బౌలర్ల కంటే బ్యాట్స్‌మెన్‌కు ప్రాధాన్యమెందుకు?
ABN, Publish Date - Jul 13 , 2024 | 04:15 AM
క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఆత్మకథ ‘I Have the Streets : A Kutty Cricket Story’ కవర్ చూసి ఆశ్చర్యపోయాను. రచయిత తెల్ల ప్యాంటు, తెల్ల షర్టులో, ఒక బ్యాట్ పిడిని తన చేతులతో పట్టుకుని కూర్చున్న భంగిమలో ఉన్న ఛాయాచిత్రమది. ఒక వికెట్ పడిపోవడం కోసం వేచి చూస్తూ తన సమయం వచ్చినప్పుడు డ్రెస్సింగ్ రూం నుంచి గ్రౌండ్‌లోకి దూసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్న ఆటగాడిని
క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఆత్మకథ ‘I Have the Streets : A Kutty Cricket Story’ కవర్ చూసి ఆశ్చర్యపోయాను. రచయిత తెల్ల ప్యాంటు, తెల్ల షర్టులో, ఒక బ్యాట్ పిడిని తన చేతులతో పట్టుకుని కూర్చున్న భంగిమలో ఉన్న ఛాయాచిత్రమది. ఒక వికెట్ పడిపోవడం కోసం వేచి చూస్తూ తన సమయం వచ్చినప్పుడు డ్రెస్సింగ్ రూం నుంచి గ్రౌండ్‌లోకి దూసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్న ఆటగాడిని ఆ కవర్‌పై ఉన్న అశ్విన్ బొమ్మ తలపిస్తుంది. ఇప్పుడు నేను అశ్విన్ బ్యాటింగ్ చేయగలడని అర్థం చేసుకున్నాను. అశ్విన్ ఆత్మకథ ప్రచురితం కావడానికి చాలా కాలం ముందే స్కూల్ బాయ్ క్రికెట్‌లో వికెట్లు తీసుకోవడం కంటే పరుగులు చేయడంలో సామర్థ్యానికే బాల అశ్విన్ ప్రసిద్ధుడని అందరికీ తెలుసు. అశ్విన్ ఆటను నేను ప్రత్యక్షంగా చూడలేదు. నేను ఎక్కువగా టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌లనే చూస్తాను (కొన్ని కారణాల వల్ల ఈ రోజుల్లో బెంగళూరులో టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌లు పెద్దగా జరగడం లేదు). అయినప్పటికీ టీవీలో అశ్విన్ ఆటను చూసిన జ్ఞాపకాలు నా మనస్సులో పదిలంగా ఉన్నాయి.
నా మనోనేత్రంలో ఒక ఫాస్ట్ బౌలర్ వేసిన బంతిని అశ్విన్ ఎంత నేర్పుగా, సొగసుగా ఎదుర్కొన్నాడో కనిపిస్తూనే ఉన్నది. బంతిని స్పిన్నర్ తల మీదగా సైట్ స్క్రీన్ వైపుకు కొట్టిన దృశ్యమూ నా మనోనేత్రం నుంచి చెరిగిపోలేదు. టెస్ట్ క్రికెట్‌లో అశ్విన్ ఆడిన రెండు అతి ముఖ్యమైన ఇన్నింగ్స్‌లో ఈ రెండు షాట్‌లు సంభవించలేదు. 2021లో జనవరి, ఫిబ్రవరి నెలల్లో వేర్వేరు గ్రౌండ్స్‌లో భిన్న ప్రత్యర్థులపై ఆడిన సందర్భంలో అవి చోటుచేసుకున్నాయి. మొదటిది సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో సంభవించింది. ఆస్ట్రేలియన్ ఆటగాళ్ల దాడిని హనుమ విహారితో కలిసి అశ్విన్ సమర్థంగా ఎదుర్కొన్నారు. ఇద్దరూ కలిసి 40 ఓవర్స్ దాకా ఉండి, ఏ జట్టూ గెలవని స్థితి కల్పించి తమ జట్టుకు ఒక సానుకూలతను సృష్టించారు. మరింత స్పష్టంగా చెప్పాలంటే తమ జట్టును ఒక ఎపిక్ డ్రాకు తీసుకువెళ్లారు. ఓవర్స్ మధ్య అశ్విన్, విహారి ఇరువురూ సుదీర్ఘంగా మాటా మంతీ జరిపారు. అది తమిళంలో జరిగిందని ఆ తరువాత వెల్లడయింది. ఇది చెపాక్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌లను వీక్షించేందుకు తరచుగా వచ్చే వారికి సంతృప్తి కలిగించి ఉండవచ్చు గానీ పొట్టి శ్రీరాములు భావజాల వారసులకు మనస్తాపం కలిగించిందేమో?!
నా మనోనేత్రంలో కదులుతున్న అశ్విన్ రెండో ఇన్నింగ్స్ ఆయన హోమ్ గ్రౌండ్ అంటే చెన్నైలో ఇంగ్లాండ్‌కు వ్యతిరేకంగా ఆడింది. భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో లీడ్‌లో ఉన్నప్పటికీ రెండో ఇన్నింగ్స్‌లో బాగా వెనుకబడి పోయింది. అప్పుడు అశ్విన్ గ్రౌండ్‌లోకి వచ్చాడు. కోహ్లీ, కుల్దీప్, ఇషాంత్, సిరాజ్‌లతో కలిసి భారత్ పరుగులను 286కు తీసుకువెళ్లి విజయాన్ని సులభసాధ్యం చేశాడు. అశ్విన్ స్వయంగా సెంచరీ సాధించాడు. అశ్విన్ బ్యాటింగ్ చేయగలడని నాకు తెలుసు. అతని పుస్తకం కొన్నవారికి, కొనేవారికి కూడా ఆ విషయం తెలుసు. భారత క్రికెట్ చరిత్రలో అశ్విన్ తన బౌలింగ్ సామర్థ్యానికే జ్ఞాపకముండి పోతారు. అయినప్పటికీ 500కి పైగా టెస్ట్ వికెట్‌లను పడగొట్టిన ఆటగాడు, అనీల్ కుంబ్లేను మినహాయిస్తే భారత్‌కు ఎన్నో టెస్ట్ మ్యాచ్‌లను గెలిచిన క్రీడా మేటి తన ఆత్మకథ పుస్తకం అట్టపై బ్యాట్ పట్టుకుని ఉన్న తన ఫోటోను ఎందుకు ముద్రింపచేశారు? నేను ఎప్పుడూ అశ్విన్‌ను స్వయంగా కలుసుకోలేదు. అయితే ఆయన గురించి నేను చదివిన, విన్నదాన్ని బట్టి ఆయన దృఢమైన, ఆలోచనాదాయకమైన అభిప్రాయాలు కలవాడని తెలిసింది. ఆయన ఆత్మకథ అట్టపై ఫోటోను ఎంపిక చేసింది ప్రచురణ కర్త గాని, రచనా సహకారి సిద్ధార్థ మోనిజియా గానీ కాదని, అశ్వినే స్వయంగా ఆ చిత్రాన్ని ఎంచుకున్నారని నిర్ధారణ అయింది. బాల్‌ను కాకుండా బ్యాట్ను పట్టుకున్న విధంగా తన బొమ్మ ఆత్మకథ కవర్‌పై ఉండాలని అశ్విన్ ఎందుకు కోరుకున్నారు?
ఈ ప్రశ్నకు నేను కచ్చితమైన సమాధానాన్ని ఇవ్వలేను (భవిష్యత్తులో అశ్వినే ఇవ్వగలరని భావిస్తున్నాను). అయితే నేను కొన్ని ఊహలు చేయగలను. ఆ ఫోటోలో ఒక సంకేత సందేశం లేదా సందేశాలు ఏమైనా ఉన్నాయా? ప్రపంచ క్రికెట్ (ప్రత్యేకించి భారత క్రికెట్) క్రికెట్‌లో ప్రతిభాపాటవాలను గుర్తించి గౌరవించే విధానంలోని ఒక క్రూర వాస్తవాన్ని అందరి దృష్టికి తీసుకురావడానికి అశ్విన్ ప్రయత్నిస్తున్నారా? ఏమిటి ఆ క్రూర వాస్తవం? కీర్తి, కనకాలు, అభిమానుల ఆప్యాయతలు, ఎక్కువ ఆమోదాలను, మరిన్ని టీవీ ఆమోదాలను, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డులను, సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లకు అత్యధికుల అభ్యర్థనలను బౌలర్స్ కంటే బ్యాటర్సే ఎందుకు ఎక్కువగా పొందుతున్నారు?
క్రికెట్ అభిమానులు బ్యాట్స్‌మెన్‌నే ఎందుకు మిక్కిలిగా గౌరవిస్తున్నారు? బ్యాటర్స్‌ను ఆ అందమైన ఆట ఉన్నతస్థాయి ఆటగాళ్లు కాగా, బౌలర్స్ అధిక శ్రమ చేసే నిమ్న శ్రేణి క్రీడాకారులు అనేది ఒక సత్యం. అయితే ఇది సర్వా జనామోదం పొందలేదు. బ్యాట్స్‌మెన్ పట్ల పక్షపాతం, బౌలర్స్ విషయంలో వివిక్ష చూపే ధోరణులకు వ్యతిరేకంగా నేను చాలాసార్లు వాదించాను. అయితే నా గోసను ఎవరూ పట్టించుకోలేదు. తన ఆత్మకథ అట్టపై ఫోటో ఎంపిక, క్రికెట్‌లో తనకు ఉన్న సమున్నత స్థానంతో అశ్విన్ ఆ సత్యాన్ని మరింత సున్నితంగా, మరింత సూక్ష్మంగా చెప్పుతున్నారా?
మ్యాచ్‌ను గెలిచిన బ్యాటర్లకు, మ్యాచ్‌ను గెలిచిన బౌలర్ల కంటే ఎక్కువ ధన లాభం, పేరు ప్రఖ్యాతులు ఎలా లభిస్తున్నాయో చాలాసార్లు మాట్లాడాను, విపులంగా రాశాను. దురదృష్టకరమైన విషయమేమిటంటే బౌలర్ల పట్ల వివక్ష డబ్బుకు సంబంధించిన వ్యవహారాలకే పరిమితం కాదు. ప్రముఖ బ్యాట్స్‌మెన్ స్టీవ్ వా, రికీ పాంటింగ్‌లు ఆస్ట్రేలియా టీమ్‌కు వరుసగా 57, 72 సార్లు కెప్టెన్లుగా ఉన్నారు. అయితే అద్భుత బౌలర్ అయిన షేన్ వార్న్‌కు ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా కెప్టెన్సీ బాధ్యత అప్పగించలేదు. షేన్‌వార్న్ ఒక ప్రతిభావంతుడైన క్రికెట్ వ్యూహకర్త స్టీవ్ వా, పాంటింగ్ కంటే షేన్‌వార్న్ నిస్సందేహంగా మరింత విజయవంతమైన కెప్టెన్ అయి వుండే వాడనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు.
టీమ్ ఇండియా కెప్టెన్ల ఎంపికలో కూడా ఈ పక్షపాతం కనిపిస్తోంది. విరాట్ కోహ్లీ 69 టెస్ట్ మ్యాచ్‌లలోను, రోహిత్ శర్మ 16 టెస్ట్ మ్యాచ్‌లలోను కెప్టెన్‌గా ఉన్నారు. అయితే అశ్విన్ ఒక్కసారి కూడా టీమ్ ఇండియాకు కెప్టెన్‌గా లేరు. మొదటి ఇద్దరు బ్యాట్స్‌మెన్ కాగా అశ్విన్ ప్రధానంగా బౌలర్ కావడమే అందుకు కారణం కావచ్చు. అయినప్పటికీ ఇండియా తరఫున ఆడిన క్రికెటర్లలో అశ్విన్ అత్యంత ప్రతిభావంతుడు అనే విషయం మనకు తెలుసు. ఈ మద్రాసు ఆటగాడికి కెప్టెన్ అయ్యే అవకాశం లభించి ఉంటే ఆయన భారత్‌కు మరింత మహత్తర విజయాలు సాధించేవాడనడంలో సందేహం లేదు. స్పిన్ బౌలర్లు సైతం సాటిలేని మేటి టెస్ట్ కెప్టెన్లు కాగలరని ఇంగ్లాండ్‌కు చెందిన రే ఇల్లింగ్ వర్త్, ఆస్ట్రేలియా ఆటగాడు రిచి బెనౌడ్‌లు నిరూపించలేదూ? ఆ కోవలోనివాడే మన అశ్విన్ కూడా.
తన ఆత్మకథ కవర్ పోటోగ్రాఫ్‌కు సంబంధించిన అశ్విన్ ఎంపిక, కెప్టెన్సీ విషయమై ఆయన (గత, ప్రస్తుత) ఆకాంక్షలను సూచన ప్రాయంగా తెలుపుతున్నాయా అని నేను అనుమానిస్తున్నాను. కెప్టెన్సీకి అశ్విన్ అర్హుడు. ఆయన చాలా హుందాగా వ్యవహరించే వ్యక్తి. భ్రమలు లేని మంచి మనిషి. నా మొదటి ఊహ చాలా సుసంబంధమైనది. గ్రౌండ్‌లోనూ, గ్రౌండ్ వెలుపల బ్యాటర్లు బౌలర్ల పట్ల వ్యవహరిస్తున్న తీరుతెన్నులలో వ్యత్యాసాన్ని, వివక్ష గురించి క్రికెట్ అభిమానులకు అవగాహన కల్పిస్తున్నాడని నేను భావిస్తున్నాను. ఈ రెండూ గాక మూడో కారణం కూడా ఉండి ఉండవచ్చు. బ్యాటింగ్‌ను నిజంగా ప్రేమించిన ఆటగాడు అశ్విన్. అలాగే షేన్‌వార్న్, అనీల్ కుంబ్లేలు కూడా.
షేన్‌వార్న్ రాసిన ఐదు పుస్తకాలలో రెండిటిపై ఆయన ముఖం ఉండగా మిగతా మూడు పుస్తకాల కవర్‌పై బౌలింగ్ చేస్తున్నట్లుగానో లేక వికెట్‌ను పడగొడుతున్న ఫోటోలు ఉన్నాయి. కుంబ్లే ఆత్మకథ ఇంకా రాలేదు. అది వచ్చినప్పుడు 619 టెస్ట్ వికెట్లు పడగొట్టిన ఆటగాడు బ్యాట్ పట్టుకుని ఉన్న ఫోటో, ఆ ఆత్మకథ కవర్ ఫోటో గ్రాఫ్‌గా ఉండే అవకాశం లేదు. ఇంకా మన మధ్య నడయాడుతున్న గొప్ప క్రికెట్ రచయిత ఒకసారి ఏకైక క్రికెట్ ఫోటోగ్రాఫ్ గురించి ఏకంగా ఒక పుస్తకమే రాశాడు. అదొక అద్భుతమైన పుస్తకం. దాని గురించి నేను కూడా చాలా సంవత్సరాల క్రితం ఈ కాలమ్‌లో రాయడం జరిగింది. అయితే నేను గిడియోన్ హైగ్‌ను కాను కనుక ఒక క్రికెట్ ఫోటో గురించి 100కి పైగా పదాలతో ఒక వ్యాసం మాత్రమే రాశాను. అశ్విన్ ఆత్మకథలోని ఒక ప్రస్తావన కనీసం ఆ పుస్తకంపై ఫోటోగ్రాఫ్‌ను అశ్విన్ ఎందుకు ఎంచుకున్నారన్న విషయమై నా విశ్లేషణను ధ్రువీకరించింది. ఆ ప్రస్తావన ఇలా ప్రారంభమవుతుంది: ‘అది అంతిమంగా బౌలర్–బ్యాటర్–కోచ్ డబ్ల్యువి రామన్‌తో మరో సంభాషణ అయింది. బౌలర్లను బ్యాటర్స్ తాము కోరుకున్నరీతిలో బ్లూ కాలర్ కార్మికులు (చేతితో పనిచేసేవారు)గా ఉపయోగించుకుంటున్నారు. ఒక బౌలర్ ఒక బ్యాడ్ బాల్ వేసినప్పుడు నెట్స్‌లో ఉన్న ఒక బ్యాటర్‌కు క్షమాపణలు చెప్పుతాడు. అయితే ఒక బ్యాటర్ తన బ్యాడ్ షాట్‌కు ఎవరికీ ఎలాంటి క్షమాపణలు చెప్పడు. ఎందుకని?’
ప్రముఖ బ్యాట్స్‌మెన్ స్టీవ్ వా, రికీ పాంటింగ్‌లు ఆస్ట్రేలియా టీమ్‌కు వరసగా 57, 72 సార్లు కెప్టెన్‌గా ఉన్నారు. అద్భుత బౌలర్ అయిన షేన్ వార్న్‌కు ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా కెప్టెన్సీ బాధ్యత అప్పగించలేదు.
టీమ్ ఇండియా కెప్టెన్ల ఎంపికలోనూ ఈ పక్షపాతం కనిపిస్తోంది. విరాట్ కోహ్లీ 69 టెస్ట్ మ్యాచ్‌లలోను, రోహిత్ శర్మ 16 టెస్ట్ మ్యాచ్‌లలోను కెప్టెన్‌గా ఉన్నారు. అశ్విన్ ఒక్కసారి కూడా టీమ్ ఇండియాకు కెప్టెన్‌గా లేరు. స్పిన్ బౌలర్లు సైతం సాటిలేని మేటి టెస్ట్ కెప్టెన్లు కాగలరని ఇంగ్లాండ్‌కు చెందిన రే ఇల్లింగ్ వర్త్ , ఆస్ట్రేలియా ఆటగాడు రిచి బెనౌడ్‌లు నిరూపించలేదూ? ఆ కోవలోనివాడే మన అశ్విన్ కూడా.
(వ్యాసకర్త చరిత్రకారుడు)
Updated Date - Jul 13 , 2024 | 04:15 AM