ఏపీకి ఇప్పుడు ‘తన రోజులు’ వచ్చాయి!
ABN, Publish Date - Jun 06 , 2024 | 03:22 AM
ఎంత సన్నగా వీచినా రుతుపవనం సోకిన వెంటనే, రోహిణి ఎండలకు ఇక చివరి రోజులని తెలిసిపోతుంది. ఉక్కపోత తగ్గిపోతుంది. ఆర్చుకుపోయిన గుండెలను మృగశిర చల్లారుస్తుంది. అడుగడుగున మొలిచిన...
ఎంత సన్నగా వీచినా రుతుపవనం సోకిన వెంటనే, రోహిణి ఎండలకు ఇక చివరి రోజులని తెలిసిపోతుంది. ఉక్కపోత తగ్గిపోతుంది. ఆర్చుకుపోయిన గుండెలను మృగశిర చల్లారుస్తుంది. అడుగడుగున మొలిచిన అగడ్తలు కొన్నైనా పూడుకుపోతాయి. సంకెళ్లు తెగకపోయినా, కనీసం సడలింపు దొరుకుతుంది. ఎంత కొంచెమైనా స్వేచ్ఛ కలిగించే జీవితేచ్ఛే వేరు.
ఇంతా చేసి, జరిగిందేమీ లేదు. ఆయనే మళ్లీ ప్రధాని అవుతారు. కాకపోతే, మునుపటిలాగా ఉండలేరు. బహుశా కొంత ఒదిగి ఉంటారు. అదుపులో ఉంటారు. అరువురెక్కలతో మాత్రమే ఎగురుతారు. నవ్వుతూ మాట్లాడతారు. ముఖంలోకి ప్రసన్నత తెచ్చుకుంటారు. మొన్నటి ఎన్నికల ప్రచారంలో అట్లా మాట్లాడింది తాను కానే కాదన్నట్టు వ్యవహరిస్తారు. ఇంత మాత్రానికే స్వేచ్ఛలూ సడలింపులూ అని ఆశపడవచ్చా?
ఆయనలో మార్పు వచ్చి, పరిస్థితులు మారడం కాదు. పరిస్థితి మారినందువల్ల, ఆయనలో నిజంగానో, అభినయంలోనో మార్పు అవసరమౌతోంది.
పరిస్థితి ఏమి మారిందో తెలియాలంటే, మంగళవారం మధ్యాహ్నం నుంచే గొంతుసవరించుకుంటున్న జాతీయ మీడియాను చూడాలి. ఇంకా ఒడిలోనే కూర్చున్నా, నాలికకు నరం బిగించుకుంటున్న విన్యాసం చూడాలి. బుధవారం పొద్దుటి నుంచి ఢిల్లీలో రూపొందిన సన్నివేశాలను చూడాలి. సకల రాజకీయ పక్షాలూ రెండు కూటములుగా మోహరించుకుని జరుపుతున్న భేటీలు చూడాలి. ముఖ్యమంత్రులను జైళ్లకు పంపిన పెద్దలతో..... మద్దతులు ఉచితంగా రావని తేల్చిచెబుతున్న చంద్రబాబు, నితిశ్‌లను చూడాలి.
ఎవరు అధికారంలోకి వస్తున్నారు అన్నదే ముఖ్యం అనుకుంటే, ఈ లోక్‌సభ ఫలితాలలో కొత్త ఏమీ లేదు. కొనసాగింపు మాత్రమే చూడదలిస్తే, ఇది ముచ్చటగా మూడోసారి. నెహ్రూ తరువాత నరేంద్రుడే. ఫలితాల సారాంశం చూస్తే, ఏకపక్షం నుంచి తిరిగి సంకీర్ణం. తీవ్రజాతీయవాదానికి, కర్కశ నిర్బంధ విధానాలకు, ప్రత్యర్థుల వేధింపులకు కొద్దిపాటి విరామానికి ఆస్కారం ఉంటుందని, నలిగిన గొంతులకు కొత్త ధైర్యం ఇచ్చే వాతావరణం ఏర్పడుతుందని, లొంగిన వ్యవస్థలకు స్వతంత్రించే అవకాశం వస్తుందని ఆశ కలగడం. మంగళవారం నాటి లోక్‌సభ ఫలితాలలో తక్షణ విజయాలకు మించి, రాబోయే రోజుల వాగ్దానమే ఆకర్షణీయంగా ఉన్నది.
దేశ రాజకీయాలకు సంబంధించి, ప్రజాప్రమేయాన్ని మెరుగుపరిచే పరిణామాలు రావడంలో ఆంధ్రప్రదేశ్ తీర్పు దోహదం చాలా ఉన్నది. మోదీ గనుక తాను అనుకున్న మూడున్నర వందలో నాలుగువందలో సాధించి ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో కూటమి విజయం ఆ రాష్ట్రం వరకే పరిమితమై ఉండేది. దుష్పరిపాలన అంతం కావడం, రాజధాని మొదలైన అభివృద్ధి సమస్యలకు పరిష్కారం దొరకడం వరకే ఆ విజయానికి ప్రాధాన్యం ఉండేది. కానీ, ఇప్పుడు, రాష్ట్ర అసెంబ్లీ విజయం కంటె లోక్‌సభకు తెలుగుదేశం నుంచి గెలిచిన సభ్యుల సంఖ్యకు అధిక ప్రాధాన్యం ఏర్పడింది, జాతీయ స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ తెలుగుదేశం విజయాలు కీలకంగా మారాయి. తెలంగాణలోనూ, బీజేపీకి లభించిన ఎనిమిది విజయాలు విశేషమైనవి అయినప్పటికీ, జాతీయస్థాయిలో మోదీజోరు తగ్గడంతో పెద్ద సంచలనం కలిగించలేకపోయాయి. మోదీకి పూర్తి మెజారిటీ వచ్చి ఉంటే, చంద్రబాబు ప్రాధాన్యం అత్యంత పరిమితంగా ఉండేది. తెలుగుదేశం బలగం మోదీ ప్రభుత్వ మనుగడకే కీలకం కావడంతో, ఇప్పుడు చంద్రబాబు ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. ‘‘భారతదేశంలో ద్వేషం ఓడిపోయింది, ముస్లిముల మీద సానుకూలవైఖరి కలిగిన రెండు పార్టీల దయాదాక్షిణ్యాల మీద మోదీ ప్రభుత్వం ఆధారపడవలసి వస్తోంది’’ అన్న అర్థంలో ప్రముఖ పాకిస్తానీ పత్రిక ‘డాన్’ పతాకశీర్షిక పెట్టింది. పశ్చిమ దేశాల మీడియా కూడా, మోదీ బలం తరిగిపోవడం గురించి, తెలుగుదేశం, జనతాదళ్(యు) మీద ఆధారపడి సంకీర్ణం ఏర్పడడం గురించి ప్రముఖంగా రాస్తున్నాయి, చెబుతున్నాయి. బీజేపీ ప్రభుత్వం దూకుడుకు ఈ రెండు పార్టీలు కళ్లెం వేస్తాయని, వేయాలని దేశంలోని వివిధ వర్గాలు కూడా ఆశిస్తున్నాయి. కొన్ని బృందాలైతే ఏకంగా, చంద్రబాబు ఇండియా కూటమిలోకి మారాలని కూడా అభ్యర్థిస్తున్నాయి. బీజేపీతో కూటమి కట్టడానికి తెలుగుదేశానికి నిన్న ఒక కారణం ఉన్నట్టే, తెగదెంపులు చేసుకోవడానికి కూడా రేపు ఒక కారణం ఏర్పడాలి. అంతవరకు, చంద్రబాబు మిత్రధర్మానికే కట్టుబడి ఉండవచ్చు, కాకపోతే, కొన్ని షరతులతో.
విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పుడు ‘తన రోజులు’ వచ్చాయి. రాజధాని శంకుస్థాపనకు వచ్చి, తనవంతు వాటాగా నీళ్లూ మట్టీ ఇచ్చిన నాయకుడు, ఇప్పుడు తన భాగస్వామి అయిన చంద్రబాబు నాయుడి డిమాండ్లను శ్రద్ధగా ఆలకించక తప్పదు, నెరవేర్చకా తప్పదు. కేంద్ర మంత్రివర్గంలో రావలసిన స్థానాలను, తనకు చెందవలసిన అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు సాధికారికంగా రాబట్టుకుంటుంది. ఏకపక్ష పాలనకు, సంకీర్ణ భాగస్వామ్యపాలనకు తేడా ఇదే. ఒకే దేశం ఒకే నాయకుడు అని భ్రమిస్తే, దక్షిణ భారతదేశానికి ఏమి దక్కుతుందో తెలిసిందే. వైవిధ్యభరిత దేశం, బాహుళ్య నాయకత్వం అన్నదే ఉన్నంతలో ప్రజలకు మేలు చేస్తుంది. ఎన్‌డీఏ వెంట ఉంటామని, మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తామని సూత్రప్రాయ ప్రకటన చేసినప్పటికీ, అధికారిక ప్రకటన వెలువడే లోపే కావలసిన వాగ్దానాలు పొందాలన్నది తెలుగుదేశం పార్టీకి, యునైటెడ్ జనతాదళ్‌కు, ఇతర చిన్న పక్షాలకు తెలుసు. ఆయా రాష్ట్రాల డిమాండ్లను పరిశీలించి తీరవలసిన అగత్యంలోకి బీజేపీ వెళ్లింది. తన వంతు కోసం ఇండియా కూటమి మాటువేసి ఉన్నంత కాలం, బీజేపీ మీద ఆ ఒత్తిడి పనిచేస్తూనే ఉంటుంది. పాలక కూటముల మధ్య పోటీలో కూడా కొంత ప్రజాప్రయోజనం నెరవేరుతుంది.
తెలుగుదేశం కానీ, నితీశ్ జనతాదళ్ కానీ జాగ్రత్తపడవలసిన విషయం ఒకటి ఉంది. బీజేపీ సొంతంగా సంపాదించుకున్న సంఖ్యకి కనీస మెజారిటీకి మధ్య తేడా 32. మిత్రపక్షాలు చేస్తున్న జోడింపు 52. అంటే మెజారిటీకి మించి కేవలం 20 మాత్రమే ఎన్‌డీఏ దగ్గర ఉన్నాయి. ఈ రెండు పార్టీల దగ్గర ఉన్న 28 మినహా తక్కిన 24 చిన్నా చితకా పార్టీల నుంచి సమకూరినవి. డిమాండ్ల విషయంలో, విధానాల విషయంలో ఈ పక్షాలన్నిటి నుంచి ఒత్తిడిని తప్పించుకోవడానికి బీజేపీ ఇతర మార్గాల నుంచి బలసమీకరణ చేస్తుంది. ఇప్పటికే, ఏ కూటమికి చెందని పదకొండు మంది ఎంపీల మద్దతు సంపాదించినట్టుంది. తమ ప్రాబల్యాన్ని తగ్గించడానికి జరిగే అదనపు బలసమీకరణను తెలుగుదేశం, జనతాదళ్ (యు) గమనిస్తూ ఉండాలి. బీజేపీ తమ మీద ఆధారపడేట్టు చూసుకోవడంలోనే తమ ప్రయోజనాలు నెరవేరే అవకాశం ఉంది. దానదండోపాయాల ద్వారా చీలికలను, చేరికలను కల్పించే ప్రయత్నాల విషయంలో జాగ్రత్తగా మెలగాలి.
ఈ జాతీయ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన తీర్పు, ఏకశిలా సదృశమైనది కాదు. అనేకపార్శ్వాల తీర్పు. సర్వం సహాధికారానికి బీజేపీని దూరంగా నిలబెట్టడం ఒక కోణం అయితే, క్షేత్రస్థాయిలో సానుకూలత ఉన్నా, తగినంత వ్యూహరచన లేకుండా, సన్నద్ధత లేకుండా ఎన్నికల పోరాటం చేసిన ఇండియా కూటమిని కూడా నిరీక్షణలో ఉంచడం మరో పార్శ్వం. ఈ సంకీర్ణత, ప్రజలకు కావలసిన వెసులుబాటు ఇస్తుందని, తమ ఆకాంక్షలను వ్యక్తం చేయడానికి, సమస్యల పరిష్కారానికి పోరాడడానికి వారికి అవకాశం ఇస్తుందని కూడా ఈ తీర్పు భావించింది. ప్రజాశ్రేణులలో ఎంతో వైవిధ్యం, అనేక ప్రాంతాలు, సంస్కృతులు కలగలసిన దేశంలో, అందరికీ చోటు ఉండే పరిపాలన, అందరినీ కలుపుకుపోయే సామరస్యం అవసరం. ప్రధాని పదవికి కూడా మచ్చతెచ్చే విధంగా సాగిన విద్వేష ప్రచారాన్ని ఈ ఎన్నికలలో ప్రజలు తిరస్కరించారు. అటువంటి విభజన రాజకీయాల మీద ఆసక్తి లేని పక్షాల చేతిలో ప్రభుత్వ భవితవ్యాన్ని పెట్టారు. తెలుగుదేశం, జనతాదళ్ వంటి పార్టీలు తమ విజయంలో దాగి ఉన్న జాతీయ కర్తవ్యాన్ని కూడా గుర్తించే ఉంటాయి. అయినా సరే, కొత్త ప్రభుత్వం అనైతిక పద్ధతులతో ప్రజాతీర్పుకు విరుద్ధంగా బలాన్ని పెంచుకుని, సంకీర్ణ ధర్మాన్ని విస్మరించి, గత పదేళ్ల విధానాలనే కొనసాగిస్తే, ప్రజలకు, ప్రాంతీయ పక్షాలకు ఆశాభంగమే మిగలవచ్చు. అందుకే అప్రమత్తత అవసరం.
కూటమిగా మెజారిటీ లభించినప్పటికీ, ఏ ఒక్కపార్టీకీ జనాదేశం లేకపోవడాన్ని పరిగణించాలని, తాము కూడా అధికారాన్ని కోరుకోవడంలో తప్పులేదని ఇండియా కూటమి వాదిస్తోంది. ఎన్నికల ముందు ఏర్పడిన కూటములు ఫలితాల వెంటనే విచ్ఛిన్నం కావు. బలమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తే, ప్రభుత్వం నుంచి మెరుగైన పాలన అయినా వస్తుంది లేదా అధికార కూటమి అంతర్గత సంక్షోభంలో పడే అవకాశం ఉంటుంది. సమయం కోసం వేచి ఉండడం మంచిది. ప్రపంచమంతా గుర్తిస్తున్నట్టు, ఇప్పుడు మోదీ ప్రభుత్వానికి ఊతకర్రలుగా మారిన రెండు పార్టీలు, ఇండియా కూటమికి కూడా సహజమిత్రులే కదా?
కె. శ్రీనివాస్
Updated Date - Jun 06 , 2024 | 03:22 AM