ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శాంతి సాధనకు సైన్స్‌ !

ABN, Publish Date - Nov 15 , 2024 | 02:29 AM

శాంతియుత జీవనాన్ని, స్థిరమైన అభివృద్ధిని మానవ ప్రపంచం కోరుకుంటుంది. శాస్త్ర సాంకేతిక అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతితో పుష్కలమైన ఉపాధి అవకాశాలతో -ఆకలిచావులు లేని ప్రపంచాన్ని సమాజం ఆకాంక్షిస్తున్నది...

శాంతియుత జీవనాన్ని, స్థిరమైన అభివృద్ధిని మానవ ప్రపంచం కోరుకుంటుంది. శాస్త్ర సాంకేతిక అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతితో పుష్కలమైన ఉపాధి అవకాశాలతో -ఆకలిచావులు లేని ప్రపంచాన్ని సమాజం ఆకాంక్షిస్తున్నది. ఆ లక్ష్యసాధనకు ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇతర దేశాలతో కలిసి అభివృద్ధి చేసుకోవడం అత్యవసరమని ప్రపంచదేశాలు గుర్తించాయి. సంయుక్తంగా పరిశోధనలు నిర్వహించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని మార్పిడి చేసుకోవడం ప్రపంచదేశాలకు అనివార్యం, అవసరం.

పారిశ్రామిక విప్లవం అనూహ్య సంపద సృష్టించింది. దీంతో పారిశ్రామిక సంస్థలు పరిశోధనలపై దృష్టి సారించి -అవసరమైన నిధులు కేటాయించాయి. ఈ కారణంగా 19వ శతాబ్దం ప్రారంభం నాటికి శాస్త్ర పరిశోధనలు అన్ని దేశాలలో ఊపందుకున్నాయి. శాస్త్రవేత్తలు వారి వారి దేశాలలో జాతీయ అకాడమీలను ఏర్పాటుచేసి -ఇతర దేశాల అకాడమీ గ్రూపులతో అంతర్జాతీయ సంఘంగా ఏకీకృతమయ్యారు. పరస్పర సహకారం, సమన్వయంతో పరిశోధనలు నిర్వహించారు. ప్రపంచ యుద్ధాల కాలంలో చీలిపోయివున్న ప్రపంచ దేశాలు అభద్రతాభావంతో శాస్త్రవేత్తల సంఘాలను ప్రోత్సహించలేదు కానీ, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అంతర్జాతీయ సంఘాలు తిరిగి పునరుద్ధరించబడి, క్రియాశీలకపాత్ర పోషిస్తున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఐరోపాఖండంలోని 12 దేశాల శాస్త్రవేత్తలు కలసి సంయుక్తంగా అంతర్జాతీయ అణు పరిశోధనా కేంద్రాన్ని నెలకొల్పాలని సంకల్పించారు. అణు పరిశోధనలను - మానవజాతి అభివృద్ధి లక్ష్యాల వైపు తరలించాలని యూరప్ శాస్త్రవేత్తలు భావించారు. ఐక్యరాజ్యసమితి, దాని అనుబంధ సంస్థల సహకారంతో స్విట్జర్లాండ్ లో CERN(Conseil Européen pour la Recherche Nucléair)ను స్థాపించారు. ప్రపంచ యుద్ధాలకు ప్రధాన కారణమై -యూరప్‌కు భారీ నష్టం కలిగించిన పశ్చిమ జర్మనీ, ఇటలీలు కూడా CERN స్థాపనకు మద్దతు తెలిపి, వ్యవస్థాపక సభ్యులుగా చేరాయి. నేడు CERN ప్రపంచంలోనే అతిపెద్ద పరిశోధనా సంస్థలలో ఒకటి. ప్రపంచ యుద్ధాల ఫలితంగా ఐరోపా దేశాలలో వేళ్లూనుకున్న రాజకీయ వైరాలను, వైషమ్యాలను తొలగించి -ఐరోపా ఐక్యతకు విజ్ఞాన శాస్త్రం ఇలా ప్రముఖ పాత్ర పోషించింది.


సైన్సు సంఘాల అంతర్జాతీయ కౌన్సిల్ 1957ను అంతర్జాతీయ జియో ఫిజిక్స్ సంవత్సరంగా ప్రకటించి ప్రపంచంలోని 67 దేశాల భాగస్వామ్యంతో భూగోళ వ్యవస్థపై పరిశోధనలు నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో పరస్పరం విరోధించుకునే అమెరికా, రష్యాలు ఇతర దేశాలతో కలిసి అంటార్కిటికా ట్రీటికి అంగీకారం తెలిపాయి. అగ్రదేశాల మధ్య కుదిరిన ఈ సంచలనాత్మక ఒప్పందం ప్రచ్ఛన్న యుద్ధకాలంలో అమెరికా రష్యాల తొలి ఆయుధ నియంత్రణ ఒడంబడికగా గుర్తింపు పొందింది. ఈ ఒప్పందం శాస్త్ర సాంకేతిక అభివృద్ధితో పాటుగా -ప్రపంచంలో శాంతి నెలకొంటుందనే ఆశావాదాన్ని మానవ సమాజంలో చిగురింప చేసింది. కౌన్సిల్ శాస్త్రవేత్తల క్రియాశీలక పాత్ర అగ్రరాజ్యాల సానుకూల వైఖరికి ప్రధాన కారణం.


అమెరికా అధ్యక్షుడు జాన్ కెనెడి నేతృత్వంలో 1961లో ప్రారంభించిన అమెరికా జపాన్ సైన్సు సహకార కమిటీ కార్యకలాపాల్లో మొదట కొంత జాప్యం జరిగినా, ఆ తరువాత-రెండు దేశాల శాస్త్రజ్ఞులు, పరిశోధకుల క్రియాశీలక భాగస్వామ్యంతో జోరందుకున్నాయి. వాతావరణం, సాంకేతిక శాస్త్రం, వైద్య రంగాలలో సమస్యలకు పరిష్కారాలను కనుగొనాలని, పరిశోధనా రంగంలో పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగాలని ప్రాథమికంగా ప్రతిపాదించారు. భూకంపాలను ముందుగానే గుర్తించే విధానాలపై పరిశోధనలు, ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధికి చికిత్స, నివారణకు పరిశోధనలు అమెరికా, జపాన్ శాస్త్రవేత్తలు ప్రారంభించారు. 1988లో ప్రారంభమైన అమెరికా జపాన్ సంయుక్త కార్యాచరణ కమిటీ (Japan Joint Working-Level Committee (JWLC)) పరిశోధనా భాగస్వామ్యాన్ని వేగవంతం చేసి -అద్భుతమైన విజయాలను సాధించి పెట్టింది. రెండు దేశాల ప్రజల మధ్య వైషమ్యాలు తొలగిపోయి స్నేహ సంబంధాలు పటిష్టమయ్యాయి. అమెరికా జపాన్‌ల సాంకేతిక శాస్త్ర సహకారం అంతరిక్షనౌకల నిర్మాణం నుండి అంతరిక్ష పరిశోధనల వరకు విస్తరించింది. దశాబ్దాలుగా సాగుతున్న పరిశోధనా భాగస్వామ్యం 2024లో అత్యంత క్లిష్టమైన కృత్రిమ మేధపై పరిశోధనలకు శ్రీకారం చుట్టింది. రెండవ ప్రపంచ యుద్ధంలో అణుబాంబు ప్రయోగాలతో విధ్వంసమైన అమెరికా, జపాన్ సంబంధాలు సైన్స్, శాస్త్రవేత్తల పరిణతి చెందిన దౌత్యంతో మిత్ర దేశాలయ్యాయి.


కోవిడ్ మహమ్మారి మానవజాతిపై చేసిన దాడిని ఎదుర్కోవడంలో ప్రపంచమంతా ఒక్కటై విజయం సాధించింది. పరిశోధకులు పరస్పరం సహాయ సహకారాలను ఇచ్చిపుచ్చుకొని వ్యాక్సిన్ సకాలంలో ప్రతి పౌరుడికి అందించారు. పెను ఆపదలో ఉన్న మానవ సమాజాన్ని కాపాడటం కోసం శాస్త్ర విజ్ఞానం ప్రపంచ దేశాలను ఐక్యం చేసింది. సూక్ష్మజీవశాస్త్రంలో విశేష కృషి చేస్తున్న భారతదేశం 101 దేశాలకు వ్యాక్సిన్ అందించింది. శాస్త్ర పరిశోధనా రంగాలలో భారతదేశం ప్రపంచంలోని అన్ని ప్రముఖ దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలను పటిష్టం చేసుకుంది. భారతదేశం, యూరోపియన్ దేశాల మధ్య శాస్త్రసాంకేతిక రంగాలతో పాటు సంస్కృతిక ఒప్పందాలు కూడా ఉన్నాయి.


రెండు శత్రుదేశాల మధ్య స్నేహ, సౌభ్రాతృత్వాలు ఏర్పడటం కష్టం. చాలా దేశాల ద్వైపాక్షిక ఒడంబడికలు వాటి రాజకీయ ప్రయోజనాలతో ముడిపడి -అమలుకావటం లేదు. ఈ నేపథ్యంలో సైన్స్ ఒప్పందాలు, శాస్త్రవేత్తల క్రియాశీలక పాత్ర ఆ దేశాల మధ్య స్నేహ సంబంధాలను పటిష్టం చేస్తున్నాయి. సైన్స్ రెండు దేశాల ప్రయోజనాలను కాపాడుతూ - శాస్త్ర సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తూ -అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తోంది. ప్రజలు తమ దైనందిన జీవితంలో కనిపిస్తున్న అభివృద్ధిని ఆస్వాదిస్తూ -శాస్త్ర, సాంకేతిక, పరిశోధనా ఒప్పందాలను అంగీకరిస్తూ -దేశాల మధ్య స్నేహాన్ని ఆహ్వానిస్తున్నారు. దేశాల మధ్య స్నేహ సంబంధాలు పెంపొందటానికి సైన్స్ ఒక సా‌ధనంగా మారింది. మానవజాతికి విజ్ఞానాన్ని ప్రసాదించే ఒక శాస్త్రంగానే మిగిలిపోకుండా -శత్రు దేశాల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించడానికి ఆధునిక కాలంలో సైన్స్ విఫలంకాని దౌత్య వ్యూహంగా రూపు దిద్దుకుంది. ఈ కారణంగానే, శాంతియుత ప్రపంచాన్ని సాధించడంలో సైన్స్‌ పాత్రను నొక్కిచెబుతూ ఏటా నవంబరు 9 నుంచి 15 వరకూ ఐక్యరాజ్యసమితి ‘సైన్స్‌–ప్రపంచశాంతి’ వారోత్సవాలు నిర్వహిస్తున్నది.

భరత్ వేదాంతం

Updated Date - Nov 15 , 2024 | 02:29 AM