ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కూలుస్తున్నారు సరే, ఏ విలువను నిలబెడతారు?

ABN, Publish Date - Aug 29 , 2024 | 03:26 AM

మహారణ్యం కూడా నిశ్శబ్దంగా, అదృశ్యంగా ఎదుగుతుంది, కానీ, కూలిపోయేటప్పుడు ఒంటరి చెట్టు కూడా పెద్ద చప్పుడు చేస్తుంది.... ఎవరిదో ఏనాటిదో ఒక సుభాషితం ఇది. దీని ఉదాత్త అర్థమేదైనా, నిర్మాణం మితభాషి అని...

మహారణ్యం కూడా నిశ్శబ్దంగా, అదృశ్యంగా ఎదుగుతుంది, కానీ, కూలిపోయేటప్పుడు ఒంటరి చెట్టు కూడా పెద్ద చప్పుడు చేస్తుంది.... ఎవరిదో ఏనాటిదో ఒక సుభాషితం ఇది. దీని ఉదాత్త అర్థమేదైనా, నిర్మాణం మితభాషి అని, విధ్వంసంలో ఒక హడావిడి ఉన్నదని మాత్రం తెలుస్తోంది.

కూలడమైనా, కూల్చడమైనా ఒక ఘటన.

కనిపించే, వినిపించే ఒక చర్య.

కూల్చివేత ఒక దృశ్యం.

రాజకీయాలకు దృశ్యాలు చాలా అవసరం. ఈ సత్యం యోగి ఆదిత్యనాథ్‌కు తెలుసు. బుల్‌డోజర్‌ను చక్రాలు తొడిగిన ‘తక్షణ’ న్యాయదేవతగా ఆయన ముస్తాబు చేశాడు. దానికింద నలిగినవాళ్లకు అది రాకాసి పార కావచ్చును కానీ, ప్రేక్షక మాత్రులకు మాత్రం అది పనిచేస్తూ కనిపించే ప్రభుత్వం. జనం తరఫున తానే లించింగ్ చేసే అధికారిక యంత్రం.

దశాబ్దం కిందట కేసిఆర్ కూడా ఎన్ కన్వెన్షన్ దగ్గర హడావిడి చేశారు. అయ్యప్ప సొసైటీ ఆక్రమణల గురించీ మాట్లాడారు! హైడ్రా కాదు కదా అమీబా కూడా ఆయన ఏర్పాటు చేయలేదు! తడిసిపోయిన టపాకాయ లాగా ఆ ఘట్టం పెద్దగా పేలలేదు! దృ‍శ్యాల అవసరం ఆయనకు లేకపోయిందేమో?


బీజేపీ నుంచి కూడా నేర్చుకోగలిగిన చాకచక్యం ఉన్న రేవంత్‌రెడ్డికి, ఈ దృశ్య రహస్యం తెలిసిపోయింది. యోగికి తట్టిందో లేదో కానీ, కూల్చివేతల వెనుక అదనంగా గీతారహస్యం కూడా రేవంత్‌కు తెలిసివచ్చింది. బుల్‌డోజర్‌కు భగవద్గీత కూడా తోడైతే, ‘దేశం కోసం ధర్మం కోసం’ చాలా చేయొచ్చు! ఏకంగా కూల్చివేతలకు ఒక సంస్థనే పెట్టొచ్చు, దానికో చట్టమూ చేయవచ్చు!

లోకంలో అక్రమంగా కట్టినవి అనేకం కూల్చవలసినవి ఉంటాయి. తలెగరేసి నిలబడవలసినవి అనేకం కూలిపోతూ ఉంటాయి. ఎవరు ఏ పార్టీకి, ఏ నాయకుడికి జైజైలు కొట్టినా, నియమాలు, చట్టాలు అందరికీ ఒకేలాగ వర్తించవని, అట్లా వర్తించకుండా చూడడానికే ప్రభుత్వాలు, వ్యవస్థలు, నిపుణులు, ప్రతిభావంతులు పనిచేస్తూ ఉంటారని అందరికీ తెలుసు. చిన్న చిన్న తప్పులకు ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గేవారు, పూచీకత్తు కట్టలేక బెయిళ్లు పొందలేనివాళ్లు వేలాదిమంది ఉంటారు. పెద్ద పెద్ద తప్పులుచేసి దర్జాగా బయటిప్రపంచంలో తిరిగేవాళ్లు, పరాయిదేశానికి రెక్కలు తొడుక్కున్నవాళ్లు వార్తల్లో పెద్దమనుషులుగా కనిపిస్తారు. ఇదంతా సహజమని, ఈ అంతస్థుల న్యాయం, బలవంతుడి ధర్మం అచంచలమైనవని అనిపిస్తున్నప్పుడు, ఎప్పుడైనా ఒక్కసారి సంపన్నుడి జేబుకు కన్నం, పెత్తందారుకు బెత్తపు దెబ్బ తగిలినప్పుడు, పేదలకు ఉచితంగా ఒక చక్కిలిగిలి, ఒక ఊరట దక్కుతాయి. అధికారం తమ తరఫునే పనిచేస్తున్నదన్న తృప్తి ప్రాప్తిస్తుంది. ఆ న్యాయం తమ కళ్లెదుటే దృశ్యమానం అయినప్పుడు, ఆ సంతోషమే వేరు!


‘హైడ్రా’ సాహసదాడుల ద్వారా రేవంత్‌రెడ్డి ప్రజలకు అమందానందాన్ని కలిగించబోయారు! కొంతవరకు విజయం సాధించారు కూడా! డబ్బూ హోదా బాగా ఉన్న సంఘబలిష్ఠుల తప్పు రట్టయిందని, వారిని కూడా చట్టం గట్టిగా కొట్టిందని చూసి, విని, తెలుసుకుని, ఒంటికాలిమీద అయినా ఇంకా న్యాయం మిగిలుందని జనానికి నమ్మకం కలిగింది. ఆ ఉత్సాహంలో తబ్బిబ్బు అయిపోయి, ఈ దశ చిరకాలం కొనసాగుతుందని వారమో నెలో రెన్నెల్లో ఆశల్లో తేలియాడే అవకాశం దొరికింది. కలగవలసిన వారికి భయమూ కలిగింది! ఒక్కోసారి, ఇటువంటి మెరుపుకలలు లేకపోతే, ఈ లోకంలో బతకడం కష్టం!

ఈ కూల్చివేతల వల్ల, రెండు మూడు అదనపు ఫలితాలు కూడా దక్కినయి. ఒకటి, రేవంత్‌రెడ్డికి కొంత ఊరట దొరికింది. ప్రజల దృష్టి మరల్చడానికే ఈ ‘హైడ్రా’ అధ్యాయం అవతరించిందని ప్రతిపక్షాలు అంటున్నాయి కానీ, అందుకోసమే ఇదంతా అంటే సరికాదు. దానివల్ల ఈ ఫలితం కూడా సమకూరింది అనడం నిజానికి దగ్గరగా ఉంటుంది. ఒక్కసారిగా, రుణమాఫీలు, రుణబంధులు, ఇతర ఎన్నికల వాగ్దానాలు వెనక్కుపోయాయి. తెలంగాణతల్లి వర్సెస్ రాజీవ్‌గాంధీ వివాదం పక్కకు వెళ్లింది. రేవంత్‌రెడ్డి పాలనలో సతమతమవుతున్నారు, తన ముద్ర చూపించలేకపోతున్నారు, అసలు ఇంకా పట్టే సంపాదించలేదు అని విమర్శించేవారంతా మౌనం వహించారు. కఠినమైన, సాహసమైన, న్యాయంగా కనిపించే నిర్ణయాలు తీసుకోగల సమర్థుడు అన్న ఇమేజ్‌కు ఉన్నట్టుండి ఆస్కారం ఏర్పడింది.


మరొక ముఖ్యమైన ఫలితం, ఒకనాడు చెరువుల పట్టణంగా వర్ధిల్లిన హైదరాబాద్‌ను ఎట్లా కబ్జాకోరులు నంజుకుని తిన్నారో వివరాలన్నీ బయటకు రాసాగాయి. జనంలో ఈ ఆక్రమణల మీద ఆసక్తి పెరిగింది. ఈ సమాచారపు వెల్లువ వల్ల, ఇకనైనా ఆక్రమణలను నిరోధించి, ఉన్న మేరకైనా నగరాన్ని కాపాడుకోవాలన్న స్పృహ పెరుగుతోంది. ఆక్రమణలకు మూలకారకులెవరు అన్న చర్చ జరిగి, పలుకుబడి ప్రయోగించే రాజకీయ నేతలు, నియమాల మెడలు వంచిన అధికారగణం పాత్ర గురించిన ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. ఘరానా బాబులు ఆక్రమించారు నిజమే, కానీ, వారికి అనుమతుల తివాచీలు పరిచిందెవరు? వారెందుకు శిక్ష తప్పించుకోవాలి? వంటి సూటిప్రశ్నలు న్యాయస్థానాలు కూడా సంధిస్తున్నాయి.

కాళ్ల కింద కాసింత నేల కోసం చెరువుల అంచున, నాలాల పక్కన గుడిసెలు వేసుకునే వారిని, పడావులో ఉండే ప్రభుత్వ భూములలో తలదాచుకునేవారిని అత్యుత్సాహంతో ఈడ్చిపారేసినప్పుడు, ఈ సభ్యసమాజం ఇంతగా కలవరపడదేమి? వారిని అధికార యంత్రాంగం ఏనాడూ కనికరించిన పాపాన పోదు కదా? ఈ మహానగరాన్ని వరదలో కుంభవృష్టులో ముంచెత్తినప్పుడు, గోడలు కూలీ, కాలువల్లో కొట్టుకుపోయీ ఆ అభాగ్యులే చనిపోతారు కానీ, లారీల కొద్దీ మన్నుకుమ్మరించి మట్టాన్ని పెంచుకుని నిర్మించుకున్న కబ్జా భవంతులన్నీ క్షేమంగానే ఉంటాయి. చెరువుల దారులను పేదలెప్పుడూ మూసివేయరు. మహాభవనాలే కరకట్టలై పల్లపుజీవితాలకు గండికొడతాయి!


ఈ హడావిడి ఎక్కువ కాలం ఉండదని, నిజంగా సత్సంకల్పంతో మొదలైనా, ఒత్తిడుల బరువుతో ఇది కుంగిపోతుందని బహుశా అందరికీ తెలుసు. అ‍స్మదీయుల కైనా నోటీసులు, కూల్చివేతలు తప్పవని ముఖ్యమంత్రి చెప్పడం బాగుంది కానీ, అన్ని అక్రమాల మూలాలు చివరకు అధికారపీఠాల పెరళ్ల దగ్గరే ముగిసి, చర్యలు క్రమంగా మగతలోకి జారుకుంటాయని కూడా తెలుసు. కానీ, ఈ వేడి ఉన్నప్పుడే, సాధ్యమైనన్ని ఎక్కువ సత్యాలు మాట్లాడుకోవాలి, అక్రమార్కులను విమర్శల బోనెక్కించాలి. మాటలకు చేతలకు నడుమ ఉండే ద్వంద్వత్వాన్ని సాధ్యమైనంతగా ఇరుకున పెట్టాలి. అందుకే, ఈ తేనెతుట్టెను కదిలించినందుకు రేవంత్‌రెడ్డిని అభినందించాలి.

రేవంత్‌రెడ్డి ఇమేజ్‌ను ‘హైడ్రా’ ఎంతవరకు మరమ్మత్తు చేయగలదు అంటే చెప్పడం కష్టం. కూల్చివేతల సారథిగా పోలీసు అధికారి రంగనాథ్‌కు హైడ్రా కీర్తిలో చాలా వాటా వెడుతుంది. చర్యలు ఆగిపోయినప్పుడు ఆ అప్రదిష్ట మాత్రం రేవంత్‌రెడ్డికే దక్కుతుంది. ప్రస్తుతం ‘హైడ్రా’ డాన్ క్విక్సోట్ లాగా అనిపిస్తుంది కానీ, మున్ముందు అ‍‍సలు ఘట్టం ఆవిష్కృతమవుతుంది. ఆరంభదశలో ఉన్న సంచలనాత్మకత తగ్గి పోయి, క్రమంగా సమస్యాత్మక అంశాలు ముందుకు వస్తాయి. అసౌకర్యం కలిగించే చారిత్రక వాస్తవాలన్నీ గుర్తుకు వస్తాయి. 2000 నాటి వరదల్లో దోషులెవరు దగ్గర నుంచి, హుసేన్ సాగర్ చుట్టూ వలయాకారపు ఆక్రమణలూ, హైడ్రా ఆఫీసున్న బుద్ధభవనమూ అన్నీ ప్రశ్నార్థకాలవుతాయి! ఆక్రమణదారులు సొంతంగా అనుభవించరు, అమ్ముకుని సొమ్ముచేసుకుంటారు, కొనుక్కున్న మధ్యతరగతి గగ్గోలు పెడుతుంది. ఈ లోగా, తాత్కాలిక ఫలితాలతో సంతుష్టి చెందిన పాలకులు, మరో కొత్త సంచలనానికి వలసపోలతారు!


చెరువులు అయినా, మూసీ రక్షణ అయినా, కొంత కాఠిన్యాన్ని, కొంత ఆచరణాత్మకతని మిళితం చేసి వ్యవహరిస్తే ఎంతో కొంత ఫలితం దక్కుతుంది, విలువలుగా మారితే, దక్కినది నిలబడుతుంది. ఆక్రమణలు, నియమోల్లంఘనలు ఇకమీదట అనుమతించబోమని, సహజవనరుల పరిరక్షణకు అమిత ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వం స్పష్టమైన విధాన ప్రకటన చేయాలి. ఇప్పటిదాకా జరిగిన కబ్జాలు, జలాశయాలకు కల్పించిన అవరోధాలు, ఎంతవరకు దిద్దుబాటు చేయగలమో పరిశీలించి, ఆ దిశగా చర్యలు చేపట్టాలి, నగర జీవనాన్ని మరింత క్షేమం, సౌకర్యం, పర్యావరణ హితం చేయడమే కర్తవ్యాలుగా ఉండాలి. వర్షప్రవాహాలను ప్రభావితం చేసి, నిర్మాణాలు చేసినవారి నుంచి పెద్ద ఎత్తున జరిమానాలు వసూలు చేయాలి. భవననిర్మాణ సంస్థల నుంచి రాజకీయ కప్పాలను వసూలు చేస్తున్నారన్న వార్తలు వింటున్నాం, వాటితో పాటు, నగర పర్యావరణాన్ని, జలవనరులను రక్షించడానికి సుంకాలను కూడా వసూలు చేయాలి. అధికార యంత్రాంగాన్ని, రాజకీయ నాయకులను గత చర్యలకు, ప్రస్తుత చర్యలకు కూడా బాధ్యత వహించేట్టు చేయాలి. ఈ చర్యలకు పెద్దగా దృశ్యమానత ఉండదు మరి!

ఆప్టిక్స్‌ను ఆశ్రయించే ఆధునిక రాజకీయాలలో ఈ నిశ్శబ్దనిర్మాణాత్మకతను ఆశించడం కష్టమేమో?

కె. శ్రీనివాస్

Updated Date - Aug 29 , 2024 | 03:26 AM

Advertising
Advertising