ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆధునికులం, నాగరికులం కదా, అట్లా ఉండలేమా?

ABN, Publish Date - Jul 04 , 2024 | 04:39 AM

పోయిన శనివారం నాడు హైదరాబాద్‌లో డేనియల్ ఫెర్నాండెజ్ అనే హాస్యకళాకారుడి ప్రదర్శన చివరినిమిషంలో రద్దు అయింది. ‘‘నువ్వు కనుక ప్రదర్శన నిర్వహిస్తే, నా అనుచరులు వచ్చి...

పోయిన శనివారం నాడు హైదరాబాద్‌లో డేనియల్ ఫెర్నాండెజ్ అనే హాస్యకళాకారుడి ప్రదర్శన చివరినిమిషంలో రద్దు అయింది. ‘‘నువ్వు కనుక ప్రదర్శన నిర్వహిస్తే, నా అనుచరులు వచ్చి దేహశుద్ధి చేస్తారు, మరెప్పుడైనా తెలంగాణ రావాలనుకుంటే యాభైసార్లు ఆలోచిస్తావు’’ అని బీజేపీ శాసనసభ్యుడు టి. రాజాసింగ్ విడియో ప్రకటన ద్వారా ఆ కమెడియన్‌ను హెచ్చరించడమే ఆ రద్దుకు కారణం. రాజాసింగ్ ఆ ప్రకటనలో పోలీసులకు కూడా గట్టి హెచ్చరిక చేశారు. ఆ ప్రదర్శనకు అనుమతి రద్దు చేయకపోతే, ‘‘మరెవరన్నా జైన, హిందూ మతాల మీద జోక్ చేయాలంటే వణికిపోయేంతగా ఆ కమెడియన్‌కు బుద్ధిచెబుతాము’’ అని ఆయన అన్నారు. ఫెర్నాండెజే తన షోను రద్దు చేసుకున్నారు. తన తాజా విడియో జైనులను నొప్పించినందుకు మరోసారి క్షమాపణలు చెప్పారు.

ఇంతకూ ఆ నొప్పించిన విడియో ఏమిటి? బక్రీద్ సందర్భంగా ఢిల్లీలో కొందరు జైనమతస్థులు వీలయినంత జీవహింస నివారించడం కోసమని, ముస్లిముల వేషంలో వెళ్లి, కోతకు అమ్మకానికి ఉన్న 124 మేకలను కొన్నారు. అందుకోసం 15 లక్షల రూపాయలు సమీకరించుకున్నారు. ఈ వార్త అన్ని పత్రికల్లో, చానెళ్లలో ప్రముఖంగా ప్రచారమయింది కూడా. ఈ ఉదంతం మీద ఫెర్నాండెజ్ చేసిన విడియోలో కొన్ని ఛలోక్తులున్నాయి. దాని మీద వెంటనే ఎన్నో అభ్యంతరాలు ఆ విడియో పోస్టు కిందటే వెలువడ్డాయి. కొందరు బెదిరింపులు, దూషణలు కూడా చేశారు. ఆ హాస్య కళాకారుడు తన క్షమాపణలు కూడా అక్కడే చెప్పారు. అయినప్పటికీ, హైదరాబాద్‌లో మాత్రం రాజాసింగ్ ద్వారా స్పందన తీవ్రంగా వ్యక్తమైంది.


అనేక హాస్య స్ఫోరక ఉదంతాలను ప్రస్తావిస్తూ, అనర్గళంగా చమత్కారాలు గుప్పిస్తూ, ప్రేక్షకులను రంజింప చేసే ప్రదర్శనలు పదిపదిహేనేళ్లుగా ప్రాచుర్యం పొందాయి. ఆ విదూషకుల భాషా విన్యాసం, హాస్యప్రియత్వం చూస్తే ముచ్చట కలుగుతుంది. వీరిలో రాజకీయ నిశితత్వం ఉన్న కమెడియన్లు మరింతగా ఆకట్టుకుంటారు. వీరి కళలో వెక్కిరింత ఒక భాగం కాబట్టి, వివిధ భాషా, మత, ప్రాంత శ్రేణుల అలవాట్లను, సాంస్కృతిక విశేషాలను ప్రస్తావించకతప్పదు. హాస్యానికి, అపహాస్యానికి తేడా పాటించక, గీత దాటే కమెడియన్లు కొందరు ఉంటారు. వారు తరచు వివాదాస్పదమవుతారు. ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించేవారు కూడా, ప్రేక్షకులకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేకపోవడం వల్ల నిరసనలు ఎదుర్కొంటారు. విస్తృత ప్రజా వర్గాలను ఉద్దేశించి పనిచేసే రకరకాల సమాచార, ప్రసార సాధనాలు, సృజనాత్మక వ్యక్తీకరణలు అన్నీ కూడా ఎక్కడో ఒకచోట ఎప్పుడో ఒకప్పుడు పొరపాటు చేయడమో, కొన్ని ‌వర్గాల నుంచి పొరపాటుగా దాడికి గురికావడమో సహజం. ‘‘హాస్య కళాకారుల వృత్తిలోనే ఈ ప్రమాదం ఉన్నది, అందరినీ సమానంగా రంజింపజేయలేము. ఎప్పుడో ఒకసారి అప్రియమైన స్పందనలు ఎదురవుతాయి’’ అని ఫెర్నాండెజ్ తమ రంగంలోని సమస్యల గురించి చెప్పారు. ఒక కళాకారుడి ప్రదర్శనతో విభేదించ వచ్చు, ‘‘అభ్యంతరం చెప్పవచ్చు, కానీ, హింస ప్రయోగిస్తామని హెచ్చరించడం సరి కాదు కదా?’’ అని ఆయన ఆవేదన చెందారు.


నిజంగా మరో మార్గం లేదా? మనోభావాలు గాయపడినవారు కళాకారులకు తమ నిరసన చెప్పడమూ, ఆ కళాకారుడు తన తప్పును గ్రహించి కానీ, తన చర్యను వివరించి కానీ సమాధానం ఇవ్వడం వంటి ప్రజాస్వామిక పరిష్కారాలు ఇటువంటి సమస్యలకు లభించవా? ఒక కళాకారుడి ప్రదర్శనను రద్దు చేయించడమే న్యాయమైన ప్రతిస్పందనా? తన నియోజకవర్గంలో జైనులు గణనీయంగా ఉండడం రాజాసింగ్ తీవ్ర స్పందనకు ఒక కారణమనుకుందాం. స్వయంగా జైన మతావలంబకులు సమస్యలను ఘర్షణపూర్వకంగా పరిష్కరించుకోవాలనుకునేవారు కాదు. బక్రీద్ బలుల కోసం అంగడిలో ఉన్న మేకలను మారువేషంలో కొనుగోలు చేసి, జీవరక్ష చేద్దామనుకున్నారంటే, వారి సున్నితమైన ఆలోచనావిధానం అర్థం చేసుకోవచ్చు. తమకు రుచించని తీరులో ఛలోక్తులు చెప్పిన కళాకారుడిని ఊళ్లోకి రాకుండా హెచ్చరించాలని వారు కోరుకుంటారా? వాళ్లే కాదు, సాంస్కృతిక జన వైవిధ్యం ఉన్న హైదరాబాద్ నగరం మనోభావాల సున్నితత్వాన్ని, భావప్రకటనా స్వేచ్ఛను సమతుల్యతతో నిర్వహించజాలదా? కళలకు, కళాకారులకు, ఎడతెగని సృజనాత్మకతా ఉత్సవాలకు వేదిక అయిన భాగ్యనగరాన్ని నిషేధాల ఆంక్షలతో మలినపరచడం సరిఅయినదేనా?

ప్రభుత్వం ఏమి చేసింది? నిమ్మకు నీరెత్తినట్టు ఊరుకుంది. కళాకారుడు తానే షో రద్దుచేసుకునేట్టు వ్యవహరించింది. గతంలో మరో హాస్యప్రదర్శకుడు మునావర్ ఫరూఖ్ విషయంలో రాజాసింగ్ ఇటువంటి నిషేధ ప్రకటనే చేసినప్పుడు, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యంగా మంత్రి కేటీఆర్, మంచో చెడో, ఒక స్పష్టమైన వైఖరి తీసుకున్నారు. వివిధ భావాల వ్యక్తీకరణకు ఆస్కారం ఇవ్వడం హైదరాబాదీ సంస్కృతిలో భాగమని భావిస్తూ, ప్రదర్శన జరగడానికి మద్దతు ఇచ్చారు. అప్పుడు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన మాట నిజమే కానీ, సాంకేతికంగా అయినా నిషేధం అమలుజరగలేదు. మరి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేసింది? అసలు తనకు ఒక సాంస్కృతిక విధానం ఉన్నదా? పార్లమెంటులో వారి నాయకుడు ‘నఫ్రత్’ను వ్యతిరేకిస్తూ ప్రసంగాలు చేస్తారు కానీ, క్షేత్రస్థాయిలో ఆ వైఖరి అమలు కావడానికి కాంగ్రెస్ నేతలు ఏమి చేస్తున్నారు? రాత్రి పదకొండు దాటితే దుకాణాలు కట్టేయాలని కొత్త ప్రభుత్వం కట్టడి చేస్తుంటే, నైట్ లైఫ్ లేని హైదరాబాద్ ఎట్లా అభివృద్ధి చెందుతుందని ఆందోళన చెందే సిటీజనులు, నాగరిక జీవనంపై ఫత్వాల జారీని ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?


మునావర్ ఫరూఖీ, డేనియల్ ఫెర్నాండెజ్‌ల భావ ప్రకటనా స్వేచ్ఛ బేషరతుదేమీ కాదు. వారు, ఒక సంస్కారాన్ని, మనోభావాల పట్టింపును కళాకారులుగా పాటించవలసిందే. కానీ, ఆ విలువలో సమస్య వచ్చినప్పుడు చట్టం దాన్ని పరిష్కరించాలి. పౌరసమాజం కూడా కల్పించుకుని, ఉభయపక్షాలకు నచ్చచెప్పాలి. ఉద్రిక్తతలకు ఆస్కారమిచ్చే శక్తులను ఒంటరి చేయాలి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటామనే హెచ్చరికలకు ఆస్కారం ఉండకూడదు. అది ఒక ధోరణిగా మారిపోకుండా చూడాలి.

బీఆర్ఎస్ పార్టీకి లోపాయికారీగా బీజేపీతో ఏదన్నా అవగాహన ఉండిందో లేదో కానీ, పైకి మాత్రం ఆ పార్టీ నేత కేసీఆర్ తెలంగాణ మిశ్రమ సంస్కృతిని, వైవిధ్య సామాజిక జీవనాన్ని గొప్పగా ప్రచారం చేసేవారు. అభివృద్ధికి, మతసామరస్యానికి ఉండవలసిన అనివార్య సంబంధం గురించి తనదైన పద్ధతిలో చెప్పేవారు. కొత్త ప్రభుత్వానికి సెక్యులరిజం అన్నది ఒక ఎన్నికల రాజకీయ విలువ మాత్రమేనా అన్న సందేహం కలుగుతున్నది. ఉదాహరణకు, బక్రీద్ ముందూ తరువాతా మెదక్‌లో ఏర్పడిన ఉద్రిక్తత.. ఆ పక్షం నుంచి ఇద్దరిని, ఈ పక్షం నుంచి ఇద్దరిని అరెస్టు చేసి కేసులు పెట్టడమే మతసమానత్వం అనుకుంటే ఎట్లా? జరిగినదానికి బాధ్యులెవరో నిష్పాక్షికంగా కనిపెట్టడం, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తపడడం, ఈ రెంటిలోనూ ప్రభుత్వ వైఫల్యమే కనిపించింది. వెటకారాలు చేసే వృత్తిలో అప్పుడప్పుడు నోరుజారడాలు ఉన్నట్టే, వేర్వేరు మతాలు నివసించే చోట అప్పుడప్పుడు సమస్యలు వస్తాయి. పైగా దేశవ్యాప్తంగా ఉన్న వాతావరణం ప్రభావం తెలంగాణ లోనూ ఉంటుంది. ఈ ఉద్రిక్తతలలో జీవించేది, నష్టపోయేది ప్రజలు కదా? ఉభయ మతాల వారితో సంప్రదింపులు జరిపి, ఆవేశాలను చల్లార్చేపని ప్రజాప్రతినిధులు చేయాలి, ప్రభుత్వం ఆ దిశగా ప్రోత్సహించాలి. లేదా, అందరికీ ఆమోదయోగ్యులైన పెద్దమనుషులకు ఆ బాధ్యత అప్పగించాలి. క్షేత్రస్థాయిలో సామరస్యాన్ని కాపాడడం అంటే, ప్రజలతో గాఢమైన సంబంధంలో ఉండి, ప్రమాదకర ధోరణులు కనిపిస్తే వాటిని మొగ్గలోనే తుంచేయడం. వాటి గురించిన అవగాహన కలిగించడం. సమానసంఖ్యలో అరెస్టులు చేయడం కాదు.

బీజేపీ వల్ల ప్రమాదం ఉంటుందని, దానిని గెలవనివ్వవద్దని ప్రచారం చేస్తూ కొన్ని ప్రజాసంఘాలు లోక్‌సభ ఎన్నికల ముందు ప్రచారం చేశాయి. నేరుగా చెప్పకపోయినా, వారు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటు వేయమని చెప్పినవారే. అది వారి ఇష్టం. దేశంలోని పరిస్థితుల రీత్యా అది అవసరమైన ఎంపిక అని వారనుకున్నారు. ఆ ప్రచారంలో భాగంగా వారొక బస్సు యాత్ర చేశారు. వివిధ ప్రజావర్గాలను వారున్నచోటునే కలుసుకుని తమ అభిప్రాయాలను వివరించడం పద్ధతిగా పెట్టుకున్నారు. రిటైర్డ్ ఐఎఎస్‌లు, ప్రొఫెసర్లు, సామాజిక కార్యకర్తలు ఆ బృందంలో ఉన్నారు. మహబూబ్ నగర్, వరంగల్ పట్టణాలలో, ఆ బృంద సభ్యులకు అప్రజాస్వామికమయిన, అమర్యాదాకరమైన ఆటంకాలు ఎదురయ్యాయి. అట్లాగే, మత సామరస్యం కోసం గొంతెత్తే కవులు, రచయితలు ‘సమూహ’ అనే వేదికపై సంఘటితమై తమ రచనలను, అభిప్రాయాలను పంచుకుంటుంటే వరంగల్ లోనే వారి మీద దౌర్జన్యం జరిగింది. ఈ అన్ని చోట్ల ఆయా అధికారులు తమ పాత్రను నిర్వహించనే లేదు. అప్పటికప్పుడు చెదరగొట్టడమో, బాధితులకే నచ్చచెప్పడమో తప్ప. ఒక వైఖరి తీసుకుని, సమస్య పునరావృతం కాకుండా పరిష్కరించడం లేదు. ఈ సంఘటనలన్నీ తెలంగాణలో సామాజిక దౌర్జన్యవాదం పెరిగిపోతోందన్న కలవరం కలిగిస్తున్నాయి. ఉత్తరాది అంతగా చెడిపోలేదు కానీ, హేతువాదుల మీద, ఉదారవాదుల మీద, రకరకాల ప్రగతివాదుల మీద నేరుగానో, సామాజిక మాధ్యమాలలోనో దాడులు జరుగుతూనే ఉన్నాయి. చాప కింద నీరులాగా వ్యాపిస్తున్న ఈ ధోరణులే, రేపు పెను ప్రమాదానికి కారణమవుతాయి.


విద్యుత్ రంగంలో ప్రైవేటు పాత్రధారులను తీసుకురావాలనుకుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విషయం బాహాటంగా చెప్పి చేస్తే బాగుంటుంది. పాతికేళ్ల కిందట, ఎప్పుడైతే విద్యుత్ బోర్డు, ఉత్పాదక, సరఫరా, పంపిణీ వ్యవస్థలుగా విభజితమయిందో అప్పుడే, ప్రైవేటు ఉద్దేశ్యాలు వెల్లడయ్యాయి. ఆయా సంస్థలు ప్రజల నిత్యావసరాలతో ముడిపడినవి కావడం, లాభదాయకత లేకపోవడంతో ఇంతకాలం ప్రైవేటు సంస్థలు రాలేదు తప్ప, విధానం లేక కాదు. ఇవాళ బిల్లింగ్‌తో ప్రారంభించి అదానీ తెలంగాణ విద్యుత్ రంగంలోకి ప్రవేశిస్తుంటే, దాని రాజకీయ పర్యవసానాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎదుర్కొనవలసి వుంటుంది. అదానీయే ఒక సమస్య. విద్యుత్ సంస్కరణల అమలుతో ముడిపడిన వ్యవసాయాది రంగాలు మరొక సున్నితమయిన సమస్య. అయితే, అదానీకి అందించిన మొదటి ప్రాంతం హైదరాబాద్ పాతబస్తీ కావడంతో ఒక చిత్రమైన పరిస్థితి ఏర్పడింది. పాతబస్తీలో విద్యుత్ బిల్లుల వసూళ్లు దాదాపుగా జరగవు అనేది ప్రాచుర్యంలో ఉన్న అభిప్రాయం. మైనారిటీల తుష్టీకరణ అంటూ చేసే వాదనల్లో ఇదొక అంశం. బహుశా, అక్కడ విద్యుత్ వినియోగానికి, బిల్లింగ్ జరిగే పరిమాణానికి కొంత అంతరం ఉండి ఉంటుంది. రాష్ట్రంలో ఏ ఏ చోట్ల ఆ అంతరం ఉన్నదో, పాతబస్తీలో ఎంత ఉన్నదో ప్రభుత్వాలు ఎప్పుడూ చెప్పలేదు. ఏది ఏమయినా పాతబస్తీ వాసులు తమ మీద ఉన్న ఆ అభిప్రాయాన్ని తొలగించుకోవడమే మంచిది. వాళ్లు తక్కిన సమాజంతో సంలీనం కావడానికి అది తోడ్పడుతుంది కూడా. అది ఒక అభాండమే గనుక అయితే, అది కూడా తేలిపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తన మైనారిటీ అనుకూల ముద్రను కడిగేసుకోవచ్చు. మరి ఇంతటి చొరవ, రాష్ట్రమంతటా ఉన్న మతావేశాల విషయంలో కూడా చూపవచ్చును కదా?

మతపరంగా ఉన్న అన్ని ఉద్రిక్త ప్రాంతాలలోనూ సమస్యను సమూలంగా తొలగించి, శాంతియుత సహజీవన మార్గాలేమిటో అన్వేషించడం ప్రభుత్వం రాజకీయ కర్తవ్యంగా ఉండాలి. ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తోడ్పడిన పౌరసమాజ ప్రతినిధులు కూడా ఆ బాధ్యత తీసుకోవాలి. లేకపోతే, వారి స్థానాన్ని మరెవరో ఆక్రమిస్తారు. చట్టాలను, సమష్టి నైతికతను కాదని రాజ్యాంగేతర శక్తులుగా అవతరిస్తారు. ఏ సమస్యనైనా నాగరికంగా, ప్రజాస్వామికంగా పరిష్కరించుకోవడంలోనే ప్రత్యామ్నాయ నమూనా రూపొందుతుంది.

Updated Date - Jul 04 , 2024 | 10:38 AM

Advertising
Advertising