ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రెండో రాకడ...!

ABN, Publish Date - Nov 07 , 2024 | 02:57 AM

డోనాల్డ్‌ ట్రంప్‌ మళ్ళీ అమెరికా అధ్యక్షుడయ్యారు. అభ్యర్థులు ఇద్దరి మధ్యా ఈ మారు పోటీ గట్టిగా ఉందనీ, అయినా, కమలదే పైచేయి కాబోతున్నదన్న సర్వేలన్నీ తారుమారైనాయి. కమల మరీ ఇంతదూరంలో నిలిచిపోవడం...

డోనాల్డ్‌ ట్రంప్‌ మళ్ళీ అమెరికా అధ్యక్షుడయ్యారు. అభ్యర్థులు ఇద్దరి మధ్యా ఈ మారు పోటీ గట్టిగా ఉందనీ, అయినా, కమలదే పైచేయి కాబోతున్నదన్న సర్వేలన్నీ తారుమారైనాయి. కమల మరీ ఇంతదూరంలో నిలిచిపోవడం ఆశ్చర్యపరిచింది. రెండుపర్యాయాలు వరుసగా గెలవడం గతంలో ఉన్నది కానీ, ఒక విడత విరామం తరువాత తిరిగి అధ్యక్షుడు కావడం అమెరికా చరిత్రలో నూటముప్పైయ్యేళ్ళ తరువాత ఇదేనట. రెండుదశాబ్దాల తరువాత పాపులర్ ఓటు కూడా సాధించిన రికార్డు కూడా ట్రంప్‌కు దక్కింది. ఈ ఘన విజయానికి ఏయే అంశాలు దోహదం చేశాయో, నాలుగేళ్ళలోనే అమెరికన్లు ఆయనమీద మళ్ళీ ఎందుకంతగా మనసుపడ్డారో రాబోయే కాలంలో మరింత లోతుగా తేలుతుంది.


ట్రంప్‌ పునరాగమనాన్ని స్వదేశంలోని ఆయన అభిమానులు తప్ప మిగతా ప్రపంచం ఏమాత్రం హర్షించడం లేదని అమెరికన్‌ పత్రిక ఒకటి వ్యాఖ్యానించింది. ప్రచారాన్ని విద్వేషపూరిత వ్యాఖ్యలతో దట్టించడం, అక్రమవలసదారుల గుప్పిట్లో తనదేశం బందీగా ఉన్నదని వాపోవడం, అమెరికాను విముక్తంచేస్తానని ప్రకటించడం తెలిసినవే. పరోక్షంగానో, ప్రత్యక్షంగానో రంగు, జాతి ప్రస్తావనలు లేకుండా, అవమానకరంగానో, వివక్షాపూరితంగానో ఇతరులపట్ల వ్యాఖ్యానించకుండా ఆయన ఉండలేడు. ఇక మహిళల విషయంలో ఆయన వ్యక్తిగత ప్రవర్తన, మాటల్లో చులకనభావం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. అధ్యక్ష ఎంపికలో ఇవన్నీ పనిచేస్తాయని మిగతా ప్రపంచం ఆశించడం సహజం. కానీ, ఆయన మీద ఉన్న డజనుకుపైగా కేసులు ఓటర్లను పెద్దగా ప్రభావితం చేసినట్టు లేదు.


గతంలో తనను ప్రజలు గద్దెదించినందుకు కోపించి, వారిచ్చిన ఆ తీర్పును వమ్ముచేసేందుకు అన్ని కుట్రలూ చేసి, ఆఖరుకు తన కార్యకర్తలను చట్టసభలమీద దాడికి ఉసిగొల్పిన ఆ ఘట్టాన్ని కూడా ఓటర్లు విస్మరించినట్టే కనిపిస్తోంది. ఏ మాత్రం ఊగిసలాడకుండా తెల్లజాతివారు ఆయనకు అండగా ఉన్న విషయం తెలుస్తూనే ఉంది. అక్రమవలసలు, అడ్డుగోడల మాటలతో పాటు దేశాన్ని ఆర్థికంగా ఉద్ధరిస్తానన్న హామీ కూడా వారిని ప్రభావితం చేసినట్టు ఉంది. అధ్యక్ష అభ్యర్థుల చర్చలో తనది పైచేయి కానందుకు, మరోమారు రావడానికి అంగీకరించని ఆయన, ఎన్నికల సభల్లో మాత్రం అసత్యాలు, అర్ధసత్యాలతో ప్రజలను నెగ్గుకురాగలిగారు. జరిగిన హత్యాయత్నం, ఆ సందర్భంలో ఆయన కనబరిచిన ధైర్యం, ఇచ్చిన నినాదాలు, మొత్తంగా ఆ దృశ్యం ఓటర్ల మనసులో నిలిచివుండవచ్చు.


ఇప్పుడు సెనేట్‌ మీద కూడా రిపబ్లికన్లకు గట్టిపట్టు దొరికింది కనుక ఇక ట్రంప్‌ దూకుడుకు అడ్డం ఉండదు. పలు అంతర్జాతీయ ఒప్పందాలనుంచి అమెరికాను తప్పించిన ఘనమైన గతం ఆయనది. పర్యావరణ పరిరక్షణ అంటే పడదు కనుక, పారిస్ ఒప్పందం నుంచి తప్పుకున్న చరిత్ర ఉన్నది కనుక, మిగతా ప్రపంచం ఎంత మొత్తుకున్నా, కాలుష్య నియంత్రణ చర్యలకు ఆయన సిద్ధపడడు. ఇరాన్‌తో ఒబామా సాధించిన అణు ఒప్పందాన్ని రద్దుచేసి, ప్రపంచాన్ని ప్రమాదంలో పడవేసిన ట్రంప్ ఇప్పుడు మారిన పరిణామాల నేపథ్యంలో ఇంకెంత దూకుడుగా వ్యవహరిస్తారో చూడాలి. తాను అమెరికా గద్దెమీద ఉన్నట్టయితే రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం వచ్చేది కాదని ట్రంప్‌ అంటున్నారు. నాటో కోసం వెంపర్లాడే లక్షణం లేదు కనుక, ఉక్రెయిన్‌కు ఎక్కువ నష్టంతో పుతిన్‌ పక్షాన నిలబడతాడన్న విశ్లేషణలను అటుంచితే, అనతికాలంలోనే యుద్ధాన్ని ముగిస్తానన్న ఆయన హామీ కాస్తంత ఆలస్యంగానైనా నెరవేరవచ్చు. కానీ, గాజాతో ఆరంభించి ఇరాన్‌వరకూ ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ విస్తరించిన ఆ యుద్ధాన్ని ఆపే విషయంలో ట్రంప్‌ అంత ఉత్సాహం చూపే అవకాశాలైతే లేవు. నెతన్యాహూకు మరింత సాయంతో, ఇంకొంత విధ్వంసంతో యుద్ధాన్ని ముగిస్తే ట్రంప్‌కు చాలు. సమస్త విషయాల్లోనూ చైనాతో ఆయన గతంలో ప్రదర్శించిన కయ్యం, తదనుగుణంగా భారత్‌తో పెరిగిన బాంధవ్యం తెలిసిందే. ఈ మారు కూడా ఆ వాతావరణంలో పెద్ద మార్పేమీ ఉండబోదు. భౌగోళిక రాజకీయాల్లో భారత్‌కు నిర్దేశించిన పాత్రను ప్రశస్తంగా పోషించడంతో పాటు, ట్రంప్‌తో ప్రధాని మోదీకి ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం కూడా మనకు ఇతరత్రా విషయాల్లో ఉపకరించవచ్చు.

Updated Date - Nov 07 , 2024 | 02:57 AM