నేరం మీది కాదు, నిన్నటిదీ మొన్నటిదీ !!
ABN, Publish Date - Jun 27 , 2024 | 05:03 AM
ఏ కాలంలో ఆ కాలపు విషయాలుంటాయని అనుకుంటాం. కానీ, ఇది అకాలం లాగా, అతీత కాలంగా ఉంది. గత పదేళ్లకాలంలో పేరుకు నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయినా, నెహ్రూగారే పాలిస్తున్నారేమో, అన్ని పాపాలకూ...
ఏ కాలంలో ఆ కాలపు విషయాలుంటాయని అనుకుంటాం. కానీ, ఇది అకాలం లాగా, అతీత కాలంగా ఉంది. గత పదేళ్లకాలంలో పేరుకు నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయినా, నెహ్రూగారే పాలిస్తున్నారేమో, అన్ని పాపాలకూ ఆయనే భైరవుడు అన్నట్టుగా గడచిపోయింది. ఇప్పుడు నెహ్రూ నుంచి ఇందిరకు నాలుగడుగులు చరిత్రలో ముందడుగు వేశాం. ఇది మూడో విడత మోదీ పాలన కాదు, తాజాగా మనం ఇందిరాగాంధీ నియంతృత్వపు పీడకలను స్మరించడం మొదలుపెట్టాం. కళ్లెదురుగా కనిపిస్తున్న వర్తమానాన్ని మూర్ఛపుచ్చి, కాలయంత్రంలో గతంలోకి నడిపించుకువెళ్లడం సామాన్యమైన విద్య కాదు. ఆ అమోఘమైన విద్యను సాధన చేస్తున్నవారిని అభినందించవలసిందే. ఫ్లాష్ బ్యాక్ కాలాన్ని జీవించే, పునర్జీవించే భారతీయులు అదృష్టవంతులు.
ఆ నాటి ఎమర్జెన్సీ తక్కువదేమీ కాదు. అది స్వతంత్ర భారతం మీద చేసిన స్వదేశీ గాయం చిన్నది కాదు. స్వేచ్ఛకు, పోరాటశీలతకు కత్తులబోనులు మొలిచి, నెత్తురు పారిన కాలం అది. కానీ, ఆ పీడకల నుంచి భారతదేశం తేరుకున్నది. ఎమర్జెన్సీ అనుభవాల నుంచి దేశంలో పౌరహక్కుల ఉద్యమాలు, పాత్రికేయ పరిశోధనోద్యమాలు, న్యాయవ్యవస్థ క్రియాశీలత మొదలైనవన్నీ ఉధృతమయ్యాయి. చరిత్రలో ఆ ఘట్టం ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. ఏ దేశం చరిత్రలో అయినా అనేక ఉద్రిక్త, విషాద, దుర్మార్గ పర్వాలుంటాయి. కొన్ని జ్ఞాపకాలుగా మారిపోయి, మచ్చలుగానే గుర్తుంటాయి. ఏ న్యాయమూ జరగనప్పుడు మాత్రం ఇంకా సలుపుతూ ఉంటాయి. 1984 సిక్కుల ఊచకోత, అదే ఏడాది భోపాల్ విషవాయు హత్యలు, 1992 బాబ్రీమసీదు కూల్చివేత, ముంబై హింసాకాండ, పేలుళ్లు, 2002 గుజరాత్ ఊచకోత వంటివి, తగిన నిష్కృతి దొరకక, ఇంకా సజీవ వ్రణాలుగానే మిగిలాయి. వాటి ప్రభావాలు, ప్రతిధ్వనులను భరించడంతో పాటు, కొత్తగా తమ ముందుకు వచ్చే అనేక జీవన్మరణ అంశాల మీద కూడా ప్రజలు ఆవేదన చెందుతూ, పరిష్కారాలు వెదుక్కోవలసి ఉంటుంది. దురదృష్టవశాత్తూ, దేశం ఎదు ర్కొంటున్న అనేక సమస్యలకూ గతంలో మూలాలున్నాయి, ఇప్పుడు దేశాన్ని పాలిస్తున్న జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నిటికీ ఆయా కాలాల్లో వాటితో ప్రమేయం ఉన్నది. ఎవరూ ఇందులో పూర్తి నిర్దోషులు కారు. ఎవరి చేతులూ పవిత్రంగా లేవు. ఆ పార్టీలతోనే ప్రజలు ప్రయోగాలు చేయాలి. గెలిపించాలి. ఓడించాలి.
రాజ్యాంగానికి ప్రమాదం ఉన్నదని, దాన్ని కాపాడుకోవాలని ప్రతిపక్ష కూటమి గత ఎన్నికలలో ప్రచారం చేసింది. మూడోసారి దేశ సారథ్యాన్ని చేపట్టిన నరేంద్రమోదీ నుంచి ఆ ప్రమాదం ఇంకా కొనసాగుతున్నదని కూడా భావిస్తోంది. దాన్ని ఎదుర్కొనడానికి, తామెంతటి రాజ్యాంగ నిబద్ధులమో చెప్పుకోవలసింది పోయి, యాభై ఏళ్ల కింద కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగానికి ద్రోహం చేసిందని బీజేపీ ఎదురుదాడి చేయ డంలో ఆత్మరక్షణ వ్యూహం ఉన్నదా, అతిశయించిన మేధ ఉన్నదా తెలియదు. గత రెండు ప్రభుత్వాలలోని అన్ని అంశాలను కొనసాగించే వ్యూహంలో ఇది భాగమా, లేక, కొత్త ఎత్తుగడలు వేయలేని భావదారిద్ర్యమా అర్థం కావడం లేదు.
ఏ కొత్త ప్రభుత్వమైనా పాత ప్రభుత్వాల వైఫల్యాల నుంచి, దుష్పరిపాలనల నుంచే ప్రజల తీర్పును పొందుతుంది. ఓడించడమే పాత ప్రభుత్వానికి పెద్ద శిక్ష. కొన్ని సమయాల్లో, గత ప్రభుత్వాలు ప్రజల విషయంలో, ప్రత్యర్థుల విషయంలో అతి దుర్మార్గంగా వ్యవహరించినప్పుడు, కొంతకాలంపాటు, పాత కాలపు స్మరణ, దోషుల అభిశంసన కొనసాగుతూ ఉంటాయి. అరుదైన సందర్భాలలో, గత పాలకులు నేరస్థులుగా నిర్ధారణ జరిగి, శిక్షలు అనుభవిస్తారు. ఎమర్జెన్సీ కాలంలో, ఇందిరాగాంధీ ప్రభుత్వం అకృత్యాలకు పాల్పడడమే కాక, వాటి సమాచారం వ్యాప్తి చెందకుండా సెన్సార్‌షిప్ కూడా విధించింది. అందువల్ల, ఎమర్జెన్సీ అంతమై, జనతాప్రభుత్వం వచ్చిన తరువాత, ఆ కాలపు అకృత్యాలన్నీ ఒక్కొక్కటిగా వెలికిరావడం, తెలియని వారు దిగ్భ్రాంతి చెందడం దీర్ఘకాలం పాటు జరిగింది. కథలు కథలుగా వాటిని తెలుసుకున్న ప్రజలు, ఆ కోపంలో చాలాకాలం పాటు జనతాప్రభుత్వాన్ని అధికారంలో కొనసాగించి ఉండేవారు. కానీ, రాజకీయ అంతఃకలహాలు, పాలనలో వాటి ప్రతిఫలనాలు వారిలో విరక్తి కలిగించాయి. ఎమర్జెన్సీ ప్రతికూలత మీద అమితంగా ఆధారపడడం ఒకవైపు, కమిషన్ల విచారణలు ఇందిరను వేధించడానికే సాగుతున్నాయన్న అభిప్రాయం కలిగించడం మరోవైపు, 1980లో ప్రజలు తిరిగి ఇందిరకు పట్టం కట్టడానికి కారణం అయ్యాయి. గతం నుంచి, గత ప్రభుత్వాల నుంచి రాజకీయ లాభం కొంత పొందవచ్చు. కానీ, గతాన్నభుక్కులు కావడాన్ని ప్రజలు ఇష్టపడరు.
నరేంద్రమోదీ ప్రభుత్వం 2014లో మొదటి దఫా గెలిచినప్పుడు, గత ప్రభుత్వంలోని అవినీతి, పాలనా వైకల్యాల నుంచి బాగానే ప్రయోజనం పొందింది. తరువాత దాన్ని దీర్ఘకాలికం చేసుకోవడానికో, తన విస్తృతమైన ఎజెండాను అమలు చేయడంలో భాగంగా ఆధునిక భారత చరిత్రను కొత్తగా వ్యాఖ్యానించడానికో, గాంధీతో మొదలుపెట్టి, నెహ్రూ కుటుంబం దాకా బోనులో నిలబెట్టింది. గత ప్రభుత్వం స్థానంలో, ఆ ప్రభుత్వం రాజకీయచరిత్రే దోషిగా మారిందన్న మాట. జరిగిందంతా తప్పే, 2014 నుంచి మాత్రమే దిద్దుబాటు మొదలయిందన్న ప్రచారాన్ని భారతీయ సమాజం పూర్తిగా అంగీకరించలేదు. 2024లో ఆ ప్రాజెక్టుకు పెద్ద ఆటంకం ఏర్పడింది. అయినా, ఏమీ జరగనట్టు, ఇంతకాలం అనుసరించిన విధానమే మరింత తీవ్రంగా కొనసాగించడమే కర్తవ్యమన్నట్టు, మోదీ ప్రమాణస్వీకారాల రోజు నుంచే యాభై ఏళ్ల కిందటి చరిత్రను రక్షణకవచంగా ధరించింది. వర్తమానంలో బలమైన ప్రత్యర్థి కాకపోయినా, ఊహలో, గతంలో బలశాలిగా ఉన్న కాంగ్రెస్‌తో మోదీ యుద్ధంచేస్తూ వచ్చారు. గత్యంతరం లేదు, ప్రమాదకరమైన ప్రత్యర్థి లేకపోతే తీవ్ర జాతీయవాదం లేదు.
ఎమర్జెన్సీ జ్ఞాపకాన్ని కవచంగా ధరించడంలో నరేంద్రమోదీ సరళి అందరికీ పనికివచ్చేది కాదు. 2019 దాకా ఆ పద్ధతి సైద్ధాంతికమైన చట్రం కోసం మాత్రమే ఉద్దేశించింది. కానీ, అది ఇటీవల ఎన్నికలలో పగుళ్లు బారింది. ఇప్పుడు కూడా ఇండియాకూటమి రాజకీయనైతికతను దెబ్బతీయడానికి మాత్రమే ఎమర్జెన్సీను రంగంలోకి దించారు. సైద్ధాంతిక కారణాలు కాక, కేవలం రాజకీయ ఆధిక్యం కోసం కొత్తప్రభుత్వాలు పాతప్రభుత్వాల నేరాలమీద అమితంగా ఆధారపడడం కూడా అనేక సందర్భాలలో చూడవచ్చు. తెలంగాణలో రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు కూడా, గత ప్రభుత్వాల రాజకీయ, పాలనా అనైతికత మీద అమితంగా ఆధారపడడంలో ఉన్న ప్రమాదాన్ని గుర్తించాలి. మునుపటి ప్రభుత్వాలు పాల్పడిన రాజకీయ అకృత్యాలయినా, పాలనాపరమైన అక్రమాలైనా, వాటిని బట్టబయలు చేసి, సరైన విచారణకు, న్యాయప్రక్రియలకు నివేదించడం తప్పనిసరి. ఆ క్రమాన్ని ప్రజలు కోరుకుంటారు. అంతేకాదు, అది ప్రజలకు అవసరమైనది కూడా. ప్రభుత్వాలలో ఉన్నవారు ఎంతటి అవినీతికి, అఘాయిత్యాలకు పాల్పడగలరో ప్రజలకు తెలిసి, వారు మున్ముందు అప్రమత్తంగా ఉంటారు. ఇదంతా కూడా పరిపాలనను మెరుగుపరచడానికి జరిగే ప్రక్రియలాగానే ఉండాలి కానీ, రాజకీయ కక్ష సాధింపుగా ప్రజలు భావించే ఆస్కారం ఇవ్వకూడదు. న్యాయంగా కనిపించే నేరవిచారణ, ఏ కీలక దశలో ప్రజలకు అన్యాయంగా అనిపిస్తుందో గ్రహించే వివేచన నాయకులకు ఉండాలి.
చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఇంకా నెలరోజులు కూడా కాలేదు. ఒకరి ఘోరపరాజయం, ఒకరి అతి ఘనవిజయం అన్న జంటపరిణామాలు సహజంగానే సంచలనం కలిగించాయి. రాజకీయంగాను, ప్రభుత్వపరంగానూ కొన్ని ఉద్రిక్త స్పందనలు కనిపించాయి. ఓటు ద్వారా ఓడించినా, ప్రజల నుంచి కొంత ఆగ్రహప్రకటన కూడా జరిగింది. కానీ, చంద్రబాబు బృందం వెంటనే పనిలోకి దిగింది. ప్రధానమైన వాగ్దానాలపై నిర్ణయం తీసుకుంది. గత పాలన దోషాలను నిగ్గుతీయవలసిందే కానీ, కేవలం గతాన్ని నిందిస్తూ కూర్చుంటే ఉపయోగం లేదన్న గ్రహింపు అందులో ఉంది. కానీ, తెలంగాణలో మాత్రం కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు కావస్తున్నా, పరిస్థితి భిన్నంగా ఉన్నది.
పోయిన డిసెంబర్‌లో తెలంగాణ విజయం, కష్టకాలంలో కాంగ్రెస్‌కు లభించిన రెండో గెలుపు. కాకపోతే, కర్ణాటకలో లాగా ఘనవిజయం లభించలేదు. ఆరు భారీ గ్యారంటీల మీద, ప్రజాస్వామిక పాలన వాగ్దానం మీద ఆధారపడి ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారు. రాష్ట్ర ఆర్థికపరిస్థితి రీత్యా, హామీలన్నీ ఎంతో ఖర్చుతో కూడుకున్నవి. ఆర్టీసీ ఉచిత ప్రయాణం వెంటనే ప్రారంభించగలిగారు. ఎంతో వ్యవధి లేకుండానే లోక్‌సభ ఎన్నికలు వచ్చాయి. అదనంగా 2 లక్షల రుణమాఫీ వాగ్దానం. ఆ వాగ్దానం లేకపోతే, కాంగ్రెస్‌కు ఎనిమిది స్థానాలు కూడా దక్కేవి కాదన్న అభిప్రాయం ఉంది. అసెంబ్లీ ఎన్నికలనాటి వాగ్దానాల విషయంలో గట్టి ముందంజపడి ఉంటే, కాంగ్రెస్ మీద విశ్వాసం మరింత బలంగా ఉండేది. కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తప్పుడునిర్ణయాలు, కరెంటు కొనుగోళ్లలో జరిగిన అధికవ్యయాలు, ఇంకా అవినీతులు, అక్రమాలు, ఈ ఆరునెలల కాలంలో చర్చలోకి వచ్చాయి. ప్రభుత్వం సంక్షేమాన్ని అమలుచేయడానికి తగిన ధనవసతి లేకపోవడానికి గత ప్రభుత్వమే కారణమన్న అభిప్రాయమైతే కలిగింది. కానీ, కొత్తప్రభుత్వం చాకచక్యంగా పరిస్థితిని చక్కబరచాలని కూడా ప్రజలు భావిస్తారు.
చంద్రబాబుతో పోటీపడి రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేయాలని రేవంత్ రెడ్డి అనుకోవడం బాగుంది. కానీ, ఇంతకాలానికి కూడా తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఇంకా స్థిమిత పడలేదని, సమర్థులైన అధికారులు, వ్యవహర్తలైన సలహాదారులు అధినేతకు సమకూరలేదని ఒక అభిప్రాయమైతే వ్యాప్తిలో ఉంది. ఎక్కడో ఫామ్‌హౌస్‌లో ఉండి, అత్యవసర వ్యవహారాలను కూడా పెండింగ్‌లో పెట్టేవారని గత ముఖ్యమంత్రిపై విమర్శలు ఉండేవి. కొత్త ముఖ్యమంత్రి రాజధానిలోనే, విరామం లేకుండా జనంమధ్యలోనో, అధికారులతోనో ఉంటారు. కానీ, అనేక ప్రక్రియలు నత్తనడక నడుస్తున్నాయి. ఈ పరిస్థితికి గత ప్రభుత్వం నుంచి సంక్రమించిన అయోమయం కొంత కారణం. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకమైన కొన్ని పరిస్థితులు మరో కారణం. ప్రాంతీయపార్టీకి ఉండే స్వేచ్ఛ, నిర్ణయవేగం రాష్ట్ర కాంగ్రెస్‌లో సాధ్యపడదు. కానీ, పరిపాలన నాణ్యత ప్రజలకే బాగా తెలుస్తుంది. అందులో కలిగే లోపాన్ని గత ప్రభుత్వం మీద అభియోగాలు, ఆరోపణలు భర్తీ చేయలేవు. పైగా, సానుభూతి కలిగిస్తాయి. ప్రతికూల ప్రచారం నుంచి కాక, సానుకూల పాలన నుంచే బలాన్ని పెంచుకోవడానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రయత్నించాలి.
కె. శ్రీనివాస్
Updated Date - Jun 27 , 2024 | 05:03 AM