ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘గంధర్వ’ లోక మలయమారుతాలు

ABN, Publish Date - Oct 19 , 2024 | 05:59 AM

వృత్తిపరమైన వాగుడుకాయ (సంతోషాన్ని ఇవ్వడమే కాకుండా లాభదాయమైన ఔద్యోగిక వ్యవహారం)కు ఎదురయ్యే సంకటాలలో ఒకటి ఉపన్యాసాన్ని వెలువరించిన అనంతరం స్వీకరించే కానుకలు. ఈ కానుకలు చాలా బరువుగా ఉండడం కద్దు.

వృత్తిపరమైన వాగుడుకాయ (సంతోషాన్ని ఇవ్వడమే కాకుండా లాభదాయమైన ఔద్యోగిక వ్యవహారం)కు ఎదురయ్యే సంకటాలలో ఒకటి ఉపన్యాసాన్ని వెలువరించిన అనంతరం స్వీకరించే కానుకలు. ఈ కానుకలు చాలా బరువుగా ఉండడం కద్దు. అయితే అవి చాలవరకు నిరుపయోగకరమైనవి. ఉదాహరణకు ఆతిథేయి సంస్థ పేరు, లోగో ముద్రించి ఉన్న ఫలకాలు. అప్పుడప్పుడు పుష్పగుచ్ఛం మొదలైన సౌందర్యాత్మక కానుకలు లభిస్తాయి. అయితే ఉపన్యాసం వెలువరించింది బెంగళూరు కాక ఇతర ప్రదేశాలలో అయితే ఆ పువ్వులు ఇంటికి రాకముందే వాడిపోతాయి.

మూడు దశాబ్దాలుగా వివిధ వేదికలపై ఉపన్యాసాలు వెలువరిస్తున్న నాకు చాలా అరుదుగా లభించిన ఒక విలువైన, నా మనస్సుకు అమితంగా నచ్చిన కానుక నేను చదువుకున్న ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ నుంచి లభించింది. 2000 సంవత్సరం నాటి సందర్భమది. ఏ విషయంపై ఉపన్యసించానో నాకు ఇప్పుడు గుర్తులేదు. అయితే ఉపన్యాసం అనంతరం ఆతిథేయి నుంచి లభించిన కానుక ఏమిటో ఇప్పటికీ నాకు బాగా గుర్తు ఉన్నది. ఆ కానుక ఇప్పటికీ నావద్ద భద్రంగా ఉన్నది. అది కుమార్‌ గంధర్వ సంగీతపు ఎనిమిది వాల్యూమ్‌ల సీడీ సెట్‌. ఆ కానుకను ఆ ఇనిస్టిట్యూట్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ అనిత రామ్‌పాల్‌ స్వయంగా ఎంపిక చేశారు. 1970ల్లో ఆమె, నేను ఢిల్లీ వర్శిటీ విద్యార్థులం. అప్పుడప్పుడు తన బాయ్‌ఫ్రెండ్‌ (ఆ తరువాత భర్త) అయిన భౌతిక శాస్త్రవేత్త వినోద్‌ రైనాతో కలిసి సంగీత కచేరీలకు నేను హాజరవుతుండడం ఆమెకు బాగా తెలుసు.

అప్పట్లో మేము వెళ్లిన గాన కచేరీలలో ఒకటి కుమార్‌ గంధర్వది. ఆయన తన భార్య వసుంధర కొమ్కలితో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు మండి హౌజ్‌ సమీపంలోని ఫిక్కి ఆడిటోరియంలో ఆ సంగీత కచేరి జరిగినట్టు నాకు గుర్తు. దాదాపు రెండు గంటలపాటు కుమార్‌ గంధర్వ స్వరకల్పన చేసిన భజన్‌లు, జానపద గేయాలను ఆ భార్యాభర్తలు మధురంగా గానం చేశారు. అద్భుతం, సంపూర్ణంగా అద్భుతం ఆ వీనుల విందు. ఆడిటోరియం చివరివరుసలో కూర్చున్నప్పటికీ కుమార్‌ గంధర్వ లోకోత్తర గాన మాధుర్యం నన్ను బాగా పరవశుడిని చేసింది. ఆ పరవశత్వం ఎన్నటికీ మరువలేనిది.


అనితా రామ్‌పాల్‌ నాకు కానుకగా ఇచ్చిన సీడీలలో ఆ రోజు కుమార్‌ గంధర్వ గానం చేసిన భజన్‌లు మరికొన్ని ఇతర కృతులు ఉన్నాయి. మనోహరమైన జోడ్‌ రాగాల గానం కూడా వాటిలో ఉన్నది. కవితాత్మక హమీర్‌, గ్రాండ్‌ శంకర రాగాలలో గానం చేసిన ఖయాల్స్‌ కూడా ఉన్నాయి. కుమార్‌ గంధర్వ రాగ నంద్‌లో అద్వితీయంగా గానం చేసిన రాజాన్‌ అబ్కో ఆ రె మొదలైన బండిష్‌లూ వాటిలో ఉన్నాయి. ఇప్పుడు చాలా అరుదుగా విన్పించే పత్మాంజరి రాగంలో గానం చేసిన 15 నిమిషాల ఖయాల్‌ నొకదాన్ని ప్రత్యేకంగా మళ్లీ మళ్లీ వింటుంటాను.

నాకు కానుకగా లభించిన ఆ సీడీలను ఒక దశాబ్దం పాటు ఇంటి వద్ద పదే పదే వింటుండేవాణ్ణి. 2010లో కాబోలు ఐ పాడ్‌ను కొనుక్కున్న తరువాత వాటిని ఆ అధునాతన సాధనంలో భద్రపరిచాను. సుదూర విమాన ప్రయాణాలలో వాటిని వింటూ సుఖంగా విహరిస్తుంటాను. ఆ సీడీలలో సుప్రసిద్ధ నిర్గుణ్‌ భజన్‌లు ఉన్నప్పటికీ కుమార్‌ గంధర్వ స్వయంగా స్వరకల్పన చేయనప్పటికీ ఆయనకు అజరామర కీర్తిని సమకూర్చిన జమునా కినారే మోరాగావ్‌ వాటిలో లేదు.

కుమార్‌ గంధర్వ గానంతో నాకు ఆత్మీయాను బంధం ఉన్నది. అయితే జమునా కినారేతో నా అనుబంధం ప్రత్యేకమైనది, వ్యక్తిగతమైనది. డెహ్రాడూన్‌లోని ఫారెస్ట్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌లో నేను పుట్టి పెరిగాను. నా తల్లిదండ్రుల గృహం ఆ సంస్థ ప్రాంగణం ఉత్తర దిక్కున చివరలో ఒక కొండపై టాన్స్‌ అనే నదీ దృశ్యాలు స్పష్టంగా కనిపించే చోట ఉన్నది. ఆ నది పశ్చిమ దిక్కుగా సాగి అసన్‌తో సంగమించి ఆ తరువాత మరింత పశ్చిమంగా మరికొన్ని మైళ్లు ప్రవహించి యమునా నదిలో కలుస్తుంది. క్షమార్హమైన అతిశయోక్తితో జమునా కినారే మోరాగావ్‌ పాట నా బాల్యంలో అంతర్భాగంగా ఉన్న టాన్స్‌ నది గురించేనని చెప్పుకోవడానికి సందేహించను. యుమున ఉపనది తీరాన నేను పుట్టిన ప్రదేశం ఉన్నది. సెలవు రోజుల్లో మా కుటుంబం వ్యాహాళికై ఆ నదీతీరానికి వెళ్లేది. ఆ నది కొండల నుంచి మైదాన ప్రాంతంలోకి దిగే ప్రదేశంలో పావోంట సాహిబ్‌ అనే పవిత్ర సిక్కు మత ఆరాధనా మందిరం ఉండేది. ఆ గురుద్వారా నా బాల్య స్మృతులలో ప్రధానమైనది.


కుమార్‌ గంధర్వ గానం చేసిన జమునా కినారే యు ట్యూబ్‌లో అందరికీ అందుబాటులో ఉన్నది. నేను ఏదైనా క్లిష్టమైన సమావేశాలకు వెళ్లే ముందు ఆ పాటను తప్పక వింటాను. అప్పుడప్పుడు కుమార్‌ గంధర్వ కుమారుడు ముకుల్‌ శివపుత్ర గానం చేసిన జమునా కినారేను కూడా వింటుంటాను. గంభీరమైన గానమది. ముకుల్‌ జై జయవంతి, కేదార్‌, ఖమాజ్‌ రాగాల ఆలాపన కూడా నాకు బాగా ఇష్టం.

ఈ శరదృతువు ఆరంభంలో జమునా కినారేను ప్రత్యక్షంగా విన్నాను. తండ్రి ప్రతిభను పుణికిపుచ్చుకున్న కుమార్‌ గంధర్వ కుమార్తె కలాపిని కోమ్కలి గాన మాధురి అది. తండ్రి శత జయంత్యుత్సవాలలో భాగంగా బెంగళూరులో ఆమె పాట కచేరి జరిగింది. ఆ రాగ సుధా స్రవంతికి ముందు, జీవిత వివిధ దశలలోను, విభిన్న సందర్భాలలోను కుమార్‌ గంధర్వ ఛాయా చిత్రాల స్లైడ్‌ షో నిర్వహించారు. నన్ను అమితంగా ఆకట్టుకున్న, భావోద్వేగానికి లోనుచేసిన ఛాయా చిత్రం 1991లో ధార్వాడ్‌లో మల్లికార్జున్‌ మన్సూర్‌తో కుమార్‌ జీ ఉన్న బొమ్మ.

బాంబే కర్ణాటకగా పిలవబడే ప్రాంతం (ఈ సీమ సాంస్కృతిక రాజధాని ధార్వాడ్‌)లో ఒక దశాబ్దంన్నర కాలంలో ఒకరి తరువాత ఒకరు పుట్టిన ఐదుగురు మహాగాయకులలో మన్సూర్‌ ఒకరు. ఆయనే అందరి కంటే పెద్దవాడు. ఆ సంగీత ప్రతిభామూర్తుల బృందంలో అందరికంటే చిన్నవాడు కుమార్‌ గంధర్వ. మిగతా ముగ్గురు గంగూబాయి హంగల్‌, భీమ్‌సేన్‌ జోషి, బసవరాజ్‌ రాజగురు. ఒకసారి కుమార్‌జీ ముందుగా తెలుపకుండా మన్సూర్‌ గృహానికి వెళ్లారు. సంగీతంలో తన సమస్కంధుడు అయిన కుమార్‌ గంధర్వ తన ‘పెద్దన్న’ను చివరిసారి చూడడానికి వచ్చి ఉంటాడని మల్లికార్జున్‌జీ భావించారు. కుమార్‌జీ కంటే మన్సూర్‌ వయస్సులో చాలా పెద్దవాడు. పైగా నిరంతరాయంగా సిగరెట్‌పై సిగరెట్‌ కాల్చే ధూమపాన ప్రియుడు. ఆ మహాగాయకుల మధ్య ఈ చివరి సమావేశ మనంతరం కొద్ది రోజులకే కుమార్‌ గంధర్వ మరణించారు. మల్లికార్జున్‌ మన్సూర్‌ పరితాపానికి అంతులేకపోయింది. ఆయన్ను ఊరడించడం ఎవరికీ శక్యం కాలేదు. నా తమ్ముడు నా కంటే ముందే వెళ్లిపోయాడు అని మన్సూర్‌ రోదించారు (ఆ తరువాత కొద్ది నెలలకే మన్సూర్‌ కూడా మరణించారు).

కలాపిని కొమ్కలి తన గాన కచేరీని తండ్రి భీమ్‌ పలాసి రాగంలో స్వరకల్పన చేసిన మూడు కృతులతో ఆరంభించారు. భీమ్‌ పలాసి ఒక గంభీర, వైదుష్య వైభవోపేత రాగం. కలాపిని గానం ఆ రాగ గుణ విశేషాలకు సముచిత ఉదాత్తత కల్పించింది. ఆ తరువాత, తండ్రి కుమార్‌ గంధర్వ స్వయంగా సృష్టించిన జోడ్‌ రాగాలలో ఒకటైన శ్రీ కల్యాణ్‌లో కొన్ని కృతులను గానం చేశారు. ఆ తరువాత మాల్వా జానపద గేయాన్ని ఆమె ఆలాపించారు. బాంబేలో సంగీత శిక్షణ పొందిన కన్నడిగుడు అయిన కుమార్‌ గంధర్వ ఆరోగ్య కారణాల రీత్యా కొన్ని సంవత్సరాల పాటు మధ్యప్రదేశ్‌లోని మాల్వా ప్రాంతంలో నివసించారు.

కలాపిని గాన మాధురిని ఆస్వాదిస్తూ కచేరి ముగిసే లోగా ఆమె జమునా కినారే మోరాగావ్‌ను కూడా ఆలపిస్తే బాగుండునని అనిపించింది. ఆ మధుర గీతాన్ని కుమార్‌ గంధర్వ తనయ నోట వినాలనే ఉత్సకత నాలో కలిగింది. ఇదే నేను నా యవ్వన కాలంలో అయితే నా ‘ఫర్మాయిష్‌’ (అభ్యర్థన)ను పెద్దగా అరుస్తూ చేసేవాణ్ణి లేదా ఒక కాగితం మీద రాసి పంపేవాణ్ణి. అయితే ఇప్పుడు ఇంత వయస్సులో అలా చేయడానికి వెనుకాడాను. పెద్దరికంతో వ్యవహరించాలి కదా. కనుక మౌనంగా ఉండిపోయాను. అయితే కలాపిని, తన తండ్రి కుమార గంధర్వ పేరు ప్రతిష్ఠలతో ముడివడి ఉన్న ఆ సుప్రసిద్ధ గీతాలాపనతో తన గాన కచేరిని ముగించారు (నేనే కాదు, అక్కడ ఉన్న శ్రోతలలో అత్యధికులు ఆ పాటను వినాలని ఆరాటపడుతున్నారనే విషయం బహుశా ఆమె గ్రహించే ఉంటారు).


జమునా కినారే మోరాగావ్‌ను తన తండ్రి శైలిలో ఆమె గొప్ప ఓజస్సుతో గానం చేశారు. ఆమె పాడుతుండగా అరమోడ్పు కళ్లతో కూచుండిపోయాను. నా మనస్సు నా బాల్యంలోకి పరుగెత్తింది. నాకు చిరపరిచితమైన అడవులు, యమునా తీర సుందర ప్రాంతాలు, పొడవైన, విశాల బాటలు మదిలో మెరిసాయి. మరుసటి రోజు ఉదయం యు ట్యూబ్‌కు వెళ్లాను. ‘కుమార్‌ గంధర్వ/ వసుంధర కోమ్కలి భజన్‌ కన్సర్ట్‌ న్యూ ఢిల్లీ 1978’ అని టైప్‌ చేశాను. ఆశ్చర్యకరంగా ఆ లింక్‌ లభించింది. ఆనాడు నేను వెళ్లిన కచేరీనే అది. 110 నిమిషాల పాటు సాగిన గాన ఉత్సవమది. అందులో 19 పాటలు ఉన్నాయి. దిగ్విజయ్‌ పాటిల్‌ అనే సంగీత రసికుడు సమకూర్చిన లింక్‌ అది. ఆ కచేరి 20 ఆగస్టు 1978న జరిగిందని కూడా ఆ లింక్‌ పేర్కొంది. అది కచ్చితమైన తేదీ. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా నా చివరి సంవత్సరం మొదటి నెలలో ఆ కచేరి జరిగింది. ఈ లింక్‌తో పాటు కుమార్‌ గంధర్వ ఇతర రికార్డింగ్‌లు కూడా నేను తరచు యు ట్యూబ్‌లో వింటుంటాను. ఫ్రొఫెసర్‌ అనితా రామ్‌పాల్‌ నాకు కానుకగా ఇచ్చిన ఎనిమిది సీడీలు ఇప్పటికీ నా ఐ పాడ్‌ నుంచి నన్ను ఆనందపరుస్తున్నాయి.

కుమార్‌ గంధర్వ గాన శ్రవణానందంలో ఓలలాడుతూ నేను వృద్ధాప్యంలోకి ప్రవేశించాను. అజరామరమైన ఆయన సంగీతం నా అంతిమ క్షణాల దాకా నాతో సహవాసం చేస్తుంది. నేను ఈ భవబంధాల నుంచి విముక్తమై సుదూర తీరాలకు పయనమయినప్పుడు దయాశీలుడు అయిన స్నేహితుడో లేదా ప్రేమాస్పదుడయిన కుటుంబ సభ్యుడో, కుమార్‌ గంధర్వ లోకోత్తర మాధుర్యంతో గానం చేసిన జమునా కినారే మోరాగావ్‌ నాదాలు నా వీనుల్లో ప్రతిధ్వనించేలా శ్రద్ధ చూపగలరని ఆశిస్తున్నాను, చూపాలని ఆకాంక్షిస్తున్నాను.

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Updated Date - Oct 19 , 2024 | 05:59 AM