కొత్త నేర చట్టాలపై జవాబు లేని ప్రశ్నలు
ABN, Publish Date - Jul 13 , 2024 | 04:05 AM
భారత శిక్షాస్మృతి (ఐపిసి), 1860; నేర విచారణా స్మృతి (సిఆర్‌పిసి), 1973; భారత సాక్ష్యాధార చట్టం (ఐఇఎ), 1872 రద్దు చేసి వాటి స్థానంలో కొత్త శాసనాలను ప్రవేశపెట్టడానికి ఉద్దేశించిన బిల్లులు, వాటిపై చర్చను సహేతుక కారణాలతో ప్రతిపక్షాలు బహిష్కరించిన తరువాత, పార్లమెంటు ఆమోదం పొందాయి.
భారత శిక్షాస్మృతి (ఐపిసి), 1860; నేర విచారణా స్మృతి (సిఆర్‌పిసి), 1973; భారత సాక్ష్యాధార చట్టం (ఐఇఎ), 1872 రద్దు చేసి వాటి స్థానంలో కొత్త శాసనాలను ప్రవేశపెట్టడానికి ఉద్దేశించిన బిల్లులు, వాటిపై చర్చను సహేతుక కారణాలతో ప్రతిపక్షాలు బహిష్కరించిన తరువాత, పార్లమెంటు ఆమోదం పొందాయి. కొత్త బిల్లులకు (వాటి ఆంగ్ల పాఠాలకు సైతం) హిందీ (లేదా సంస్కృతం)లో నామకరణం చేశారు. రాష్ట్రపతి ఆ బిల్లులకు ఆమోదం తెలిపారు. కొత్త నేర చట్టాలు జూలై 1, 2024 నుంచి అమలులోకి రానున్నాయని ప్రభుత్వం నోటిఫై చేసింది.
కొత్త నేర చట్టాలను ప్రతిపక్షాలే కాదు, న్యాయకోవిదులు, పౌర సమాజ ప్రముఖులు తీవ్రంగా వ్యతిరేకించారు. అన్ని ఆక్షేపణలను ప్రభుత్వం కొట్టివేసింది. కొత్త నేర చట్టాలపై విమర్శలు, అభ్యంతరాలు అసంబద్ధమైనవని, రాజకీయ దురుద్దేశాలతో కూడినవని ప్రభుత్వం ఆరోపించింది. పార్లమెంటు ఆమోదించిన నేర చట్టాలను యథాతథంగా అమలుపరుస్తామని స్పష్టం చేసింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో ఏకీభవించలేదు. కొత్త నేర చట్టాలను తమ శాసనసభలలో నిర్దిష్ట సవరణలతో మాత్రమే తాము ఆమోదిస్తామని స్పష్టం చేశాయి. ఎటువంటి మార్పులు చేయాలో నెలరోజులలోగా సూచించాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం ఒక ఏక సభ్య కమిటీ నేర్పాటు చేసింది. కర్ణాటక, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదే మార్గాన్ని అనుసరించవచ్చు. ఈ దృష్ట్యా కొత్త నేరచట్టాల వాస్తవాలు, సమస్యలను ప్రజలకు విపులంగా నివేదించవలసిన అవసరమున్నది. ప్రజలు తమ సొంత అభిప్రాయానికి రావడానికి ఆ నివేదన తోడ్పడగలదు.
‘క్రిమినల్ లా’ (క్రిమినల్ న్యాయ శాసనం) ఉమ్మడి జాబితాలోని అంశం. కనుక ఈ అంశంపై చట్టాలు చేసే అధికారాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండిటికీ ఉంది. కేంద్రం చేసిన ఒక చట్టం, ఒక రాష్ట్ర శాసనసభ చేసిన ఒక చట్టం పరస్పర ప్రతికూలంగా ఉన్న పక్షంలో రాజ్యాంగంలోని అధికరణ 254 నిర్దేశించిన విధంగా వెళ్లవలసి ఉంటుంది. అయితే ఇది, ఒక రాష్ట్ర శాసనసభ ఒక చట్టాన్ని తీసుకువచ్చిన తరువాత దాన్ని రాష్ట్రపతి ఆమోదించని పక్షంలో తలెత్తే సమస్య.
ఇదిలా వుండగా కొత్త నేర చట్టాలను వ్యతిరేకిస్తున్న వారి ప్రశ్నలకు సమాధానామివ్వవలసి ఉన్నది. దురదృష్టవశాత్తు ప్రభుత్వం వాటికి పార్లమెంటులో గానీ, పార్లమెంటు వెలుపల గానీ జవాబిచ్చేందుకు అంగీకరించడంలేదు ఆ ప్రశ్నలు ఏమిటో వివరంగా పేర్కొంటాను: (1) కొత్త చట్టాలలోని అత్యధిక నిబంధనలు రద్దయిన మూడు చట్టాల నుంచి తీసుకున్నవే అన్న ఆక్షేపణ సరైనదేనా? ఐపిసి, సిఆర్‌పిసి నుంచి 90 నుంచి 95 శాతం మేరకు ఐఇఎ నుంచి 95 నుంచి 99 శాతం మేరకు నిబంధనలను కొత్త చట్టాలలో యథాతథంగా ఉంచి, ప్రతి సెక్షన్‌కు కొత్త క్రమసంఖ్య నిచ్చారన్న విమర్శ నిరాధారమైనదా? అమలులో ఉన్న చట్టాలలో మార్పులు, చేర్పులు అవసరమైనపక్షంలో సవరణల ద్వారా వాటిని ఎందుకు చేయకూడదు? కొత్త నేర చట్టాలతో వలసపాలన వారసత్వానికి’ ముగింపు పలికామన్న ప్రభుత్వ వాదన ఒక తప్పుడు వాదన కాదా?
2) కొత్త చట్టాలను తీసుకురావడంలో ప్రభుత్వ ఉద్దేశం నేర చట్టాలను సమగ్రంగా, మౌలికంగా సవరించడమే అయితే, మన సువ్యవస్థిత రాజ్యాంగ సంప్రదాయం ప్రకారం, ఆ అంశాన్ని లా కమిషన్ పరిశీలనకు ఎందుకు నివేదించలేదు? నేర చట్టాలలో మార్పులపై సంబంధిత వ్యక్తులు, వ్యవస్థలను సంప్రదించి, ముసాయిదా బిల్లులతో సహా సిఫారసులను ప్రభుత్వం, పార్లమెంటు పరిశీలనకు సమర్పించేందుకు లా కమిషన్ అర్హమైన సంస్థ కదా? ఈ బాధ్యతను లా కమిషన్‌కు కాకుండా న్యాయశాస్త్ర ఆచార్యులతో కూడిన వేరే కమిటీకి ఎందుకు అప్పగించారు?
3) కొత్త నేర చట్టాలు నేర న్యాయశాస్త్ర సూత్రాలకు అనుగుణంగా ఉన్నాయా? గత పదేళ్లలో దేశ సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన ప్రముఖ తీర్పులు నిర్దేశించిన ప్రగతిశీల న్యాయసూత్రాలను గుర్తించి కొత్త చట్టాలలో చేర్చారా? కొత్త చట్టాలలోని అనేక నిబంధనలు భారత రాజ్యాంగానికి సుప్రీం కోర్టు ఇచ్చిన వివరణలు, ఆ మౌలిక శాసనంపై సర్వోన్నత న్యాయస్థానం భాష్యానికి విరుద్ధంగా లేవా?
4) అనేక ప్రజాస్వామిక దేశాలు రద్దు చేసిన మరణశిక్షను కొత్త చట్టాలు ఎందుకు ఆమోదిస్తున్నాయి? పైగా ‘ఏకాంత నిర్బంధం’ అనే క్రూర, అమానుష శిక్షను ఎందుకు ప్రవేశపెట్టారు? ‘వ్యభిచారం’ను మళ్లీ కొత్త చట్టాలలోకి ఎందుకు తీసుకువచ్చారు? పరువునష్టం వ్యవహారాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించడం తప్పనిసరా? ‘పరువునష్టం’పై ఒక క్రిమినల్ ఫిర్యాదును దాఖలు చేసేందుకు నిర్దిష్ట కాలపరిమితిని విధించడమూ తప్పనిసరా? ‘కమ్యూనిటీ సర్వీస్ (నేరం చేసిన వ్యక్తి జైలుకు వెళ్లడానికి బదులు చేసే సేవ) శిక్షను స్పష్టంగా ఎందుకు నిర్వచించలేదు. కమ్యూనిటీ సర్వీస్ అంటే ఏమిటో కనీసం ఉదాహరణలు కూడా ఎందుకు ఇవ్వలేదు?
5) ‘రాజద్రోహం’ నేరాన్ని విస్తృతపరిచి, దేశ ద్రోహంగా మార్చి కొత్త నిబంధనలతో ఎందుకు ఉంచారు? ‘ఉగ్రవాద’ నేరాలపై విచారణకు ‘చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (ఊపా) అనే శాసనం ఉండగా ఆ నేరాలను సాధారణ నేర న్యాయవిచారణ చట్టం పరిధిలోకి ఎందుకు తీసుకువచ్చారు? ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950; ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 అనే ప్రత్యేక చట్టాలు ఉండగా ఎన్నికల సంబంధిత నేరాలను కొత్త చట్టాల పరిధిలోకి ఎందుకు చేర్చారు?
6) ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు లేదా పోలీస్ కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులకు కొత్త చట్టాలు మరిన్ని అధికారాలు ఇవ్వలేదా? అరెస్ట్ చేయడానికి అధికారాలు ఉండడమంటే విధిగా అరెస్ట్ చేయడానికి కాదు అన్న సుప్రీంకోర్టు నిర్దేశాన్ని కొత్త చట్టాలు ఎందుకు ఉపేక్షించాయి? ‘బెయిల్ అనేది నియమం, జైలు మినహాయింపు’ అన్న న్యాయసూత్రాన్ని కొత్త చట్టాల్లో స్పష్టంగా చేర్చడం తప్పనిసరి కాదా? అరెస్ట్ న్యాయబద్ధతను, అరెస్ట్ ఆవశ్యకతను మెజిస్ట్రేట్ నిర్ధారించడం తప్పనిసరి కాదా? అరెస్ట్ అయిన 40 నుంచి 60 రోజుల తరువాత సైతం మెజిస్ట్రేట్ బెయిల్ నిరాకరించేందుకు అనుమతించే నిబంధనలు సక్రమంగా ఉన్నాయా?
7) నేరం ఎక్కడ జరిగినప్పటికీ దానిపై ఎఫ్‌ఐఆర్‌ను దేశంలోని ఏ పోలీస్ స్టేషన్‌లోనైనా దాఖలు చేసేందుకు అనుమతినిస్తున్న నిబంధన రాజ్యాంగ విహితమేనా? ‘పోలీస్’ అనే అంశం రాష్ట్ర జాబితాలోది కనుక ఎఫ్‌ఐఆర్ ఏ రాష్ట్రంలో అయితే నమోదయిందో ఆ రాష్ట్ర పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి నేర దర్యాప్తునకు పూనుకోవడం రాజ్యాంగ విరుద్ధం కాదా? సదరు నిబంధనలు రాజ్యాంగ మౌలిక లక్షణమైన ‘సమాఖ్య పాలన’ స్ఫూర్తిని కాలరాచివేయడం లేదూ?
కొత్త నేర చట్టాల రాజ్యాంగబద్ధతపై ఇంకా అనేక ప్రశ్నలు ఉన్నాయి. వాటికి సమాధానమిచ్చేది ఎవరు? ప్రభుత్వంలో ఉన్నవారు గానీ, అధికార పక్షం నాయకులు గానీ ఇంతవరకూ ఏ ప్రశ్నకూ సమాధానమివ్వలేదు. అయినంత మాత్రాన ఆ ప్రశ్నలు సమసిపోతాయా? అయినా నేర విచారణ న్యాయపాలనకు ప్రాతిపదికలు అయిన ఆ కొత్త చట్టాలు ఇప్పటికే అమలులోకి వచ్చాయి. కొంత మంది ప్రజల కోసం కొంత మంది ప్రజలతో నడిచే ప్రభుత్వానికి ఇదొక ఉదాహరణ.
ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు లేదా పోలీస్ కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులకు కొత్త చట్టాలు మరిన్ని అధికారాలు ఇవ్వలేదా? అరెస్ట్ చేయడానికి అధికారాలు ఉండడమంటే విధిగా అరెస్ట్ చేయడానికి కాదు అన్న సుప్రీం కోర్టు నిర్దేశాన్ని కొత్త చట్టాలు ఎందుకు ఉపేక్షించాయి? ... ఇలా కొత్త నేర చట్టాలపై అనేక మంది అనేక ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రభుత్వంలో ఉన్నవారు గానీ, అధికారపక్షం నాయకులు గానీ ఇంతవరకూ ఏ ప్రశ్నకూ సమాధానమివ్వలేదు.
అయినంత మాత్రాన ఆ ప్రశ్నలు సమసిపోతాయా?
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు)
Updated Date - Jul 13 , 2024 | 04:05 AM