ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘జమిలి’ దిశగా...

ABN, Publish Date - Sep 19 , 2024 | 05:17 AM

జమిలి ఎన్నికల విషయంలో మరో అడుగుపడింది. ఈ మధ్యనే, సార్వత్రక ఎన్నికలకు కాస్తంత ముందు, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని కమిటీ ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు...

Jamili Elections

జమిలి ఎన్నికల విషయంలో మరో అడుగుపడింది. ఈ మధ్యనే, సార్వత్రక ఎన్నికలకు కాస్తంత ముందు, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని కమిటీ ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించిన నివేదికను కేంద్రమంత్రివర్గం ఆమోదించింది. లోక్‌సభలో సొంతబలం గట్టిగా ఉన్న తొలి రెండు పర్యాయాల్లో ఈ దిశగా సాగించిన ప్రయత్నాలను, ఇప్పుడు సరిపడా స్వశక్తి లేని దశలోకూడా ముందుకు తీసుకుపోవాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. జమిలితో దేశానికి ఎంతో మంచిది అంటూ బీజేపీ పెద్దలు పట్టువీడకుండా పోరాడుతున్న తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

విపక్షాలు ఆదినుంచీ జమిలిని వ్యతిరేకిస్తున్నాయి కనుక, ఇప్పుడు మరింత గట్టిగా విరుచుకుపడటం సహజం. దేశానికి మంచిదన్న పేరిట బీజేపీ తన స్వార్థరాజకీయ ప్రయోజనాలకోసం, ఉజ్వల భవిష్యత్తుకోసం, మిగతాపార్టీల పతనం కోసం ఈ జమిలిని దేశంమీదకు రుద్దుతున్నదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. చీటికీమాటికీ ఎక్కడోక్కడ ఎన్నికలు వచ్చిపడుతూ, అవి ఎక్కడ జరిగినా విధాన నిర్ణయాలకు, అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతున్న స్థితిలో జమిలి వల్ల మాత్రమే ప్రజా‌ధనం ఆదాకావడంతో పాటు, అభివృద్ధి కూడా పరుగులుపెడుతుందని అధికారపక్షం చెబుతూవస్తోంది. మోదీ మొదటివిడత ఎన్నికల మానిఫెస్టోలోనే జమిలి ప్రతిపాదన ఉంది. మరో రెండేళ్ళకు నీతిఅయోగ్‌ బరిలోకి దిగింది. మరో రెండేళ్ళకు లా కమిషన్‌ తన లోతైన అధ్యయనంతో ఏకకాల ఎన్నికలకు ఏయే రాజ్యాంగసవరణలు అవసరమో చెప్పింది. ఒకప్పుడు ససేమిరా కూడదన్న కమిషనే మోదీ ఏలుబడిలో అందుకు సరేనన్నది.


ప్రధాని మోదీ ఓ అఖిలపక్షాన్ని ఏర్పాటుచేయడం, కాంగ్రెస్‌ సహా కొన్ని పార్టీలు వెళ్ళకపోవడం తెలిసిందే. జమిలిమీద ఎందుకంత ప్రేమ కలిగిందో తెలియదు కానీ, రెండేళ్ళక్రితం అప్పటి ప్రధాన ఎన్నికల కమిషనర్‌ తాము సిద్ధం అన్నరీతిలో ఓ ప్రకటన చేసేశారు. ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటిస్తున్నప్పుడు, ఫలానా రాష్ట్రాన్ని జాబితాలో చేర్చకపోవడానికి ఈవీఎంల లభ్యత, సైనికబలగాల తరలింపుల వంటి సమస్యలు కారణమని ఎన్నికల అధికారులు చెబుతూంటారు. దేశవ్యాప్తంగా ఒకేమారు ఎన్నికలు జరపాలనుకుంటే ఈ తరహా చాలా రకాల కొరతలున్నాయని నిపుణులు చేస్తున్న విశ్లేషణలు కూడా కొందరికి నచ్చడం లేదు. బందోబస్తు సంగతి అటుంచితే, లక్షలాది ఈవీఎంలను వేలకోట్ల ఖర్చుతో కొనాల్సి ఉంటుందన్నది వాస్తవం. ఏకకాలంలో ఎన్నికల మంచిచెడులమీద ఇప్పటికే మాధ్యమాల్లో కొంత చర్చ జరిగింది. ప్రజాధనం వృధాకావడం నుంచి అభివృద్ధి సంక్షేమపథకాల నిరవధిక అమలు వరకూ ప్రతీ వాదనమీదా భిన్నాభిప్రాయాలున్నాయి.


జమిలి విషయంలో బీజేపీ పట్టుదల వెనుక తమ ఉనికిని దెబ్బతీసే రాజకీయ లక్ష్యం ఉన్నదని ప్రాంతీయపార్టీల వాదన. ఏకకాలంలో ఎన్నికలు జరిగినప్పుడు కేంద్రంలో ఎవరుండాలన్న అంశమే రాష్ట్రస్థాయి ఎంపికనూ ప్రభావితం చేస్తుందని, ఓటర్లు అక్కడా ఇక్కడా ఒకేపార్టీ అన్నధోరణిలో పోతారని వాటి భయం. జాతీయాంశాలు ముందుకు వచ్చి తమను దెబ్బకొడతాయని వాటి వాదన. దేశభక్తి, సరిహద్దు సమస్యలు, యుద్ధాలు, కులమతాలు ఇత్యాదివి ప్రభావితం చేసినప్పుడు స్థానికాంశాలు వెనక్కుపోవచ్చు. జమిలివస్తే ఒకేపార్టీకి ఓటుచేస్తామని డెబ్బయ్‌శాతం మంది ఓ సర్వేలో చెప్పారట.


‘ఒకేదేశం–ఒకే ఎన్నిక’ విధానం ప్రజాస్వామ్యానికి మంచిదా కాదా అన్నది అటుంచితే, బీజేపీ గతంలో కంటే దిగజారిన తన సంఖ్యాబలంతో దానిని గట్టెక్కించగలదా అన్నది ప్రశ్న. బీజేపీ ఆశిస్తున్నది జరగాలంటే, రాజ్యాంగానికి అరడజను సవరణలు చేయాలి, అందుకు మూడింట రెండువంతులమంది సభ్యులు దానిపక్షాన ఉండాలి, ఆ తరువాత రాష్ట్రాలు దానిని ఆమోదించాలి. ఈ దేశంలో ప్రజలూ ఇతర పార్టీలూ జమిలిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నందున ఇదంతా జరిగేది కాదని, ప్రజల దృష్టిమరల్చే ప్రయత్నమని కాంగ్రెస్‌ అంటున్నప్పటికీ, తిమ్మినిబమ్మిని చేసి అయినా సరే, బీజేపీ కచ్చితంగా తాను అనుకున్నది సాధిస్తుందని అత్యధికుల విశ్వాసం. కోవింద్‌ కమిటీముందు తలూపిన పార్టీల్లో కొన్ని భవిష్యత్తులో కాదుపొమ్మన్నా, కొత్త చేయూతలతో గట్టెక్కవచ్చునని బీజేపీ పెద్దలు నమ్మకంగా ఉన్నట్టు కనిపిస్తోంది.

Updated Date - Sep 19 , 2024 | 11:13 AM

Advertising
Advertising