పరిమాణ చరిత్రతో మొదలై పరిణామ చరిత్రకు..
ABN, Publish Date - Oct 28 , 2024 | 06:09 AM
చరిత్రలో తమకు లభించిన స్థానమేమిటన్న ప్రశ్న దాదాపు అన్ని అస్తిత్వ సమూహాలూ వాదాలను నిర్మించుకోవడానికి కారణమైంది. తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమం కూడా ఆ ప్రశ్న వేసుకుంది....
చరిత్రలో తమకు లభించిన స్థానమేమిటన్న ప్రశ్న దాదాపు అన్ని అస్తిత్వ సమూహాలూ వాదాలను నిర్మించుకోవడానికి కారణమైంది. తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమం కూడా ఆ ప్రశ్న వేసుకుంది. సాహిత్యచరిత్రలో తమ ప్రాతినిధ్యం గురించి మరింత ఎక్కువగా మథన పడింది. తెలంగాణ ప్రాచీన సాహి త్యాన్ని చరిత్రీకరించి ‘ముంగిలి’ లో నిలబెట్టిన కవి, రచయిత డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి.. తెలుగు సాహిత్యచరిత్రల రచనాచరిత్ర అధ్యయనంలో భాగంగా కె.శ్రీనివాస్ ఆయనతో జరిపిన సంభాషణ ఇది.
తెలుగుసాహిత్యచరిత్ర మీద సమగ్రమైన తెలంగాణవాద విమర్శ ఉన్నదా?
సమగ్రమో కాదో కానీ, అలాంటి విమర్శ ఖచ్చితంగా ఉంది. విస్మృతి, వివక్ష, కాంట్రిబ్యూటరీ కోణాల నుంచి, తనదైన ప్రస్థాన కోణం నుంచి, ఆ విమర్శ ఉన్నది.
1. మొదటి విమర్శ, సురవరం ప్రతాపరెడ్డిది. గోలకొండ కవుల సంచిక సంపాదకీయంలో దాన్ని చూడవచ్చు. ‘నవ్యాంధ్ర సాహిత్య వీథులు’పై ఆయన చేసిన సమీక్షలోనూ ఉంది. 2. దేవులపల్లి రామా నుజ రావు వ్యాసాల్లో ఉంది. 3. వానమామలై వరదాచార్యులు రాసిన ఒక వ్యాసంలో ఉంది. 4. మీరు, నేను, సంగిశెట్టి శ్రీనివాస్, కాసుల ప్రతాపరెడ్డి రాసిన వ్యాసాల్లో ఉంది. వీటన్నిటినీ క్రోడీ కరిస్తే అది సమగ్ర తెలంగాణ వాద విమర్శ అవుతుంది.
తెలంగాణ రచయితలకు తెలుగు సాహిత్యచరిత్రలో లభించిన పరిగణన ఎటువంటిది?
ప్రాచీన సాహిత్యంలో పాల్కుర్కి, పోతన, గోనబుద్ధారెడ్డిలాంటి కొద్దిమందే పరిగణన పొందిండ్రు. నూతన కవి సూరన, చరిగొండ ధర్మన, కాణాదం పెదసోమన, భైరవ కవి, తెలంగాణ నుంచే అత్యధికంగా వెలువడిన కులపురాణాలు, వీరగాథలు, కీర్తన, తత్వకవులు పరిగణన పొందలేదు. ఆధునిక సాహిత్యంలో, కొద్దిగా సురవరం, వట్టికోట, కొంత విస్తృతంగా కాళోజీ, దాశరథి, సినారె లాంటి కొద్దిమందే పరిగణన పొందిండ్రు. 1965 నుంచి ముఖ్యంగా 1970 నుంచి తగినంతగా, తగినంత మంది పరిగణన పొందిండ్రు. వానమామలై సోదరులు, ఒద్దిరాజు సోదరులు, మామిళ్ల రామగౌడ్, గంగుల శాయిరెడ్డి, భాస్కరభట్ల లాంటి చాలా మంది ఊసే లేకుంట పోయిండ్రు.
తెలంగాణ స్థలాలు, తెలంగాణ కథావ్యక్తులు, తెలంగాణ రాజ్యాలు సాహిత్యచరిత్రలో ఎటువంటి ప్రాతినిధ్యాన్ని పొందాయి?
‘‘ఇప్పటికీ తెలంగాణకు చారిత్రక ప్రతీకలు కొదవే. ముఖ్యంగా చారిత్రక నాయకులు, యుద్ధాలు, ఘనమైన చారిత్రక దశ వంటివే లేవు’’ అని దాగ్మార్ బెర్న్ స్టార్ఫ్ అనే ప్రసిద్ధ పరిశోధకుడు రాసినాడు. తెలంగాణ తగినంత ప్రాతినిధ్యం పొందలేదని చెప్పటానికి ఈ మాటలు గొప్ప నిదర్శనం.
‘విజయనగరం’ అంత పొందకపోయినా ఓరుగల్లు ఒక్కటే తగినంత ప్రాచుర్యాన్ని పొందింది. అమరావతి ప్రాచుర్యం కోటిలింగాలకు దక్కలేదు. వేములవాడ, రాచకొండ, దోమ కొండ, పాపన్న పేట, హైద్రాబాద్ (గోల్కొండ).. ఇలాంటి వాటి సంగతి సరే సరి.
ప్రతాపరుద్రుడు, రుద్రదేవుడు, గణపతిదేవుడు, అనపోతా నాయకుడు, లింగమనీడు, కులీ కుతుబ్ షా- ఇలాంటి వారికి- రెడ్డి రాజులకు లభించిన స్థానం కూడ లభించలేదు. నా రచనలు ‘ముంగిలి’, ‘ తెలంగాణ చరిత్ర’ ల ముగింపు అధ్యాయాలలో ఈ అంశాలను వివరించాను.
తెలంగాణ వైపు నుంచి సాహిత్యచరిత్ర ఎట్లా ఉండాలని భావిస్తారు?
తెలుగు సాహిత్యాన్ని తెలంగాణ సాహిత్యం ఎట్లా సుసంపన్నం చేసిందీ తెలుపుతూనే, అంటే, కాంట్రిబ్యూటరీ, అంటే దోహదకారి చరిత్రగా ఉంటూనే తెలంగాణ చేసిన తనదైన ప్రత్యేక ప్రస్థానాన్ని తెలిపేదిగా తెలంగాణ వైపు నుంచి సాహిత్యచరిత్ర ఉండాలని అనుకుంటున్న.
సామాజిక, తదితర అస్తిత్వాల నుంచి సాహిత్యచరిత్రపై అనేక ప్రశ్నలు వచ్చాయి. తెలంగాణవాదం నుంచి తగినన్ని ప్రశ్నలు వచ్చాయని భావిస్తున్నారా?
వచ్చినయి కదా! మీ మొదటి ప్రశ్నకు చెప్పిన జవాబులోనే ఆ ప్రశ్నలు కూడా ఇమిడి ఉన్నాయి. అయితే, ప్రశ్నల స్వభావంలో మౌలికమయిన భేదం ఉంది. స్త్రీ, దళిత, బహుజన అస్తిత్వాల ప్రశ్నలు వివక్షకు, అణచివేతకు సంబంధిం చినవి. అవి కేవలం సాహిత్య చరిత్ర కారులపై ఎక్కుపెట్ట బడినవి కావు. సాహిత్య సృజనకారులతో సహా మొత్తం సమాజంపై ఎక్కుపెట్టబడినవి. అందువల్ల, వాట్లిలో తీవ్రత ఉంటుంది. అది కూడా స్ట్రయికింగ్ గా ఉంటుంది.
తెలంగాణవాద ప్రశ్నలు చరిత్రకారులపై ఎక్కుపెట్టినవి. అందువల్ల అంత తీవ్రత కనిపించదు. ప్రశ్నలే లేనట్టు అనిపిస్తది. అయితే, వర్తమానానికి సంబంధించిన ప్రశ్నల్లో ఆ తీవ్రత ఉన్నది.
తెలంగాణ కవులు, పండితుల జీవితాలను, కావ్యాలను లేదా రచనలను గురించి రాసే పుస్తకాలు సాహిత్యచరిత్ర అవుతాయా?
అవుతయి. ఏ భాషా సాహిత్యచరిత్ర నిర్మాణ క్రమంలోనైనా తొలిదశలో కవుల చరిత్రలే సాహిత్యచరిత్రలు. ముందు ఎంతమంది కవులున్నారో, ఎన్ని రచనలున్నవో బయటికి రావాలి గదా? సాహిత్య పరిణామ చరిత్రనే సాహిత్యచరిత్ర అని మీ ఉద్దేశం కావచ్చు. అది అనంతర దశలో సాధ్యం కావచ్చునేమో. ఎందుకంటె తొలికవుల చరిత్ర (కావలి రామస్వామి, దక్కన్ కవుల చరిత్ర, (1829) వచ్చి దాదాపు 200 సంవత్సరాలయినా ఇప్పటికీ సమగ్ర తెలుగు సాహిత్య చరిత్ర రాలేదు.
‘ముంగిలి’ని మీరు కవుల చరిత్ర, పాలకుల యుగవిభజన కలిసిన ధోరణిలో రాశారు. వస్తు, ప్రక్రియ, శిల్ప ధోరణుల రీత్యా తెలంగాణా సాహిత్య చరిత్ర గతిని నిర్వచించి, నిర్మించడం సాధ్యమేనా, మీకు ఆలోచన ఉందా?
మొన్నటిదాకా వచ్చిన చరిత్రలు సాహిత్య చరిత్రలు అన్నీ సాధారణీకరించిన ప్రధాన కథనాలే, మహా కథనాలే. వస్తు ప్రక్రియ, శిల్ప తదితర ప్రాతిపదికన వచ్చిన సాధారణ (Generalise చేసిన) పరిణామ చరిత్రలే. వీటివల్ల ప్రాదేశిక నిమ్న శ్రేణుల తదితరాలకు సంబంధించిన ఎన్నో విస్మరణలు జరిగినవి. వాటిలో నిర్దిష్టతకు విభిన్నతలకు స్థానం లభించలేదు. అందుకే వాటిని తిరస్కరించి సబాల్టరన్, విభిన్నతల, నిర్దిష్టతల, అట్టడుగు నుంచి చరిత్ర రచనల (History from below) అధ్యయనాలు ముందుకు వచ్చినవి. ముందుగా తెలంగాణ నుంచి వచ్చిన సాహిత్యమంతా వెలుగులోకి రావాలె. అలా జరగాలంటే ఏ ప్రాతిపదికన చేసిన యుగ విభజనను అనుసరించినా ఏదో ఒక విస్మరణ జరుగు తుంది. అంటే ఒక విస్మరణను సవరించబోయి మరొక విస్మరణకు కారకులమౌతం. అలా జరగకూడదనే రాజవంశ యుగాలను (ఇందులో కూడా కొన్ని విస్మరణలున్నవి) తీసుకొని ‘ముంగిలి’లో కాలక్రమంగా కవుల చరిత్రను రాసిన. ఏ భాష, ప్రాంత సాహిత్య చరిత్ర నిర్మాణంలోనైనా తొలుత జరగాల్సింది ఇదే. అంతేకాక జిల్లాల వారీగా నిమ్నశ్రేణుల వారీగా ప్రక్రియల వారీగా తెలంగాణ సాహిత్యమంతా వెలుగులోకి రావాలె. అది రికార్డ్ కావాలె. అప్పుడు మాత్రమే తెలంగాణ సాహిత్య చరిత్ర గతిని నిర్వచించి సమగ్ర సాహిత్య చరిత్రను నిర్మించడం సాధ్యం అవుతుంది. అప్పుడైనా ఏదో ఒక అంశం ప్రాతిపదికన ‘గతి’ (పరిణామ సూత్రం)ని నిర్వచించడం సరి అయింది కాదు.
ప్రాదేశిక సాహిత్య చరిత్రలో ఇతర స్థానిక భాషల సాహిత్యాలు కూడా భాగమేనా?
ఒక ప్రాదేశిక విభాగంలో ప్రధాన భాషతో పాటు సంస్కృతం, ఉర్దూ, కోయ, గోండి లాంటి భాషలు, వాటి సాహిత్యం ఉంటయనేది తెలిసిన విషయమే. వీటన్నిటి సాహిత్యచరిత్రనే మీరు ‘సమగ్ర సాహిత్యచరిత్ర’ గా ఉద్దేశిస్తే, అలాంటి సాహిత్య చరిత్ర అవసరమే.
ఒక ప్రాంతంలో ప్రధాన భాషకు చెందిన సాహిత్యంలో జరిగే పరిణామమే ఆ ప్రాంత ఇతర భాషా సాహిత్యాల్లో జరగొచ్చు. కొన్ని సందర్భాల్లో జరగకపోవచ్చు. వాటి ప్రత్యేకత వాటికి ఉండొచ్చు. అందువల్ల అన్ని భాషా సాహిత్యాల సమగ్ర చరిత్ర అవసరం.
సాహిత్య చరిత్రకారుడిగా, తెలంగాణ సాహిత్య పరిణామ క్రమంలో ఏదైనా ప్రత్యేకమైన క్రమానుగత సరళిని గుర్తించారా?
సంస్కృతాంగ్ల ప్రభావంతో కాకుండా స్థానిక సామాజిక పరిస్థితుల నుండి సాహిత్యం ఉత్పన్నం కావడం ఇక్కడి ఒకానొక ప్రత్యేకత.
ప్రఖ్యాతంగా ఉన్న యుగవిభజనకు భిన్నమైన విభజనను ప్రతిపాదిస్తారా?
ప్రక్రియను బట్టి, కవులను బట్టి చేసిన విభజన అవ్యాప్తి, అతివ్యాప్తి దోషాలకు గురైందనే విషయం తెలిసిందే. యుగ సాహితీ స్వభావాన్ని సూచించక పోయినా, రాజ్య వంశాలను అనుసరించి చేసిన విభజననే కొంత అనుకూలమైనది. తెలుగు సాహిత్యచరిత్రల్లో చేసిన ఏ విభజనా మిగతా ప్రాంతాలకు, ముఖ్యంగా తెలంగాణకు వర్తించదు.
తెలంగాణ సాహిత్య చరిత్రకు నేను ఒక విభజన చేశాను. యుజిసి కి అందించిన మేజర్ రీసర్చి ప్రాజెక్టు ప్రతిపాదనలో దాన్ని పేర్కొన్నాను. ప్రాచీన సాహిత్యాన్ని ప్రధాన రాజవంశాల యుగాలుగా విభజించాను. ఆధునికత సాహిత్యాన్ని నవ్య, ప్రజాస్వామిక, అభ్యుదయ, అభ్యుదయానంతర, విప్లవ, విప్లవ కవిత్వానంతర, అస్తిత్వవాద యుగాలుగా ప్రతిపాదించాను.
ఒక భాషకు సంబంధించిన సాహిత్య చరిత్రలో ప్రాదేశిక ఉపవర్గీకరణ ఎంతవరకు సాధ్యం? రెండు లేదా మూడు లేదా అంతకంటె ఎక్కువ ప్రాంతాలలో ఉండే విభిన్న తలతో పాటు సారూప్య అంశాలను చరిత్ర రచనలో ఎట్లా నిర్వహించాలి?
చాలా గొట్టు ప్రశ్న.
వినిర్మాణ వాదం చర్చించిన అంశాలలో ఇది కూడ ఒకటి. దాన్ని మీరు ‘విభిన్నత’ అన్న పదం ద్వారా సూచించారు.
ఉపవర్గీకరణ సాధ్యమే. కాని దాని వల్ల ఇతర ప్రాదేశికతలకు న్యాయం చేకూరదు. వాటికి ‘ఉప’ శ్రేణి హోదానే లభిస్తుంది. సారూప్య అంశాలను చెప్పబోతే సాధారణీకరణ అయి కూర్చుంటుంది. విభిన్నతలు విస్మృతికి లేదా అణచివేతకు గురైతవి.
భారతదేశ చరిత్రలో భాగంగా చూసినంత కాలం దక్షిణ భారతదేశ చరిత్ర మరుగున పడే ఉంది. నీలకంఠశాస్త్రి దక్షిణ భారతదేశ చరిత్ర రాసిన తర్వాత మాత్రమే దక్షిణ భారతానికి ఎంతో కొంత గుర్తింపు వచ్చింది.
అందువల్ల, ఆయా ప్రాదేశికతల విడి విడి చరిత్రలు రాసుకోవ డమే తొలుత చేయాల్సింది. తర్వాత సారూప్య అంశాలు ఒక్క చోట చేరుస్తూ అక్కడికక్కడే విభిన్నతలను ప్రత్యేకంగా ప్రస్తావించాల్సి ఉంటుంది.
ఇంటర్వ్యూ : కె.శ్రీనివాస్
Updated Date - Oct 28 , 2024 | 06:09 AM