ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

గ్రహిస్తారు, అనుగ్రహిస్తారు, ఆగ్రహిస్తారు

ABN, Publish Date - May 09 , 2024 | 06:08 AM

మేరేరామ్ అన్న నాటకం చూశాను. అందులో రావణుడు చనిపోతూ అన్న ఈ మాటలు కదిలించాయి. ‘‘నా పతనానికి కారణం ఏమిటంటే, నాకు నా జ్ఞానం గురించి అహంకారం ఉంది. రాముడికేమో అహంకారానికి సంబంధించిన జ్ఞానం ఉంది...’’.

మేరేరామ్ అన్న నాటకం చూశాను. అందులో రావణుడు చనిపోతూ అన్న ఈ మాటలు కదిలించాయి. ‘‘నా పతనానికి కారణం ఏమిటంటే, నాకు నా జ్ఞానం గురించి అహంకారం ఉంది. రాముడికేమో అహంకారానికి సంబంధించిన జ్ఞానం ఉంది...’’. ఈ విషయం అర్థంచేసుకుని మనం మన పనితీరులో మార్పు చేసుకుంటేనే ఉపయోగం. జై భారత్... ఇది జీగ్రూప్ అధినేత సుభాష్ చంద్ర ఈ మధ్య చేసిన ట్వీట్. అంతకు ముందు రోజే ఆయన పత్రికాస్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో స్వతంత్ర పత్రికారంగానికి ఉన్న శక్తిని స్మరించుకున్నారు.

ఈ మధ్య భారతదేశంలో కొన్ని అనూహ్యమైన ఆశ్చర్యాలు కూడా ఎదురవుతున్నాయి. ఈ సుభాష్ చంద్ర, జీటీవీ ఛానెళ్ల మీడియా సంస్థ ఎస్సెల్ గ్రూప్ అధినేత. గోదీ మీడియా అని విమర్శకులు పిలిచే మోదీ సన్నిహిత మీడియాలో ఈ జీటీవీ ది ప్రధానపాత్ర. బీజేపీ సహాయంతో రాజ్యసభకు ఒకసారి సుభాష్ చంద్ర ఎన్నికయ్యారు కూడా. ఇంతకూ ఆయన తన ఇటీవలి ట్వీట్‌లో చెప్పిన రావణాసురుడు ఎవరు? అహంకారం ఎవరిది? జీ మీడియా కార్పొరేషన్ సీఈవో అభయ్ ఓఝాతో సహా కొందరు ముఖ్యుల నిష్క్రమణ, ప్రభుత్వ అనుకూల విధానాన్ని విరమించుకుంటున్నందువల్లనే అని వినిపిస్తున్న వార్తల నేపథ్యంలో, సుభాష్ చంద్రకు పత్రికాస్వేచ్ఛ గుర్తు వచ్చిందా? లేదా, దేశంలో గాలి మళ్లుతున్నదని ముందుగానే గ్రహించి, ఎన్నికల ప్రక్రియ మధ్యలోనే అధికార శిబిరానికి వీడ్కోలు చెప్పారా? వార్తాప్రసారకులలోనే కాదు, వీక్షకులలో కూడా మార్పు వచ్చిందని, ప్రభుత్వంపై విమర్శలకు కూడా కోట్లాది వీక్షణలు దొరుకుతున్నాయని ధ్రువ్ రాఠీ, రవీశ్ కుమార్ వంటి వారి విజృంభణ తెలియజేస్తోంది. అయితే, స్వేచ్ఛా భాషణ పెరిగినంత మాత్రాన, పెను రాజకీయమార్పులు జరుగుతాయని అనుకోనక్కరలేదు.


అహంకారపు వేడి అస్మదీయులకు కూడా సోకి, అంతిమంగా అధికార మార్పిడికే కారణమయిన అనుభవం తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. కేసీఆర్ ప్రభుత్వం మీద సవాలక్ష ఫిర్యాదులు ఉండవచ్చు, క్షేత్రస్థాయిలో అభివృద్ధి సమస్యలు అనేకం ఉండి ఉండవచ్చు కానీ, వాటన్నిటికి ఎగువన, ప్రజల అభిమతాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన అంశం మాత్రం ‘అహంకారమే’. కేసీఆర్ వ్యవహార సరళిలోని ఆభిజాత్యం, అధికారస్వరం మొన్నటి ఎన్నికల నాటికి ప్రజలు భరించలేని స్థాయికి చేరుకున్నాయి. మరి నరేంద్రమోదీ తీరులో కూడా పతనానికి దారితీసే అవలక్షణం కనిపిస్తున్నదని సుభాష్ చంద్ర చెబుతున్నారా? ప్రజల ఎంపికల మీద నిజంగా ఇటువంటి వ్యక్తిత్వ అంశాలు ప్రభావం వేస్తాయా? అసలు ఎన్నికల తీర్పు వెనుక ఉండే చలనసూత్రాలు, తర్కం ఏమిటి?


రాజకీయవాదులు ప్రజలను ఆకర్షించడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. వాటిలో ముఖ్యమైనది, అభినయం. తమ స్వభావాలు, అభిప్రాయాలు ఎటువంటివైనా ప్రజల ముందుకు వెళ్లినప్పుడు, ముఖ్యంగా ఎన్నికల వేళ, గౌరవంగా, ప్రేమగా, సానుభూతిగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. చనువుగా ఉండడానికి చూస్తారు. అధికారంలోకి వచ్చాక కూడా, ఆ నటనను కొనసాగించాలనే అనుకుంటారు కానీ, క్రమంగా స్వభావానిదీ, పదవుల దర్పానిదీ పైచేయి అవుతుంది. స్వరం మారుతుంది. జనాన్ని విదిలించి దూరం పెడతారు. ప్రజలకు కూడా ఇది తెలుసు. కొంతవరకు అర్థం చేసుకుని, సహిస్తారు. అది ఒక నిర్ణయంగా మారడానికి సమయం పడుతుంది. తాము గమనిస్తున్న ప్రతికూల అంశం ఒక నిష్పత్తి దాటిన తరువాత, జనం ఇక లెక్కపెట్టుకోవడం మొదలుపెడతారు. అవకాశం వచ్చినప్పుడు తమ చేతిలో ఉన్న ఆయుధాన్ని ఉపయోగించుకుంటారు. పూర్తి అక్షరాస్యత ఉండి, రాజకీయచైతన్యం అధికంగా ఉండే పశ్చిమదేశాలలో సైతం అన్నీ తెలిసి ఓటు చేయగలిగే వివేకం లేదు. ఇక, భారత్ వంటి ఎదుగుతున్న దేశంలో, పూర్తి అవగాహనతో, విచక్షణతో ఓటుచేయగలిగే పరిస్థితి ఎక్కడ? అందుకని, సులభ సంకేతాల నుంచే ప్రజల సమ్మతి కానీ, అసమ్మతి కానీ రూపొందుతుంది. మనసు పడడమో, మనసు విరగడమో!


అయితే, ఓటు ఆయుధానికి పెద్ద పదును లేదు. ఒకరిని తీసి మరొకరిని ఎక్కించడానికి తప్ప ఓటరుకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. ముప్పాతిక సంవత్సరాల భారత ప్రజాస్వామ్యంలో చాలా గొప్పగా సాధించామని ప్రశంసకులు అంటుంటారు. సాధించింది శూన్యమని విమర్శకులూ అంటారు. ప్రజలు తమ అభిమతాన్ని ఎన్నికలలో స్వేచ్ఛగా వ్యక్తం చేసే పరిస్థితులు లేవని, అధికారం ఇమ్మని జనం ముందుకు వచ్చే అభ్యర్థుల మధ్య, పార్టీల మధ్య పెద్ద వ్యత్యాసమే లేదని, చట్టసభల ద్వారా కాక, వీధుల్లోనే ప్రజలు ఎక్కువ పోరాటాలు చేసి సాధించుకున్నారని రాజకీయ చరిత్రకారులు చెబుతుంటారు. ప్రజలను మభ్యపెట్టి, భయపెట్టి, గందరగోళపరచి, ప్రలోభపరచి జరిగే ఎన్నికల ప్రచారం ఏ విధంగా అవగాహనాయుత ఓటింగ్ సాధిస్తుందన్న ప్రశ్న సహేతుకమైనదే. ప్రజల తరఫున పనిచేయవలసిన ప్రజాప్రతినిధులు సామాజిక వనరులను, సంపదను ప్రైవేటు లాభార్జనాపరులకు కట్టబెట్టే కమిషన్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారన్నది కూడా చాలావరకు నిజమే. అట్లాగని, ఇంతకాలంగా జరుగుతూ వచ్చిన ఎన్నికలలోని ప్రజల తీర్పుల్లో ఒక క్రమంకానీ, అంతస్సూత్రం కానీ, మార్పు కానీ లేదని అనగలమా? భారతదేశంలోని వివిధ ప్రజావర్గాలు అవకాశాలకు, అధికారానికి దగ్గర కాలేదని చెప్పగలమా? ప్రాంతాలు, లింగ, కుల తదితర సామాజికవర్గాలు తమ సాధికారతాస్థలాన్ని విస్తరించుకోవడాన్ని విస్మరించగలమా? అదే సమయంలో, పారిశ్రామిక, కార్పొరేట్ సంపన్నులు, భూస్వామ్యవర్గాలు తమ తమ ప్రయోజనాలను రక్షించుకోవడానికి, తమ ఆస్తులను ఇబ్బడి ముబ్బడిగా పెంచుకోవడానికి, ఆర్థిక అంతరాలను అగాధాలుగా మార్చడానికి ఆయా ప్రభుత్వాలే ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణమని చెప్పకుండా ఉండగలమా?


ప్రజల అభిమతాన్ని సాధించడానికి చేసే రకరకాల విన్యాసాలు, ఆ సమ్మతి పొందిన తరువాత పొందిన అధికారంతో చేసే దాష్టీకాలూ భారత ప్రజాస్వామ్య చరిత్ర పొడవునా చూడవచ్చు. అయితే, ప్రజలు ఈ క్రమంలో కేవలం మభ్యపడేవారిగాను, మాయకు లోబడేవాళ్లుగాను లేరు. వారు కూడా పరిస్థితులను ఓట్ల ద్వారానో, ఉద్యమాల ద్వారానో మారుస్తూ వచ్చారు. చాయిస్ లేకపోవడం వల్లా, తీవ్ర ఉద్వేగాల ప్రభావం వల్లా ప్రజలు కొన్ని సందర్భాలలో గాలివాటంలో కొట్టుకుపోయిన మాట నిజమే. అందుకు కూడా కొన్ని నిగూఢ రాజకీయార్థిక, ఉద్వేగ కారణాలు ఉండవచ్చు. కానీ, ఎక్కువ కాలం అహంకారాన్ని, ఉన్మాద రాజకీయాలను భారత ప్రజలు సహించిన ఉదాహరణలు లేవు. 1970 దశకం మొదట్లో విజయేందిరగా జయజయధ్వానాలు అందుకున్న ఇందిర, అయిదేళ్లు గడిచేసరికి నియంతగా నిలబడ్డారు, మరో రెండేళ్లకు ఘోరపరాజయం పొందారు. కలహాల జనతా పాలన తిరిగి ఇందిరకే దారి ఇచ్చింది. కార్గిల్ నేపథ్యంలో అవతరించిన మొదటి ఎన్డీయే ప్రభుత్వం, ఐదేళ్లకే దేశం మెరిసిపోతున్నదన్న ఆభాస నినాదంతో పరాజయం పాలయింది. రాజీవ్ ప్రభంజనాన్ని ఎదుర్కొని ఘనవిజయం సాధించిన ఎన్టీయార్ తరువాతి దఫాకు ఘోరంగా ఓడిపోయారు. తరువాత అధికారం పొందిన కాంగ్రెస్ ఏడాదికో ముఖ్యమంత్రిని మార్చి, సకల రంగాలలో విధ్వంసపాలన అమలుజరిపి, తిరిగి జనం అదే ఎన్టీయార్‌కు ఘనవిజయం ఇచ్చేట్టు చేసింది.

వ్యవసాయానికి, గ్రామీణరంగాలకు వ్యతిరేకమన్న ముద్ర 2004లో చంద్రబాబుకు ప్రతికూలంగా పనిచేసింది. కానీ, నగరాభివృద్ధిలోను, పాలనలోను ఉన్న అనుభవం కారణంగా విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనను మొదటి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఒక అవకాశం ఇద్దామని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన అవకాశం దుష్పరిపాలనకు దారితీయడంతో, ఇప్పుడు తిరిగి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు వేటు వేసి తీరతారన్న వాతావరణం వ్యాపించి ఉంది. ఈ అన్ని సన్నివేశాలలోనూ, ప్రజలు ఏదో ఒక అనుకూలతను లేదా ప్రతికూల అంశాన్ని పూర్తి అనుభవ జ్ఞానంతో లేదా సహజాత శక్తితో గ్రహించారు. పత్రికల్లోనూ టీవీచర్చల్లోనూ సిద్ధాంత చర్చల్లోనూ వినిపించే విశ్లేషణలతో, రాజకీయ కథనాలతో వారికి పెద్దగా నిమిత్తం ఉండదు. తాము కనెక్ట్ అయ్యే ఒక సంకేతం వారికి అందితే చాలు. ఉష్ణోగ్రతో శీతలత్వమో వారికి తాకితే చాలు. అట్లాగని, ప్రజాపక్ష మేధావులు, ఉద్యమకారులు కల్పించే భావ వాతావరణం అవసరం లేదని కాదు. ప్రజల గ్రహింపును అది ఉద్దీపింపజేస్తుంది. ఆ పౌరసమాజం తమ ఆలోచనలతో చర్చలతో కల్పించే వాదనా, సాధారణ ప్రజ గ్రహించే సంకేతమూ ఒకటే అయినప్పుడు, వాటి ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. ఎన్నికల సందర్భంలో అయితే, అది ప్రభంజన ఫలితంగా ఉంటుంది.


2014 నుంచి రెండు దఫాలు నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రాథమికంగా ప్రజలు కనెక్ట్ అయిన సంకేతాలే కారణం. యూపీఏ ప్రభుత్వం అవినీతో, విధాన వైకల్యమో, బీజేపీ అచ్ఛేదిన్ వాగ్దానమో ఏదో మొగ్గును సృష్టించింది. 2019లో తీవ్ర జాతీయభావాల దగ్గర నుంచి మతభావోద్వేగాల దాకా ప్రజల మనస్సులను ఆవరించాయి. ప్రతిపక్షం అత్యంత బలహీనంగా ఉండడం మరో కారణం. సాధించినవాటిని గొప్పగా చెప్పుకోవడం కంటె, బలహీనంగా కనిపిస్తున్న ప్రత్యర్థి విధానాంశాలే ప్రస్తుత ఎన్నికల్లో ఎందుకు చర్చలో ఉంటున్నాయి? రాముడికి ఉన్న అహంకార జ్ఞానం రామప్రతినిధులమని చెప్పే రాజకీయవాదులకు ఉండడం లేదా? సుభాష్ చంద్ర ‘అహంకారం’ అని గుర్తించినదాన్ని, సాధారణ ప్రజలు నియంతృత్వంగానో, పరమాధికారంగానో గుర్తిస్తున్నారా? 2024లో ఓటర్లకు అందవలసిన సంకేతం అందిందా?

కె. శ్రీనివాస్

Updated Date - May 09 , 2024 | 06:08 AM

Advertising
Advertising