ఔను.. సన్నాఫ్ ‘మాణిక్యమే’ సీతారాం!!
ABN, Publish Date - Aug 24 , 2024 | 05:38 AM
ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో తనదైన సంతకాన్ని చేసిన కవి, విమర్శకుడు, పరిశోధకుడు, అధ్యాపకుడు సీతారాం. బహుముఖ పాత్రలు పోషిస్తున్న ఈ అరుదైన సాహితీ శిఖరం అలుపెరుగని
ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో తనదైన సంతకాన్ని చేసిన కవి, విమర్శకుడు, పరిశోధకుడు, అధ్యాపకుడు సీతారాం. బహుముఖ పాత్రలు పోషిస్తున్న ఈ అరుదైన సాహితీ శిఖరం అలుపెరుగని ప్రయాణాన్ని అవలోకిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగకమానదు. రక్తస్పర్శ కవుల్లో ఒకరిగా సీతారాం ప్రపంచానికి పరిచయం. ‘ఇదిగో ఇక్కడిదాకే’ అంటూ తాను వెలువరించిన కవితా సంపుటి అప్పట్లో ఒక సంచలనంగా నిలిచింది. కవిత్వంలో తాత్విక గాఢత కలిగిన పోస్ట్ మాడర్నిస్ట్ ధోరణిలో సాగిన ఈ కవిత్వం ఇటు పాఠకులనే కాదు అటు విమర్శకులను సైతం ఆలోచింపజేసింది. గ్లోబలైజేషన్ నేపథ్యంలో ఆధునిక మానవుడి అంతఃసంఘర్షణను, లోలోపలి మానని గాయాలను అతి సున్నితంగా, హృద్యంగా పట్టుకోవడంలో సీతారాంది అందెవేసిన చెయ్యి. ఆ తరువాత... కాలం వెంట నడుస్తూనే దాని పరిణామాలను, ప్రతిఫలనాలను ఒడిసి పట్టుకుని కవిత్వంలో హృద్యంగా ఒదిగించిన తీరు అసామాన్యమైంది. వస్తువు ఎంపిక దగ్గరి నుండి, దాని అభివ్యక్తి వరకు నూతనత్వంతో కూడిన తాజాదనమే ప్రతీ కవితలో పొదిగిన కవిత్వజీవి ఆయన. ఇట్లా కవిత్వం రంగంలో తనదైన సాహిత్య జెండాను ఎగురవేసిన ‘సన్నాఫ్ మాణిక్యం’ సీతారాం.
కవికి సృజనకారుడికి సాహిత్య లోతుపాతులను విడమరిచి చెప్పి, సరైన దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యతను సైతం నిండు మనసుతో స్వీకరించిన విమర్శకుడు తాను. అట్లా తాను రాసిన ‘అదే పుట’ సాహిత్యం విమర్శలో వస్తు, శిల్పాలనే కాదు అభివ్యక్తి విషయంలో సైతం పాశ్చాత్య సాహిత్య విమర్శ సిద్ధాంతాలతో విశ్లేషించి తెలుగు సాహిత్యానికి పరిచయం చేశారు. ఈ రకంగా సీతారాం విమర్శకులు లేని లోటును గడిచిన మూడున్నర దశాబ్దాలుగా తీరుస్తూనే ఉన్నారు. నిర్మొహమాటంగా తాను చేసిన విమర్శ సాహిత్యకారులను ఆ సమయంలో నొప్పించి ఉండొచ్చుగానీ ఆ తర్వాత మాత్రం సీతారాం చూపిన మార్గమే సరైనదని గుర్తించక మానరు. అట్లా సాహిత్య గమనాన్ని నిరంతరం పరిశీలిస్తూ సీరియస్ విమర్శ వెలువరించారు. విమర్శ అంటే అదేదో బ్రహ్మపదార్థం కాదని దాన్ని కూడా సృజన ప్రక్రియగా సృజించి పాఠక అభిమానుల్ని సంపాదించుకున్న విమర్శకాగ్రేసరుడు సీతారాం.
సీతారాం కవిగా, విమర్శకుడిగా చేసిన కృషి ఎంత కీలకమైందో వారు చేసిన పరిశోధన కూడా అంతే ప్రాముఖ్యతను సంతరించుకుంది. తెలుగులో 1955 నుండి వెలువడిన వచన కవిత్వ అభివ్యక్తిని గురించి సీతారాం చేసిన పరిశోధన నేటికీ ఎంతోమంది స్కాలర్‌లకు ఒక దిక్సూచిగా నిలబడి ఉంది. పరిశోధనను సీతారాం కేవలం పీహెచ్‌డీ పట్టా వరకే పరిమితం చేయలేదు. పీహెచ్‌డీ పరిశోధన అనంతరం అనేక అంశాల మీద వారి పరిశోధన దృష్టిని సారించారు. ఆ నేపథ్యంలో వాగ్గేయ సాహిత్యంలో పర్యావరణ వాదం మీద మేజర్ రీసెర్చ్ ప్రాజెక్టు చేశారు. తద్వారా తెలుగు సాహిత్యంలో పర్యావరణవాద పరిశోధనకు, సృజనకు దారులు తెరిచారు.
ఇక అధ్యాపకునిగా సీతారాం చేసిన చేస్తున్న కృషి చారిత్రాత్మకమైంది. తన దగ్గర తెలుగు చదువుకుంటున్న విద్యార్థులను సాహిత్యం మార్గం పట్టిస్తున్నారు. సోషల్ మీడియా జమానాలో పుస్తకాలకు దూరమవుతున్న నేటి తరాన్ని సీతారాం కవులుగా మార్చే బాధ్యతను తన భుజాలకు ఎత్తుకున్నాడు. తాను ఏ కళాశాలలో పని చేసినా విద్యార్థులకు కవిత్వ మెలుకువలు నేర్పుతూ రేపటి కవులను తయారు చేస్తున్న ‘కవుల గని’ సీతారాం. సృజనాత్మకతకు పూర్తిగా దూరమై మరమనుషులుగా మారుతున్న కాలం పట్ల తీరని వేదనతో నిత్యం తాత్విక చింతన చేస్తున్న ఈ కవిని గురువుగా కలిగి ఉన్న విద్యార్థులు అదృష్టవంతులు. బోధనను కేవలం ఉద్యోగధర్మంగా మాత్రమే కాకుండా దానినొక చారిత్రిక బాధ్యతగా గుర్తించాడు. అందుకే ఈ ఆధునిక కాలపు పోకడలకు దూరంగా నేటి తరాన్ని ఎప్పటికప్పుడు ఒక స్పష్టమైన దార్శనికతతో ముందుకు నడుపుతున్నాడు. సాహిత్యం, జీవితం వేరువేరు కాదని తాను చెప్తున్నదే ఆచరిస్తూ, ఆచరిస్తున్నదే బోధిస్తూ సాహిత్యంలో, సమాజంలో ఒక ధిక్కార బావుటా ఎగురవేస్తున్న బలమైన గొంతుక సీతారాం.
నిరంతర అధ్యయనం, అరుదైన సాహితీ వ్యక్తిత్వం సీతారాం సొంతం. వ్యంగ్య తాత్వికత వెనక ఎంత గాఢత దాగి ఉంటుందో సీతారాం పలికే ప్రతీ మాటలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. పోరాటాల గుమ్మం ఖమ్మం నేల అందించిన ఆణిముత్యం సీతారాం. ఈ కాలాన్ని వెలిగించిన సీతారాం ప్రసరించిన సాహిత్య వెలుగుల మీద ఇప్పటికే ఎంతో మంది లబ్ధప్రతిష్టులైన విమర్శకులు, పరిశోధకులు ఎంతో బేరీజు వేసి ఉన్నారు. ఇంత నిండైన సాహితీమూర్తిని దేవులపల్లి రామానుజం అవార్డుకు ఎంపిక చేయడం సముచితమైన గౌరవం. అలుపెరుగకుండా సీతారాం చేస్తున్న ఈ కృషి మరింత ముందుకు సాగాలని ఆశిస్తూ...
డాక్టర్ పసునూరి రవీందర్
(నేడు తెలంగాణ సారస్వత పరిషత్‌లో సీతారాంకు
దేవులపల్లి రామానుజరావు పురస్కారం అందజేస్తున్న సందర్భంగా)
Updated Date - Aug 24 , 2024 | 05:38 AM