ఎన్నికల వేళ...!
ABN, Publish Date - Oct 26 , 2024 | 04:43 AM
అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరింత దగ్గరకొచ్చిన తరుణంలో, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మీద వాల్‌స్ట్రీట్ జర్నల్ ఒక కథనాన్ని ప్రచురించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో రెండేళ్ళనుంచి
అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరింత దగ్గరకొచ్చిన తరుణంలో, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మీద వాల్‌స్ట్రీట్ జర్నల్ ఒక కథనాన్ని ప్రచురించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో రెండేళ్ళనుంచి ఎలాన్ మస్క్ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని, వ్యక్తిగత అంశాలనుంచి వ్యాపార వాణిజ్యాలు, యుద్ధాలు, అంతర్జాతీయ సంబంధాలు కూడా వారిద్దరూ చర్చించుకుంటున్నారని వాల్‌స్ట్రీట్ జర్నల్ ఆరోపించింది. మస్క్‌తో వ్లాదిమిర్ పుతిన్ ఒక సందర్భంలో చైనాకు అనుకూలంగా మాట్లాడారని, స్టార్‌లింక్ శాటిలైట్ నెట్‌వర్క్‌ను తైవాన్ మీద యాక్టివేట్ చేయకుండా చైనాకు సహకరించమని చెప్పారని సదరు పత్రిక రాసింది. పుతిన్‌తో మస్క్ సాన్నిహిత్యం పతాకస్థాయిలో ఉన్నదని ఈ కథనం సారాంశం. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యాకు తన స్టార్‌లింక్ ద్వారా ఎలాన్‌మస్క్ సహకరిస్తున్నాడని ఇప్పటికే ఆరోపణలు రావడం, అవన్నీ అబద్ధాలని ఈ టెస్లా అధినేత ఖండించడం తెలిసిందే. ఈ కొత్త కథనాన్ని క్రెమ్లిన్ ప్రతినిధి కొట్టిపారేశారు. గతంలోనూ పుతిన్‌తో మస్క్ మాట్లాడారన్న ఆరోపణలు రావడం, అవి నిజం కాదని రష్యా అనడం తెలిసిందే. 2022లో ఒకే ఒక్కసారి వారిద్దరి మధ్యా అది కూడా అంతరిక్షరంగానికి సంబంధించి మాత్రమే సంభాషణ జరిగిందని రష్యా అప్పట్లో చెప్పింది. అయితే, రష్యా అధ్యక్షుడితో మస్క్ సంబంధాల గురించి, కీలకమైన అంశాలతో వెలువడిన ఈ వాల్‌స్ట్రీట్ కథనం దేశభద్రతకు సంబంధించి అమెరికా ప్రభుత్వానికి పరోక్షంగా ఓ సవాల్ విసిరింది. స్పేస్ ఎక్స్ సహా మస్క్‌కు చెందిన చాలా సంస్థలు అమెరికా సైన్యంతోనూ, ప్రభుత్వ సంస్థలతోనూ భాగస్వామ్యంలోనూ, విస్తృతమైన లావాదేవీల్లోనూ ఉన్న విషయం తెలిసిందే. దాదాపు మూడువందలకోట్ల డాలర్ల ఒప్పందాల కారణంగా, మస్క్ సంస్థల వద్ద అత్యంత కీలకమైన సమాచారం ఉంటుంది. ప్రభుత్వ విభాగాలన్నీ ఆయన స్టార్‌లింక్ సేవలను వినియోగించుకుంటున్నాయి. కనుక, పుతిన్‌తో సాన్నిహిత్యం మీద ఈ కొత్త కథనం చిన్న విషయమేమీ కాదు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌నూ, ఆయన మళ్ళీ అధ్యక్షుడు కావడానికి కోట్లు కుమ్మరిస్తున్న ప్రపంచ కుబేరుడు మస్క్‌నీ ఏకకాలంలో గురిపెట్టిన కథనం ఇది. అమెరికా బద్ధశత్రువు పుతిన్‌తో ట్రంప్‌కు అవధులు లేని దోస్తీ ఉన్నదని, ట్రంప్ తొలి విజయంలోనూ పుతిన్ హస్తం ఉన్నదని అప్పట్లోనే అనేక కథనాలు వచ్చాయి. గత ఎన్నికల్లో ఆఖరుక్షణం వరకూ ఆయనను నిలబెట్టేందుకు పుతిన్ రహస్య కుట్రలు చేశారన్న విమర్శలూ వచ్చాయి. అమెరికా అధ్యక్షుడుగా దిగిపోయిన తరువాత కూడా ట్రంప్–పుతిన్ మధ్య రహస్యబంధం కొనసాగుతోందని చాలా కథనాలు వచ్చాయి. పాత్రికేయుడు బాబ్‌వూడ్‌వర్డ్ తన పుస్తకంలో, పుతిన్‌కు ట్రంప్ కొవిడ్ టెస్ట్ కిట్లు పంపించారని, ఇద్దరూ రోజూ చాటింగ్ చేసుకుంటారని రాశారు. కొవిడ్ కిట్లు పంపిన మాట నిజమే కానీ, టచ్‌లో ఉండటం మాత్రం అబద్ధమని రష్యా అంటోంది. ట్రంప్‌కు వ్యతిరేకంగా సాగుతున్న పలువిచారణల్లో అమెరికా అంతర్గత వ్యవహారాల్లో పుతిన్ జోక్యం, పదవీచ్యుతుడైన తరువాత పుతిన్‌తో సంబంధాల అంశం కూడా ఉన్నాయి. ఇప్పుడు వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడైన మస్క్ సైతం శత్రువు చేయి కలిపాడని అంటోంది. తాను రేపు అధికారంలోకి వస్తే మస్క్‌కు సమస్త వ్యవస్థలను ప్రక్షాళించే కీలకమైన పదవిని కట్టబెడతానని ట్రంప్ గతంలోనే ప్రకటించారు. మంత్రికావచ్చు లేదా సలహాదారుగా చక్రం తిప్పవచ్చు అని ముందే ప్రకటించారు. ట్రంప్ అధ్యక్షుడైతే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు సంబంధించిన నిబంధనల సడలింపు సహా తాను ఏయే ప్రతిపాదనలు చేయబోతున్నానో మస్క్ కూడా సెలవిచ్చారు. తాను అధికారంలోకి రాగానే ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుందని ట్రంప్ హామీ ఇవ్వడం, ఉక్రెయిన్ కొన్ని భూభాగాలను రష్యాకు వదులుకొని, నాటోలో చేరనని హామీ ఇవ్వాలంటూ మస్క్ ప్రతిపాదించడం తెలిసిన విషయాలే. ఉక్రెయిన్‌తో యుద్ధంలో తన స్టార్‌లింక్ సాటిలైట్ సర్వీసుల ద్వారా రష్యాకు కీలకమైన సమయాల్లో మస్క్ సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. ప్రస్తుతం ట్రంప్ పక్షాన మస్క్ స్వయంగా ఎన్నికల ప్రచారంలోకి దిగడమే కాక, వందలకోట్ల డాలర్ల విరాళాలు ఇస్తున్నారు. కీలకమైన రాష్ట్రాల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఏవేవో పథకాలు, ప్రతిపాదనలతో డబ్బు ఎరవేస్తున్నారు. అమెరికా ఓటర్లమీద మస్క్ విన్యాసాలు, ఈ సరికొత్త కథనం ఏ మేరకు ప్రభావితం చూపుతాయో తెలియదు. కానీ, పరుగుపందెంలో విజేత ఎవరో తేలిపోతున్న ఈ ఆఖరుక్షణంలో ప్రత్యర్థుల పక్షాన ఇటువంటి కుట్రకథనాలు రావడంలో ఆశ్చర్యమేమీ లేదు అని రష్యా చేసిన వ్యాఖ్య మాత్రం విచిత్రమైనది.
Updated Date - Oct 26 , 2024 | 04:43 AM