ట్రంప్ 2.0: వాణిజ్య యుద్ధాలే!
ABN, Publish Date - Nov 19 , 2024 | 05:54 AM
వ్యాకరణం బోధిస్తూ మా తెలుగు టీచర్ ‘రావణుణ్ణి శ్రీరాముడు చంపాడు’ అని ఉదహరించిన వాక్యం ట్రంప్ ఎన్నిక సందర్బంగా గుర్తు వస్తోంది. రాముడు ‘కర్త’, రావణుడు ‘కర్మ’, ‘చంపాడు’ క్రియ. ఈ వ్యాకరణ విశేషాన్ని అమెరికా అధ్యక్ష ఎన్నిక ఫలితాల ప్రచార
వ్యాకరణం బోధిస్తూ మా తెలుగు టీచర్ ‘రావణుణ్ణి శ్రీరాముడు చంపాడు’ అని ఉదహరించిన వాక్యం ట్రంప్ ఎన్నిక సందర్బంగా గుర్తు వస్తోంది. రాముడు ‘కర్త’, రావణుడు ‘కర్మ’, ‘చంపాడు’ క్రియ. ఈ వ్యాకరణ విశేషాన్ని అమెరికా అధ్యక్ష ఎన్నిక ఫలితాల ప్రచార సరళికి వర్తింపజేస్తే ట్రంప్ కర్త అవుతాడు. అయితే అది సత్యం మాత్రం కాదు. ‘ట్రంప్ అనూహ్యమైన విజయం సాధించాడు’, ‘ప్రత్యర్థి డెమొక్రటిక్ పార్టీ ఓట్ బ్యాంకుని సైతం కొల్లగొట్టాడు’, ‘ఏ స్త్రీలు, మైనార్టీలకూ, వలస కార్మికులకూ, నాన్ వైట్ జాతులకు వ్యతిరేకమో వాటి ఓట్లు సైతం కొల్లగొట్టి విజేతగా నిలిచాడు’ అని పబ్లిసిటీ జరుగుతోంది. పై లెక్కన డొనాల్డ్ ట్రంప్ ‘కర్త’, కమలా హారిస్ ‘కర్మ’, ఓటమి ‘క్రియ’!
మరో ప్రచార సరళి చూద్దాం. ‘అనూహ్య ఆధిక్యతతో ట్రంప్ గెలిపించబడ్డాడు’, ‘ప్రత్యర్థి పార్టీ ఓట్లు సైతం బదిలీ చేయబడ్డాయి’, ‘ఆటుపోట్లకి గురైన ట్రంప్‌ని నిలబెట్టి విజేతగా మార్చింది’, ‘ఏ వర్గాలకు వ్యతిరేకంగా దూషణలకు ట్రంప్‌ని ప్రేరేపించిందో అదే వర్గాల ఓట్లు వేయించింది’. ఈ ప్రకారం ట్రంప్ ‘కర్మ’గా మారతాడు. ఓటమి క్రియే! ఇది కర్త లేని ‘రావణుడు చచ్చెన్’ వంటి వాక్యం. నిజానికి ట్రంప్ సాధించిన విజయం కాదిది. ట్రంప్‌కి చేకూర్చబడ్డ విజయం. ఈ రెండో ప్రచార సరళిలో కర్త అదృశ్యశక్తిగా ఉంటుంది. అదే అమెరికా పెట్టుబడి! పైగా టీ పార్టీ ఉద్యమంగా మొదలై ‘మన అమెరికాని మళ్ళీ గొప్పరాజ్యం చేద్దాం’ అనే ఉద్యమాన్ని తెర వెనక నుండి నడిపిస్తున్న పెట్టుబడిలోని ఓ కొత్త శిబిరం.
అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ రెండవసారి ఎన్నిక వర్తమాన ప్రపంచాన్ని తీవ్ర కుదుపునకు గురిచేసింది. ట్రంప్ మొదటి ప్రభుత్వ పాలన బాధిత సమూహలుగా మారిన శ్రేణులు కూడా రెండోసారి ట్రంప్ గెలుపునకు సాయం చేయడం విస్మయం కలిగించేదే. ఇది అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ట్రంప్ వ్యతిరేక రాజకీయ శక్తుల దృష్టిలో సైతం అనూహ్య ఫలితమే. అయితే ఆ గెలుపు 78 ఏండ్ల ట్రంప్ వ్యక్తిగత ఘన విజయంగా సాగే ప్రచార సరళి వాస్తవ విరుద్ధమైనది. ట్రంప్ వ్యక్తి కాదు. ట్రంప్ పార్టీ స్వతంత్ర రాజకీయ సంస్థ కాదు. ఆయన పార్టీ అమెరికా పెట్టుబడికి ప్రాతినిధ్యం వహిస్తోంది. అది చేపట్టిన వ్యూహం, ఎత్తుగడలకి దక్కిన విజయం. అది ఒక వ్యక్తికి అంటగట్టడం సరికాదు. వ్యక్తిగతంగా సమర్థుడైనా వ్యక్తిగత విజయం కాదు. ట్రంప్‌ని పోటీలో నిలబెట్టి గెలిపించిన పెట్టుబడిదారీ వర్గం సాధించిన విజయమది.
అమెరికా రాజ్య వ్యవస్థ ద్విముఖ స్వభావం గలది. బయటకి కనబడే రాజ్యం (ఓపెన్ స్టేట్) వెనక చీకటి రాజ్యం (డీప్ స్టేట్) ఉంది. సాధారణంగా అమెరికా ప్రభుత్వ విధానం రెండు పార్టీల మధ్య వైరుధ్యాలతో కూడింది. ఆ వివాదం ఓపెన్ స్టేట్‌కే పరిమితం. కానీ బాహ్య వివాదాలకి అతీతంగా డీప్ స్టేట్ గాఢ ఐక్యతని ప్రదర్శిస్తుంది. ఆఫ్ఘానిస్తాన్, ఇరాక్ దురాక్రమణల నుండి ఇరాన్, సిరియా, క్యూబా, ఉత్తర కొరియాతో కయ్యం దాకా ఐక్యత ప్రదర్శించింది. ఆ డీప్ స్టేట్‌లోనూ విభజన వస్తుండడం నేటి కొత్త మాట! దాని రాజకీయ ప్రతిబింబమే ట్రంప్. దేశాల మధ్య సరిహద్దుల్ని చెరిపి, సుంకాల్ని రద్దుచేసి ప్రపంచాన్ని ఓ కుగ్రామంగా మార్చిన ప్రపంచీకరణతో మరింత బలపడగలనని అమెరికా పెట్టుబడిదారీ వర్గం 1990 దశకంలో అంచనా వేసింది. తనకు కలిసొచ్చిన అంతర్జాతీయ పరిస్థితిని సద్వినియోగం చేసుకుంది. సోవియట్ యూనియన్ పతనాన్ని అవకాశంగా ఎంచుకొని సరిహద్దులు లేని కొత్త ప్రపంచ వ్యవస్థ (న్యూ వరల్డ్ ఆర్డర్) స్థాపనకు పూనుకున్నది. అదే ప్రపంచీకరణ ప్రక్రియ! అందులో భాగమే ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్యుటీవో).
తమ ఆర్థిక సామ్రాజ్య విస్తరణ కోసం, రాజకీయ సామ్రాజ్య పటిష్ఠత కోసం, తుదకు సైనిక సామ్రాజ్య ఆధిపత్యం కోసం, అంటే ఏకధ్రువ ప్రపంచ వ్యవస్థ స్థాపనకై నాటి అమెరికా పెట్టుబడిదారీవర్గం నడుం కట్టింది. అది జార్జి బుష్‌ని శక్తిమంతమైన రాజకీయ ప్రతినిధిగా మార్చుకుంది. నాడు బుష్ సర్కార్‌తో యుద్ధాలను చేయించింది. అమెరికా పెట్టుబడి కర్త, బుష్ కర్మ కాగా, యుద్దాలు క్రియగా మారింది. కానీ బయటకు బుష్ కర్తగా పేరొందాడు. వాస్తవ కర్త కనుమరుగైనది. చరిత్ర పునరావృతం అవుతోంది. నేడు ట్రంప్ కూడా కర్తగానే పేరొందాడు. వాస్తవ కర్త తెరమరుగైనది. ఆ కర్త గూర్చి తెల్సుకుందాం.
అమెరికా పెట్టుబడిదారీ వర్గం డబ్ల్యుటీవోతో తలచింది ఒకటి. జరిగింది మరొకటి. ఆ సంస్థ అమెరికా కొంప ముంచింది. ఆఫ్ఘాన్, ఇరాక్ యుద్ధాల్లో అమెరికా దిగబడ్డ కాలంలో ప్రపంచ వాణిజ్య సంస్థను చైనా ఒక వరంగా మార్చుకొని బలపడ్డది. అది 150 దేశాల భాగస్వామ్యంతో బెల్టు అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరిట తలపెట్టిన అంతర్జాతీయ వాణిజ్య కారిడార్ అమెరికా ఆర్థిక సామ్రాజ్యానికి ఓ సవాల్‌గా మారింది. నాటి నుండే డబ్ల్యుటీవో పట్ల అమెరికా పెట్టుబడిదారీ వర్గంలో విబేధాలు మొదలై చీలికకి బీజం పడింది. క్రమంగా అది డీప్ స్టేట్‌లో చీలికకి కూడా దారి తీసింది. ప్రపంచ వాణిజ్య సంస్థతో తాము పొందే లాభం కంటే చైనా అధిక లాభపడుతుందనే భావన అమెరికా పెట్టుబడిదారీ వర్గంలోని ఒక శిబిరంలో బలపడుతూ వచ్చింది. అదే సమయంలో నేటికీ అమెరికా పెట్టుబడిదారీ వర్గంలో ఓ శిబిరం ప్రపంచ వాణిజ్య సంస్థ ద్వారా లాభపడుతోంది. అది డబ్ల్యుటీవో నిబంధనల ప్రకారం చైనాని ఎదుర్కొని జయిద్దామని వాదిస్తోంది. ఆ నిబంధనలకి విరుద్ధంగా చైనాపై వాణిజ్య సుంకాల్ని విధించి వాణిజ్య యుద్ధం చేపడదామని కొత్త శిబిరం వాదిస్తోంది. ఆచరణలో ఇది ప్రపంచ వాణిజ్య సంస్థ నుంచి వైదొలిగే ప్రక్రియకి దారి తీస్తుంది. రెండో శిబిరపు రాజకీయ ప్రతినిధి ట్రంప్! పై కర్త రెండో శిబిరమే.
ట్రంప్ ఆకస్మికంగా ఆకాశం నుండి రాలిపడ్డ తార కాదు, ఊడిపడ్డ ఉల్క అసలే కాదు. వర్తమాన అంతర్జాతీయ రంగంలో పరస్పర విరుద్ధ శక్తుల మధ్య సంఘర్షణలో పుట్టి పెరుగుతున్న తీవ్ర మితవాద రాజకీయ వ్యవస్థకు శక్తిమంతమైన ప్రతినిధి మాత్రమే. ఈ ఎన్నికల్లో ‘యుద్ధాలు వద్దు, వాణిజ్యం ముద్దు’ అన్న ట్రంప్ నినాదంలో వాస్తవ శాంతి లేదు. అది నాటి బుష్ యుద్ధోన్మాద విధానానికి వ్యతిరేకమూ కాదు. అమెరికాకి ప్రపంచ వాణిజ్య సంస్థతో లాభం జరక్కముందే తొందరపడి యుద్ధాలకు దిగిందనీ, తద్వారా యుద్ధ ఊబిలో పూర్వ వైభవాన్ని కోల్పోయిందనీ, పూర్వ వైభవం రావాలంటే సైనిక యుద్ధాల కంటే వాణిజ్య యుద్ధాల తొలి అవసరం ఉందని ఈ రెండో శిబిరం వాదిస్తోంది. ఇది ప్రపంచ వాణిజ్య సంస్థతో అమెరికా కంటే చైనా వంటి ఆర్ధిక వ్యవస్థలు బలపడ్డ స్థితి నుండి గుణపాఠం. అమెరికా అప్పుల కొంపగా మారడానికి కారణమైన సైనిక యుద్ధాల్ని వెంటనే నిలిపి వాణిజ్య యుద్దాలపై కేంద్రీకరణ చేద్దామనే ఎత్తుగడలో బాగమిది. అధిక సుంకాలతో చైనా వంటి ఆర్థిక వ్యవస్థలపై నిరాయుధ యుద్ధాలతో డబ్ల్యుటీవో విచ్ఛిన్నమైనా వెనకాడకూడదని కూడా ఈ శిబిరం వాదిస్తోంది.
ఆఫ్ఘాన్, ఇరాక్‌లపై యుద్ధాల వల్ల అమెరికా పౌర సమాజంలో పెరిగిన వ్యతిరేకత ఆధారంగా ఈ శిబిరం ట్రంప్ యుద్ధ వ్యతిరేకిగా ఫోకస్ చేసే వ్యూహం పన్నింది. బుష్‌తో అమెరికా పెట్టుబడి ఏకగ్రీవశక్తిగా నిలిచి నాడు ప్రాంతీయ యుద్ధాలను చేయిస్తే, నేడు అందులో ఓ శిబిరం వేరుపడి మూడో ప్రపంచ యుద్ధానికి పూర్వ రంగ స్థితిని ట్రంప్‌తో సృష్టించజూస్తోంది.
సామ్రాజ్యవాదానికి లెనిన్ పేర్కొన్న ఐదు లక్షణాల్లో అవి వెనకబడ్డ దేశాలకు సరుకులకు బదులు పెట్టుబడిని ఎగుమతి చేయడం! ఆ ఎగుమతైన పెట్టుబడి ఆ దేశాల్లో చౌక శ్రమశక్తితో సరుకుల్ని ఉత్పత్తి చేయడం కూడా అందులో భాగమే. తమ స్వంత దేశాల్లో సరుకులు, సేవల ఉత్పత్తుల కోసం వెనకబడ్డ దేశాల నుంచి చౌక శ్రమశక్తిని దిగుమతి చేసుకోవడానికి కూడా అది దారి తీస్తుంది. ఇవి వాటి సహజ లక్షణాలే. వాటికి వ్యతిరేకంగా తమ దేశానికి పరిశ్రమల్ని తెచ్చి సరుకుల ఉత్పత్తుల దేశంగా మార్చి, విదేశీ చౌక శ్రామికుల దిగుమతి నియంత్రణని, తద్వారా ‘గ్రేట్ అమెరికా’ నిర్మాణం చేస్తాననీ ట్రంప్ హామీ ఇచ్చాడు. రోజుకు ఐదారు డాలర్ల జీతం గల దేశాల నుంచి గంటకి పది, ఇరవై డాలర్ల జీతాలు గల అమెరికాకి తెస్తాననడం ఆచరణలో కాలచక్రాన్ని అడ్డుకోవడమే. అదో భ్రమ. తాత్కాలికంగా విదేశీ సరుకుల్ని దిగుమతి కాకుండా అధిక సుంకాల ద్వారా అడ్డుకోవచ్చు. అదే సమయంలో అధిక జీతాల స్వదేశీ కార్మికులతో పని చేయించే ప్రయత్నానికి అమెరికా పెట్టుబడిదారీ వర్గం నుండే తిరుగుబాటు రావచ్చు. పైగా ఎక్కువ ఉత్పాదక ఖర్చులతో ఉత్పత్తి చేసిన సరుకుల్ని కొనే స్తోమతు లేని స్వదేశీ ప్రజా వ్యతిరేకత వెల్లువగా మారవచ్చు. ఇలా ట్రంప్ సర్కార్ సామ్రాజ్యవాద ఆర్ధిక నియమాలకు వ్యతిరేకంగా కాలప్రవాహ దిశను మార్చజూస్తే వాటి చక్రాల క్రింద నలిగిపోక తప్పదు. యుద్ధాలకు వ్యతిరేకంగా ట్రంప్‌తో వల్లింపజేసే నేటి ‘శాంతి’ ప్రవచనాలు రేపు గాలిలో దీపాలుగా మారి ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీసే ప్రమాదం లేకపోలేదు.
చరిత్ర గమనంలో అనేక మహా సామ్రాజ్యాలు కాలగర్భంలో కలిసాయి. ప్రాచీన రోమన్, ఆధునిక పోర్చుగీస్, స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్, సోవియట్ యూనియన్ వరకూ అగ్రరాజ్యాలు అంతరించి పోయాయి. నేడు అమెరికా వంతు వచ్చింది. దాన్ని పూర్తి చేసే రాజకీయ బాధ్యత ట్రంప్ భుజస్కందాలపై చరిత్ర మోపిందేమో!
నేటి నిర్దిష్ట పరిస్థితుల్లో అమెరికా అధిక సుంకాలు విధించి చైనా, భారత్ వంటి దేశాలతో తీవ్ర వాణిజ్య యుద్ధానికి దిగి ప్రపంచ వాణిజ్య సంస్థకి స్వస్తి చెబితే యుద్ధాలు లేని పరిస్థితికి దారి తీస్తుందా? లేదంటే నేటి ప్రాంతీయ యుద్ధాల స్థానంలో ప్రపంచ యుద్ధ పూర్వరంగ పరిస్థితికి దారి తీస్తుందా? ఇది నేటి చర్చనీయాంశం. చరిత్ర గమనం ఏఏ మలుపులు తీసుకుంటుందో వేచి చూద్దాం.
పి. ప్రసాద్
భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఇఫ్టు)
Updated Date - Nov 19 , 2024 | 05:54 AM