ఎడతెగని హింస
ABN, Publish Date - Nov 29 , 2024 | 05:29 AM
పాకిస్థాన్ ప్రశాంతంగా ఉండటం ఇటీవల చూడలేదు. కొద్దిరోజులుగా షియా–సున్నీ ముస్లింల మధ్య ఎడతెగని హింస కారణంగా వందమందివరకూ మరణించారు. ఆ యుద్ధం సాగుతూండగానే, మాజీ ప్రధాని...
పాకిస్థాన్ ప్రశాంతంగా ఉండటం ఇటీవల చూడలేదు. కొద్దిరోజులుగా షియా–సున్నీ ముస్లింల మధ్య ఎడతెగని హింస కారణంగా వందమందివరకూ మరణించారు. ఆ యుద్ధం సాగుతూండగానే, మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను జైలునుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన పార్టీ భారీ నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చి, తీవ్ర ఉద్రిక్త పరిస్థితులను సృష్టించింది. వేలాదిమంది భద్రతాబలగాలు అర్థరాత్రివేళ విరుచుకుపడి పీటీఐ మద్దతుదారులను, కార్యకర్తలను చావగొట్టాయి. కనిపిస్తే కాల్చివేత ఆదేశాలతో భయపెట్టాయి. ఇమ్రాన్ మద్దతుదారులు పెద్దసంఖ్యలో మరణించారని, వందలాదిమంది తీవ్రంగా గాయపడ్డారని అనధికారిక సమాచారం. విద్యాలయాలను మూసివేసి, ఇంటర్నెట్ నిలిపివేసి ఒకవిధంగా లాక్‌డౌన్ అమలైంది. ఈ మొత్తం వ్యవహారంలో పైచేయి ఇమ్రాన్ పార్టీది అయిందా, బలగాలు గెలిచాయా అన్నది అటుంచితే, ఇప్పటికీ కటకటాల వెనుకనుంచి ఆయన ఒక సవాలు విసిరినా, నిరసనలకు పిలుపు ఇచ్చినా ప్రభుత్వం అతలాకుతలమవుతోందనడానికి ఈ ఘటన నిదర్శనం.
ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ నిరసనలను అనుమతించకూడదన్న లక్ష్యంతో పాకిస్థాన్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వ్యవహరించింది, హద్దులుదాటిన కాఠిన్యాన్ని కనబరిచింది. ఇస్లామాబాద్, రావల్పిండికి వెళ్ళే ప్రధాన దారులను మూసివేసి, రైళ్ళు, బస్సులు నిలిపివేసి, దేశంలోని మిగతా ప్రాంతాలనుంచి ఎవరూ రాజధానికి రాకుండా ప్రభుత్వమే నిలువరించింది. ఒక్కముక్కలో చెప్పాలంటే, తానే రాజధానిని దిగ్బంధించింది. ఇమ్రాన్‌ను విడుదల చేసేవరకూ ఇస్లామాబాద్‌లోని డీచౌక్‌నుంచి కదిలేది లేదని, ఆయనతో కలిసే ఇంటికిపోతామని లక్షలాది కార్యకర్తలముందు భీకర ప్రతిజ్ఞలు చేసిన ఇమ్రాన్ భార్య బుష్రా బీబీ, పోలీసు హింస పతాకస్థాయికి చేరడంతో, కాల్పులు జరగడంతో అక్కడనుంచి పారిపోయారని వార్తలు వచ్చాయి. అయినప్పటికీ, ఆమె నాయకత్వంలో పీటీఐ సాగించిన ఈ పోరాటం ప్రభుత్వాన్ని బాగా భయపెట్టగలిగింది. మరోపక్క భద్రతాదళాలు కూడా వందలాదిమంది కాళ్ళూ చేతులూ విరగ్గొట్టి ఇమ్రాన్ పార్టీని నియంత్రించగలిగాయి.
ఈ భుట్టోలు, షరీఫ్‌లు దేశాన్ని ఇంకెంతకాలం ఏలుతారంటూ వారసత్వరాజకీయాలను తీవ్రంగా విమర్శించే ఇమ్రాన్ ఇప్పుడు తన మూడోభార్యను, సోదరిని యుద్ధక్షేత్రంలోకి దించడం విచిత్రం. రెండున్నరేళ్ళుగా జైల్లో ఉంటున్న ఆయన ఇప్పటికీ తన పార్టీని నియంత్రించగలుగుతున్నాడు, క్షేత్రస్థాయి పోరాటాలకు పురిగొల్పుతున్నాడు. కానీ, వందలాది కేసులు తన మెడకు చుట్టి జైల్లోకి నెట్టేసినవారిని ఢీకొట్టాలంటే, వారి మెడలు వంచి బయటకు రావాలంటే, కదనరంగంలో తానో, తనవారో ప్రత్యక్షంగా కనిపించడం ముఖ్యం. తన పక్షాన కార్యకర్తలకు స్ఫూర్తినిచ్చే శక్తి, తెలివితేటలు, వ్యూహరచనా సామర్థ్యం తన భార్యకు ఉందని ఆయన నమ్మకం.
సైన్యమే ఇమ్రాన్‌ను ఇంతశక్తిమంతుడిగా మార్చిందన్నమాట నిజం. దానికీ, షరీఫ్‌లకు మధ్య లోపాయికారీ అవగాహన కుదరడంతో ఘనంగా గెలిచిన ఇమ్రాన్ తన పదవిని కోల్పోయాడు. గతంలో సైన్యాన్ని విమర్శించి గద్దెదిగిన నవాజ్ షరీఫ్ దానికి ప్రీతిపాత్రుడయ్యాడు. సైన్యానికీ, అమెరికాకూ వ్యతిరేకంగా మాట్లాడిన ఇమ్రాన్ కటకటాలు లెక్కపెట్టవలసి వచ్చింది. అతడిని గద్దెదింపి, కేసులు పెట్టి, శిక్షలు వేసి, జైల్లోకి నెట్టడం వెనుక సైన్యం ఉన్నదని పాకిస్థాన్ ప్రజలకు తెలుసు. చివరకు సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం వంటి బలమైన వ్యవస్థలు కూడా ఆయనకు వ్యతిరేకంగా వ్యవహరించి, ఆయన పార్టీని ఛిన్నాభిన్నం చేసి, కనీసం ఎన్నికల్లో పాల్గొననివ్వని సంగతి తెలిసిందే. బద్ధశత్రువులైన భుట్టోలు, షరీఫ్‌లు చేతులు కలిపి, సైన్యం ఆశీస్సులతో పాలన చేసుకుంటున్నారు. ఇమ్రాన్ జైలునుంచి ప్రజాక్షేత్రంలో వస్తే తమకు ప్రమాదమన్న భయం సైన్యాన్నీ, షరీఫ్ సోదరులను పీడిస్తోంది. ఎన్నికలు నిర్వహించాలన్న ఇమ్రాన్ డిమాండ్‌కు వారు ఇప్పట్లో అంగీకరించరు. ఎంతమంది కార్యకర్తలనైనా బలిపెట్టి జైలునుంచి బయటకు రావాలన్నది ఇమ్రాన్ లక్ష్యం. పాకిస్థాన్ హింస సమీపకాలంలో ముగిసే సూచనలు కనబడటం లేదు.
Updated Date - Nov 29 , 2024 | 05:29 AM