ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఓటమిని దాచి నటన చేయగలమా?

ABN, Publish Date - Jun 13 , 2024 | 03:14 AM

పొంగిపోము, కుంగిపోము అని రాజకీయ నాయకులు చెబుతుంటారు కానీ, అంత స్థిత ప్రజ్ఞులు ఇప్పుడు ఎవరున్నారు? పైకి ఎలా కనిపించినా లోలోపల వాళ్ల మనస్సులు గాల్లో తేలిపోవడమో, పాతాళానికి జారిపోవడమో...

పొంగిపోము, కుంగిపోము అని రాజకీయ నాయకులు చెబుతుంటారు కానీ, అంత స్థిత ప్రజ్ఞులు ఇప్పుడు ఎవరున్నారు? పైకి ఎలా కనిపించినా లోలోపల వాళ్ల మనస్సులు గాల్లో తేలిపోవడమో, పాతాళానికి జారిపోవడమో చేస్తుంటాయి. బుద్ధినే కాదు, మనఃస్థితిని కూడా ప్రదర్శించేది ముఖమే. జయాపజయాల సందర్భాలలో ఎంత దాచుకున్నా, సంతోష విచారాలు ముఖాల్లో తొంగిచూస్తాయి. ప్రజాజీవితం ఒక ప్రదర్శనగా కూడా మారిపోయింది కాబట్టి, గాంభీర్యాన్ని తెచ్చిపెట్టుకోవడం, ముఖకవళికలను, ఆంగిక భాషను నియంత్రించడం కొందరికి నైపుణ్యంగా మారిపోయింది. కానీ, వారికి కూడా వశపడని సందర్భాలు కొన్ని ఉంటాయి.

ఈ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మనకు పరిచితమైన రాజకీయ వ్యాకరణానికి లొంగేవి కావు. అంతా అధివాస్తవికత, మొత్తంగా విరోధాభాస. కొంచెం నీరు. కొంచెం నిప్పు. వారి విజయం విజయంలాగా లేదు. వీరి ఓటమి ఓటమిలాగానూ లేదు. గెలిచినవాడు కోల్పోయినట్టు విచారపడుతున్నాడు. ఓడినవాడు విజేతలాగా సంబరపడుతున్నాడు. సన్నివేశానికి అభినయానికీ మైత్రి కుదరడం లేదు. పోనీ, కొయ్యముఖం పెట్టి తప్పించుకుందామా అంటే, ముఖనటన కుదరని సంక్లిష్ట మనోభావం.


ఈ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతాపార్టీకి ఏమంత సంతోషాన్ని ఇచ్చి ఉండవు. మెజారిటీని మించి మరింత, మరింత బలాన్ని ఇవ్వమని ఓటర్లను అభ్యర్థిస్తే, వారు మెజారిటీకి ముప్పై రెండు దిగువన నిలబెట్టారు. కూటమిగా తమకు అధికారం ఖాయమే అయినా, ఈ విజయంలో తగినంత అపజయం కూడా ఉన్నది. తేజస్సు జారిపోయి, పరాధీనపు అధికారం దక్కింది కదా అని బాధపడుతున్నది. ఇక కాంగ్రెస్‌తో సహా అనేక పార్టీల ఇండియా కూటమికి బీజేపీకి సొంతంగా వచ్చినన్ని సీట్లు కూడా రాలేదు. కానీ, బీజేపీని చావుదెబ్బ తీశామన్నట్టు అది ఆనందిస్తున్నది. ప్రియాంక గానీ పోటీచేసి ఉంటేనా, మోదీ కూడా చిత్తుగా ఓడేవాడు కదా అని పశ్చాత్తాపపడేంతగా కాంగ్రెస్‌లో విజయోత్సాహం కనిపిస్తున్నది. ఫలితాల ఆంతర్యం బీజేపీని తగ్గించడమే కావచ్చును కానీ చిత్తుగా ఓడించడం కాదు, ఇండియా కూటమిని పెంచడమే కావచ్చును కానీ, పూర్తిగా గెలిపించడం కాదు. ఫలితాల సాంకేతిక సత్యంతో పొంతనలేని ముఖచిత్రాలను ఈ రెండు పార్టీల శ్రేణులలో చూడవచ్చు.

నరేంద్రమోదీ ముఖం గంభీరంగా ఉంటుంది. చూపు పదునుగా ఉంటుంది. ఎప్పుడైనా నవ్వినా అది ఆత్మీయంగా కాక, యథాలాపంగా ఉంటుంది. అత్యధిక జనాదరణ కలిగిన ఒక నాయకుడు, కఠినమైన వ్యవహారసరళి, కఠోరమైన రాజకీయ సంకల్పాలు కలిగి ఉంటే ఎట్లా ఉంటారో దానికి తగ్గట్టు ఆయన ముఖకవళికలు గత పదేళ్లుగా మనకు అలవాటు అయ్యాయి. ఒక రకమైన దర్పంతో ఆయన యాభైయ్యారు అంగుళాల ఛాతీ ఉప్పొంగి కనిపించేది. ఫలితాలు వచ్చాక ఆయన ఎట్లా ఉన్నారు? ఫలితాలు రాకముందు, తొలిరౌండ్లలో వారణాసి కౌంటింగ్‌లో వెనుకబడినప్పుడు ఆయన ముఖం ఎట్లా ఉండి ఉంటుంది? కెమెరా ఎదుట లేనప్పుడు ఆయన మనోభావాలే ఆయన ముఖంలో పలికి ఉంటాయి. జూన్ నాలుగోతేదీ సాయంత్రం బీజేపీ కేంద్ర కార్యాలయానికి వచ్చినప్పుడు, ఆయన పార్టీ నాయకుడిగా, ఫలితాలపై శ్రేణులకు సంతృప్తినో, ఓదార్పునో అందించవలసిన కర్తవ్యంలో ఉన్నారు. ప్రత్యక్ష ప్రసారంలో ఆయనను చూసినవారంతా ఆయన కవళికలను శ్రద్ధగా గమనించారు. తప్పనిసరిగా ఆయన తనను తాను కూడగట్టుకున్నారు. నవ్వుతున్నారు కానీ, అది యథాలాపంగా నిర్లిప్తంగా లేక, ఏదో అప్రియభావాన్ని ప్రకటిస్తోంది.


తమకు దక్కింది ఆశించిన విజయమో కాదో ఆయన చెప్పలేదు. ఎన్నికల ప్రచారమంతటా ఆయన తన పేరును మాత్రమే జపించారు. ఆ నాటి సందేశం తరువాత ఇక ఆయన ఎన్డీయే ప్రతినిధిగా మారిపోయారు. రెండో ప్రభుత్వానికి కొనసాగింపే మూడో ప్రభుత్వం అన్నారు. గెలుపోటములు వస్తుంటాయి పోతుంటాయి అన్నారు కానీ, ఆ వ్యాఖ్యను ప్రస్తుత సందర్భంతో అన్వయించలేదు. అప్పటి నుంచి ఆయన చాలా కలివిడిగా కనిపించాలని చూస్తున్నారు. ఆలింగనాలు కరచాలనాలు పెంచారు. హాయిగా నవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఛాతీని కాక హృదయాన్ని ముందుకు తోస్తున్నారు. నిజానికి చాలా కష్టమైన ప్రక్రియ ఇది. నలుగురిని కలుపుకుని పోవలసిన అగత్యంలో, ఒక దృఢమైన నాయకుడికి కలిగే కష్టం ఇది. తన అపజయానికి తాను మొహం చాటేసి, సాంకేతికమయిన విజయాన్ని నెత్తిన పెట్టుకోవలసిన పరిస్థితి.

ఓటమికి పెద్ద బాధపడకుండా, గెలుపును పెద్దగా వేడుక చేసుకోకుండా ఉండవలసిన పరిస్థితిని తెలంగాణలో కూడా చూడవచ్చు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో బీజేపీకి పెద్ద లాభం చేకూర్చాయి. కాంగ్రెస్‌కు బాగా నష్టం చేశాయి. బీఆర్ఎస్ సంగతి చెప్పుకోవలసిన పని లేదు. కానీ, జాతీయ స్థాయి పరిణామాల హడావిడిలో, పొరుగు తెలుగు రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ఘనవిజయం సంరంభంలో, తెలంగాణ జయాపజయాలు పెద్దగా చర్చల్లోకి రాలేదు. కార్పెట్ కిందికి తోసేద్దామని ఓడిపోయినవాళ్లు అనుకుంటే సరే కానీ, నాలుగు సీట్లను రెట్టింపు చేసుకుని ఎనిమిది సీట్లు గెలిచిన బీజేపీ కూడా గెలుపుస్థాయికి తగ్గట్టు సంబరాలు చేసుకోలేదు. ఎనిమిది స్థానాల్లో గెలిచి, మరో ఏడు స్థానాల్లో రెండో స్థానంలో నిలవడం అంటే, ఆ పార్టీకి ఎంతటి పెద్ద గెంతు?


బహుశా, జాతీయస్థాయిలో పెద్ద గెలుపు దక్కలేదన్న నిరుత్సాహం తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో కూడా పనిచేసి ఉంటుంది. అదే సమయంలో, ఇప్పుడు దక్కిన ఓట్ల శాతం కానీ, సీట్లు కానీ ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే వచ్చాయని, వాటిని స్థిరపరచుకోవడానికి ఇంకా చాలా కష్టపడవలసి ఉంటుందని గ్రహించడం కూడా వారి ఆనందాన్ని నిగ్రహించి ఉండవచ్చు. మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు తన ఓటమిని మభ్యపరచాలని చూస్తున్నది? జాతీయస్థాయిలో ఓటమిలో వెలిగిన విజయంలో తలమునకలైనందునా? 2019లో గెలుచుకున్న 3 స్థానాలతో పోలిస్తే ఐదు అదనంగా గెలుచుకున్నామని, బీఆర్ఎస్ తన ఓట్లను బీజేపీకి బదలాయించినందువల్లనే ఆ స్థానాలలో ఓడిపోయామని కాంగ్రెస్ ఎందుకు వివరణలు ఇస్తున్నది? కూడబలుక్కున్నట్టు వారూ వీరూ తమ గెలుపు ఓటములను గుట్టుచప్పుడు కాకుండా ఎందుకు నిద్రపుచ్చుతున్నారు?

నిజానికి, కాంగ్రెస్ ఓట్లు 2019 సాధారణ ఎన్నికలతో కానీ, 2023 అసెంబ్లీ ఎన్నికలతో కానీ పోలిస్తే పెరిగాయి తప్ప తరగలేదు. కాకపోతే, పెరగవలసినంత పెరగలేదు. బీఆర్ఎస్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో సంపాదించుకున్న 37.35 శాతం ఓట్లు, ఇప్పటి లోక్‌సభ ఎన్నికల నాటికి 16.68 శాతానికి ఆవిరయ్యాయి. అసెంబ్లీ ఓటమి తరువాత బీఆర్ఎస్‌కు ప్రాసంగికత లేదని దాదాపు 20 శాతం ఓటర్లు భావించి ఉండవచ్చు. బీజేపీకి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ఓట్ల శాతంలో పెరుగుదల సుమారు 20 శాతమే. సులువుగా లెక్కవేసుకోవడానికి వీలుగా, లోక్‌సభ ఎన్నికలలో ఆ 20 శాతమే బీజేపీకి అదనంగా వెళ్లాయని అనుకుందాం. ఎందుకు వెళ్లాయన్నది కదా ప్రశ్న? కాంగ్రెస్‌ను కాదని వాళ్లు బీజేపీని ఎందుకు ఎంచుకున్నారు? 2018 అసెంబ్లీ ఎన్నికలకు, 2019 లోక్‌సభ ఎన్నికలకు మధ్య కూడా బీజేపీ ఓట్లు 10 శాతం పెరిగాయి. పార్లమెంటు ఎన్నికలలో పెరగడానికి మోదీ ఆకర్షణ ఒక కారణం కావచ్చు. అసెంబ్లీ ఎన్నికలలో కూడా క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు 15 నియోజకవర్గాల్లో ప్రథమ లేదా ద్వితీయ స్థానంలో ఉన్న బీజేపీ, వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్ర అధికారానికి గురిపెట్టినట్టే కదా? ఇందులో వారి నిర్మాణ బలం, కృషి పాలు ఎంత? కాంగ్రెస్ వైఫల్యం ఎంత? పోనీ, వైఫల్యం కాదు అనుకుందాం.. కాంగ్రెస్‌కు పెరిగిన ప్రమాదం ఎంత? ఈ ప్రశ్నలను చర్చ నుంచి తప్పించలేము.


బీఆర్ఎస్ చెబితే తమ ఓట్లను బదలాయించే విధేయతలో ఆ పార్టీ ఓటర్లు లేరు. బదలాయింపు అన్నది రాజకీయమైన ఆరోపణ. కీలకమయిన స్థానాలలో కాంగ్రెస్ బలహీన అభ్యర్థులను నిలబెట్టి, బీజేపీకి సహకరించిందని బీఆర్ఎస్ కూడా ఆరోపించింది. కొందరు అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇతరులు కూడా రకరకాల అనుమానాలు వ్యక్తం చేశారు. ఫలితాలు ఇట్లా వచ్చాక, తాము శంకించింది నిజమైందని వారు భుజాలు చరుచుకుంటున్నారు. రాజకీయ ఆరోపణల సంగతి పక్కనబెడితే, కనీసం నాలుగైదు సీట్లను కాంగ్రెస్ నష్టపోయిన మాట వాస్తవం. రేవంత్ రెడ్డి రూపొందించిన నినాదాలు దేశమంతా కాంగ్రెస్‌కు పనికివచ్చాయి. మరి తెలంగాణలో ఎందుకు ప్రభావం వేయలేకపోయాయి? దేశమంతా తమకు దొరికిన విజయాలకు రాహుల్‌గాంధీ ఎంతో ఆనందంగా ఉన్నారు. కానీ, ఆయనకు తెలంగాణలో చెలామణీ లేకపోయిందా? బీజేపీ పని అయిపోయిందని ప్రకటనలు చేస్తున్నప్పుడు, తాము అధికారంలో ఉన్న ఒక రాష్ట్రంలో బీజేపీ తన భవిష్యత్ విజయానికి విత్తనం వేసిందని రాహుల్‌గాంధీ గ్రహించారా?

అన్ని పార్టీలలోను, తన స్థితిగతులను బట్టి సహజమైన వ్యక్తీకరణలను ఇస్తున్నది ఇప్పుడు ఒక్క బీఆర్ఎస్సే కనిపిస్తున్నది. కిందపడ్డా తనదే పైచేయి అన్న ధోరణి అందరిలోనూ ఉండేదే. అసెంబ్లీ అపజయం తరువాత, లోక్‌సభ ఎన్నికల సన్నాహాలలో భాగంగా, ఆ పార్టీ నేతలు కొంత గాంభీర్యాన్ని ప్రకటించకతప్పలేదు. ఇప్పుడిక సున్నా విజయాలతో, చేతిలోని శాసనసభ్యులు కూడా ఎంతవరకు నిలబడతారో తెలియని స్థితిలో ఆ పార్టీ స్తబ్దుగా మారిపోతున్నది. బుకాయింపులకు దబాయింపులకు అసలే ఆస్కారం లేని స్థితి. ఉనికిని చాటుకునే చిటపటలు మాత్రం కొన్ని వినిపిస్తున్నాయి. బహుశా, ఇది ఆ పార్టీకి ఆత్మవిమర్శో అంతర్ధానమో తేల్చుకోవలసిన సమయం.

కె. శ్రీనివాస్

Updated Date - Jun 13 , 2024 | 03:14 AM

Advertising
Advertising