సునాక్ నిష్క్రమణ
ABN, Publish Date - Jul 06 , 2024 | 04:38 AM
బ్రిటన్‌లో ‘మార్పు’ తీవ్రంగా దూసుకువచ్చింది. పధ్నాలుగేళ్లుగా అధికారంలో ఉంటూ, ప్రజల వ్యతిరేకతను అపారంగా పోగేసుకున్న కన్సర్వేటివ్ (టోరీ) పార్టీ గురువారం జరిగిన సాధారణ ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయింది. రెండు తరాల కింద మాత్రమే తరలివెళ్లిన,
బ్రిటన్‌లో ‘మార్పు’ తీవ్రంగా దూసుకువచ్చింది. పధ్నాలుగేళ్లుగా అధికారంలో ఉంటూ, ప్రజల వ్యతిరేకతను అపారంగా పోగేసుకున్న కన్సర్వేటివ్ (టోరీ) పార్టీ గురువారం జరిగిన సాధారణ ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయింది. రెండు తరాల కింద మాత్రమే తరలివెళ్లిన, భారతీయ మూలాలున్న రిషి సునాక్ ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. ఘనవిజయం సాధించిన లేబర్ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా నియమితులయ్యారు. ప్రభుత్వ పతనం ఊహించిందే అయినా, ఈ ప్రభంజనం మాత్రం ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. భారతదేశానికి, ప్రపంచానికి ఈ పరిణామం అనేక ప్రభావాలను కలిగించబోతోంది.
భారత్ ఎన్నికలలో ‘చార్ సౌ పార్’ లాగానే, బ్రిటన్ ఎన్నికలలో లేబర్ పార్టీ ‘సూపర్ మెజారిటీ’ నినాదం ఇచ్చింది. నిజానికి, అక్కడ ఎంత పెద్ద నిర్ణయాలకైనా సాధారణ మెజారిటీ చాలు. కన్సర్వేటివ్ పార్టీ కూడా లేబర్ సూపర్ మెజారిటీకి వ్యతిరేకంగా ప్రచారం చేసింది. ఇండియాలో నినాదం సఫలం కాలేదు కానీ, బ్రిటన్‌లో స్టార్మర్ మూడింట రెండువంతుల సంఖ్యకు దగ్గరగా ఘనవిజయం సాధించారు. 650 మంది సభ్యులుండే బ్రిటన్ దిగువ సభలో లేబర్ పార్టీ 412 స్థానాలు సంపాదించింది. ఇది గత సభ కంటె 214 అధికం. కన్సర్వేటివ్ పార్టీ కేవలం 121 స్థానాల్లోనే గెలుపొందింది. గత ఎన్నికలలో సాధించిన విజయాల కంటె ఇది 251 తక్కువ.
అంకెలలో కనిపిస్తున్న విజయాలను బట్టి, బ్రిటన్ పరిణామాన్ని అర్థం చేసుకోలేము. ఇది లేబర్ పార్టీ విజయం కాదని, టోరీల పరాజయమనీ ముందు తెలుసుకోవాలి. కన్సర్వేటివ్ పార్టీ గత ఎన్నికలలో సాధించిన ఓట్ల కంటె 20 శాతం నష్టపోయి, ప్రస్తుతం కేవలం 24 శాతం ఓట్లతో మిగిలింది. కానీ, లేబర్ పార్టీ అన్ని సీట్లు అదనంగా గెలుచుకున్నప్పటికీ, గత ఎన్నికల కంటె కేవలం అదనంగా పొందింది 2 శాతం కంటె తక్కువ ఓట్లే! యూరోపియన్ యూనియన్ నుంచి ఎటువంటి ఒప్పందమూ లేకుండా వైదొలగాలని వాదించి వెలుగులోకి వచ్చిన తీవ్ర మితవాద పార్టీ ‘రిఫామ్ యుకె’ ఈ ఎన్నికల్లో కేవలం నాలుగు సీట్లు మాత్రమే సాధించింది. అయినప్పటికీ అది చిన్న విజయమేమీ కాదు, పెద్ద ప్రమాదం దాగి ఉన్న విజయం కూడా. గత ఎన్నికల్లో కేవలం 1.7 శాతం ఓట్లు సంపాదించుకున్న ఈ పార్టీ ఈ సారి 14 శాతం ఓట్లు పొందింది. కన్సర్వేటివ్ పార్టీలోని అతిమితవాదులు ఈ పార్టీ వైపు ఆకర్షితులయినట్టు తెలుస్తోంది. ఫాసిస్టు పోకడలున్న ‘రిఫామ్ యుకె’ నేత నైజిల్ ఫరాజ్ మొదటిసారి పార్లమెంటులోకి అడుగుపెట్టబోతున్నాడు. కన్సర్వేటివ్ పార్టీలో ఉదారవాదం వైపు మొగ్గుచూపే వారు ఈసారి లిబరల్ డెమొక్రటిక్ పార్టీ వైపు మొగ్గినట్టు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో కేవలం 8 సీట్లున్న ఈ పార్టీ ఇప్పుడు 71 స్థానాల్లో గెలిచింది. పాలస్తీనాకు అనుకూలంగా నిలబడిన ఐదుగురు స్వతంత్ర సభ్యులు కూడా ఈ ఎన్నికల్లో గెలిచారు. కన్సర్వేటివ్ ఓట్లు చెల్లా చెదురయినట్టు, లేబర్ పార్టీకి కొత్తగా ఓట్లు పెద్దగా రానట్టు కనిపిస్తున్న ఈ ఎన్నికల్లో ఫలితాలు ఇట్లా ఎందుకు వచ్చాయన్న సందేహం కలుగుతుంది. లేబర్ పార్టీ తాను గెలవడానికి అవసరమైన ఓటింగ్ మీదనే ఆయా నియోజకవర్గాలలో గురిపెట్టిందని, అందువల్ల, తన ప్రయత్నాన్ని ఎక్కువ స్థానాల్లో సమానంగా విస్తరించగలిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎక్కువ ఓటింగ్ శాతం ఉండి, తక్కువ స్థానాలు పొందిన పార్టీల ఓట్లు కొన్ని నియోజకవర్గాలలో కేంద్రీకృతమైనట్టు అర్థం చేసుకోవాలి. నాలుగు స్థానాల్లో మాత్రమే గెలిచిన రిఫామ్ యుకె పార్టీ ప్రభావం అనేక నియోజకవర్గాల్లో విస్తరించింది. బ్రిటన్‌లోని మైనారిటీలు, పూర్వ వలసల నుంచి వచ్చి స్థిరపడినవారు, కొత్తగా వలసవచ్చినవారు, ఆర్థికంగా అణగారినవారు ఈ తీవ్రమితవాద పార్టీ ప్రభావం పెరగడం మీద ఆందోళనగా ఉన్నారు.
ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, అశాంతితో పద్నాలుగేళ్లుగా కునారిల్లుతున్న బ్రిటన్ పౌరులు, తమ నిర్ణయాన్ని స్పష్టంగా, కఠినంగా చెప్పారు. ‘‘మీ ఆగ్రహం నాకు తెలుస్తోంది’’ అని సునాక్ తన వీడ్కోలు ప్రసంగంలో అన్నమాట, ప్రజానిర్ణయం వెనుక కారణాలను అంగీకరించడమే. ఎంతో గంభీరంగా, ఉదాత్తంగా సునాక్ చేసిన ప్రసంగం, అక్కడి వ్యాఖ్యాతలు అవహేళన చేస్తున్నా, భారతీయ ప్రజాస్వామిక విలువల నుంచి చూస్తే, విశేషమే అనిపిస్తుంది. నిజానికి, ఓటమికి కారణం సునాక్ 20 నెలల పాలన కాదు. విశ్వసనీయత కోల్పోతున్న ప్రభుత్వాన్ని నిలబెట్టాలని ఆయన ఏదో ప్రయత్నం చేశారు. కానీ, అది ఒకరి సదుద్దేశాలతో బాగుపడే సంక్షోభం కాదు. అంతకు ముందు కంటె, కన్సర్వేటివ్‌లు అధికారం చేపట్టిన 2010 కంటె పరిస్థితి మెరుగ్గానే ఉందని సునాక్ చెప్పుకున్నారు కానీ, అటువంటి సమర్థనలు అనవసరం.
మధ్యేవాద, ఉదారవాద లక్షణాలున్న లేబర్ పార్టీకి భారతదేశ విధానాలతో కొన్ని సమస్యలున్నాయి. ఇటీవలిదాకా, ఆ పార్టీ కశ్మీర్ స్వయంనిర్ణయాధికార హక్కుని సమర్థించేది. ఈ మధ్యే స్టార్మర్ కశ్మీర్ సమస్య భారత్ పాక్‌ల మధ్య తేలవలసినదని, అంతర్గత సమస్యలను భారత్ ప్రజాస్వామ్యం పరిష్కరించుకోగలదని వ్యాఖ్యానించి, వైఖరిలో మార్పును సూచించారు. ఉక్రెయిన్ యుద్ధం వంటి అంశాలు అంతర్జాతీయంగాను, భారత్‌తో సంబంధాల విషయంలోను అవరోధంగా ఉండేవే. ఈ ఎన్నికల్లో గర్భితమై ఉన్న ప్రజాభిప్రాయాన్ని అర్థం చేసుకుని, బ్రిటన్‌ను సమస్యల నుంచి లేబర్ ప్రభుత్వం గట్టెక్కించగలదని ఆశించాలి.
Updated Date - Jul 06 , 2024 | 04:38 AM