ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వచ్చే ఒలింపిక్స్‌కు

ABN, Publish Date - Sep 14 , 2024 | 05:07 AM

క్రీడల్లో మన తెలంగాణ బిడ్డలు ప్రపంచ దేశాల సరసన ఎందుకు నిలబడద్దు! పతకాలు కొన్ని దేశాలకే పరిమితమా! మనం ఎందుకు వెనుకపడుతున్నాం! ఎందుకు విశ్వవిజేతలుగా నిలవడం లేదు! – అనుకుంటే లక్ష్యాన్ని సాధించే సత్తా తెలంగాణ బిడ్డలకు ఉంది.

క్రీడల్లో మన తెలంగాణ బిడ్డలు ప్రపంచ దేశాల సరసన ఎందుకు నిలబడద్దు! పతకాలు కొన్ని దేశాలకే పరిమితమా! మనం ఎందుకు వెనుకపడుతున్నాం! ఎందుకు విశ్వవిజేతలుగా నిలవడం లేదు! – అనుకుంటే లక్ష్యాన్ని సాధించే సత్తా తెలంగాణ బిడ్డలకు ఉంది. పట్టుదల, క్రమశిక్షణతో కఠోరంగా శ్రమిస్తే అనుకున్న లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇదే ఆలోచనతో సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని మట్టిలో మాణిక్యాలను వెలికితీసి వారి ప్రతిభకు పదునుపెట్టి సరైన శిక్షణను ఇప్పించి అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ క్రీడాకారులుగా తెలంగాణ బిడ్డలను తయారు చేయాలనే ఉక్కు సంకల్పంతో యంగ్ ఇండియా తెలంగాణ స్పోర్ట్స్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సుమారు 200 ఎకరాల్లో ఈ యూనివర్సిటీని హైదరాబాద్‌లోని ముచ్చర్లలో నిర్మిస్తారు.

అంతర్జాతీయ వేదికల్లో తెలంగాణ నుంచి మన క్రీడాకారులే అత్యధికంగా పతకాలు సాధించి తెచ్చే స్థాయిలో రాష్ట్రాన్ని క్రీడా రంగంలో గొప్పగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కంకణం కట్టుకున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని భావిస్తున్న ఫ్యూచర్ సిటీలోని (ఫోర్త్ సిటీ) స్పోర్ట్స్ హబ్‌లో దాదాపు 12 క్రీడల అకాడమీలను నెలకొల్పాలని ప్రభుత్వం భావిస్తున్నది. వీటిలో అంతర్జాతీయ స్థాయిలో అధునాతన సదుపాయాలు కల్పించనున్నారు. ఈ స్పోర్ట్స్ హబ్‌లో స్పోర్ట్స్ సైన్స్ సెంటర్, స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్ కూడా అందుబాటులో ఉంటాయి. క్రీడాకారులకు శిక్షణతో పాటు తగిన పరిశోధనలకు నిలయంగా వర్సిటీ రూపుదిద్దుకోనుంది. ప్రతి క్రీడకు ఇందులో ప్రాధాన్యం ఉంటుంది.


రాష్ట్రంలోని అన్ని క్రీడా విభాగాలు, ప్రభుత్వ ఆధ్వర్యంలోని క్రీడా పాఠశాలలు, అకాడమీలు, క్రీడా శిక్షణ సంస్థలు అన్నింటిని స్పోర్ట్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురానున్నారు. మన దేశ క్రీడాకారులు ఒలింపిక్స్‌లో రాణించేలా షూటింగ్, రెజ్లింగ్, బాక్సింగ్, అర్చరీ, జావెలిన్ త్రో, హాకీ క్రీడల్లో మొదట శిక్షణ ఇవ్వనున్నారు. ఆ ఆరింటి తర్వాత పతకాలు సాధించే అవకాశాలు ఉన్న క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. యూనివర్సిటీలో వసతులు, ఆహారం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అందిస్తారు.

ఇటీవల విదేశీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ మినిస్టర్ శ్రీధర్‌బాబు దక్షిణ కొరియాలో పర్యటించిన సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ పురుడుపోసుకుంది. సియోల్‌ లోని కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని ముఖ్యమంత్రి సందర్శించారు. అది ప్రపంచంలోనే పేరుపొందిన స్పోర్ట్స్ యూనివర్సిటీగా ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఇటీవల పారిస్ ఒలంపిక్స్‌లో దక్షిణ కొరియా మొత్తం 32 పతకాలు గెలుచుకోగా వాటిలో 16 పతకాలు ఈ యూనివర్సిటీలో శిక్షణ పొందిన అథ్లెట్లే సాధించారు. ఈ యూనివర్సిటీని సాంకేతిక భాగస్వాములుగా వాడుకొంటూ తెలంగాణలోని భవిష్యత్తు ఒలింపిక్ ఛాంపియన్లకు శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


రాబోయే 2028 ఒలంపిక్స్‌లో అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం నుంచి క్రీడాకారులు అత్యధికంగా పతకాలు సాధించేలా ముఖ్యమంత్రి రూపకల్పన చేస్తున్నారు. ఇందుకోసం కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. దక్షిణ కొరియా నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. యూనివర్సిటీ విధానం, క్రీడాకారుల ఎంపిక, శిక్షణ ఏ విధంగా ఇస్తున్నారు, అనుసరిస్తున్న ప్రత్యేక ప్రణాళిక ఏంటి... ఇలాంటి అంశాలపై పూర్తిస్థాయి అధ్యయనం జరపాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన వివిధ దేశాల క్రీడాకారులపై స్టడీ చేయాలని ఆదేశించారు. ఆయా దేశాలు ప్రోత్సహించిన తీరు. వారికి ఇచ్చిన శిక్షణ తదితర అంశాలపై సమగ్ర నివేదిక అందించాలని సూచించారు.

అంతేగాక, హైదరాబాద్‌లో ఉన్న స్టేడియాలను ఒలింపిక్స్ స్థాయికి ఆధునీకరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని క్రీడాప్రాంగణాల్లో సౌకర్యాలను మెరుగుపరచనున్నారు. రాష్ట్రంలోని ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో ఒక స్పోర్ట్స్ స్కూల్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ స్కూళ్లలో విద్యాబోధన కూడా ఉంటుంది. అయితే ఇందులో క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. విద్యార్థులకు నచ్చిన ఆటలో శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత ప్రతిభ ఆధారంగా వారికి స్పోర్ట్స్ యూనివర్సిటీలో వసతి కల్పించి మరింత పదును పెడతారు. రాబోయే రోజుల్లో తెలంగాణ క్రీడాకారులు అంతర్జాతీయంగా పతకాలు సాధించి తెలంగాణకు మంచి పేరు రావాలనే ముఖ్యమంత్రి ఆశయం నెరవేరాలని ఆకాంక్షిద్దాం.

-వెలిచాల రాజేందర్‌రావు

కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌

Updated Date - Sep 14 , 2024 | 05:07 AM

Advertising
Advertising