ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రచ్ఛన్న హస్తం కాదు, అది ప్రజల పిడికిలి!

ABN, Publish Date - Aug 08 , 2024 | 03:17 AM

బంగ్లాదేశ్ ఏర్పడిన రోజులు మసకగా అయినా గుర్తున్నవారికి, ఆ దేశపు అర్ధశతాబ్ది స్వతంత్ర ప్రయాణం విచారం కలిగిస్తుంది. బ్రిటిష్ వలసపాలన నాటినుంచి బెంగాల్ మీద ప్రయోగాలు...

బంగ్లాదేశ్ ఏర్పడిన రోజులు మసకగా అయినా గుర్తున్నవారికి, ఆ దేశపు అర్ధశతాబ్ది స్వతంత్ర ప్రయాణం విచారం కలిగిస్తుంది. బ్రిటిష్ వలసపాలన నాటినుంచి బెంగాల్ మీద ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. మొగ్గ తొడుగుతున్న జాతీయోద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి బెంగాల్‌ను చీల్చినప్పుడు తీవ్రంగా ప్రతిఘటించిన ప్రజలు, తరువాత దేశవిభజన సమయంలో తామే మతప్రాతిపదికగా వేరయ్యారు, నెత్తుటి వరదలుగా కలహించుకున్నారు. పాకిస్థాన్ దుష్పరిపాలన, వివక్షలతో విసిగిపోయిన తూర్పు పాకిస్థాన్ భాషా ప్రాతిపదికన తిరుగుబాటు చేసి బంగ్లాదేశ్ అయింది. ఆ పరిణామంలో భారత్ సైనికపాత్ర కీలకమయినది. అంతర్జాతీయ రాజకీయాలు ఆ సమయంలో ఉపఖండంలో మోహరించాయి. అవి ప్రాంతీయ, స్థానిక పరిణామాలైనా ప్రత్యక్ష పాత్రధారులతో పాటు, పరోక్ష సూత్రధారులు లేకుండా జరగలేవు.


అభ్యుదయ, లౌకికవాది అయిన ముజిబుర్ రెహ్మాన్ సారథ్యంలో బంగ్లాదేశ్ ముందుకు వెడుతుందనుకుంటే, దేశం ఏర్పడిన నాలుగేళ్లకే ఆయన సైన్యం చేతిలో హత్యకు గురి అయ్యారు. నాటి నుంచి సైనిక పాలనలు, హత్యలు, అడపాదడపా ఎన్నికలు, తిరిగి కూల్చివేతలతో సంక్షోభంలోనే బంగ్లాదేశ్‌ ప్రయాణిస్తూ వచ్చింది. వీటన్నిటి మధ్యనే అనేక తరాల ప్రజలు జీవనం సాగించారు, కొంత పురోగతి పొందారు, అప్పుడప్పుడు నిస్పృహ చెందారు, పోరాడారు, అణచివేతలు ఎదుర్కొన్నారు. తాజాగా ఇప్పుడు అక్కడ జరిగిన పరిణామంలో, మొదటిసారిగా, జనసామాన్యం తమ గొంతు బలంగా వినిపించే, తమ అభీష్టాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేసింది. క్రూరమైన నియంతృత్వాన్ని చెలాయించి, బతుకుజీవుడా అంటూ భారత్‌కు పారిపోయిన షేక్ హసీనా, బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు, బంగబంధు ముజిబుర్ రెహమాన్ కుమార్తె కావడం విషాదం. ఈమె సమకూర్చుకున్న అప్రదిష్ట, తండ్రి స్మారకాల మీద కూడా దాడులకు కారణమయింది.

పొరుగింటికి నిప్పు అంటుకున్నప్పుడు, అందులోని మనుషులకు ఏమి జరిగిందో అన్న ఆవేదనతో పాటు, అది తమ ఇంటిని కూడా కాలుస్తుందేమోనన్న భయం కూడా ఇరుగింటివారికి కలుగుతుంది. బంగ్లాదేశ్ పరిణామాల విషయంలో భారత్ కలవరానికి అర్థం ఉంది. హింసా విధ్వంసాలు ఎటు మలుపు తిరుగుతాయో, ఆ దేశంలో మైనారిటీల మీద దాడులు జరుగుతాయో, ఫలితంగా దేశంలోకి శరణార్థులు వెల్లువలా వచ్చిపడతారేమో, అన్న ఆందోళనలు కలగడంలో ఆశ్చర్యం లేదు. ఇక, దక్షిణాసియా, గ్లోబల్ రాజకీయాల నేపథ్యంలో అర్థం చేసుకోవలసిన అంశాలు మరికొన్ని ఉన్నాయి. షేక్ హసీనా భారత్‌తో స్నేహసంబంధాలలో ఉండేవారు. ఆమె చిరకాల ప్రత్యర్థి ఖలీదా జియా భారత్ వ్యతిరేక ధోరణిలో ఉండేవారు. ఈశాన్య భారతంలోని తిరుగుబాటు దారులకు ఖలీదా ఆశ్రయం ఇచ్చి ప్రోత్సహించేవారు. పాకిస్థాన్, చైనా, అమెరికాలతో స్నేహంగా ఉండేవారు. మిలిటెంట్ ఇస్లామ్ వాదం ప్రభావం బంగ్లాదేశ్ మీద కూడా పడింది. ఆ వైపు నుంచి కూడా భారతదేశానికి సమస్య ఏర్పడింది. మిలిటెంట్లను హసీనా అదుపు చేసినంతగా, ఖలీదా చేయలేదు.


బలహీనంగా ఉన్న బంగ్లాదేశ్‌ను తమ అదుపులోకి తెచ్చుకోవడానికి చైనా చిరకాలంగా ప్రయత్నిస్తోంది. తానే బలహీనపడిపోయి ఉన్న పాకిస్థాన్ ఇంకా పాత పరాభవాన్ని మరచిపోలేక, సైన్యం ద్వారా, కొన్ని రాజకీయ మత సంస్థల ద్వారా తన ప్రభావాన్ని వేస్తోంది. చైనా, పాక్ ఈ విషయంలో పరస్పరం సహకరించుకుంటున్నాయని భారత్ భావిస్తోంది. సుదూరాన ఉన్న అమెరికాకు, దక్షిణాసియా ఎంతో కీలకమయిన ప్రాంతం. చైనాను అదుపు చేసే స్నేహాల కోసం, స్థావరాల కోసం వెదుకుతూ వస్తోంది. తమ సైనిక కేంద్రం పెడతామని అమెరికా అడిగిందని, అందుకు తాను అంగీకరించలేదని హసీనా ఈ మధ్య అన్నారు. చైనాను బలహీనపరచాలనే అమెరికా ప్రాజెక్టులో చేతులు కలపడానికి ఉత్సాహపడుతున్నప్పటికీ, ఉపఖండ భూభాగం మీద అమెరికాకు చోటు ఇచ్చే ప్రతిపాదనకు మాత్రం భారత్ అంగీకరించదు.

మరి బంగ్లాదేశ్ విషయంలో భారత్ ఏమి కోరుకుంటోంది? అక్కడి ప్రజలకు రుచించని సాహస నిర్ణయాలేవీ తీసుకోవాలనుకోదు. హసీనాకు తాత్కాలిక ప్రాతిపదికన ఆశ్రయం ఇచ్చాము కానీ, ఆమెను ఇక్కడే కొనసాగించే ఉద్దేశం లేదని భారత విదేశాంగ మంత్రి సూచిస్తూనే ఉన్నారు. అక్కడి పరిస్థితులు చక్కబడాలని కోరుకోవడంతో పాటు, కొత్తగా ఏర్పడే తాత్కాలిక ప్రభుత్వంలో భారత వ్యతిరేక శక్తులది పైచేయి కాగూడదని ఆశిస్తోంది, బహుశా అందుకు ప్రయత్నం కూడా చేస్తూ ఉండవచ్చు. ఇక్కడ భారత వ్యతిరేక శక్తులంటే, జమాతే ఇస్లామీ, ఖలీదాజియా నాయకత్వంలోని బిఎన్‌పి, అక్కడి సైన్యంలోని చైనా, పాకిస్థాన్ అనుకూల అధికారులు!


బంగ్లాదేశ్ పరిణామాలను భారత ప్రభుత్వ విదేశాంగ దృక్పథం నుంచి మాత్రమే అర్థం చేసుకోవడం సరి అయినదేనా? ఒక ప్రజావ్యతిరేక పాలన మీద అపూర్వమైన తిరుగుబాటుగా గుర్తించడంలో సంకోచం ఎందుకు? భారతీయ మీడియా, ముఖ్యంగా అధికార పీఠాల ఆలింగనంలో ఉన్నదనుకుంటున్న జాతీయ ఆంగ్ల, హిందీ మీడియా, ఎందుకు బంగ్లా పరిణామాలలో కొంత కుట్రకోణాన్ని, కొంత టెర్రరిజాన్ని, మరికొంత హిందూ వ్యతిరేకతను మాత్రమే చూస్తున్నది? రాజకీయకారణాలతోనే తిరుగుబాటు జరిగినా, బంగ్లాదేశ్‌లో కల్లోలం అక్కడి మైనారిటీలలో ఎంతో కొంత భయాందోళనలను కలిగించింది. పెద్దసంఖ్యలో ప్రజలు, ఒక సంస్థాగత నిర్మాణంలో కాకుండా, యథేచ్ఛగా ఆందోళనలకు దిగినప్పుడు, విద్యార్థులు, ప్రవాస బంగ్లాదేశీయులు మాత్రమే కాక, విస్తృత ప్రజాశ్రేణులు అందులో భాగం అయినప్పుడు, అక్కడక్కడ అరాచకం, హింసాధోరణి కనిపించడం సహజం! ప్రతిఘటించలేక చతికిలపడిన పాత ప్రతిపక్షం కూడా ప్రజల ఉద్యమానికి మద్దతు ఇచ్చింది. ప్రస్తుత సందర్భంలో హసీనా పార్టీ ‘అవామీలీగ్’ కార్యాలయాల మీద, కార్యకర్తల వ్యాపారాల మీద దాడులు ఎక్కువగా జరిగాయి. దహనకాండలో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు కూడా. కానీ, ఆ దేశంలో జరిగిన పరిణామాల తీవ్రతను దృష్టిలో పెట్టుకుంటే, ప్రాణనష్టం తక్కువేనని చెప్పాలి. హిందూ మైనారిటీల ఆస్తులపై, దైవస్థలాలపై జరిగిన దాడులు కూడా తొందరలోనే తగ్గుముఖం పట్టాయి. అవామీలీగ్ కార్యకర్తలుగా, నాయకులుగా ఉన్న హిందువులు రాజకీయ కారణాల వల్లే లక్ష్యంగా మారారు. హింసను విరమించుకోవాలని ఉద్యమనాయకులు, వివిధ రాజకీయనేతలు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. హసీనా వ్యతిరేక పోరాటంలో ముందుభాగాన ఉన్న విద్యార్థి నాయకులు, సైనిక పాలనకు తాము వ్యతిరేకమని, విశ్వసనీయత ఉన్న ప్రజారంగ వ్యక్తి ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరడం విశేషం. వారు కోరినట్టుగానే నోబెల్ బహుమతి గ్రహీత, సూక్ష్మపొదుపు ఉద్యమాన్ని నిర్వహించిన మహమ్మద్ యూనస్ బంగ్లా ప్రభుత్వ బాధ్యతలు చేపట్టబోతున్నారు. హసీనా ప్రభుత్వం వల్ల తీవ్రమైన వేధింపులను ఎదుర్కొన్న యూనస్ పశ్చిమదేశాలకు అనుకూలుడని చెబుతారు. భారత్‌తో సత్సంబంధాలు ఎంతటి కీలకమైనవో యూనస్‌కు తెలుసును కాబట్టి, ఆయన వైఖరి సానుకూలంగా ఉండవచ్చునని భారత్ ఆశిస్తోంది.

భారత్‌తో స్నేహంగా ఉండడంతో పాటు, షేక్ హసీనా హయాం లౌకిక విధానాలతో కొనసాగింది. మత ఉద్రిక్తతలు చాలా తక్కువ. వస్త్ర పరిశ్రమకు ప్రపంచంలో మార్కెట్‌ను విస్తరింపజేసి, దేశంలో ఉపాధిని పెంచారు. దీర్ఘకాలం ‘సుస్థిరత’ కొనసాగింది. ఇవన్నీ నిజమే కావచ్చు. కానీ, 17 కోట్ల జనాభాలో 3 కోట్లమంది నిరుద్యోగులు. బంగ్లాదేశ్ కరెన్సీ ‘టాకా’ విలువ 28 శాతం తగ్గింది. మూడేళ్లలో విదేశీమారక నిల్వలు 44 శాతం తగ్గాయి. 2021లో 5.51 శాతం ఉన్న ద్రవ్యోల్బణం 2024లో 9.73 శాతానికి చేరింది. వీటన్నిటి ప్రతిఫలనాలు జనజీవనంలో వ్యక్తమయ్యాయి. ప్రజలు తమ అవసరాలను, అసమ్మతిని చెప్పుకోవడానికి ఆస్కారం లేకుండా పోయింది. ప్రతిపక్షం అణగారిపోయింది.


నిర్బంధం తారస్థాయికి చేరింది. అక్రమనిర్బంధాలు, చట్టవ్యతిరేక కాల్చివేతలు ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి. తమ అసహనానికి ప్రాతినిధ్యం వహించే రాజకీయ శక్తే లేకపోయిన ప్రజలు తామే వీధుల్లోకి వచ్చారు. ఇందుకు ఏ కుట్రా, ప్రచ్ఛన్నహస్తమూ అవసరం లేదు. హసీనా, బంగ్లా పాలకవర్గాలూ చేజేతులా తెచ్చుకున్న దుస్థితే ఇది. భారత ప్రతిపక్షాలు బుధవారం నాడు పార్లమెంటులో బంగ్లా పరిణామాలు ఇస్తున్న రాజకీయ సందేశాన్ని వక్కాణించాయి. భారతదేశంలోని రాజకీయార్థిక పరిస్థితులను బంగ్లా పరిణామాలతో పోల్చారు. పైపైన అంతా బాగానే కనిపిస్తున్నా, లోలోపల ముదురుతున్న సంక్షోభాన్ని గుర్తించకపోతే, భారత ప్రభుత్వానికి కూడా ముప్పు తప్పదన్నట్టు వారు హెచ్చరించారు. మరి ఎందుకు, ఘనత వహించిన ప్రసార, సమాచార సాధనాలు, బంగ్లాదేశ్‌లో జరుగుతున్నదంతా భారత్‌కు వ్యతిరేకంగానే అన్నట్టుగా, హసీనా అపరాధం ఏమీ లేనట్టుగా చిత్రిస్తున్నాయి? ఇస్లామిస్టు అరాచకశక్తుల ఇష్టారాజ్యం నడుస్తోందని, హిందువుల మీద హత్యాకాండ జరుగుతోందని ఇంటెలిజెన్స్ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ చానెళ్లు ఎందుకు ప్రసారాలు చేస్తూ భయపెడుతున్నాయో తెలియడంలేదు.

యూనస్ చేతికి ప్రభుత్వం వచ్చినంత మాత్రాన, మంత్రం వేసినట్టు పరిస్థితి మారిపోదు. రేపటికి పరిస్థితులు మారి, విచ్ఛిన్న శక్తులు దేశాన్ని అతలాకుతలం చేసే హింసకు పాల్పడవచ్చు, చెప్పలేము. కానీ, ఇప్పటికి అయితే, బంగ్లాదేశ్‌లో చాలా వేగంగా పరిస్థితులు కుదురుకుంటున్నాయి. గురువారం నాడు తాత్కాలిక ప్రభుత్వం ప్రమాణం తరువాత, శాంతిభద్రతలు సాపేక్షంగా మెరుగుపడే ఒక వాతావరణం ఏర్పడుతుంది. మౌలిక జీవన పరిస్థితులు మెరుగుపడితే తప్ప, అశాంతి తగ్గదు. ఆ దిశగా ప్రయాణం మొదలయిందని ఒక సూచన వ్యక్తమైతే ప్రజలు సహనంతో ఎదురుచూస్తారు.


తమ బెంగాలీ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి పాకిస్థాన్‌తో తెగదెంపులు చేసుకున్నవారు బంగ్లాదేశీయులు. వారి జాతీయ గీతం ‘అమర్ సోనార్ బంగ్లా’ కర్త రవీంద్రనాథ్ ఠాగోర్. హసీనాకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఆందోళనకారులకు ప్రేరణ, ఉత్సాహం ఇచ్చిన పద్యం ద్విజేంద్రలాల్ రాయ్ 20వ శతాబ్ది తొలిసంవత్సరాలలో రాసిన ‘‘ధనో ధాన్యో పుష్పో భరా’’ అన్న బెంగాలీ గీతం. ‘‘ధనధాన్యాలతో, పుష్పాలతో నిండిన మాతృభూమీ, స్వప్నాలలో పుట్టి, స్మృతులతో నిండిన తల్లీ, నీవంటి నేల ఇంకెక్కడన్నా ఉందా; నా మాతృభూమీ, రాజ్యాలన్నిటికీ రాణీ’’.. అంటూ కీర్తించే ఈ పాటలో మాతృదేశం ఆనాటి ఉమ్మడి భారతదేశం. ఇప్పుడు బంగ్లాదేశ్‌ను ఉద్దేశించి కూడా అక్కడి పోరాటవాదులు అదే పాడుకుంటున్నారు. భాషతో, నేలతో ముడిపడిన ఆ మమకారాన్ని బంగ్లాదేశ్ కొనసాగించి తీరుతుంది!

కె. శ్రీనివాస్

Updated Date - Aug 08 , 2024 | 03:17 AM

Advertising
Advertising
<