ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జమిలి దిశగా...!

ABN, Publish Date - Dec 18 , 2024 | 01:50 AM

నిన్నటిదా, మొన్నటిదా...దశాబ్దం నాటి కల, ఇప్పుడు నిజం చేసుకొనే ప్రయత్నంలో తొలి అడుగుపడింది. లోక్‌సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన జమిలి బిల్లు పార్లమెంటులో...

నిన్నటిదా, మొన్నటిదా...దశాబ్దం నాటి కల, ఇప్పుడు నిజం చేసుకొనే ప్రయత్నంలో తొలి అడుగుపడింది. లోక్‌సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన జమిలి బిల్లు పార్లమెంటులో ప్రవేశించింది. బిల్లు సభముందుకు రాగానే కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్‌ ఇత్యాది విపక్షాలు తాడెత్తున లేవడం, అరుపులూ కేకలతో నిరసనలు తెలియచేయడం అనూహ్యమైనవేమీ కావు. ఎంతోకాలంగా తమను వెంట తరుముతున్న ఈ ఒకేదేశం–ఒకే ఎన్నిక బిల్లు ఏదో ఒకరోజు కచ్చితంగా తమముందుకు రావడం ఖాయమని వారికీ తెలుసు. జమిలి బిల్లుల ప్రవేశాన్ని అనుమతిస్తూ 269మందే ఓటుచేయడం విపక్షానికి ఎందుకో అధికారపక్షం బలహీనతగా కనిపిస్తున్నది. బీజేపీ బలం, బలగం లెక్కలు అటుంచితే, బిల్లు ప్రవేశం దశలో మూడింట రెండువంతుల బలం అక్కరలేదన్న విషయం తెలియనిదేమీ కాదు.


అధికారంలో ఎవరున్నా తాము చెబుతున్నదీ చేస్తున్నదీ ప్రజాప్రయోజనార్థమేనని అంటారు. తయారవుతున్న చట్టాలు దేశ సంక్షేమం కోసమే తప్ప తమ స్వార్థరాజకీయం కాదంటాయి. ఒకేదేశం–ఒకే ఎన్నిక ఆలోచనలో విపక్షాలకు ఒక బలమైన రాజకీయ కుట్ర కనిపిస్తోంది. ఇది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమనీ, నియంతృత్వానికి దారితీస్తుందని, రాష్ట్రాల హక్కులు దెబ్బతింటాయనీ, ప్రాంతీయపార్టీలు ఉనికికోల్పోతాయనీ విపక్షాలు అంటున్నాయి. విపక్షాలు ప్రతీదానినీ రాజకీయకోణంలోనే చూస్తాయనీ, మోదీ భయం వాటిని కుదిపేస్తున్నదని అధికారపక్షం అంటోంది. రెండు బిల్లులనూ అడ్డుకోవడానికి ఆఖరుక్షణం వరకూ విపక్షాలు ప్రయత్నిస్తాయనీ, జేపీసీకి పంపాలని ఎలాగూ డిమాండ్‌ చేస్తాయనీ తెలుసు కనుక, మంత్రివర్గ సమావేశంలోనే మోదీ జేపీసీ సూచన చేశారని అమిత్‌ షా ముందే తేల్చేశారు. సదరు కమిటీలో బీజేపీ సంఖ్యాబలం సహజంగానే ఎక్కువ ఉంటుంది కనుక, మిగతాదశలూ కష్టనష్టాలమాట అటుంచితే, ఈ దశ దాటడం ఖాయం. జమిలిని మ్యానిఫెస్టోలో పెట్టడం నుంచి, ఎర్రకోట ప్రసంగాలు, రాష్ట్రపతుల హితవులు, పార్టీపెద్దల అసందర్భోచిత ప్రస్తావనలు చాలా చూశాం. జమిలికి వకాల్తాపుచ్చుకున్న మాజీ రాష్ట్రపతి తన నివేదికలో దానిని ఓ చారిత్రాత్మక పరిణామంగా ముందుకు తోయడంలో ఆశ్చర్యమేమీ లేదు. జమిలికిపోతే జీడీపీ ఒకటిన్నరశాతం పెరుగుతుందన్న లెక్క ఆర్థికవేత్తలకు ఇంకా అర్థంకావాల్సి ఉంది. ఎన్నికల ఖర్చు తగ్గుతుందని, సునాయాస పాలనకు వీలుకలుగుతుందనీ పాలకపక్షం నేతల మాదిరిగానే ఈ కమిటీ కూడా చాలా చెప్పింది. ప్రతీ చిన్న ఎన్నికనూ ఓ యుద్ధంలాగా చేయడం బీజేపీ వచ్చిన తరువాతే పెరిగింది కానీ, అంతకుముందు ఎక్కడో ఎన్నికలు జరుగుతూంటే ఢిల్లీ ఏలికలు పెద్దగా ఆయాసపడిందేమీ లేదు. మంచిచెడులతో నిమిత్తం లేకుండా విపక్షాలన్నీ జమిలిని వ్యతిరేకించడానికి అసలు కారణం ప్రాంతీయ ప్రాధాన్యతలు వెనక్కుపోయి, జాతీయాంశాలు ముందుకు వస్తాయని, కేంద్రం బలపడుతుందని. ఎన్నికలవేళ మతాన్ని రగిలించి, దేశభక్తిని రంగరించి, సర్జికల్‌ దాడులతో మోదీ ఓట్లు ఎగరేసుకుపోతారని.


రాజ్యాంగ సవరణ బిల్లు అయినప్పటికీ కూడా సభాప్రవేశం దశలో మూడింట రెండువంతుల మెజారిటీ అవసరం లేదని విపక్షాలకు తెలియదనుకోలేం. ఈ దశలోనే అధికారపక్ష కూటమి బలం తుస్సుమని తేలిపోయిందనీ, రేపు కచ్చితంగా జమిలి ఓడిపోతుందని నిజంగానే అవి నమ్ముతున్నపక్షంలో ఇప్పుడే అంత ఆవేశపడనక్కరలేదు. ఏ దశలో ఏ అడుగువేయాలో, ఎవరిని మోహరించి గట్టెక్కాలో అధికారపక్షానికి తెలిసిన విద్య కనుక తిమ్మినిబమ్మిని చేయగలదన్న భయం విపక్షాలకు లోలోన ఉన్నదేమో. బిల్లు నెగ్గదు అని విపక్షాలు అనడం, నెగ్గించి తీరుతామని అధికారపక్షం వాదించడం వాటి స్థానాల రీత్యా సహజం. గత రెండుపర్యాయాలు సొంతబలంతో అధికారంలో ఉన్న బీజేపీ, ఇప్పుడు మిత్రపక్షాల చేయూతలేనిదే అడుగువేయలేని దశలో రాజ్యాంగసవరణలకు అవసరమైనంత సంఖ్యాబలాన్ని కూడగట్టగలనన్న నమ్మకం‍తోనే ఈ సాహసానికి పూనుకుందా? అన్నది ప్రశ్న. పదేళ్ళపాటు అవధులు దాటిన ఆత్మవిశ్వాసంతో వ్యవహరించిన ఒక పార్టీకి, మూడోవిడతలో మరొకరి ఊనికతో నడవాల్సిరావడం భరించలేని విషయం. ఉన్న ఆ కాస్త హవా ఇంకొంత హరించుకుపోకముందే, జమిలితో దేశాన్నంతా చాపచుట్టేయాలని ఆశించడంలో తప్పేమీ లేదు. బలం లేనంతమాత్రాన సంకల్పం సన్నగిల్లలేదనీ, ఆత్మవిశ్వాసం చెదరలేదనీ, వెనక్కుతగ్గేదే లేదని దూకుడు చూపడం రాజకీయాల్లో అత్యంత ముఖ్యం.

Updated Date - Dec 18 , 2024 | 01:50 AM