మూసీపై మురికి రాజకీయం మానండి !
ABN, Publish Date - Nov 15 , 2024 | 02:27 AM
తెలంగాణతో పాటు హైదరాబాద్ నగరం వైపు ప్రపంచం దృష్టి సారించే మహోన్నత ఉద్దేశంతో మూసీ పునరుజ్జీవనానికి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం దృష్టిసారించింది. ఇది జీర్ణించుకోలేని...
తెలంగాణతో పాటు హైదరాబాద్ నగరం వైపు ప్రపంచం దృష్టి సారించే మహోన్నత ఉద్దేశంతో మూసీ పునరుజ్జీవనానికి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం దృష్టిసారించింది. ఇది జీర్ణించుకోలేని విపక్షాలు నీచ రాజకీయాలు ప్రారంభించాయి. ఇందులో భాగంగానే ‘నమామి గంగే...’ను చూసి నేర్చుకోవాలంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాసం రాశారు (09.11.2024).
నిజానికి చిత్తశుద్ధి లేని శివపూజలేలా అన్నట్లు సాగుతున్నది ‘నమామి గంగే’ కార్యక్రమం. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఆ కార్యక్రమాన్ని బీజేపీ ప్రభుత్వం ప్రారంభించింది. 2005లో (నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు) ప్రారంభమైన సబర్మతీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు విడతలవారీగా కొనసాగుతోంది అని కిషన్ రెడ్డి తన వ్యాసంలో అంగీకరించారు. అంటే ఇరవై ఏళ్లుగా ఆ పనులు పూర్తి కాలేదని ఆయనే స్పష్టం చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రధానమంత్రి అయిన పదకొండేళ్లకు కూడా ఒక నది ప్రక్షాళనను పూర్తి చేయలేదు. దాని నుంచి ఏం నేర్చుకోవాలి? సబర్మతీ నదీ ప్రక్షాళనకు వందల కోట్ల రూపాయలు వెచ్చించిన తర్వాత కూడా దేశంలోనే కలుషితమైన నదుల్లో రెండో స్థానంలో సబర్మతి నది ఉన్నదని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) 2022లో నివేదిక ఇచ్చింది. మరి ఆ నిధులన్నీ ఏం చేసినట్లు? అక్కడి నుంచి ఏం నేర్చుకోవాలి?
లోక్‌సభలో ఆగస్టు 8న ఇచ్చిన ఒక రాతపూర్వక సమాధానం ప్రకారం– ‘నమామి గంగే’లో గత పదేళ్లలో రూ.32,070 కోట్లతో 5,282.39 కిలోమీ టర్ల సీవరేజీ నెట్‌వర్క్‌తో కలుపుకొని రోజుకు 6,217.15 మిలియన్ల లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేసేందుకు 200 మురుగు శుద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. కానీ ఇప్పటి వరకు కేవలం 120 ఎస్‌టిపిలు మాత్రమే పూర్తయ్యాయి. రోజుకు కేవలం 3,241.55 మిలియన్ లీటర్ల మురుగు నీటినే శుద్ధి చేస్తున్నారు. అంటే ఇంకా రోజుకు 3 వేల మిలియన్ లీటర్ల పైచిలుకు మురుగు నీరు గంగలో కలుస్తూనే ఉంది.
గంగా పరివాహకంలోని ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లలో బీజేపీ ప్రభుత్వాలు ఉండడం; బిహార్‌లో బీజేపీ మిత్రపక్షం అధికారంలో ఉండడంతో అక్కడ ఎస్టీపీల నిర్మాణం, ఇతర కార్యక్రమాల్లో భారీ అవినీతి చోటు చేసుకుంటున్నా బయటకు రానివ్వడం లేదనే ఆరోపణలున్నాయి. నమామి గంగేతో గంగా నది ఏమాత్రం శుభ్రం కాలేదనడానికి పశ్చిమ బెంగాల్ కాలుష్య నియంత్రణ మండలి (WB PCB) నిర్వహించిన అధ్యయనమే మంచి ఉదాహరణ. ఆ అధ్యయనం ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లోని బహరంపూర్ నుంచి డైమండ్ హార్బర్ వరకు గంగా నది నీరు తాగడానికి కాదు కదా కనీసం స్నానం చేయడానికి పనికి రాదు. నమామి గంగే ఎగువ రాష్ట్రాల్లో అద్భుతంగా సాగితే, మరి పశ్చిమ బెంగాల్‌లో ఇలాంటి పరిస్థితి ఎలా ఉందో కేంద్ర మంత్రి జవాబు ఇవ్వాలి.
దేశం లోని ప్రముఖ నగరాల్లో ఒకటైన హైదరాబాద్ మధ్యగా మూసీ ప్రవహిస్తోంది. రాష్ట్రంలోని ప్రతి ముగ్గురిలో ఒకరు మూసీ పరివాహకం లోనే జీవిస్తున్నారు. నగర ప్రజలతో పాటు ఉమ్మడి నల్గొండ ప్రజలు మూసీ కాలుష్యంతో నరక యాతన అనుభవిస్తున్నారు. ఇటువంటి నది ప్రక్షాళనకు సహకరించాల్సిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అక్కసుతో వ్యవహరిస్తున్నారు. ఆయన రివర్ సిటీస్ అలయెన్స్ గురించి గొప్పగా చెప్పారు. పైసా ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలో చెప్పే ఉచిత సలహాల మండలి అది. నదుల ఒడ్డున ఉన్న నగరాలు నదీ కేంద్రిత ఆలోచన, కార్యాచరణతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. నదుల పునరుజ్జీవన బాధ్యత ఆయా నగరాలదే. నదుల పునరుజ్జీవనం అనే కాకుండా ఓ అభివృద్ధి కార్యక్రమంగా చూడాలని మోదీ చెప్పారని ఓ వైపు చెప్పిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదే పని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పైనా, ముఖ్యమంత్రి పైనా నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. మూసీ పునరుజ్జీవనానికి డీపీఆర్ తయారుకాకముందే రూ.1.50 లక్షల కోట్ల వ్యయం, అవినీతి, విలువైన భూములపై కన్ను వంటి బీఆర్ఎస్ సోషల్ మీడియా చెప్పే మాటలన్నింటినీ కేంద్ర క్యాబినెట్ మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి చేయడం తన స్థాయిని తాను తగ్గించుకోవడమే.
ఒక్కసారి కలవని– కనీసం గౌరవించని గత ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలుసుకునేందుకు పలుమార్లు లేఖలు రాసిన కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రిని గౌరవించే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి మూసీ పునరుజ్జీవనంపై మాట్లాడేందుకు ఎందుకు ఆసక్తి చూపడం లేదు? గంగా నది పరీవాహకంలో రూ.39,080.70 కోట్లతో వివిధ ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం చేపట్టిందని కేంద్ర మంత్రి వ్యాసంలో స్వయంగా చెప్పారు. మరి మూసీ ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం నుంచి మంత్రి ఎప్పుడైనా ఒక్క పైసా అడిగారా? కనీసం ఇప్పుడైనా ఒక రూ.10వేల కోట్లు ఇప్పించగలరా? పదేళ్లుగా కేంద్ర మంత్రిగా ఉంటున్న కిషన్ రెడ్డి మూసీ పునరుజ్జీవనానికి ఇప్పటి వరకు చేసిన కృషి ఏమిటి? పోనీ ఇక ముందు చేసే సహాయం ఏమిటో స్పష్టం చేయాలి. నదీ గర్భం లోని ఇళ్ల కూల్చివేతలను కేంద్ర మంత్రి తప్పు పడుతున్నారా? ఆక్రమణలకు కేంద్ర మంత్రి అండగా ఉంటారా? తేల్చి చెప్పాలి.
మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు. వారి తరలింపు ఖర్చుల కోసం రూ.25వేల చొప్పున ప్రభుత్వం అందజేస్తోంది. ఇప్పటికే కొల్లూరులో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లల్లోకి వెళ్లిన నిర్వాసితుల పిల్లల కోసం అక్కడే ప్రభుత్వ పాఠశాల ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. 250 కుటుంబాలు ఇప్పటికే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లల్లోకి వెళ్లాయి. మూసీ నిర్వాసితులకు ఓఆర్‌ఆర్ సమీపంలో ఒకొక్కరికి 150 నుంచి 200 గజాల స్థలాలు ఇచ్చే ఆలోచన ప్రభుత్వం చేస్తోంది. నిర్వాసితులైన స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు అందజేస్తోంది. నిర్వాసితులకు ఏ నష్టం కలగనివ్వమని ప్రభుత్వం భరోసా ఇస్తున్నా ప్రతిపక్షాలు విషం చిమ్ముతూనే ఉన్నాయి.
పేదల ఇళ్లు కూలగొడుతున్నారని కిషన్ రెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నారు. కానీ, వారికి పునరావాసం కల్పించిన తరువాతే ప్రభుత్వం ఇళ్లు కూలుస్తోంది. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో ఏం జరుగుతున్నదో కేంద్ర మంత్రి కళ్లకు కనబడటం లేదు. నేరస్థులను శిక్షిస్తున్నామనే పేరుతో ఒక వర్గం వారిపై కక్షగట్టి ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తున్నారు. అది రాజ్యాంగ విరుద్ధమని బుల్డోజర్ రాజ్యం పనికిరాదని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. హైదరాబాద్ నగరంలో మెట్రోకు రూ.25 వేల కోట్లు, ట్రిపుల్ ఆర్‌కు రూ.30వేల కోట్లు, ఓఆర్‌ఆర్ టు ట్రిపుల్ ఆర్ రేడియల్ రోడ్లకు రూ.10 వేల కోట్లు, ఎస్టీపీల నిర్మాణం, నష్టపరిహారం చెల్లింపులకు రూ.10 నుంచి రూ.15 వేల కోట్లు, మల్లన్నసాగర్ నుంచి గండిపేటకు ట్రంక్‌లైన్ ఏర్పాటుకు రూ. ఆరు నుంచి రూ.ఏడు వేల కోట్లు, ఎలివేటర్లు, ఇతరత్రాలకు రూ.30వేల కోట్లు... ఇలా మొత్తంగా రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు అవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతుంటే మూసీ ఒక్కదానికే ఆ నిధులంటూ కేంద్ర మంత్రి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పద్ధతిలో మూసీ రివర్ ఫ్రంట్ పనులు చేపడతామని ముఖ్యమంత్రి వివరంగా చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు ఇంతవరకు టెండర్లు పిలవలేదు, ఎవరికీ కాంట్రాక్టు ఇవ్వలేదు. ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. అయినా అవినీతి, భారీ ఖర్చు అంటూ ప్రచారం చేయడం తప్పు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నా ఏనాడూ మాట్లాడని కిషన్‌రెడ్డి, బండి సంజయ్ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు అడుగడుగునా అడ్డు తగులుతున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి చేతనైతే హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తేవాలి, లేదా మౌనంగా ఉండాలి.
బి. మహేశ్ కుమార్ గౌడ్
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ
Updated Date - Nov 15 , 2024 | 02:27 AM