ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సయోధ్య దిశగా...!

ABN, Publish Date - Oct 23 , 2024 | 01:26 AM

ప్రధాని నరేంద్రమోదీ బ్రిక్స్‌ సదస్సుకు బయలుదేరడానికి ఒక రోజుముందు భారత్‌–చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ఓ అడుగుపడింది. వాస్తవాధీనరేఖ వద్ద బలగాల ఉపసంహరణకు...

ప్రధాని నరేంద్రమోదీ బ్రిక్స్‌ సదస్సుకు బయలుదేరడానికి ఒక రోజుముందు భారత్‌–చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ఓ అడుగుపడింది. వాస్తవాధీనరేఖ వద్ద బలగాల ఉపసంహరణకు సంబంధించి ఇరుదేశాలూ ఓ ఒప్పందానికి వచ్చాయని, ఎల్‌ఏసీ వద్ద మళ్ళీ గస్తీ ఆరంభమవుతుందని భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ ప్రకటించారు. అనేకవారాలుగా రెండుదేశాల మధ్యా జరుగుతున్న చర్చలు ఫలించి ఈ బలగాల ఉపసం‌హరణ నిర్ణయం జరిగిందని, నాలుగేళ్ళుగా రగులుతున్న సరిహద్దు సమస్య పరిష్కారానికి మార్గం సుగమం అయిందని అన్నారాయన. దౌత్య, సైనికమార్గాల్లో రెండుదేశాల మధ్యా చర్చోపచర్చలు జరిగాయని, ఒప్పందం నిజమేనని చైనా మంగళవారం ధ్రువీకరించింది. బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో చైనా అధ్యక్షుడితో భారత ప్రధాని భేటీకి ఈ పరిణామం వీలు కల్పిస్తుందని విశ్లేషకుల అభిప్రాయం.


సరిహద్దుల్లో తిరిగి ప్రశాంతత నెలకొంటుందంటే కచ్చితంగా స్వాగతించవలసిందే. 2020 గల్వాన్ లోయ ఘర్షణ రెండుదేశాల మధ్య వైషమ్యాలను పెంచింది. ఘర్షణలో కర్నల్‌ సంతోష్‌బాబు సహా 20 మంది భారత సైనికులు మరణించారు. తుపాకులు, పేలుడు పదార్థాలు ఉపయోగించకూడదని 1996 నాటి ఒప్పందం చెబుతున్నందున, ఇరుదేశాల సైనికులు కర్రలతోనూ, రాళ్ళతోనూ తీవ్రంగా దాడిచేసుకున్నారు. చైనా భారీగా సైనికులను కోల్పోయినప్పటికీ కొన్ని నెలలపాటు ఆ వివరాల జోలికి పోలేదు. చాలాకాలం తరువాత ఐదుగురు చనిపోయినట్టు అంగీకరించినా ఆ సంఖ్య నిజం కాదన్న అనుమానాలున్నాయి. 2021లో ఉత్తర సిక్కింలో, మరుసటి ఏడాది తవాంగ్‌ సెక్టార్‌ సరిహద్దుల్లో ఇరుదేశాల సైనికుల మధ్యా ఘర్షణలు జరిగాయి. రెండుదేశాలు అధీనరేఖ వెంబడి భారీస్థాయిలో బలగాలను మో‌హరించడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. భారత్‌–చైనా మధ్య దాదాపు మూడున్నరవేల కిలోమీటర్ల అత్యంత కఠినమైన, వివాదాస్పద సరిహద్దు ఉంది. వైషమ్యాలు హెచ్చుతున్నకొద్దీ ఉభయదేశాలు సరిహద్దు వెంబడి రోడ్లు, వంతెనలు నిర్మిస్తూపోతున్నాయి. చైనా ఏకంగా కొత్త గ్రామాలనే స్థిరపరుస్తోంది.

ఈ నేపథ్యంలో, ఈ కీలకమైన ఒప్పందంతో 2020 పూర్వస్థితికి వెళ్ళాం, బలగాల ఉపసంహరణ కూడా దాదాపుగా ముగిసింది, ఇదొక అద్భుతమైన పరిణామం అని విదేశాంగమంత్రి ఒక చానెల్ చర్చల్లో ఉత్సాహంగా వ్యాఖ్యానించినప్పటికీ, ఒప్పందంలో ఉన్నదేమిటో తెలిస్తే కానీ, అది అద్భుతమో కాదో చెప్పలేమని విపక్షాలు అంటున్నాయి. గల్వాన్‌ ఘటన జరిగినప్పటి నుంచి విపక్షాలు నరేంద్రమోదీ ప్రభుత్వంమీద విమర్శలతోపాటు, అనుమానాలు వెలిబుచ్చడం కూడా జరుగుతోంది. చైనా మన భూభాగంలోకి అంగుళం కూడా రాలేదంటూ మోదీ ప్రభుత్వం దబాయి‍స్తున్న విషయం తెలిసిందే. భారత భూభాగంలోకి ఏ ఒక్కరూ చొరబడలేదు, ఒక్క పోస్టును కూడా చెరబట్టలేదు అని ప్రధాని స్వయంగా చేసిన ప్రకటనతో మనకు జరిగిన అన్యాయం వెనక్కుపోయి, మన వాదన వీగిపోయిందని కాంగ్రెస్‌ మండిపడుతోంది. చైనా ఎన్ని వీరంగాలు వేసినా, సరిహద్దు వెంబడి అనేక చొరబాట్లకు పాల్పడినా, కొద్దికొద్దిగా మన భూభాగాన్ని మింగివేసినా భారత ప్రభుత్వం దేశప్రజలకు నిజాలు తెలియనివ్వలేదని, చట్టసభల్లో చర్చకు మోకాలడ్డుతూ విపక్షాల నోరుమూయించే ప్రయత్నం చేసిందని దాని విమర్శ.


చైనా చొరబాట్లు, దుందుడుకు వైఖరి కారణంగా ఇప్పటికే మనకు జరిగిన నష్టాన్ని ఈ ఒప్పందం ఏ మేరకు పూడుస్తుందో, దురాక్రమించుకున్న ప్రాంతాల నుంచి అది ఎంతమేరకు వైదొలుగుతున్నదో చూడాలి. అన్ని పాయింట్ల నుంచి చైనా వెనక్కు తగ్గి, గతంలో మనం గస్తీ తిరిగినవన్నీ తిరిగి దక్కడం ముఖ్యం. ఉత్తర లద్దాఖ్‌లోని డెప్సాంగ్‌, దక్షిణంలోని డెమ్‌చోక్‌ వంటి ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ హక్కులు వస్తే సైనికపరంగా మనకు ఎంతో ఉపయోగం. కొత్త ఒప్పందంలో భాగంగా కీలకమైన ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ వివరాలను రెండుదేశాలు ఎప్పటికప్పుడు ఇచ్చిపుచ్చుకుంటాయట. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియవచ్చునేమో కానీ, ఈ ఒప్పందం కుదిరినంతమాత్రాన రెండుదేశాల మధ్యా సయోధ్య ఏర్పడినట్టు, సత్సంబంధాలు నెలకొన్నట్టూ కాదు. రెండుదేశాల మధ్యా అవిశ్వాసం ఉన్నంతకాలం ఉభయపక్షాలకూ ఏకాభిప్రాయం లేని వేలకిలోమీటర్ల సరిహద్దులో అవసరమైనప్పుడల్లా అగ్గిరాజేయగలిగే అవకాశం ఎప్పుడూ ఉంటుంది.

Updated Date - Oct 23 , 2024 | 01:27 AM