ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అంధకార ప్రపంచంలో ‘అప్పో దీపో భవ’!

ABN, Publish Date - Oct 31 , 2024 | 03:00 AM

పద్నాలుగేళ్లు అరణ్యవాసం చేసిన రాముడు, సీతాలక్ష్మణులతో తిరిగి వస్తున్నాడంటే అయోధ్య ప్రజలు తమ ఆనందాన్నంతా ప్రమిదల్లోకి ఒంపి దీపాలు వెలిగించారట. అయోధ్య దేదీప్యమానమైందట....

పద్నాలుగేళ్లు అరణ్యవాసం చేసిన రాముడు, సీతాలక్ష్మణులతో తిరిగి వస్తున్నాడంటే అయోధ్య ప్రజలు తమ ఆనందాన్నంతా ప్రమిదల్లోకి ఒంపి దీపాలు వెలిగించారట. అయోధ్య దేదీప్యమానమైందట. వియోగం ఎప్పుడూ చీకటే. కలయిక ఎప్పుడూ వేడుకే.

రాముడి కథకూ, చారిత్రక బుద్ధుడి కథకూ ఎందుకో ఎన్నో పోలికలు! కుటుంబాన్ని, రాజ్యాన్ని, దేశాన్ని వదిలి సత్యాన్వేషణకై వెళ్లిన సిద్ధార్థ గౌతముడు, మానవ దుఃఖాలకు కారణాలను, నివారణలను తెలుసుకుని బుద్ధుడయ్యాక, తల్లిదండ్రులు, పుట్టిన నేల పిలిచిందని సందర్శనకు వస్తుంటే, కళ్లల్లో వత్తులు వేసుకుని చూస్తున్న కపిలవస్తు, వీధులన్నిటిలోనూ వెలుతురు ముగ్గులేసి స్వాగతించిందట! ఆ శాక్యప్రజలకు తెలుసు బుద్ధుడు ఉండిపోవడానికి రావడం లేదు, రాజ్యం ఏలడానికీ రావడం లేదు, తన మీద బెంగనే కాదు, బెంగలన్నిటినీ తీర్చడానికి వస్తున్నాడు!

ఆశ్వయుజ, కార్తీకమాసాలలో వచ్చే పండుగలకు అనేక కథనాలున్నాయి. రావణవధ జరిగింది దసరా అంటారు. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులకు విజయం లభించిన సందర్భం అంటారు. అశోకుడు బౌద్ధంలోకి పరివర్తన చెందిన రోజు విజయదశమి అంటారు. పెద్దలను స్మరించుకోవడం, పూలపండుగ చేసుకోవడం, జమ్మి ఆకులు పంచుకోవడం, ఉపవాసనిష్ఠలు, వనభోజనాలు, అనేక సందర్భాలతో ఈ రెండు నెలల కాలం కిక్కిరిసిపోతుంది.


పండగల వెనుక ఉన్న కథలేమైనా, ఈ రెండు మాసాల శరదృతువు, ఎంతో ఆహ్లాదకరమైన కాలం. ‘‘శారదరాత్రులుజ్వల లసత్తర తారక హారపంక్తుల’’తో అలంకృతమయ్యాయని నన్నయ రాశాడు. వెదజల్లిన కర్పూరపు పుప్పొడిలాగా ఉంటుందట వెన్నెల. వర్ష రుతువు ముగిసి, జలాశయాలు నిండి, పూలవెల్లువతో నేల నేల అంతా ఉప్పొంగిపోతుంది. మబ్బులు లేని ఆకాశాలు, మెరిసే నక్షత్రాలు, కాటుకపొగల కృష్ణ పక్షాలు, తుళ్లింతల తేరు మీద రాత్రింబవళ్లు సవారీ చేస్తాయి. మనకు అమావాస్యతో నెలముగుస్తుంది కదా, నేటి దీపావళి తరువాత కార్తీకం కదా? దేశంలో చాలా మందికి, ముఖ్యం ఉత్తరాదికి, పున్నమి నుంచి పున్నమికి నెల. వాళ్లకు కార్తీకం ఇప్పటికే మొదలై పక్షం గడిచింది! కాలపు లెక్కలకేమి గానీ, ఈ రెండు మాసాల మీద కమ్మినదొక జన, వన జాతరల జమిలి రుతువు!

పర్వదినం అంటే, ఒకే సంతోషం అందరి కళ్లలోనూ వెలగడం కదా! లోకకంటకుడు ఎవరో హతుడయ్యాడని, ఎంతో జననష్టం జరిగే యుద్ధంలో విజయం దక్కిందని పండగ చేసుకోవడంలో ఏదో అసౌకర్యం ఉన్నది. శాంతి, కరుణలు నిండిన ఉల్లాసంలో ఉత్సాహంలో కదా సంబరమన్నది! చెడు మీద మంచి విజయంగా ఆ పురాణకథలను చూడాలి అంటారు. ఆ విజయం హింస ద్వారానో, శిక్షించడం ద్వారా, బలవంతంగా నిర్మూలించడం ద్వారానో జరిగినప్పుడు, అక్కడ ఏదో అపజయం కూడా స్ఫురించడం లేదా? మూలకారణాన్ని కాక, వ్యక్తీకరణను మాత్రమే తొలగించే పని ఎవరు చేసినా అది అసంపూర్ణమే. అటువంటప్పుడే, ధర్మసంస్థాపనకు పదే పదే సంభవామి తప్పదని హామీలు పూచీలు ఇచ్చుకోవలసి వస్తుంది. ఒక్క దుష్ట శిక్షణ కూడా చేయకుండానే గౌతమబుద్ధుడు కొత్త ధర్మాన్ని స్థాపించాడే, అనేక ఆదర్శాలను వ్యాపింపజేశాడే? అది ఎట్లా సాధ్యపడింది?


కానీ, ఏది ధర్మం? ఏది మంచి? ఏది చెడుగు? ఓ మహాత్మా ఓ మహర్షీ? ఎవరు ఎవరికి కంటకుడో ఏమో? యుద్ధంలో ఏ పక్షానిది న్యాయమో ఎవరు తేల్చాలి? రాసిన పురాణాలైనా, చరిత్రలైనా విజేతల కథనాలే కదా! ఐదు దశాబ్దాల కిందట శ్రీకాకుళం ఆదివాసులకు అత్యంత ఆప్తులైన ఉద్యమకారులను పోలీసులు కాల్చిచంపినప్పుడు, ఒక పత్రిక ‘నరకాసుర వధ’ అన్నపేరుతో సంపాదకీయం రాసింది. భూమిపుత్రుడు కదా నరకుడు, ఏ ప్రయోజనాల యుద్ధంలో అతను దేనికి చనిపోయాడో? ఆగ్రహాలను, ప్రతీకారాలను కాక, లోలోపల ప్రేమదీపాలను వెలిగించగల రోజులే హర్షరుతువులై, జీవనోత్సవాలైతే ఎంత బాగుండును! పండుగలు కేవలం భక్ష్యభోజ్యాలకు, పూజాతతంగాలకు పరిమితం కాక, ఆయా సందర్భాలలో దాగిన విలువలను తరచి చూడగలిగితే ఎంత సార్థకంగా ఉండును? లేదా, మనిషి తను కాలక్రమంలో సమకూర్చుకుని, దృఢపరచుకున్న కొత్త ఆశయాలకు, లక్ష్యాలకు, నీతికి అనుగుణమైన కొత్త పండుగలను కనిపెడితే, కరకుదనమూ రోషకషాయిత రౌద్రమూ కాక, మానవ ఆదిమ అమాయకత్వాన్ని పులుముకున్న దైవరూపాలనూ ఆవిష్కరిస్తే, వేడుకలు ఎంత దయగా ఉండేవి?


ద్వేషంతో ఎవరినైనా, దేన్నైనా గెలవాలని ప్రయత్నించినప్పుడల్లా, ద్వేషమే గెలుస్తుంది. అట్లాగే, ద్వేషాన్ని ద్వేషంతో ఎప్పుడూ తొలగించలేము. న్యాయమైన ఆగ్రహాన్ని, పదిమంది మీద ప్రేమతో పుట్టే ప్రతిఘటనను కూడా బలప్రయోగంతో అణగార్చలేరు. వ్యక్తి స్వార్థమో, వర్గ, జాతి స్వార్థాలో, ఆక్రమణలో అపహరణలో కొందరిని ఆధిక్యంలోకి అనేకులను అధీనతలోకి నెట్టవచ్చు. దుర్మదంతో ఒకరు దౌర్జన్యం చేయవచ్చు. మరొకరు బక్కకోపం చూపవచ్చు. పరస్పరత కలిగిన సోదరత్వం మిగిలితే, మనుషులకీ తామసాలే అక్కరలేదు! గౌరవప్రదమైన మనుగడ కోసం, కాళ్ల కింద చారెడు నేల కోసం మనిషి పడే తపన, అందుకు అడ్డుపడే అత్యాశలు, వీటి మధ్యే అరిషడ్వర్గాలు! పోరాటాలు యుద్ధాలు సంగ్రామాలు! అప్పుడప్పుడు ఎవరో ఒకరు, ఏదో ఒక సమూహం సంచారిణీ దీపశిఖల్లాగా, లోకం మీదకు లిప్తకాలపు వెలుగులు విసిరి వెళ్లిపోతారు! సృష్టిలో చీకటి సర్వవ్యాపితం, గాఢం, అనంతం అని, వెలుగు మాత్రం స్వల్పం, స్థానికం అంటాడు కార్ల్ సాగన్! ..‘‘లోన జ్వలియించుచున్న మహానలమునకొక విస్ఫులింగమె కాద యీ యుత్సవాగ్ని’’ అంటూ దీపావళిని అంతర్ బహిర్ యుద్ధారావం చేశారు కవి వేదుల.


మనిషి భయాలన్నీ చీకటితోటల్లోనే సంచరిస్తుంటాయి. చీకటంటే భయమున్నవారే చావుకు భయపడతారని స్టీఫెన్ హాకింగ్ అన్న మాట మరింత భయపెడుతుంది. దేవుడనేవాడు పోతన ఊహించినట్టు పెంజీకటికి ఆవల ఉంటాడేమో, మన అపరిచితత్వపు భయాలను పారదోలడానికి ఏదో ఒక శక్తి లేకపోతే ఎట్లా? ఈ మహాసృష్టిలో, అన్ని జీవులకంటె అధికులమనుకునే మనుషులకే దేవుడు! తక్కిన అన్ని చరాచరాలూ అటానమస్! అబద్ధం, అజ్ఞానం, అధికారం, ఆధిక్యం, అహంకారం... చీకటికి ఎన్నో పర్యాయపదాలు, అర్థం మాత్రం ఒకటే.! కార్తీకరాత్రులు దీపాలంకరణకు బాగుంటాయి కానీ, కాలంలోను, స్థలంలోను, మానవహృదయంలోను ప్రమిదలు చీల్చలేని కటికచీకటి రాత్రులు పరచుకుని ఉన్నాయి. పసిపాపల నిదురకనులపై క్షిపణులు, స్ఫటికాకాశాల నిండా ఘాటెక్కిన గంధకధూమాలు, అడవిసిరుల కోసం కడుపుకోతలు, రుతువులన్నీ చెరిగిపోయే విషవాయు విన్యాసాలు, బుసకొట్టే గోడలు, మృత్యుక్రీడలు... మానవ నిశీథిని నిండా నీలి నీడలు! తానే దీపం కావడం సరే, కనీసం తాను మనిషి కాగలడా? కాగలదా? తానే చీకటి కాకుండా కాపాడుకోగలడా? వెలుగులను ప్రేమించడం వడ్డించిన విస్తరి లాంటి విలాసం కాకుండా కాపాడుకుంటుందా? చీకటి వీక్షణలను గుప్పించి, చీకటినే నిశ్వసించి, వెలుతురు పొరలకు తూట్లు పొడవకుండా ఉండగలడా?


‘‘అప్పో దీపో భవ’’ అన్నాడు తథాగతుడు. తనతోనే తనను అంటిపెట్టుకుని గడిపిన ఆనందుడికి మరణశయ్య మీద ఇచ్చిన సందేశం అది. అదే ఆయన చివరిమాట కూడా. నీకు నువ్వే దీపం! ‘జ్ఞాన సంబుద్ధికి వేరే మార్గం లేదు, పరాధీనత కుదరదు. నీలోపలి దీపాన్ని నువ్వే కనుగొనాలి! ఈ మాటలకు కోటానుకోట్ల పుటల వ్యాఖ్యానాలు వచ్చాయి. మనిషి చేతన మీద అపారమైన భారం మోపుతున్నట్టు కనిపించే ఈ సందేశం, మనుషుల మధ్య అత్యంత సహజ కరుణను పునరుద్ధరించడం... అనాయాసపు, అవలీల లక్ష్యం కాదని గుర్తు చేస్తుంది. కోట్ల కాగడాలు వెలిగించినా చెదిరిపోనంత చీకటి లోకాన ఉన్నదంటాడు గుడిపాటి వెంకట చలం.

హృదయాలను కపిలవస్తు చేసుకుని, ముస్తాబు చేసుకోవాలి. ఎవరో జ్ఞాని నడచివస్తాడని కాదు. కరిమబ్బు లేని కార్తీక ఆకాశం లాగా మనసును నిర్మలం చేసుకుని మనలోకి మనమే నడిచి రావడం కోసం. శాంతి పూసే వేళన ఆ మాత్రం దీపాలంకరణ చేసుకోవాలి!

అసత్యం నుంచి సత్యంలోకి, చీకటి నుంచి వెలుగులోకి మృత్యువు నుంచి అమృతత్వంలోకి నడిపించమని వేదకవి కోరుతున్నాడు. బృహదారణ్యక ఉపనిషత్తులోని ఈ సందేశంలోని ‘తమసోమా జ్యోతిర్గమయ’ అన్న పంక్తి ఆంధ్రజ్యోతికి తొలినాటి నుంచి కరదీపికగా ఉంది. ఎరుకను మించిన వెలుగు లేదు. చీకటిని వెలిగించడంలో అక్షరానికి మించిన జ్యోతి లేదు. ఈ అక్షర కాంతి నిరంతరంగా ‘‘ఆంధ్రజ్యోతి’’ పాఠకులపై వర్షిస్తూనే ఉండాలి!

కె. శ్రీనివాస్

Updated Date - Oct 31 , 2024 | 03:00 AM