ఈ రాజకీయ భావ దారిద్ర్యం తీరేదెలా?
ABN, Publish Date - Aug 30 , 2024 | 05:37 AM
రాజకీయ సిద్ధాంతం ఏమిటి? ఎవరు రాజకీయ తాత్త్వికుడు? రాజకీయ చింతన మరణించిందని ఎవరైనా ఒకరు ఎలా తీర్మానిస్తారు? ఇవీ, ఇంకా ఇతర ఆసక్తిదాయకమైన ప్రశ్నలను, నా ‘చింతనాత్మక రాజకీయాలు యేవీ?’ (ఆంధ్రజ్యోతి, ఆగస్టు 19) అన్న వ్యాసానికి ప్రతిస్పందిస్తూ పలువురు నాకు గుప్పించారు. వ్యాసాలు, సామాజిక మాధ్యమాల పోస్టులు, వ్యక్తిగతమైన లేఖలు,
రాజకీయ సిద్ధాంతం ఏమిటి? ఎవరు రాజకీయ తాత్త్వికుడు? రాజకీయ చింతన మరణించిందని ఎవరైనా ఒకరు ఎలా తీర్మానిస్తారు? ఇవీ, ఇంకా ఇతర ఆసక్తిదాయకమైన ప్రశ్నలను, నా ‘చింతనాత్మక రాజకీయాలు యేవీ?’ (ఆంధ్రజ్యోతి, ఆగస్టు 19) అన్న వ్యాసానికి ప్రతిస్పందిస్తూ పలువురు నాకు గుప్పించారు. వ్యాసాలు, సామాజిక మాధ్యమాల పోస్టులు, వ్యక్తిగతమైన లేఖలు, సందేశాలు, సంభాషణలు నన్ను ముంచెత్తాయి. ‘చింతనాత్మక రాజకీయాలు యేవీ?’ అన్న ప్రశ్నను సరైన సమయంలో వేశానన్న విషయాన్ని అవి ధ్రువీకరించాయి. ఆ ప్రశ్నను మరింత స్పష్టాతి స్పష్టం చేయవలసిన అవసరాన్ని కూడా ఆ తొలి ప్రతిస్పందనలు సూచించాయి.
అసలు ఈ ‘రాజకీయ చింతన’ ఏమిటి? (ఇది క్షీణించిపోవడం పట్ల నేను దఃఖిస్తున్నాను, ఎందరో పరితాపం చెందుతున్నారు). అది, దైనందిన రాజకీయ వ్యాఖ్యానాలు, సైద్ధాంతిక వాద ప్రతివాదాలు, విధాన నిర్దేశాలను మించిన విస్తృత రాజకీయ పర్యాలోచనల ప్రస్తావన. ఈ రీతి రాజకీయ వివేచనను ఆ వ్యాసంతో మొదలుపెట్టినప్పటికీ మూడు విస్తృత ప్రశ్నలకు సాధారణ సమాధానాలు ఇచ్చేందుకై ఆ ఉపక్రమానికి విరామం పాటిస్తున్నాను.
మొదటి ప్రశ్న: ఏ వెల్గులకు మన ప్రస్థానం? ఎటువంటి రాజకీయ వ్యవస్థను సృష్టించాలని మన శుభ కామన? రాజకీయ దార్శనికత ఆవశ్యకమయ్యే నిర్ణయాత్మక ప్రశ్న ఇది. రెండో ప్రశ్న: మన ప్రస్థానంలో నేడు మనం ఎక్కడ ఉన్నాం? మనం వెళ్లాలని సంకల్పించుకున్న గమ్యానికి సమీపంలో ఉన్నామా? లేక సుదూరంలో ఉన్నామా? ఇదొక అనుభవపూర్వక ప్రశ్న (ఎంపిరికల్ క్వశ్చన్). దీనికి కార్యకారణ సంబంధాన్ని అవగాహన చేసుకొనేందుకు రాజకీయ విశ్లేషణ అవసరం. మూడవ ప్రశ్న: ఏమి చేయాలి? మనం ఎక్కడ ఉన్నామో అక్కడ నుంచి మనం వెళ్లదలుచుకున్న గమ్యానికి ఎలా వెళ్లాలి? ఇదొక నిర్దేశాత్మక ప్రశ్న. రాజకీయ కౌశలం, ఎత్తుగడలుగా రూపాంతరీకరణ కాగల రాజకీయ వివేచనా శక్తిని అది అపేక్షిస్తుంది. రాజకీయ తాత్త్వికులు అందరూ తమ దేశ పరిస్థితులు, కాలావధులకు లోబడి ఆ ప్రశ్నలన్నిటికీ ప్రతిస్పందించాలి. రాజకీయ సిద్ధాంతం, రాజకీయ తత్త్వశాస్త్రం, రాజకీయ భావజాలం లేదా రాజకీయ భావనాశక్తి.. ఏ పేరుతోనైనా పిలవండి, ఏ ప్రయోజనకరమైన రాజకీయ ఆచరణకు అయినా రాజకీయాల గురించి అటువంటి ఆలోచనా విధానం తప్పనిసరి.
సమున్నత రాజకీయ ఆచరణకు దోహదం చేసే సుసంగతమైన, గుణప్రదమైన రాజకీయ చింతనా సంప్రదాయాన్ని ఆధునిక భారతదేశం అభివృద్ధిపరిచింది. విశాల భావాలు, నిష్పాక్షిక దృక్పథంతో ఆచరణ సాధ్యమైన సిద్ధాంతాలను వెలయించిన రాజకీయ చింతకులు అన్ని భావజాలాల పరిధిలో మనకు ఎంతో మంది ఉన్నారు పైన పేర్కొన్న మూడు ప్రశ్నలకు వారు తమ తమ మార్గాలలో సాధారణ, పరస్పర సంబంధం కలిగివున్న సమాధానాలు ఇచ్చారు. అవి మన గతాన్ని అర్థం చేసుకునేందుకు, వర్తమానాన్ని వివేచించేందుకు, భవితవ్యాన్ని దర్శించేందుకు మనకు విశేషంగా దోహదం చేశాయి. ఐరోపాలోని రాజకీయ తాత్త్వికులవలే కాకుండా మన రాజకీయ చింతకులలో అత్యధికులు రాజకీయ క్రియాశీలురు. ఇప్పటి ఆలోచనాపరులకు భిన్నంగా వారు తమ తమ మాతృభాషా సంస్కృతులు, దేశీయ చింతనతో పేగుబంధం ఉన్న మేధోశీలురు. అయినా వారు ఆధునిక పాశ్చాత్య భావస్రవంతులను తరచి చూసి, వాటి నుంచి స్ఫూర్తి పొందారు. ఆ బాహ్య భావనలను గుడ్డిగా స్వీకరించడం కాకుండా ప్రాంతీయ సందర్భం, జాతీయవాద సంవేదనలతో వాటిని వడగట్టి తేర్చిన శ్రేష్ట ఆలోచనలతో మన జాతి జీవనంలో నవ్య భావోదయానికి స్రష్టలు అయ్యారు. విద్యలందు మాత్రమే స్పర్థిస్తున్న భావాల భండారమే ‘ఆధునిక భారతీయ రాజకీయ చింతన’. అదే మన జాతీయోద్యమానికి, మన రాజ్యాంగానికి, వలసపాలనానంతర రాజకీయాలకు ప్రాతిపదికలు సమకూర్చింది. రమారమి ఒక శతాబ్దం పాటు–1870ల నుంచి 1960ల దాకా– మహోన్నతంగా వర్థిల్లిన ఆ చింతనా సంప్రదాయం హఠాన్మరణం కానప్పటికీ త్వరిత గతిన ప్రాధాన్యం కోల్పోయింది, అపాయకరంగా అవనతి అయింది. 21వ శతాబ్ది భారతదేశంలో రాజకీయ భావ దారిద్ర్యం, విశాల రాజకీయ అవగాహనా లేమి, సమగ్ర రాజకీయ వివేకం లోటు ఆ మహోన్నత చింతనా సంప్రదాయ క్షీణ ఫలాలే.
ఈ సాధారణ ధోరణికి మినహాయింపులు ఉన్నాయి. ఆధునిక భారతీయ చింతనా సంప్రదాయంలో మూడు ‘సజీవ’ స్రవంతుల– స్త్రీ వాదం, సామాజిక న్యాయం, ‘అభివృద్ధి’ – ను నేను ప్రస్తావించాను. భారతీయ ‘విశిష్టత’, పితృస్వామ్య అణచివేతలను స్త్రీ వాదం చర్చిస్తోంది. వాటికి వ్యతిరకంగా పోరాడుతోంది. జెండర్ ఎలా కులం, వర్గంతో సంకీర్ణమవుతోందో నిశితంగా వివేచిస్తోంది. చట్టం పరిమితులు, ప్రగతిశీల శక్తిగా రాజ్యవ్యవస్థ బలహీనతలు, భారతీయ సమాజ నేపథ్యంలో స్వలింగ సంపర్కుల హక్కులు మొదలైన అంశాలపై చురుకైన వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఇవన్నీ, జాతీయవాద చింతనలోని ‘మహిళల ప్రశ్న’ను దాటి మన రాజకీయ భావనాశక్తిని కొత్త మార్గాల్లో సాగేలా పురిగొల్పుతున్నాయి. సామాజిక న్యాయంపై చర్చలు బాబాసాహెబ్ అంబేడ్కర్ ప్రభావాల నుంచి ఇంకా బయటపడనప్పటికీ కుల అంతరాలు, జాతి వివక్షల మధ్య సమాంతరాలపై చర్చలు జరుగుతున్నాయి. కుల వ్యవస్థ రాజకీయ ఆర్థికత, పస్మాండ ముస్లింలు, మహాదళితుల సమస్యలపై చర్చలు కొత్త ఆలోచనలకు దారితీస్తున్నాయి.
‘అభివృద్ధి’కి సంబంధించిన ప్రత్యామ్నాయ నమూనాలపై సహేతుక, వివేకవంతమైన చర్చలు ఇప్పుడు మహాత్మాగాంధీ ఆలోచనా సీమలను దాటిపోయి కేవలం పర్యావరణంపైనే కాకుండా నూతన ఆర్థిక, రాజకీయ వ్యవస్థల విషయమై కూడా మన ఆలోచనా ప్రగతికి మార్గదర్శకమవుతున్నాయి. అయినప్పటికీ ఇవన్నీ కలిసికట్టుగా కూడా ఆధునిక భారత రాజకీయ చింతన విలుప్తత మిగిల్చిన అపార శూన్యతను పూరించలేవు.
నా వాదనను వివరించేందుకు నేను ప్రస్తావించిన చింతకుల జాబితాలోని పేర్లపై తొలి ప్రతిస్పందనలు తమ దృష్టి నిలిపాయి., ఆక్షేపించాయి. ఈ పేర్ల విషయంలో నా తప్పును ఒప్పుకుంటున్నాను. నా ఉదాహరణల కాల పరిధిని అపార్థం చేసుకున్నందున ఆ విమర్శలకు ఆస్కారమేర్పడింది. 1947లో సజీవంగా ఉన్న చింతకులతో నా జాబితా ప్రారంభమయింది (కనుకనే జ్యోతిబా ఫూలే, గోపాలకృష్ణ గోఖలే పేర్లు చోటుచేసుకోలేదు). నా సమకాలికులు అయిన నిశిత సామాజిక, రాజకీయ సిద్ధాంతవేత్తలను కూడా నేను పేర్కొనలేదు (ఇందుకు మేధావులు, క్రియాశీలురు అయిన స్నేహితులకు నా క్షమాపణలు). ఆ జాబితా సైద్ధాంతికంగా తటస్థమైనది. తత్కారణంగానే నాకు ఏ మాత్రం భావసారూప్యతలేని హిందూత్వ, ఇస్లామిక్ చింతకులను కూడా ఆ జాబితాలో చేర్చాను.
రాజకీయ చింతనను ఒక పరిమితార్థంలోనే పరిగణనలోకి తీసుకున్నాను. ఆ ఈ కారణంగానే సామాజిక సిద్ధాంతవేత్తలు ఆంద్రే బెటిల్లె, జెపిఎస్ యుబెరోయి, ఇంతియాజ్ అహ్మద్, వీణాదాస్; తత్త్వశాస్త్ర కోవిదులు దయాకృష్ణ, రామచంద్ర గాంధీ; రచయితలు నిర్మల్ వర్మ, రఘువీర్ సహాయ్ మొదలైన వారిని ప్రస్తావించలేదు. అయితే కమలాదేవి చటోపాధ్యాయ, అరుణా అసఫ్ అలీ, సరోజినీనాయుడు మొదలైన మహిళా చింతకులను మినహాయించడాన్ని ప్రొఫెసర్ నందినీ సుందర్‌తో సహా పలువురు ఆక్షేపించారు. ఇది, నా జాబితాకు ఒక విలువైన సవరణ అని అంగీకరిస్తున్నాను. స్వతంత్ర భారత చింతకులలో ఇఎమ్‌ఎస్ నంబూద్రిపాద్‌ను; ఆ తరువాయి తరంలోని డిఆర్ నాగరాజ్, క్లాడ్ ఆల్వేర్జ్‌ను కూడా చేర్చి ఉండవల్సింది. మన మధ్యనే ఉన్న అరుణారాయ్, దిలీప్ సిమ్‌యోన్, వందనా శివ, దేవనూర మహదేవ, ఆనంద్ తెల్తుంబ్డెలను నేను ఆదర్శంగా తీసుకున్న రాజకీయ చింతనా సంప్రదాయానికి ప్రతినిధులుగా ఉదహరించివుండవల్సింది. తొలితరం రాజనీతిశాస్త్ర విశారదులలో రణధీర్ సింగ్, రషీదుద్దీన్ ఖాన్, రామ్ బాపట్, శాంతి స్వరూప్, రాఘవేంద్రరావు, మనోరంజన్ మొహంతి పేర్లు కూడా చేర్చి ఉండవల్సింది. రాజనీతి శాస్త్రాన్ని, రాజకీయ చైతన్యశీలతను సంధానించిన విద్వజ్ఞులు వారు.
ఇంకా మరెంతో మంది చింతకులను, ముఖ్యంగా నేను చదవలేని భాషలలో రాస్తున్న వారిని నా జాబితాలో చేర్చలేకపోయానన్న విషయం నాకు బాగా తెలుసు. ఆ మినహాయింపులు నా పరిమితులే గానీ, నేను ముందుకు తెచ్చిన ప్రాథమిక వాదనకు అవి పరిమితులు కానే కావు. నేను ఈ చర్చను ఆరంభించేందుకు ప్రేరేపించిన లక్ష్యం ఏమిటి? ఆధునిక భారత రాజకీయ చింతన ‘మరణాన్ని’ గుర్తించి పరితాపం చెందడం ఎంతమాత్రం కాదు. మనం ఈ పరిస్థితి (దుస్థితి కాదూ?)కి ఎందుకు వచ్చాం, మన సమున్నత ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యానికి ప్రాణరక్షకమైన చింతనా సంప్రదాయాన్ని పునశ్శక్తిమంతం చేసేందుకు ఏమి చేయాలి, ఏమి చేయగలమని సమష్టిగా వివేచించేందుకు ఆహ్వానించడమే. అవును, ‘జీవ మంత్రమేది అహో, ఈ మిత్తవ జాముల్లో’ అని ఆక్రోశించనవసరం లేదు. ఆధునిక భారతీయ రాజకీయ చింతన మన రిపబ్లిక్‌కు ఒక సమున్నతమైన జీవగర్ర. దాని స్ఫూర్తి ఒక జీవ మంత్రం. మరి ఆ జీవ స్ఫూర్తిని ఆవాహన చేసుకునేందుకు పూనుకుందామా?
రాజకీయ ఆచరణకు దోహదం చేసే సుసంగతమైన, గుణప్రదమైన రాజకీయ చింతనా సంప్రదాయాన్ని ఆధునిక భారతదేశం అభివృద్ధిపరిచింది. ఐరోపాలోని రాజకీయ తాత్త్వికుల వలే కాకుండా మన రాజకీయ చింతకులలో అత్యధికులు వర్తమాన భారతదేశంలో రాజకీయ భావదారిద్ర్యం, విశాల రాజకీయ అవగాహనా లేమి, సమగ్ర రాజకీయ వివేకం లోటు ఆ మహోన్నత చింతనా సంప్రదాయ క్షీణ ఫలాలే. ఆ చింతనా ధార మన రిపబ్లిక్‌కు ఒక జీవగర్ర. దాని స్ఫూర్తి ఒక జీవ మంత్రం. మనం ఆ జీవ స్ఫూర్తిని ఆవాహన చేసుకోవాలి.
(వ్యాసకర్త ‘స్వరాజ్ ఇండియా’ అధ్యక్షుడు)
Updated Date - Aug 30 , 2024 | 05:37 AM