అంశం. అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో ఎన్నికలు సజావుగా పూర్తయ్యేందుకు సమస్త బలగాలూ తమ శక్తియుక్తులను ధారపోశాయి.
జమ్మూకశ్మీర్ ప్రజానీకం ఈ ఎన్నికల పట్ల ఏ మేరకు ఉత్సాహంగా ఉన్నారు, పదేళ్ళనాటితో పోల్చితే వాతావరణం ఎట్లా ఉంది అన్న విశ్లేషణలు ఇప్పుడు సాగుతున్నాయి. ప్రజాప్రతినిధులకు ఏ అధికారాలూ లేని, చరిత్రలో అత్యంత బలహీనమైన జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి తమవారిని నాయకులుగా పంపేందుకు ప్రజలకు ఈ మూడుదశల పోలింగ్ అవకాశం ఇచ్చింది. ప్రత్యేకప్రతిపత్తిని కోల్పోయి, రాష్ట్రంగా ఉన్నదల్లా రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మారి, దశాబ్దం తరువాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో తిరిగి రాష్ట్రహోదా సాధించడమే ప్రచారాంశంగా, ప్రధానాంశంగా, లక్ష్యంగా మిగిలింది. అన్ని పార్టీలూ ఆ మేరకు ప్రజలకు గట్టి హామీ ఇస్తున్నాయి. పీడీపీ, బీజేపీ, నేషనల్ కాన్ఫరెన్స్–కాంగ్రెస్ కూటమి ప్రధానంగా బరిలో ఉండగా కొన్ని చిన్నచితకాపక్షాలతో పాటు, జమాతే ఇస్లామీ కూడా ఈ మారు పరోక్షంగా పోటీపడటం విశేషం. దశాబ్దాలుగా ఎన్నికల బహిష్కరణకు కట్టుబడిన ఈ సంస్థ, ఈమారు లోయలోని కొన్ని కీలకమైన చోట్ల తన వారిని స్వతంత్రులుగా నిలబెట్టింది. ఉగ్రవాదాన్ని పోషిస్తున్న, ప్రోత్సహిస్తున్న ఆరోపణలమీద 2019లో కేంద్రం ఈ సంస్థను ‘ఊపా’తో నిషేధించి, మరోమారు గడువును ఇటీవలే పొడిగించింది కూడా. ఆర్టికల్ 370 రద్దు తరువాత, ఈ సంస్థమీద విరుచుకుపడటమే కాక, దాని నాయకులంతా వేర్పాటువాదం ముసుగులో ఆస్తులు పోగేసుకున్నారని ఆరోపిస్తూ కేంద్రం ఆస్తులను సైతం జప్తుచేసింది. ఏడాది కాలంగా ఈ సంస్థ వైఖరిలో మార్పువచ్చిందని, ఎన్నికలను బాయ్‌కాట్ చేయడం కాక, వాటిద్వారా ప్రజలకు చేరువకావాలన్న ఆలోచన ఆ నాయకుల్లో పెరిగిందని అంటారు. ఇది కచ్చితంగా సంతోషించాల్సిన పరిణామం. స్థానిక ప్రధాన పక్షాల ఓట్లను చీల్చేందుకు, ముఖ్యంగా నేషనల్ కాన్ఫరెన్స్–కాంగ్రెస్ కూటమిని అది గెలవగలిగే స్థానాల్లో దెబ్బతీసేందుకు జమాతేను బీజేపీ రంగంలోకి దింపిందన్న ఆరోపణలు సైతం లేకపోలేదు.
ఈ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలభాగస్వామ్యం ఎంతో మెరుగ్గా ఉంది. మొత్తం ఐదుస్థానాల్లో జమ్మూలోని రెండింటినీ బీజేపీ గెలుచుకుంది. కశ్మీర్ లోయలోని మిగతా మూడుస్థానాల్లో రెండింటిని నేషనల్ కాన్ఫరెన్స్, ఒకదానిని ఇండిపెండెంట్ గెలుచుకున్నారు. పీడీపీకి ఒక్కటీ రాలేదు. ఆ ప్రాతిపదికన చూస్తే ఎన్‌సీ–కాంగ్రెస్ కూటమికి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 43 స్థానాలవరకూ రావాలి. మరోపక్క జమ్మూలో బీజేపీ ఎంతో బలంగా ఉన్నమాట వాస్తవం. ప్రత్యేక ప్రతిపత్తి, అనంతర పరిణామాల మీద ప్రజల ప్రతిస్పందన ఏ విధంగా ఉన్నదో ఈ ఎన్నికల్లో తేలుతుంది. గతాన్నీ, గాయాలనూ మరిచిపోయి, పాలకులు హామీ ఇస్తున్న అభివృద్ధినీ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు కొత్తతరం సిద్ధంగా ఉన్నదని కొందరి నమ్మకం. ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తరువాత జమ్మూకశ్మీర్ అద్భుతంగా ఎదిగిపోయిందని బీజేపీ పెద్దలు చెబుతున్నారు. ఆయా రంగాల్లో సాధించిన ప్రగతిని విశ్లేషిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయపక్షాలు, అనాదిగా ఏలుతున్న అబ్దుల్లాలు, ముఫ్తీలతో పాటుగా, స్వతంత్రులు, చిన్నాచితకాపార్టీలు ఈ మారు బరిలో నిలిచినందున అక్టోబర్ 8న విడుదలయ్యే ఫలితాలు సైతం ఊహించని రీతిలో ఉండవచ్చును.
Updated Date - Oct 02 , 2024 | 01:59 AM