ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రాజీవ్ గాంధీకి, తెలంగాణ తల్లికి పోటీ ఎందుకు?

ABN, Publish Date - Sep 19 , 2024 | 05:31 AM

రాహుల్ గాంధీ మీద శివసేన ఎమ్మెల్యే ఒకరు, బీజేపీ ఎంపీ ఒకరు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ, బుధవారం నాడు ఢిల్లీలోనూ, హైదరాబాద్‌లోనూ జరిగిన ఆందోళనల తీరు చూస్తే, కాంగ్రెస్ శ్రేణులలో తిరిగి భావావేశాలు ప్రవేశించాయని...

రాహుల్ గాంధీ మీద శివసేన ఎమ్మెల్యే ఒకరు, బీజేపీ ఎంపీ ఒకరు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ, బుధవారం నాడు ఢిల్లీలోనూ, హైదరాబాద్‌లోనూ జరిగిన ఆందోళనల తీరు చూస్తే, కాంగ్రెస్ శ్రేణులలో తిరిగి భావావేశాలు ప్రవేశించాయని అనిపించింది. రాహుల్ రాజకీయ పరిణతిని అభిమానించేవారే కాక, ఆయన వ్యక్తిత్వంతో అనుబంధాన్ని పెంచుకుంటున్నవారు కూడా పెరుగుతున్నారు. ఇది కాంగ్రెస్‌కు మంచిది. కొన్ని దశాబ్దాలుగా ఆ పార్టీ జనరంజక అధినేత లేని కొరతలో ఉంది, ఇందిర, రాజీవ్ ముఖచిత్రాల మీదనే ఇంకా ఆధారపడుతోంది.

గాంధీ కుటుంబం గురించి గాడిదలకేమి తెలుసును అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు కానీ, ఇక్కడ ఆయన ఉద్దేశం, గాంధీ కుటుంబం అంటే నెహ్రూ కుటుంబం. జాతీయోద్యమ నాయకుడిగా, సాహిత్య, కళా, మేధారంగాల అభిరుచి కలిగినవాడిగా నెహ్రూ మీద దేశంలో గౌరవం, ఆరాధన ఉన్నాయి కానీ, ఆయనేమీ గాంధీ లాగా మాస్ లీడర్ కాదు. ప్రజానాయకురాలు అంటే, ఇందిరాగాంధీయే. ఇందిర మరణానంతరం ఉప్పొంగిన సానుభూతి వెల్లువలో రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యారు. ఆయన తరువాత, దేశంలో కాంగ్రెస్ మెజారిటీ ప్రభుత్వం ఏర్పడనే లేదు. యూపీఏ ప్రభుత్వాలకు సాంకేతిక నాయకత్వం వహించిన మన్మోహన్ సింగ్ కూడా గౌరవం పొందినంతగా జనాభిమానం పొందినవారు కాదు, అందుకు తగ్గ అధికార స్వేచ్ఛా ఆయనకు లేకపోయింది. కాంగ్రెస్‌కు తిరుగులేని రోజుల్లోనే ఆ పార్టీలో జనాకర్షకనేతలు వచ్చారు.


ప్రజారంజకత అనేది రాజకీయాల్లో ఒక జటిలమైన లక్షణం. ప్రజలు విపరీతంగా ప్రేమించడం వల్ల అధికారం అమితంగా పొందవచ్చు. అదే సమయంలో, అందుకు ప్రతిఫలంగా ప్రజలకు ఏదో ఒకటి చేస్తూ కూడా ఉండాలి. అట్లా చేయకపోయినా, అపకారం చేసినా, ప్రజలు ఆ తిరుగులేని అభిమానాన్ని వెనక్కి తీసుకుంటారు. ప్రజలకు అప్రియమైన లేదా కఠినమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ప్రజల్లో పెద్దగా చెలామణీ లేని నాయకుడు ఉండడమే రాజ్యానికి మంచిది. తనను జనం ప్రేమిస్తున్నారు కదా అని, ఆ ధీమాతో వారినే అణచివేయాలని చూసే నాయకులకు ఏమంత సానుకూలమైన ఫలితాలు లభించవు. ఇందిరాగాంధీ తన నినాదాల ద్వారా, తనను తాను ప్రదర్శించుకున్న తీరు ద్వారా, ఆ కాలంలో తీసుకోగలిగిన కొన్ని నిర్ణయాల ద్వారా, ప్రజలకు బాగా దగ్గరగా వెళ్లారు. తమ దాకా చేరిన ప్రతిసంక్షేమం మీదా ఇందిరపేరే ప్రజలకు వినిపించేది. ఇందిర అన్నీ మంచే చేయాలనుకుంటారని, మధ్యలో ఇతరులు దానిని భంగపరుస్తున్నారని జనం అనుకునేవారు. ఎమర్జెన్సీ అకృత్యాలకు గాను ఆమెను ఘోరంగా ఓడించినప్పటికీ, ఆమెతో మానసిక అనుబంధం మాత్రం జనంలో మిగిలే ఉండింది.


రాజీవ్ గాంధీ అట్లా కాదు. మొదట అతను రాజకీయాలమీద అనాసక్తుడు. తమ్ముడి అకాలమరణం వల్ల దిగక తప్ప లేదు. ఇందిర హత్య కారణంగా, అనివార్య వారసుడయ్యాడు. నాలుగువందల పైచిలుకు స్థానాల విజయం ఇందిర మరణం వల్ల కలిగిన సానుభూతితోనే తప్ప, ఆయన స్వార్జితం కాదు. అంతటి బలం పునాదితో ప్రధాని అయిన వ్యక్తి, తనను తాను తల్లిలాగా బలపరచుకోవాలని, స్థిరపరచుకోవాలని అనుకోవడంలో తప్పులేదు. కానీ, రాజకీయంగా అనుభవం లేని రాజీవ్‌కు తప్పుడు మార్గదర్శనం లభించింది. పంజాబ్ కల్లోలాన్ని పరిష్కరించలేకపోయారు. దేశంలో అటానమీ ఉద్యమాల సమస్యలను ఎదుర్కొనలేకుండానే, పక్క దేశంలో వేర్పాటు ఉద్యమాలలో కల్పించుకున్నారు. దక్షిణాసియాలో పెద్దరికం చేయాలనుకున్నారు. ఇన్ని పెద్ద పెద్ద ప్రయత్నాల మధ్య పార్టీలో ప్రభుత్వంలో ఏమి జరుగుతున్నదీ తెలుసుకోలేకపోయారు. పెళ్లివల్ల ఏర్పడిన ఇటలీ అనుబంధంలో అవినీతి ఉన్నదన్న ఆరోపణలు వచ్చాయి. అంత గొప్ప మెజారిటీతో గెలిచిన నాయకుడు తరువాతి ఎన్నికలలో అధికారం కోల్పోయాడు. శ్రీలంక గొలుసుకట్టు ప్రభావాలు మరో రెండేళ్లకు ఆయన ప్రాణాలనే బలితీసుకున్నాయి. ఇందిర, రాజీవ్ ఈ దేశ ప్రజారంగంలో ఉంటూ, తమ విధానాలకోసం ప్రాణత్యాగం చేసినమాట వాస్తవమే, అదే సమయంలో ఆ ఇద్దరి దురదృష్టకర మరణాల వెనుక అనేక విధాన వైఫల్యాలున్నాయి.

రాజీవ్ గాంధీ మరొక పార్శ్వం చూద్దాము. ఆయనకు ఇంకా జనం బ్రహ్మరథం పట్టకముందే, ఇందిరాగాంధీ గొడుగు కింద పార్టీ పదవిలోను, ఎంపీగాను ఉన్న కాలంలోనే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంజయ్యతో వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. అది ఎన్‌టి రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఒక ముఖ్య ప్రచారాస్త్రం అయింది. భావావేశాలు ముడిపడి ఉన్న ఒక నాయకురాలి కుమారుడు, తమ మనోభావాలను దెబ్బతీయడం తెలుగుప్రజలు ఇష్టపడలేదు. ఎన్టీయార్‌ను గద్దె దించిన పరిణామాలలో ఇందిరతో పాటు రాజీవ్ గాంధీ కూడా ఉన్నారు. ఇందిర దారుణ హత్యకు తెలుగు ప్రజలు గుండెలు పగిలి ఏడ్చారు కానీ, అనంతర ఎన్నికలలో కాంగ్రెస్‌కు, రాజీవ్ గాంధీకి ఓటు మాత్రం వేయలేదు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమ అనంతర ఎన్నికలు కావడం వల్ల, సానుభూతి ప్రభంజనం తెలుగు రాష్ట్రంలో వీచనే లేదు.


1989 లోక్‌సభ ఎన్నికలలో దేశమంతటా ఓడిపోయిన కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్‌లో ఘనవిజయం (42లో 39) సాధించడానికి కారణం రాజీవ్ గాంధీ జనాకర్షణ శక్తి మాత్రం కాదు, తెలుగుదేశం పాలనపై ఏర్పడిన విరక్తి, చెన్నారెడ్డి రూపంలో కాంగ్రెస్‌కు దొరికిన సమర్థమైన రాష్ట్ర నాయకత్వం. 1991లో సాధారణ ఎన్నికలు రాష్ట్రంలో రెండు దశలలో జరిగాయి. రాజీవ్ హత్యకు ముందు ఒకటి, ఆ తరువాత ఒకటి. సానుభూతి ప్రభావం ఉన్నది కానీ, ఆంధ్రప్రదేశ్‌లో దాని శక్తి మునుపటి ఎన్నికల స్థాయిని అందుకోలేకపోయింది. (1991లో గెలుచుకున్నది 42లో 25 మాత్రమే). రెండు సంవత్సరాల కాలంలోనే తెలుగుదేశం పార్టీ బాగా పుంజుకోగలిగింది (1989లో 2 స్థానాల నుంచి, 1991లో 11 స్థానాలకు). తెలంగాణ వరకే చూసుకున్నా, నాటి 15న్నర స్థానాలను మొత్తంగా 1989లో గెలుచుకోగా, 1991లో పది మాత్రమే నిలుపుకుంది. కోస్తాంధ్ర, రాయలసీమల కంటె మెరుగే. మొత్తం మీద రాజీవ్ గాంధీ తెలుగు రాష్ట్రం మీద వేసిన ప్రభావమూ తక్కువే, తెలుగు సమాజంతో ఆయనకు గాఢమైన అనుబంధం ఏర్పడడానికి కలిగిన అవకాశమూ తక్కువే.

గత మూడు నాలుగు దశాబ్దాలలో కాంగ్రెస్ తరఫున ప్రధానులుగా చేసినవారిలో జనరంజకులు ఎవరూ లేకపోయినా, రాష్ట్రాలలో కొందరు జనప్రియ నాయకులయ్యారు. అందులో ఒకరు రాజశేఖరరెడ్డి. తన హయాంలో నెహ్రూ, ఇందిర, రాజీవ్ గాంధీ పేర్లతో రాష్ట్రాన్నంతా నింపినప్పటికీ, తనకంటూ ఒక ప్రత్యేక ప్రతిష్ఠను, జనసంబంధాన్ని ఏర్పరచుకున్నారు. రాష్ట్రాలలో ప్రాంతీయపార్టీ నాయకులకు మాత్రమే సాధ్యమయ్యే జనాకర్షణ ఆయనది. అట్లాగే, కర్ణాటకలో సిద్దరామయ్య సొంత ప్రతిష్ఠ కాంగ్రెస్ విజయానికి పనికివచ్చింది. రేవంత్‌రెడ్డి కూడా ఆ జనాకర్షక నాయకుల కోవలోకి చేరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన తన సొంత ఇమేజిని ప్రచారంలో పెట్టారు. రేవంత్‌కు ఏర్పడిన ప్రాచుర్యం వల్ల ముఖ్యమంత్రి ఎంపికలో అధిష్ఠానానికి వేరే దారే లేకుండా పోయింది. పాలనలో కూడా పార్టీలోని వివిధ బృందాలతో ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మరో వైపు అధిష్ఠానాన్ని కూడా మంచిచేసుకుంటున్నారు. బహుశా, రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు కూడా ఆ ‘మంచి’ ప్రయత్నాలలో ఒకటి కావచ్చు! ఆ ప్రయత్నం హుందాగా జరిగితే రాజీవ్ స్మృతికి కూడా మరింత గౌరవం దక్కేది!


నిజానికి, రేవంత్‌రెడ్డి జనరంజక ప్రతిష్ఠ ఇంకా కౌమారదశలోనే ఉంది. ఘనవిజయాలను కూడా నిలుపుకోలేకపోయిన గత కాంగ్రెస్ నేతల కోవలోకి, తాను తొందరపాటుతో, ఆత్రుతతో జారిపోకుండా ఆయన జాగ్రత్తపడాలి. కానీ, ఆయన సలహాదారులెవరో కానీ, తెలంగాణ వాదంతో, సెంటిమెంట్‌తో తలపడడానికి, దానితో పోటీ పెట్టుకోవడానికి ఆయనను అనవసరంగా ప్రోత్సహిస్తున్నారు. కేసీఆర్‌ను, ఆయన పార్టీని ఎంతైనా విమర్శించవచ్చు, కానీ, తెలంగాణతనాన్ని వదులుకోగూడదు. ఒక విషయం గుర్తించాలి, ఈ రాష్ట్రం భౌగోళికంగా ఇట్లాగే ఉంటుంది, మరెప్పుడూ 2014కు ముందు రూపానికి వెళ్లదు. తెలంగాణ ఉద్యమం, దాని చిహ్నాలు, దాని నినాదాలు అన్నీ బీఆర్ఎస్ సొత్తూ కాదూ, కేసీఆర్ సొంత ఆస్తీకాదు. మొదట తెలంగాణ గీతం, చిహ్నం మొదలైన అంశాల మీద వివాదానికి ఆస్కారమిచ్చిన ముఖ్యమంత్రి, ఆ తరువాత తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో తగవుకు చోటిచ్చారు. ఇవన్నీ భావోద్వేగాలకు, మనోభావాలకు సంబంధించిన సున్నితమైన విషయాలు! తెలంగాణ తల్లితో ముడిపడిన భావావేశాలకు, ఎంత గొప్ప జాతీయనేత అయినప్పటికీ రాజీవ్ గాంధీ పోటీకాగలరా? రాజీవ్ గాంధీని ఆకాశమెత్తున గౌరవించుకోవడానికి మహానగరంలో మరెన్ని చోట్లు లేవు? సచివాలయం ప్రాంగణంలో తెలుగుతల్లి విగ్రహం పెట్టాలనుకోవడం కొంత గౌరవమే, ఇన్నేళ్లుగా తెలంగాణ తల్లిని కేసీఆర్ తన పార్టీ ఆఫీసుకే పరిమితం చేయడం నేరమే. అయినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం కలిగిస్తున్న కొరత పెద్దది కదా? ఒకనాటి తెలుగుతల్లి కూడలి, రాష్ట్ర విభజన తరువాత, తెలంగాణ తల్లి కూడలిగా ఉండడమే న్యాయం కదా?


పార్టీ పేరు నుంచి కూడా తెలంగాణను తొలగించిన బీఆర్ఎస్, ఇప్పుడు మనుగడ కోసం, తీవ్రమైన ప్రాంతీయ భాష మాట్లాడవలసి వస్తున్నది. ప్రజల మానసిక సున్నితత్వాలను దృష్టిలో పెట్టుకోకుండా, మొరటుగా వ్యవహరిస్తే, చేజేతులా ఆయుధాన్ని ప్రత్యర్థికి అందించినట్టే అవుతుందని రాష్ట్ర కాంగ్రెస్ తెలుసుకోవాలి. రాహుల్ గాంధీ చుట్టూ ఆరోగ్యకరమైన, కొత్త భావోద్వేగాలు రూపొందాలని కోరుకుందాం. కానీ, ఒక చారిత్రక వాస్తవికతను కూడా గుర్తించాలి. తెలుగు రాష్ట్రాలలో, మొత్తంమీద దక్షిణాదిన ప్రాంతీయత కలిగించే మానసికానుబంధం, జాతీయస్థాయి రాజకీయం వల్ల ఎంతమాత్రం ఏర్పడదు. తెలంగాణలో సోనియాగాంధీకి లభించే గొప్ప గుర్తింపు కూడా, రాష్ట్రావతరణను సాధ్యం చేసిన నేతగానే! రాజీవ్ గాంధీకి లభించే స్మరణ కూడా తెలంగాణ ‘‘ఇచ్చిన’’ సోనియా భర్తగానే!

కె. శ్రీనివాస్

Updated Date - Sep 19 , 2024 | 05:32 AM

Advertising
Advertising