ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అన్నీ గుజరాత్‌కేనా..?

ABN, Publish Date - Nov 02 , 2024 | 06:10 AM

స్పెయిన్‌ అధినేత పెడ్రో శాంచేజ్‌తో కలసి, ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల గుజరాత్‌లోని వడోదరలో ఘనంగా ఆరంభించిన టాటా ఎయిర్‌క్రాఫ్ట్‌ కాంప్లెక్స్‌, ఇప్పుడు మహారాష్ట్రలో ఎన్నికల ముందు అధికారపక్ష కూటమిని

స్పెయిన్‌ అధినేత పెడ్రో శాంచేజ్‌తో కలసి, ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల గుజరాత్‌లోని వడోదరలో ఘనంగా ఆరంభించిన టాటా ఎయిర్‌క్రాఫ్ట్‌ కాంప్లెక్స్‌, ఇప్పుడు మహారాష్ట్రలో ఎన్నికల ముందు అధికారపక్ష కూటమిని ఆత్మరక్షణలో పడవేసింది. పదేళ్ళక్రితమే నరేంద్రమోదీ ప్రధాని అయినా, స్వరాష్ట్రం గుజరాత్‌మీద ఉన్న ప్రేమ మిగతారాష్ట్రాల మీద లేకపోయిందని, ఇతర రాష్ట్రాలకు దక్కాల్సిన ప్రాజెక్టులను కూడా ఆయన తన రాష్ట్రానికి తరలించుకుపోతున్నారని విపక్షాలనుంచి తరచుగా విమర్శలు వినబడుతూనే ఉన్నాయి. సి–295 సైనిక రవాణా విమానాల తయారీ నిమిత్తం ఏర్పాటు చేసిన ఆ కాంప్లెక్స్‌ని ఆరంభిస్తూ, ఆ విమానం ఎంత అద్భుతమైనదో ప్రధాని వివరించారు. వడోదరలో తయారైన విమానాలు ఇతరదేశాలకు ఎగుమతి అవుతాయనీ, ఈ ప్రాజెక్టు ‘మేక్‌ ఇన్‌ ఇండియా, మేక్‌ ఫర్‌ ది వరల్డ్‌’ ఆశయాన్ని బలోపేతం చేస్తుందని ప్రకటించారు. భారతదేశంలో తొలిసారిగా పర్యటించిన పెడ్రో శాంచేజ్‌తో కలసి రోడ్‌షో కూడా నిర్వహించారు. నరేంద్రమోదీ వ్యాఖ్యానించినట్టుగా, భారత్‌ గత దశాబ్దకాలంలో విమానయానరంగంలో సాధించిన ప్రగతికి, దేశం ఏవియేషన్‌ హబ్‌గా మారుతున్న తీరుకూ నిదర్శనంగా దీనిని యావత్‌ దేశం చూస్తుందని బీజేపీ నాయకులు భావించడం సహజం. అయితే, ఎన్నికలు దగ్గరపడుతున్న మహారాష్ట్రలో ఈ అంశం విపక్షాలకు అయాచిత ఆయుధంగా అందివస్తుందని మహాయుతి నేతలు ఊహించలేదు.


నాగపూర్‌లో ఏర్పాటు కావాల్సిన ఈ కర్మాగారం నరేంద్రమోదీ ఒత్తిడిమేరకు గుజరాత్‌కు తరలిపోయిందని మహారాష్ట్రలోని విపక్షపార్టీలు ఆరోపిస్తున్నాయి. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న బీజేపీ నాయకులంతా మహారాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా కుట్రచేశారని కాంగ్రెస్‌పార్టీ, ఉద్ధవ్‌ఠాక్రే శివసేన ప్రచారం చేస్తున్నాయి. మహారాష్ట్రకు రావాల్సిన ప్రాజెక్టులన్నీ ఎవరో కక్షకట్టినట్టుగా గుజరాత్‌కు వరుసపెట్టి పోతున్నాయని వారి ఆరోపణ. మహారాష్ట్రలో అధికారంలో కొనసాగడమే ముఖ్యమనుకొనేవారు ఉంటే, మరోపక్క గుజరాత్‌ కోసం ఇద్దరు ముఖ్యమంత్రులు పనిచేస్తూ అన్నీ తరలించుకుపోతున్నారని ఓ విపక్షనేత వ్యాఖ్యానించారు. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ–ఎస్పీ) అధినేత శరద్‌పవార్‌ మరో అడుగుముందుకు వేసి అప్పుడెప్పుడో జరిగిన కొన్ని పరిణామాలను వివరించారు. మహారాష్ట్రలోనే ఈ ప్రాజెక్టు స్థాపించాలని రతన్‌టాటా నిర్ణయించుకున్నారని, నాగపూర్‌ ఎంఐడిసీ ఏరియాలో దీనికోసం ఐదువందల ఎకరాలను మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం కేటాయించిందని, ఇంతలో ప్రభుత్వం మారడంతో నరేంద్రమోదీ స్వయంగా రతన్‌టాటాను పిలిపించుకొని, ప్రాజెక్టును వడోదరకు మార్చేయమని ఒత్తిడిచేశారని శరద్‌పవార్‌ వ్యాఖ్యానించారు. ఈ వయసులో ఇన్ని అబద్ధాలా అంటూ అధికారపక్షనేతలు ఆయనమీద ప్రతిదాడి చేస్తున్నారు. ప్రాజెక్టు ప్రతిపాదన దశలో కూడా మహారాష్ట్ర పేరు లేదని, కేవలం గుజరాత్‌, యూపీ మాత్రమే ఉన్నాయని ఉపముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ సమర్థించుకున్నారు.


ఒకపక్క రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, గుజరాత్‌లో ఈ ప్రాజెక్టు ఆరంభం ఘనంగా జరగడం, తరలిపోయిందన్న ప్రచారం ఎక్కువకావడం మహాయుతి నేతలను ఇరకాటంలో పెడుతున్నది. 2022లో వేదాంత–ఫాక్స్‌కాన్‌ ప్రాజెక్టు కూడా ఇదే విధంగా చేజారిపోయిందంటూ ప్రత్యర్థులు ఇప్పుడు మళ్ళీ దానిని ఓటర్లకు గుర్తుచేస్తున్నారు. ఆఖరుక్షణంలో, రాష్ట్రప్రజలకు, నిరుద్యోగయువతకు వెన్నుపోటుపొడుస్తూ బీజేపీ అప్పట్లో ఈ ప్రాజెక్టు లోకేషన్‌ మార్చేసిందని వారి విమర్శ. గుజరాత్‌లో గిఫ్ట్‌సిటీ తెరమీదకు వచ్చినప్పుడు అది ముంబైలోని ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెంటర్‌ను దెబ్బతీయ డానికేనని ఓ ప్రచారం జరిగింది. గుజరాత్‌–మహారాష్ట్ర మధ్య జన్మవైరం దశాబ్దాలుగా ఉన్నదే. ఆవిర్భావం నాటి ఆగ్రహం, అక్కసు ఇప్పటికీ వెంటాడుతున్నాయి. మరాఠీ ఆత్మగౌరవం, ఆధిపత్యంమీద తిరుగుబాటు వంటి మాటలు ఈ ఎన్నికలకాలంలో మరింత వినబడుతుంటాయి. టాటా ఎయిర్‌క్రాఫ్ట్‌ కాంప్లెక్స్‌ వివాదం వల్లనే కాబోలు, గుజరాత్‌, మహారాష్ట్రలలో ఏది ఎక్కువ విదేశీ పెట్టుబడులను ఆకర్షించిందో వివరించే డేటా ఒకటి ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. కానీ, వాస్తవాలకంటే భావోద్వేగాలే ఎన్నికల్లో ఎక్కువగా పనిచేస్తాయని నాయకుల నమ్మకం.

Updated Date - Nov 02 , 2024 | 06:10 AM