శ్వాస తెగిపోయాక, ఇక ఏమి సుందరీకరణ?
ABN, Publish Date - Sep 26 , 2024 | 02:24 AM
ఒకప్పుడేమో ప్రజలు మాకు అవి కావాలి, ఇవి కావాలి అని ప్రభుత్వాన్ని గట్టిగా అడిగేవారు, ఆలకించకపోతే ఆగ్రహించేవారు, ఆవేశపడేవారు. అయినా అడిగినవాటిని ప్రభుత్వం ఇచ్చేది కాదు. అడిగితే...
ఒకప్పుడేమో ప్రజలు మాకు అవి కావాలి, ఇవి కావాలి అని ప్రభుత్వాన్ని గట్టిగా అడిగేవారు, ఆలకించకపోతే ఆగ్రహించేవారు, ఆవేశపడేవారు. అయినా అడిగినవాటిని ప్రభుత్వం ఇచ్చేది కాదు. అడిగితే ఇవ్వడానికి నేనంత లోకువనా? ఉక్కుపాదంతో నొక్కిపెడతాను కానీ, ససేమిరా ఇవ్వననేది. కొంత హింస, కొన్ని బలులు జరిగాక, ఎంతో కొంత కొసరి విసిరేది.
ఇప్పుడు ప్రభుత్వాలు చాలా మారిపోయాయి. అడిగేది ఇవ్వరు సరే, కానీ, అడగకుండానే చాలా ఇస్తున్నాయి. అక్కరలేదు దొరలారా, అంటున్నా, ఫ్యూచర్ సిటీలట, ఫార్మా విలేజిలట, మహా జలాశయాలట, పన్నెండు వరసల రోడ్లట, అణుకర్మాగారాలట ఎన్నెన్నో నిర్మిస్తామంటున్నారు. అంతటి అభివృద్ధికి ఉడతాభక్తిగా జనం తమ కాలి కింది నేలనో, పంటనిచ్చే పొలాన్నో, పచ్చటిచెట్టూ పారేనీరూ ఇచ్చే ఆరోగ్యాన్నో సమర్పించుకుంటే చాలట. ఇంత అభివృద్ధి తీసుకువస్తుంటే ఆ మాత్రం త్యాగం చేయలేరా, మహాజనులారా?
ఒకప్పుడు అడిగినవి ఇవ్వకపోవడంలో వారికేదో నష్టం ఉండి ఉండాలి. ఇప్పుడు అడగనివి ఇవ్వడంలో వారికేదో లాభం ఉండి ఉండాలి.
ఇప్పటి అయాచిత ఉపద్రవం పేరు, దామగుండం.
వాళ్లు అభివృద్ధి ఇస్తామంటారు, ప్రజలు కాదంటారు. వాళ్లది దేశభక్తియుత ఘనకార్యం అవుతుంది. ప్రజలది అభివృద్ధి నిరోధక దేశద్రోహం అవుతుంది.
హైదరాబాద్‌కు 70 కిలోమీటర్ల దూరంలో, మూసీనది ప్రవాహ ప్రాంతంలో, దామగుండం రక్షితారణ్యంలో 2900 ఎకరాలలో భారత నావికాదళం ‘వెరీ లోఫ్రీక్వెన్సీ’ రాడార్ కేంద్రాన్ని నిర్మిస్తోంది. ఆ భూమిలో కొన్ని లక్షల వృక్షాలున్నాయి. ఈ కేంద్రం నిర్మాణానికి బహుశా పన్నెండు లక్షల చెట్లు కొట్టేస్తారు. అందువల్ల, హైదరాబాద్ పరిసరాలలో అసలే క్షీణించి ఉన్న పచ్చదనం మరింత మాయమవుతుంది. కాలుష్యభాగ్య నగరానికి బిగించిన వెంటిలేటర్లలో ఒకటి కన్నుమూస్తుంది. ఆ కేంద్రం చుట్టూ రేపు వెలిసే కొత్త సందడి మరింత అడవికోతకు, మరింత అభివృద్ధికి దారితీసి, మూసీ గొంతు ఇంకా బిగుసుకుంటుంది. సొంత నీరు లేకుండానే సుందరీకరణ జరిగిపోతుంది.
నావికాదళానికి ఈ రాడార్ కేంద్రం అత్యవసరమైన సాంకేతిక వ్యవస్థే అయి ఉండాలి. తమకు పెద్ద నష్టం లేకపోతే, దేశరక్షణకు అవసరమైన ఒక నిర్మాణాన్ని ప్రజలు అనుమతించాలి, అనుమతిస్తారు కూడా. కానీ, నష్టాన్ని ఎవరు, ఎట్లా అంచనా వేయాలి? ఇక్కడి నష్టం చిన్నది కాదు, ఒక స్థలానికి, కాలానికి మాత్రమే పరిమితమైనది కాదు. గాలిని, నీటిని, జీవులను అందరినీ నిర్వాసితులను చేసే నష్టం. ప్రత్యామ్నాయం రక్షణశాఖకు అసాధ్యం కాదు. ఆ ప్రయత్నమే వారు చేసినట్టు లేదు.
ఇదేదో ఉన్నట్టుండి, గండిపేట గేట్లు తెరవాల్సివచ్చినంత అర్జెంటుగా ముంచుకువచ్చిన సమస్య కాదు. దీనికి నేపథ్యం పదేళ్ల పై మాటే. చుట్టుపక్కల పల్లెల్లో కొంత కలవరం, కొంత కలకలం కనిపించినా, లోకం పెద్దగా పట్టించుకోకపోవడంతో, నివురు గప్పిపోయింది. దామగుండం స్వామిగా పేరుపొందిన సత్యానందస్వామి మాత్రం రాబోయే ప్రమాదం గురించి నాటి నుంచి నేటి వరకు హెచ్చరించడం మానలేదు. స్వతంత్ర జర్నలిస్టు చందు తులసి చొరవతో, దామగుండం మళ్లీ వార్తలలోకి వచ్చింది. విడియో కథనంతో తెలంగాణ ఉలిక్కిపడింది. సేవ్ రామగుండం జేఏసీ తిరిగి రంగంలోకి దిగింది. మొన్న ఆదివారం దీక్షలతో పౌరసమాజం సంఘటితమైంది. ప్రతిపక్షం తానూ ఉన్నానని గుర్తు చేసింది. మోహరింపు మొదలైంది.
ఈ రాడార్ కేంద్రానికి కావలసిన భూమిని కొన్ని నెలల కిందట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేవీ వారికి బదలాయించారు. అట్లాగని, ఇదంతా ఆయన ప్రభుత్వం ప్రారంభించింది కాదు. కానీ, కేంద్రంలో కాంగ్రెస్ హయాంలోనే దీనికి పునాది పడింది. భారత నావికాదళ బృందం 2007లో సర్వే చేసుకుని వెళ్లి, 2010లో ప్రతిపాదన పంపడంతో ప్రక్రియ మొదలైంది. భూమి బదలాయింపునకు కావలసిన సన్నాహకాలు, సానుకూల ప్రచారాలు, గ్రామసభల నిర్వహణ అన్నీ బీఆర్ఎస్ హయాంలోనే పూర్తయ్యాయి. కోర్టులో స్టే ఉండడంతో, భూమి బదలాయింపు మాత్రం జరగలేదు. ఆ అడ్డు తొలగడంతో ఈ ఏడాది జనవరి 24 నాడు లాంఛనం పూర్తయింది. నిర్మాణ కార్యక్రమాలు ప్రస్తుతం ప్రారంభదశలో ఉన్నాయి.
వ్యవసాయ భూములూ, ఊర్లూ ఈ ప్రాజెక్టులో నష్టపోవడం లేదు. దామగుండం అడవి మధ్యలో ఉన్న రామలింగేశ్వరస్వామి దేవాలయానికి చెందిన వేల ఏకరాల భూమి, నేవీ ప్రతిపాదనలు మొదలైన కాలంలోనే, ఎట్లా అటవీ శాఖ చేతిలోకి పోయిందో ఇంద్రజాలమే? మొత్తానికి రాడార్ కేంద్రానికి అనుకూలంగా భూమి దఖలు జరిగింది. వ్యక్తిగత కమతాలేవీ ఆ భూమిలో లేవు. ఏదో ఒక ప్రాజెక్టు వస్తోందంటే, దగ్గరలోని తమ భూముల రేట్లు పెరుగుతాయని, నాలుగు ఉద్యోగాలు వస్తాయని అమాయకంగా నమ్మే జనం ఎట్లాగూ ఉంటారు. రాడార్ కేంద్రానికి మద్దతు కూడగట్టడానికి కూడా ప్రాజెక్టు తరఫున అటువంటి వాగ్దానాలు గుప్పించారు. ప్రతిపాదిత రాడార్ కేంద్రస్థలానికి చుట్టుపక్కల 20 గ్రామాల్లో నివసించే 60వేల మంది అడవిని కోల్పోతున్నందుకు, పశువులకు మేత భూములు పోతున్నందుకు బాధపడ్డారు, నిరసనలు తెలిపారు. బహుశా వ్యక్తిగత నష్టం పెద్దగా లేనందువల్ల కూడా, ఉద్యమం చురుకుగా ముందుకు సాగలేదు. పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు ఎంతగా హెచ్చరిస్తున్నా, తగినంత స్పందన లేకపోయింది.
సొంత నష్టాలను కాదు, సమాజానికి మొత్తంగా జరిగే హానిని, నేడు కలిగే కీడును మాత్రమే కాదు, రేపటి తరానికి జరిగే చేటును చూడగలిగే వివేచన లేకపోవడం ప్రమాదకరం. వరదలు వచ్చి తమ ఇళ్లు మునిగిపోయినప్పుడు, ఒకనాటి చలువ నగరం ఇప్పుడు నిత్యవేసవి పట్టణంగా మారుతున్నప్పుడు, ఆ క్షణానికి మాత్రం ఒక విసుగో శాపనార్థమో పెట్టి సంతృప్తిపడే నగరజీవి, తనకు లాభం కలిగే అవకాశం వచ్చినప్పుడు తిరిగి పదిమందికి, ప్రకృతికి హానిచేయడానికి వెనుకాడకపోవడం బాధాకరం. తమ భూములకు విలువ పెరుగుతుందని జీవో 111 రద్దు చేయడాన్ని వేడుక చేసుకునే ఆత్మాహుతి నాగరికులు మనలో ఉన్నారు. నదీగర్భంలో, తీరంలో ఆక్రమణలు తొలగించడం వల్ల ఏదో లాభం కలుగుతుందని అనుకుంటున్నవాళ్లకు, నదీమూలాన్ని ఛిద్రం చేస్తే ఏం జరుగుతుందో తెలియదా? గంగ, గోదావరి, కృష్ణ, కావేరి ఈ నదుల మూలస్థానాలు చూస్తే, వాటికి ఎంత విలువో, ఎంతటి రక్షణో? ఎందుకు మూసి, ఈసా, కాగ్నా మాత్రం ఏం పాపంచేశాయి? జరుగుతున్న అపచారాన్ని భరించలేక, ఈ నదులు భూమిలోకి ఇంకిపోతే, నాలుగోనగరంతో సహా హైదరాబాద్ మరో రామగుండమే కదా?
పర్యావరణం గురించి, వనరుల పరిరక్షణ గురించి పట్టింపుతో ఉన్నవారిని వెక్కిరించడం కూడా నేటి నవసంపన్నుల కాలక్షేపం. దేశరక్షణతో ముడిపడిన ‘అభివృద్ధి’ విషయం అంటే, ఇక ఉద్యమకారుల నైతికత మీద దాడిచేయడానికి అవకాశం దొరికిందని వారికి సంబరం. అందుకే ప్రకృతికి ఇవ్వవలసిన భద్రతను ఉపసంహరించడానికి, లాభార్జనపరులకు కట్టబెట్టడానికి దేశరక్షణను ఒక సాకుగా చేసుకోవడం కూడా ప్రభుత్వాలు చేస్తున్నాయి. అన్ని సందర్భాలలోనూ ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించలేము కానీ, కీలకమయిన విషయాల్లో దేశభద్రత అంశాన్ని ముందరికాళ్లకు బంధంగా ప్రయోగించడం ఈ మధ్య తరచు చూస్తున్నాము. అటవీచట్టానికి ఈ మధ్య చేసిన కీలకమయిన సవరణల్లో, 15వేల కిలోమీటర్ల పొడవైన అంతర్జాతీయ సరిహద్దుల దగ్గర భూములను స్వాధీనం చేసుకునే వెసులుబాటు ఒకటి. అవి మామూలు అడవులైనా, రక్షితారణ్యాలైనా సరే, రక్షణ అవసరాల కోసం తీసుకోవచ్చునట. ఈ మధ్య నికోబార్ ద్వీపాన్ని ఆదిమవాసుల నుంచి కబ్జాచేసే ప్రక్రియను చూశాం. బంగాళాఖాతంలో మనకూ ఒక హాంకాంగ్ కావాలట. అదొక అభివృద్ధి ఎర. అంతరించిపోతున్న ఆదిమవాసులకు ఒక 75 చదరపు కిలోమీటర్లు ఉదారంగా ఇస్తారట. ఇది ఒక పరిహారం. ఇదంతా ఏదో వ్యాపారం కోసమే కాదు, నికోబార్‌లో రక్షణశాఖ నౌకాస్థావరాన్ని నిర్మిస్తారట. నోరెత్తడానికి వీలు లేని బ్రహ్మాస్త్రం! మొత్తం మీద నికోబార్‌ను నాగరీకం చేయడానికి సుమారు 8 లక్షల చెట్లను ప్రస్తుతానికి బలిఇస్తారట! ఇక, అబూజ్‌మడ్ అడవుల మధ్యలో లక్ష ఎకరాలకు పైచిలుకు స్థలంలో సైన్యానికి విన్యాస యుద్ధ శిక్షణ. 52 అటవీ గ్రామాలు ఖాళీ. యుద్ధటాంకులతో పోరాటానికి శిక్షణ కేంద్రం కాబట్టి, అడవిని చదును చేయకతప్పదు. ఎన్ని లక్షల చెట్లకు శిరచ్ఛేదమో తెలియదు! దీన్ని ఔననక తప్పదు, లేకపోతే, ‘అర్బన్’ విశేషణం ఉదారంగా లభిస్తుంది!
అడవులను చట్టబద్ధంగా, బాహాటంగా స్వాధీనం చేసుకుంటున్న ఈ చర్యల్లో ఒక క్రమాన్ని చూడవచ్చు. అభివృద్ధి అనేది కూడా మతతత్వంలాగా తీవ్రమైపోయి, దానికి అభ్యంతరం చెప్పడమే ద్రోహమయ్యే పరిస్థితి నెలకొన్నది. దామగుండం అడవుల్లో ఓషధి వృక్షాలు అంతరిస్తాయని, వందల ఏళ్ల వయస్సున్న చెట్లు కూలిపోతాయని తెలిసినప్పుడు, లోలోపలి నుంచి ఊపిరితిత్తుల మూలుగు వినిపించాలంటే, మానవీయ పర్యావరణం స్వచ్ఛంగా ఉండాలి!
చూద్దాం, దామగుండం పల్లెల్లో ఈ సారి పోరు బతకమ్మ ఆడతారట, చెట్లను కావలించుకుని మరో చిప్కో ఉద్యమం చేస్తారట!
కె. శ్రీనివాస్
Updated Date - Sep 26 , 2024 | 02:24 AM