వెలలేని మాగాణి మహారాష్ట్ర
ABN, Publish Date - Nov 16 , 2024 | 05:23 AM
మహారాష్ట్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది, అభివృద్ధి పరిచింది భారత జాతీయ కాంగ్రెస్. బొంబాయి రాష్ట్రం నుంచి విడివడి, మరాఠా ప్రజల స్వరాష్ట్రంగా మహారాష్ట్ర ఏర్పడిన నాటి (మే 1, 1960) నుంచి ఇప్పటిదాకా (64 సంవత్సరాలుగా) 20 మంది ముఖ్యమంత్రులు (వీరిలో కొందరు ఒకటి కంటే ఎక్కువ పర్యాయాలు ఆ ఉన్నత
మహారాష్ట్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది, అభివృద్ధి పరిచింది భారత జాతీయ కాంగ్రెస్. బొంబాయి రాష్ట్రం నుంచి విడివడి, మరాఠా ప్రజల స్వరాష్ట్రంగా మహారాష్ట్ర ఏర్పడిన నాటి (మే 1, 1960) నుంచి ఇప్పటిదాకా (64 సంవత్సరాలుగా) 20 మంది ముఖ్యమంత్రులు (వీరిలో కొందరు ఒకటి కంటే ఎక్కువ పర్యాయాలు ఆ ఉన్నత బాధ్యతలు నిర్వహించారు) మహారాష్ట్రను పరిపాలించారు. వారిలో ఐదుగురు మినహా అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులే (ఒకప్పుడు కాంగ్రెస్ చీలిక పక్షం ఐఎన్‌సి– సోషలిస్ట్‌కు ప్రాతినిధ్యం వహించిన శరద్ పవార్‌ను సైతం కాంగ్రెస్ ముఖ్యమంత్రిగానే నేను పరిగణిస్తున్నాను). కాంగ్రేసేతర ముఖ్యమంత్రులు మనోహర్ జోషి, నారాయన్ రాణే, దేవేంద్ర ఫడ్నవీస్, ఉద్ధావ్ ఠాక్రే, ఏక్‌నాథ్ షిండే. ఈ 64 ఏళ్లలో కాంగ్రెస్ ప్రత్యర్థి పక్షాలకు చెందిన ఈ ఐదుగురు ముఖ్యమంత్రుల మొత్తం పరిపాలనా కాలం 15 సంవత్సరాల 6 నెలల, 17 రోజులు. మిగతా సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు.
మహారాష్ట్ర శాసనసభకు చివరి ఎన్నికలు నవంబర్ 2019లో జరిగాయి. గత ఐదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులు ఆ రాష్ట్ర పరిపాలకులుగా ఉన్నారు. వారిలో ఇద్దరు –దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండే– మహాయుతి కూటమిలో ఉన్నారు. ఉద్ధవ్ ఠాక్రే ఎమ్‌వీఏ కూటమిలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అక్టోబర్ 31, 2014 నుంచి (నవంబర్ 2019, జూన్ 2022 మధ్య రెండు సంవత్సరాల 214 రోజులు మినహా) మహారాష్ట్రలో అధికారంలో ఉన్నది. ఆ మినహాయింపు కాలంలో శివసేన, కాంగ్రెస్, ఎన్‌సీపీ భాగస్వాములుగా ఉన్న ఎహ్‌వీఏ కూటమి అధికారంలో ఉన్నది. శివసేన, ఎన్‌సీపీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించిన బీజేపీ, ఎమ్‌వీఏ కూటమి ప్రభుత్వాన్ని కూల్చివేసి తన సొంత కూటమి (మహాయుతి) ప్రభుత్వాన్ని గద్దె నెక్కించింది.
నవంబర్ 20, 2024న మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ‘వ్యక్తుల మంచితనం వారి అస్థికలతో భూస్థాపితమవుతుంది’ అన్న షేక్‌స్పియర్ సత్య వచనం ఈ సందర్భంగా నాకు గుర్తుకు వస్తంది. నిజమే, గతకాలం వైభవాలకోసం ఎవరూ ఓటువేయరు. మహారాష్ట్ర ఇప్పుడు ఎలా ఉన్నది, ఎక్కడ ఉన్నది, దాని భవిష్యత్తు ఏమిటి? ఆ భవితవ్యం ఎలా ఉండాలి అన్న విషయాలే ప్రస్తుత ఎన్నికలలో జయాపజయాలను నిర్ణయించే అంశాలు.
ఆర్థిక వ్యవస్థకు సంబంధించినంతవరకు పారిశ్రామికీకరణలో మహారాష్ట్రను నెంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధిపరిచింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు ఈ అగ్రగామి రాష్ట్రం ‘అభివృద్ధి’కి సంబంధించిన వివిధ ప్రమాణాల విషయంలో అధో స్థానాలకు జారిపోయింది. ఈ క్రింది గణాంకాలే అందుకు సాక్ష్యం. గత రెండు ఆర్థిక సంవత్సరాలలో వివిధ రంగాలు ఎలా ఉన్నాయో చూడండి: (నిర్దిష్ట అంశం ఎదురుగా ఉన్న అంకెలలో మొదటిది 2022–23, రెండో అంకె 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినది) వృద్ధిరేటు 9.4 శాతం, 7.6 శాతం; రెవెన్యూ లోటు: రూ.1,936 కోట్లు, రూ.19,531 కోట్లు; ద్రవ్యలోటు: రూ.67,602 కోట్లు, రూ.1,11,956 కోట్ల; మూలధన వ్యయం: రూ.85,657 కోట్లు, రూ.85,292 కోట్లు; వ్యవసాయ రంగ వృద్ధిరేటు: 4.5 శాతం, 1.9 శాతం; సేవల రంగ పెరుగుదల: 13 శాతం, 8.8 శాతం; రవాణా, వర్తకం, కమ్యూనికేషన్స్ రంగాల పెరుగుదల: 13 శాతం, 6.6 శాతం; నిర్మాణ రంగ వృద్ధిరేటు: 14.5 శాతం, 6.2 శాతం.
సరే, నిరుద్యోగిత గురించి చెప్పేదేముంది? అది పెచ్చరిల్లుతోంది. యువజనుల నిరుద్యోగిత 10.8 శాతం కాగా మహిళా నిరుద్యోగిత 11.1 శాతం; మహారాష్ట్రలో ఉద్యోగిత చాల వరకు స్వయం ఉపాధే. స్వల్పసంఖ్యలో ఉన్న ప్రభుత్వోద్యోగాల భర్తీకి ప్రకటనలు వెలువడినప్పుడల్లా వేలు, లక్షల సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. 18,300 పోలీస్ కానిస్టేబుల్ / డ్రైవర్ ఉద్యోగాలకు, 4,600 తలాతి (గ్రామీణ ఉద్యోగి) ఉద్యోగాలకు 11 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఉద్యోగాలను సృష్టించే అంతర్జాతీయ కంపెనీలను మహారాష్ట్ర ప్రభుత్వం బాగానే ఆకట్టుకుంటున్నది. తమ కార్యాలయాలు లేదా ఫ్యాక్టరీలను మహారాష్ట్రలో ఏర్పాటు చేసుకునేందుకు ఒప్పందం చేసుకున్న తరువాత, సదరు కంపెనీలు గుజరాత్‌కు తరలిపోయేలా ఢిల్లీ పాలకులు వాటికి నచ్చచెప్పుతున్నారు! టాటా–ఎయిర్ బస్ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్ క్రాప్ట్ ఫ్యాక్టరీ, వేదాంత–ఫాక్స్‌కామ్ సెమి–కాండక్టర్ ఫ్యాక్టరీ ఉదంతాలే అందుకు ఉదాహరణలు. భారతదేశ వాణిజ్య రాజధానిగా ముంబై ప్రపంచ ప్రసిద్ధమయింది. అయితే ఇప్పుడు ఆ మహానగరానికి ఆ ప్రతిష్ఠ లేకుండా చేసేందుకు ‘గుజరాత్ ఇంటర్నేషనల్ పైనాన్స్–టెక్’ సిటీని ప్రత్యేక చట్టాలు, అద్వితీయ సదుపాయాలతో పనికట్టుకుని అభివృద్ధి పరుస్తున్నారు.
మహారాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంత ప్రమాదకర పరిస్థితిలో ఉన్నదో రెండు ఉదాహరణలతో వివరిస్తాను. మహారాష్ట్రలో నాలుగు భిన్న ప్రాంతాలు ఉన్నాయి. అభివృద్ధిలో వాటి మధ్య అసమానత పెరిగిపోతోంది. ముంబై, పూణే, థాణే జిల్లాలు మహా సంపద్వంతమైనవి. నడుర్‌బార్, వాషిమ్, గడ్చిరోలి, యవత్మాల్, హింగోలి, బల్దానా జిల్లాలో పేదరికం తాండవమాడుతోంది. సంపద్వంత జిల్లా నికర జిల్లా దేశియోత్పత్తి (ఎన్‌డీడీపీ), పేద జిల్లాల ఎన్‌డీడీపీ కంటే మూడు రెట్లు ఎక్కువ. తలసరి ఎన్‌డీడీపీలో వ్యత్యాసం 2011–12లో రూ.97,357 నుంచి 2022–23లో రూ.2.4 లక్షలకు పెరిగింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమరీతిలో అభివృద్ధిపరచడంలో ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో మరి చెప్పాలా?
మరో ఉదాహరణ రైతుల దుస్థితి. 2023లో మహారాష్ట్రలో 2,851 మంది రైతుల ఆత్మహత్యలు నమోదయ్యాయి. కారణమేమిటి? ఉల్లిపాయలపై కేంద్ర ప్రభుత్వ విధానాన్నే తీసుకోండి. మొదట ఉల్లిపాయల ఎగుమతులను నిషేధించింది. దీనిపై నిరసనలు వెల్లువెత్తడంతో ఆ ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేశారు. అయితే కనీస ఎగుమతి ధరను విధించారు. ఎగుమతి సుంకాన్ని 40 శాతంగా నిర్ణయించారు. పర్యవసానంగా ఉల్లి రైతులు భారీ నష్టాలను చవిచూశారు. అంతర్జాతీయ విపణిలో భారత్ తన వాటాను కోల్పోయింది. ఏటా జూలై నాటికి 15 లక్షల టన్నుల ఉల్లిపాయలు ఎగుమతి చేయడం పరిపాటి. అటువంటిది ఈ ఏడాది 2.6 లక్షల టన్నుల ఉల్లిపాయలే ఎగుమతి అయ్యాయి.
మహారాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దుర్నిర్వహణకు ఇంకా ఎన్నైనా ఉదాహరణలు ఇవ్వవచ్చు. డబుల్ –ఇంజిన్ ప్రభుత్వమనేది ఒక డొల్లమాట. ఎందుకని? మొదటి ఇంజిన్ అభివృద్ధి రైలును గుజరాత్‌కు మళ్లిస్తున్నది. రెండో ఇంజిన్ ఆర్థిక వ్యవస్థకు ఒక జడభారంగా పరిణమించింది.
ఓటర్ (ఆమె/అతడు) పూర్తిగా ఒక ఆర్థికజీవి (ఎకనామిక్ బీయింగ్) అయితే, మరే ఇతర అంశాల కంటే మహారాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత సంపద్వంతం చేసే లక్ష్యానికి అగ్ర ప్రాధాన్యమిచ్చి ఆ విద్యుక్త ధర్మ నిర్వహణకు అంకితమయ్యే అభ్యర్థులు, పార్టీలకే ఓటు వేస్తాడు, వేయాలి కూడా. మహారాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అపురూపమైనది. వెలలేని ఆస్తి అది. ఎటువంటి పరిస్థితులలోను దాన్ని అలక్ష్యం చేయకూడదు, కోల్పోకూడదు.
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు)
Updated Date - Nov 16 , 2024 | 05:24 AM