ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Polls 2024: ‘దక్షిణ’ ద్వారం తెరుచుకుంటుందా?

ABN, Publish Date - Mar 21 , 2024 | 05:21 AM

శివుడూ పార్వతీ పెళ్లిచేసుకుంటుంటే, అంబానీ చిన్న కొడుకు పెళ్లికి వచ్చినట్టుగా, పొలోమంటూ దేవలోకంలోని విఐపీలు అందరూ హిమాలయాలకు వెళ్లారట. ఉత్తరం దిక్కున బరువు...

శివుడూ పార్వతీ పెళ్లిచేసుకుంటుంటే, అంబానీ చిన్న కొడుకు పెళ్లికి వచ్చినట్టుగా, పొలోమంటూ దేవలోకంలోని విఐపీలు అందరూ హిమాలయాలకు వెళ్లారట. ఉత్తరం దిక్కున బరువు ఎక్కువై భూమి ఒకవైపు ఒరిగిపోవడం మొదలుపెట్టింది. దక్షిణంవైపు బరువు పడితే కానీ, తూకం సరిపోదని అనుకుని అగస్త్యముని దక్షిణాదికి వచ్చి, బేలన్స్ చేశాడట. ఇదికాక మరొక కథ కూడా ఉంది. వింధ్య పర్వతం అడ్డూఆపూ లేకుండా నిలువుగా పెరిగిపోవడం మొదలు పెట్టిందట. ఆకాశంలోకి చొచ్చుకువెళ్లి సూర్యుడికీ చంద్రుడికీ కూడా అడ్డుపడి, గ్రహగతులు ఆగిపోయేట్టు చేసిందట. ఉత్తరానికీ దక్షిణానికీ రాకపోకలు కూడా అసాధ్యమయ్యాయట. లోకమంతా వచ్చి మొరపెట్టుకుంటే, అగస్త్యుడు వింధ్య దగ్గరికి వచ్చి, నేను దక్షిణం వైపు పోవాలి దారివ్వమని అడిగాడు. అగస్త్యుడంటేనే పర్వతాలనే కదిలించగలవాడు అని అర్థం కదా, అందుకని గౌరవంగా, వింధ్యుడు తలవంచి, తన ఎత్తు తగ్గించుకున్నాడు. నేను మళ్లీ దక్షిణం నుంచి ఉత్తరం వైపుకు తిరిగివెడతాను, అప్పటిదాకా ఇట్లాగే ఉండు అని అగస్త్యుడు చెప్పాడు. అగస్త్యుడు తిరిగి ఉత్తరదిక్కు వెళ్లలేదు. వంగిపోయిన వింధ్య అట్లాగే, దక్షిణానికి దారి ఇస్తూ మిగిలిపోయింది. దక్షిణం వాళ్లు, ముఖ్యంగా తమిళుల కథలో కొన్ని చేర్పులుంటాయి. తమిళుల మొదటి వ్యాకరణం పేరు అగత్తియం. రాసింది అగస్త్యుడు. అతను ఉత్తరాది నుంచి వస్తే వచ్చాడు కానీ, దక్షిణంలో స్థిరపడి, ద్రావిడం నేర్చుకుని భాషకు సేవ చేశాడు. ఆర్యద్రావిడ సమాజాలకు మధ్య అవరోధాలను తొలగించి, ఉత్తరం వారు దక్షిణానికి వలసరావడానికి, దక్షిణాన్ని లోబరచుకోవడానికి అగస్త్యుడిని ఒక సంకేతంగా చెప్పేవాళ్లు ఉన్నారు. బలిచక్రవర్తి కథ కూడా అటువంటిదే అంటారు!

ప్రధానమైన ద్రావిడ భాష‌లు మాట్లాడే ప్రాంతాలు భారతదేశంలో దక్షిణంలో ఉన్న మాట నిజమే కానీ, అంతమాత్రమే చెబితే సరిపోదు. మూడువైపులా సముద్రం ఆవరించిన ద్వీపకల్ప భాగంలో ఉన్నాయని కూడా చెప్పుకోవాలి. మ‍ధ్య ఆసియా నుంచి ఉత్తరభారతంలోకి ప్రవేశించిన ఆర్యులు ఐదునదుల మైదానాల నుంచి క్రమంగా గంగాయమునా బేసిన్‌లోకి విస్తరించి తమదైన నాగరికతను నిర్మించుకున్నారు. తమ ప్రస్థానాన్ని దక్షిణాదికి కొనసాగించడం వారికి అంత సులభం కాలేదు. వంగ దేశం నుంచి సముద్రతీరం గుండా ఓఢ్రదేశం మీదుగా దక్షిణానికి రావడం కూడా ఏమంత సులువు కాలేదు. మరణానంతర వైతరిణి ఒరిస్సాలోనే ఉందట. వింధ్యపర్వతశ్రేణి, దండకారణ్యం నైసర్గిక కుడ్యాలుగా నిలిచాయి. అశోకుడు ఆంధ్ర, కర్ణాటకలలో కూడా శిలాశాసనాలు వేశాడు కానీ, ఈ ప్రాంతాలు మగధలో భాగమయ్యాయో లేదో చెప్పలేము. మౌర్యులు, శాలివాహనులు, కాకతీయులు, మొగలులు, కుతుబ్ షాహిలు దిగువకు దూసుకుపోయారు కానీ, దక్షిణాన ఎంతో కొంత కొస అజేయంగానే మిగిలిపోయింది. భారతీయ జనతాపార్టీ పదేళ్ల రాజసూయంలో కూడా దక్షిణాగ్ర భాగం ఇంకా స్వాధీనం కాలేదు.

దక్షిణ రాష్ట్రాలలో కలిగే ప్రయోజనానికి మించి నరేంద్రమోదీ ఎక్కువ కష్టపడుతున్నారు. ‘సౌత్ పుష్’ అంటున్నది జాతీయ ఇంగ్లీషు మీడియా. కొరకరాని కొయ్యగా ఉన్న దక్షిణాదిని ఈసారి లొంగదీసుకోవాలని ఆయన పట్టుదలగా ఉన్నారని చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా దేశమంతటికీ తన రాజకీయ ప్రాబల్యాన్ని విస్తరించినా, ఆ పార్టీలో కూడా ఉత్తరాది నాయకత్వానిదే పైచేయి అయినా, స్థానికంగా అటానమీని అనుమతించింది. అనేక రంగాలలో ఉత్తరాది ఆధిపత్యానికి తానొక రాయబారిగా కాంగ్రెస్ వ్యవహరించలేదు. దక్షిణభారతంలో వ్యక్తమైన స్థానిక ఆకాంక్షలను నెరవేర్చింది, భయాలను గౌరవించింది. ప్రాంతీయ పార్టీ చేతిలో ఓడిపోవడం తమిళనాడుతోనే కాంగ్రెస్ మొదటిసారిగా రుచిచూసింది. బీజేపీ పరిస్థితి వేరు. అతి బలహీనంగా ఉన్న కాలం నుంచి (జనసంఘంగా ఉన్నప్పుడుకూడా) దాన్ని ఉత్తరాది పార్టీగానే దక్షిణాది జనం భావించారు. ఎమర్జెన్సీ తరువాత కానీ, 1980 దశకం చివరలో కానీ ఉత్తరాది మధ్యే వాద పార్టీ ప్రభంజనాలు దక్షిణాదిని పెద్దగా కదిలించలేదు. తమ జాతీయవాదానికి దేశవ్యాప్త ఆమోదం కోసం, ‘ప్రగతిశీల’ భారతంలో విజయం కోసం భారతీయ జనతాపార్టీకి బెంగాల్ లోను, దక్షిణ రాష్ట్రాలలోను గెలుపు కావాలి. అతి సూక్ష్మ స్థాయి నుంచి పనిచేసుకుంటూ పథకం ప్రకారం బలాన్ని పెంచుకోగలిగిన ‘శక్తి’ బీజేపీకి ఉంది. కార్యశీలురైన నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఫలితాలు ఎట్లా ఉన్నా, వారి ప్రయత్నాన్ని మెచ్చుకోవచ్చు.

అశోకుడు కాకపోయినా, హర్షుడు కొంత, ఔరంగజేబు మరికొంత దక్షిణంలోకి చొచ్చుకువచ్చి ఆ తరువాత ఆగిపోయారు. గోవా ఎట్లాగూ భౌగోళికంగా తప్ప సాంస్కృతికంగా దక్షిణం కాదు. తక్కిన ఐదు రాష్ట్రాలూ ఉత్తరాది ప్రభావం నుంచి సమానంగా రక్షించుకున్నాయని చెప్పలేము. కర్ణాటక విజయం బీజేపీకి కొత్తేమీ కాదు. పొత్తులతోనో, ఫిరాయింపులతోనో బీజేపీ కర్ణాటకలో ఒకటి రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో 2014లోనే ఒక మైనర్ భాగస్వామిగా అయినా ప్రభుత్వంలో ఉన్నది. తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో ప్రభావశీలమైన ఉనికితో ఎప్పటి నుంచో ఉంటూ, గత పార్లమెంటు ఎన్నికలలో నాలుగు స్థానాలతో, సుమారు 20 శాతం ఓట్లతో పెద్ద విజయవిస్తరణ చేసుకోగలిగింది. కేరళలో 2016లో ఒక ఎమ్మెల్యేను గెలిపించుకున్న బీజేపీ, 2021లో 11 శాతానికి పైగా ఓట్లను సంపాదించింది. మరి కొత్తగా, దక్షిణ ద్వారాన్ని బద్దలు కొట్టడమనే ఘనకార్యంలో మోదీ ప్రస్తుతం ఉన్నారని అనడం సమంజసమేనా? అక్కడక్కడా బలంగానో, బలహీనంగానో ఉనికిలో ఉన్నప్పటికీ, సారాంశంలో దక్షిణాది ఇంకా పట్టుబడలేదన్న లోటు మాత్రం బీజేపీకి ఉన్నది. వింధ్యపర్వతం ఎక్కడున్నదో గుర్తించి, దాన్ని వంచగలిగితే, దక్షిణంలోకి మహాద్వారం తెరుచుకుంటుందని ఆశిస్తున్నది.

అంచుల్లో పలచబడుతున్నప్పటికీ, లోలోపలి అడవి దట్టంగానే మిగిలినట్టు, దక్షిణాదిలో కూడా కొంత అతి దక్షిణం ఉన్నది. భావపరంగానూ, భౌగోళికంగానూ కూడా ఉత్తరత్వానికి కొరుకుడుపడని కంచుకోటలు దక్షిణంలో మిగిలే ఉన్నాయి. వాటిని కొట్టగలిగితే, గంగా కావేరీ అనుసంధానం జరిగినట్టే. బీజేపీకి, మోదీకి అదే అంతిమలక్ష్యం కావచ్చును కానీ, ప్రస్తుతం దానిమీదే గురిపెట్టారనడం సరికాదు. ఎందుకంటే, మోదీ ‘సౌత్ పుష్’ దాడి వ్యూహం కాదు. ఆత్మరక్షణా వ్యూహం మాత్రమే. ఉత్తరాదిలో ఈ సారి తరిగిపోయే అవకాశమున్న సంఖ్యను దక్షణాదిలో భర్తీ చేసుకోవడం కోసం మాత్రమే ఈ ప్రత్యేక ప్రయత్నం. తమిళనాడు, కేరళల్లో ప్రస్తుతానికి కొత్త ఆశ ఏమీ లేదు. ఆ రెండు రాష్ట్రాలలో గతం కంటె నాలుగు ఓట్లు పెంచుకోవడమే లక్ష్యం. అతి దక్షిణం అని భౌగోళికంగా చెప్పగలిగే రాష్ట్రాలు ఆ రెండూ. కర్ణాటకలో ఒకవేళ కాంగ్రెస్ మీద విముఖత కలిగినా, గతంలో ఉన్న బలాన్ని దాదాపుగా నిలుపుకోవడమే తప్ప అదనపు ప్రయోజనం లేదు. సాంస్కృతికంగా, సామాజికంగా ఆ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు ఈ పాటికే ఉత్తరాది ప్రభావంలో పడిపోయాయి. కొత్తగా భావజాల పరంగా గెలుచుకునే ప్రాంతాలు, వర్గాలు ప్రస్తుతం అయితే లేవు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధించినప్పటికీ, అందులో బీజేపీ పాలు అతి తక్కువ. కాకపోతే, దీర్ఘకాలికంగా బీజేపీ విస్తరణ ప్రయత్నాలకు ఆ విజయం తోడ్పడవచ్చు. తెలంగాణలో బీజేపీ ప్రభావం పెరుగుతున్నదన్న వార్తలు నిజమైతే మాత్రం, అది ఆ పార్టీకి కీలకమయిన విజయం అవుతుంది. దక్షిణ దిశగా తోసిన ‘తోపు’ ఫలితం ఇచ్చినట్టు.

ఎందువల్ల? అంటే, తెలంగాణలో అధికప్రభావం చూపగలిగితే కనుక, బీజేపీ వెంటనే రెండో స్థానానికి, అతి త్వరలో అధికారస్థానానికి చేరుకోగలుగుతుంది. తెలంగాణలో బలం పెంచుకోవడం అంటే, పొత్తుల సాయంతో ఆంధ్రాలో నాలుగు సీట్లు సంపాదించుకున్నట్టు కాదు. తన సొంత ‘సిద్ధాంత’ బలంతో సంపాదించుకున్నట్టు. తన వేళ్లను తెలంగాణ నేలలో బలంగా నాటుకున్నట్టు. తెలంగాణ సమాజం ఆ మేరకు బీజేపీయీకరణం చెందినట్టు కూడా. దాని పర్యవసానాలు, ప్రభావాలు ఎట్లా ఉంటాయో సామాజిక, రాజకీయ పరిశీలకులు పోల్చుకోవచ్చు. తమిళనాడు, కేరళ అతి దక్షిణం అయినట్టు, తెలంగాణ ఎప్పటి నుంచో పలచబడిన దక్షిణం. చారిత్రకంగా ఉత్తర, దక్షిణాల మధ్య ఉండడం వల్ల కావచ్చు, ఉత్తరాది వలసలు అధికంగా ఉండడం వల్ల కావచ్చు, ముస్లిమ్ పాలకుల కింద దీర్ఘకాలం ఉన్న చరిత్ర వల్ల కావచ్చు, తెలంగాణ బీజేపీకి పంట పండించుకోవడానికి అనువైన క్షేత్రంగా ఉండింది. అయితే, అక్కడ భూస్వామ్యానికి, రాచరికానికి వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్టు, విప్లవ చరిత్ర కూడా ఉన్నది కాబట్టి, మితవాద రాజకీయాలకు అనువైన పరిస్థితులు ఇంతకాలం లేకుండా పోయాయి. తెలంగాణ వేదిక మీద ప్రజా ఉద్యమ రాజకీయాలు బలహీనపడి, సామాజిక దృష్టికోణాలు పలచబడడం మొదలయింది. దురదృష్టవశాత్తు, అందుకు ప్రత్యేక రాష్ట్ర సాధన అనంతర దశాబ్ద కాలం కూడా తోడ్పడింది. ఒకనాడు ఎక్కడ ప్రజా ఉద్యమాలు బలంగా ఉన్నాయో అటువంటి చోట్లనే ఇప్పుడు మత ఉద్రిక్తతలు, తీవ్రజాతీయవాదంపై ఆకర్షణలు పెరిగిపోయాయి. చిన్న పట్టణాలలో, జిల్లా కేంద్రాలలో యువకులు, విద్యార్థులు మోదీ ఆకర్షణలో ఉన్నారని, ‘కొత్త’ రాజకీయాలంటే ఉర్రూతలూగుతున్నారని వింటున్నప్పుడు, తెలంగాణలో అనూహ్యమైనది జరగబోతున్నదా అనిపిస్తున్నది. నాలుగైదు స్థానాలు గెలుస్తుందని కొందరు, లేదు, తొమ్మిది స్థానాల దాకా గెలిచి కాంగ్రెస్‌ను రెండోస్థానంలోకి నెట్టివేస్తుందని మరికొందరు లెక్కలు వేస్తున్నారు. ఏది నిజమైనా, అది బీజేపీని తెలంగాణలో రెండో స్థానానికి తెస్తుంది. బీఆర్‌ఎస్‌లో కొందరిని, కాంగ్రెస్‌లో కూడా కొందరిని తమ వైపు తిప్పుకుని చక్రం తిప్పగల అవకాశం బీజేపీకి వస్తుంది. ‘మితవాద’ జాతీయ జీవనస్రవంతిలో కలిసే అవకాశం తెలంగాణకు లభిస్తుంది.

కె. శ్రీనివాస్

Updated Date - Mar 21 , 2024 | 07:33 AM

Advertising
Advertising