ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హర్యానా పాఠం అందకపోతే, ‘మహా’ ప్రమాదం!

ABN, Publish Date - Oct 17 , 2024 | 02:29 AM

మధ్యలో ఆటంకాలు వస్తాయేమో అని కొందరు పనులు మొదలు పెట్టనే పెట్టరట. వీళ్లు అధములట. మొదలుపెట్టాక, చిన్న విఘ్నం రాగానే తోకముడిచేవాళ్లుంటారు, వాళ్లు మధ్యరకం వాళ్లు...

మధ్యలో ఆటంకాలు వస్తాయేమో అని కొందరు పనులు మొదలు పెట్టనే పెట్టరట. వీళ్లు అధములట. మొదలుపెట్టాక, చిన్న విఘ్నం రాగానే తోకముడిచేవాళ్లుంటారు, వాళ్లు మధ్యరకం వాళ్లు. ఇక, ఆరునూరైనా అవరోధాలు ఎన్ని ఎదురైనా ఉత్తములు మాత్రం పనిపూర్తిచేస్తారట. భర్తృహరి నీతులు చాలా చెప్పాడు కానీ, పని మొదలుబెట్టి, చిన్న విజయం రాగానే అదే మహద్భాగ్యం అనుకుని, కాడిపడేసే వాళ్ల గురించి మాత్రం రాయలేదు. అప్పటికింకా కాంగ్రెస్ పార్టీ పుట్టలేదు కాబట్టి, ఆ బాపతు మనుషుల గురించి ఆ కవికి తెలియకపోయి కూడా ఉండవచ్చు.

బుధవారం నాడు శ్రీనగర్‌లో ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారానికి హాజరయిన రాహుల్‌గాంధీని, ఆయన సోదరిని, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేని చూసినప్పుడు, వారి మీద అపారమయిన జాలి కలిగింది. మొన్నటి ఎన్నికల్లో వారికి దొరికింది ఒక పావుశేరు గెలుపు మాత్రమే. అంత మాత్రానికే వారి ముఖాలు వెలిగిపోతున్నాయి. హర్యానా జారిపోయింది. జమ్మూకశ్మీర్‌లో గెలుపు ఏదైనా ఉందంటే, అది కూడా నైతికమయిన గెలుపు, నేషనల్ కాన్ఫరెన్స్‌ది మాత్రమే. జమ్మూ ప్రాంతంలో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. కేంద్రపాలిత ప్రాంతం మొత్తం మీద బీజేపీ బాగా పుంజుకున్నది. ప్రభుత్వంలో చేరకుండా కాంగ్రెస్ కొంత పరువు దక్కించుకున్నది కానీ, ఆ ప్రభుత్వం మాత్రం ఏ పాటిది? గవర్నర్ కనుసన్నలలో వ్యవహరించవలసివచ్చే జీహుజూర్ సామంతం!


మరి, ఈ కాంగ్రెస్ అల్పసంతోషులు రేపు మహారాష్ట్రలో గట్టి పోటీ ఇస్తారా? జార్ఖండ్‌లో తమ కూటమిని గెలిపించుకుంటారా? వచ్చే ఏటికి బిహార్‌లో బలపడతారా? లేక, భారం అంతా తమతో పాటు నడిచే మిత్రపక్షాల మీదికి తోసి, నిమ్మకు నీరెత్తుతారా? తమకు కాస్త బలం పెరిగేసరికి, ఏ పొత్తూ వద్దని ఫోజు కొట్టి, హర్యానాలో గర్వభంగం జరిగిన కాంగ్రెస్‌, మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీతో సవ్యంగా కలసి నడుస్తుందా?

పోయిన ఏడాది కర్ణాటకలో బీజేపీ మీద ముఖాముఖి ఘనవిజయం సాధించేసరికి కాంగ్రెస్ గాల్లో తేలిపోసాగింది. బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు, కాంగ్రెస్‌కు సానుకూలత కూడా పెరుగుతోందని తెలిసినా, పరిస్థితిని పూర్తి అనువుగా మలచుకోవడంలో అగ్రనాయకత్వం సమర్థత అంతంత మాత్రంగానే ఉండడంతో, బొటాబొటి మెజారిటీతో తెలంగాణలో అధికారం దక్కించుకుంది. వరుస బీజేపీ పాలనల తరువాత, ప్రత్యామ్నాయానికి సిద్ధంగా కనిపించినప్పటికీ, మధ్యప్రదేశ్ ఓటర్లను కాంగ్రెస్ ఆకట్టులేకపోయింది. ఇక రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లను వ్యతిరేక ఓటుతో పోగొట్టుకున్నది. పొడువు జోడో యాత్ర తరువాత, అడ్డంగా చేసిన న్యాయ యాత్ర ఫలితమో, ఓటర్లు ఉద్వేగాలను అధిగమించి వాస్తవ జీవనసమస్యల మీద దృష్టి సారించారో లేదో కానీ, సాధారణ ఎన్నికల్లో, కాంగ్రెస్ తన బలాన్ని రెండింతలకు మించి పెంచుకుంది. బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకుండా, 240 దగ్గర నిలిపింది కానీ, ఎన్‌డీఏను, మోదీ మూడో రాకడను నిలవరించలేకపోయింది. యూపీ, మహారాష్ట్ర, హర్యానాల్లో బీజేపీని నేరుగా దెబ్బతీయగలిగినందుకు బహుశా, కాంగ్రెస్ అధిష్ఠానం బాగా అలసిపోయి ఉంటుంది. ఇక చేయాల్సింది, 2029 దాకా వేచిచూడడం మాత్రమే. ఆ లోగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలన్నీ వరుసగా తన బుట్టలో పడవలసినవే అనే పగటికలల్లోకి విశ్రమించి ఉంటుంది.


తన విజయం ఖాయమనుకుని ఆయుధాలు జారవిడవడం హర్యానాలో కాంగ్రెస్ ఓటమికి ఒకానొక ముఖ్య కారణం. ఏకైక కారణం కాకపోవచ్చు. హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందని లోక్‌సభ ఎన్నికల సరళి చెప్పింది. రైతు ఉద్యమాల హోరు చెప్పింది. క్షేత్రస్థాయిపరిశీలనలు చేసిన మీడియా వ్యాఖ్యాతలు చెప్పారు. పోలింగ్‌కు ముందు సర్వేలు, తరువాత ఎగ్జిట్‌పోల్స్ చెప్పాయి. అయినా, ఫలితం మాత్రం బీజేపీ హ్యాట్రిక్. ఇప్పుడు నెపాన్ని అందరూ భూపిందర్ సింగ్ హుడా మీదకు నెట్టేయవచ్చు. విజయాన్ని అమిత్ షా వ్యూహరచనకు అంటగడుతున్నప్పుడు, ఓటమికి మాత్రం రాహుల్, ఖర్గే ఎందుకు బాధ్యులు కారు?

ఇక్కడ సమస్య హర్యానాలో స్థానికంగా ఏ కారణాలు పనిచేశాయి, సామాజికవర్గాల ఏ కూడికలు, తీసివేతలు విఫలమయ్యాయి అన్నది కాదు. వేసుకోవలసిన ప్రశ్నలు ఇవి : హర్యానా విజయం తనకు అత్యవసరమని కాంగ్రెస్ ఎందుకు అనుకోలేదు? లోక్‌సభ ఎన్నికల్లో వ్యక్తమైన సానుకూలతను ఎందుకు జారవిడుచుకుంది? గెలిచే అవకాశం లేదని లోకం కోడై కూస్తున్నా, పట్టుదలగా బీజేపీ ఎట్లా గెలవగలిగింది? లోక్‌సభ ఎన్నికలలో నాలుగు మెట్లు కిందికి జారిన బీజేపీ, హర్యానా గెలుపుతో ఒక మెట్టు తిరిగి ఎక్కగలిగింది. ఈ విజయం, బీజేపీ శ్రేణులలో కొత్త ఉత్సాహం నింపుతోంది. ఎన్‌డీఏలో మిత్రపక్షాల ప్రాధాన్యాన్ని కుదించివేస్తోంది. మా ప్రాభవం తగ్గుతుందనుకుంటున్నారేమో, మళ్లీ మేం పూర్వ వైభవానికి వచ్చేస్తున్నాం.. అంటూ మిడిమిడి గెలుపులకే మూర్ఛపోయిన ప్రత్యర్థులను హెచ్చరిస్తోంది. తీసుకుంటే, హర్యానా ఫలితాల్లో కాంగ్రెస్‌కు తీవ్ర హెచ్చరిక దాగి ఉంది. ఆ ప్రమాదసూచిక ఒకరకంగా కాంగ్రెస్‌కు మేలుచేసేది, మేలుకొల్పేది!


తప్పుల నుంచి నేర్చుకుని, దిద్దుబాటు చేసుకుంటుంది కాబట్టి బీజేపీ హర్యానాలో గెలిచింది అని కొందరు వ్యాఖ్యాతలు అంటున్నారు. అంత ఉదాత్తత ఆపాదించనక్కరలేదు కానీ, దారి సవరించుకునే పద్ధతి అయితే ఆ పార్టీకి ఒకటి ఉంది. ఫలితాలు తమకు ప్రతికూలంగా వచ్చినప్పుడు, లోపం ఎక్కడ ఉందో కనిపెట్టి, విరుగుడు ప్రయోగించడంలో బీజేపీ వ్యూహకర్తలు దిట్టలు. ప్రజలలో వ్యతిరేకతకు కారణమైన విధాన నిర్ణయాలను వెనక్కి తీసుకుని, తిరిగి వారిని ఆకట్టుకునే ప్రయత్నం బీజేపీ పెద్దగా చేయదు. ఒక్క రైతు చట్టాల విషయంలో మాత్రమే వెనుకంజ వేసింది. అదొకటే మినహాయింపు. ప్రజల దృష్టి నుంచి ఆత్మవిమర్శ చేసుకోవడం బీజేపీకి అలవాటు లేదు. అమిత్ షా వంటి బీజేపీ పెద్దలు చేసే ప్రతిక్రియలు ప్రధానంగా సామాజిక సమీకరణాలకు సంబంధించినవి. జాట్ కులస్తులు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి, జాటేతరులందరినీ తమ వైపుకుతిప్పుకోవడం బీజేపీ చేసింది. అటువంటప్పుడు, కాంగ్రెస్ ఏమి చేయాలి? తన వెనుక సమీకృతమైన జాట్ బలానికి తోడు, ఇతరులలో నుంచి కూడా గణనీయంగా రాబట్టుకోవాలి. దళిత నాయకురాలు శెల్జాను ప్రచారం నుంచి ఆమడదూరం పెట్టి కాంగ్రెస్ ఏ ఐక్యతను ప్రదర్శించగలిగింది?


హర్యానాలో కూడా మతతత్వ వాతావరణం, దాన్ని మరింత ఉద్రిక్తం చేసిన సంఘటనల క్రమం ఉన్నది. కానీ, సాపేక్షంగాచూస్తే, బీజేపీ ఈ అసెంబ్లీ ఎన్నికలలో ఆ రాష్ట్రంలో మతవిభజనను పెద్దగా ఉపయోగించుకోలేదు. కాకపోతే, తన పార్టీ వేదికల మీద నుంచి పదే పదే నిరసించే కులవిభజనను మాత్రం బాగా ఉపయోగించుకుంది. కాబట్టి, జాతీయస్థాయిలో కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉన్న రాజకీయ సంవాదానికి హర్యానాలో ఆస్కారం లేకపోయింది. బీజేపీ ప్రతివ్యూహాన్ని అర్థం చేసుకోలేకపోవడం, సృజనాత్మకమైన పద్ధతులతో ప్రచారం నిర్వహించకపోవడం, సంప్రదాయ నాయకత్వాన్నే పూర్తిగా విశ్వసించడం కాంగ్రెస్‌ను దెబ్బతీశాయి. తన పునరుజ్జీవనంలో హర్యానా ఒక కీలకమయిన, ఆవశ్యకమైన మజిలీ అన్న స్పృహ కాంగ్రెస్ పెద్దలకు లేకపోవడం అన్నిటి కంటె ఎక్కువ చేటు చేసింది.

హర్యానాలో లాగానే, మహారాష్ట్రలో కూడా మొన్నటి లోక్‌సభ ఎన్నికలలో ప్రతిపక్షానిదే హవా. మహా వికాస్ అగాఢీ మెజారిటీ అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయం సాధించగా, అందులో కాంగ్రెస్ వాటా ఎక్కువ. ఇంకేముంది? తామే పెద్దన్నలమనుకుని, పొత్తులో మిత్రులకు అన్యాయం చేస్తే, పిట్టపోరు పిట్టపోరు పిల్లితీరుస్తుంది. హర్యానాలో స్థానిక అభివృద్ధి అంశాలే ఎన్నికలలో వినిపించాయి కానీ, మహారాష్ట్రలో మత ఉద్రిక్తతల పాత్ర చాలా ఉంటుంది. మహారాష్ట్ర ఎన్నికల పోరాటానికి సన్నాహకాలుగా, ప్రభావ ప్రేరకాలుగా ఆ రాష్ట్రంలోనూ, దేశవ్యాప్తంగానూ మత హింస జరగడాన్ని గమనించవచ్చు. మరో పక్క, మహాయుతి కూటమిలో కూడా నాయకత్వ పోటీ ఉన్నది. షిండేను తప్పించి, తమ వాడిని ముఖ్యమంత్రిని చేయాలని బీజేపీ ఆలోచన. లోక్‌సభ ఎన్నికలలో ఎదురుదెబ్బ దృష్టిలో పెట్టుకుని, నాయకత్వ సమస్యను ఎన్నికల తరువాతకి వాయిదా వేసింది. అగాఢీ కూడా అదే పనిచేయబోతోంది. బీజేపీ గనుక మహారాష్ట్రలో గట్టెక్కగలిగితే, ఆ పార్టీ మొన్నటి లోక్‌సభలో తగిలిన దెబ్బ నుంచి గణనీయంగా కోలుకున్నట్టే. అదే జరిగితే తన భవిష్యత్తేమిటో కాంగ్రెస్ ఊహించుకోవాలి.


అధికారంలో ఉన్నా లేకపోయినా, అంతః కలహాలు మాత్రం పుష్కలం. బరి గీసి నిలవవలసిన చోట, గురికి జానెడు దూరం ఆ పార్టీ ప్రస్తుత సరళి. విధాన విషయాలలో బీజేపీని అనుకరించే ధోరణి. పదేళ్ల ప్రవాసంలో పెరిగిన అలసత్వం.. తన బాధ్యతారాహిత్యానికి ఈవీఎం లనో, ఎంఐఎంనో నిందించడం, ఇన్ని జబ్బులు కాంగ్రెస్‌ను బాధిస్తున్నాయి. అసదుద్దీన్ ఒవైసీ వేసిన ప్రశ్న బాగుంది. ‘‘జమ్ములోను, హర్యానాలోను మేము పోటీ చేయలేదు కదా? అయినా కాంగ్రెస్ గెలవలేదేమి?’’

కె. శ్రీనివాస్

Updated Date - Oct 17 , 2024 | 02:29 AM