ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మానవత్వం గెలిచిన చోట పుట్టిన కథలివి

ABN, Publish Date - Aug 19 , 2024 | 12:39 AM

తమిళ రచయిత జయమోహన్‌లో చిత్రమైన ఆకర్షణ ఉంది, అది విజయవంతమైన రచయిత అయినంత మాత్రాన సాధించగల ఆకర్షణ కాదు. ఆయన నవ్వులో, పలకరింపులో, అప్రోచబుల్‌గా...

తమిళ రచయిత జయమోహన్‌లో చిత్రమైన ఆకర్షణ ఉంది, అది విజయవంతమైన రచయిత అయినంత మాత్రాన సాధించగల ఆకర్షణ కాదు. ఆయన నవ్వులో, పలకరింపులో, అప్రోచబుల్‌గా ఉండటానికి సందేహించని ఆయన మనస్తత్వంలో - మనుషులను అయస్కాంతంలా లాగగల ఆకర్షణ ఉంది.

కెత్తేల్ సాయెబు, ఏనుగు డాక్టరు, వంద కుర్చీల ఆఫీసరు...- ఇలా మనసులో స్థిరపడే పాత్రలతో ఆసక్తిగొలిపే ఆయన కథల్లో కొన్నింటిని అవినేని భాస్కర్ ‘నెమ్మి నీలం’ పేరుతో తెలుగులోకి పుస్తకంగా తెచ్చి, బెంగళూరు బుక్ బ్రహ్మ లిటరరీ ఫెస్టివల్‌లో ఆవిష్కరించారు. అదయ్యాక, జయమోహన్‌తో మట్లాడేందుకు, నాకూ రాజిరెడ్డికీ కాఫీ టైం దొరికింది. ‘గెలుపు’ కథను ప్రస్తావిస్తూ, ఆయన కథల్లో లేయర్స్ గురించీ, డీటైలింగ్ గురించీ రాజిరెడ్డి మాట్లాడారు.

దానికి కొనసాగింపుగా– ‘‘మీరంత పెద్ద పెద్ద కథలెందుకు రాశారు?’’ అడిగాన్నేను.

కథంటే చిన్నదవ్వాలన్న నియమం లేదు!


కథంటే చిన్న కథే కావాలన్న మాట ఎవరు సృష్టించారో తెలీదు. అదేమీ నియమం కాదు. అలా ఉండటం గొప్ప విషయమూ కాదు అంటూ అమెరికాలో, ఆ మధ్య 64 పేజీలతో వచ్చిన ఒక కథ అంతర్జాతీయ స్థాయిలో మొదటి బహుమతి పొందటం గురించి చెప్పారాయన.

ఇంత పెద్ద కథలు ఎలాగూ రాస్తున్నారు కదా, రాయడం కూడా ఇష్టంగా అలవోకగా చెయ్యగలరని తెలుస్తూనే ఉంది, ఈ కథలను నవలలుగా కూడా మార్చగల అవకాశం ఉన్నప్పుడు, అలా ఎందుకు చెయ్యలేదని అడిగాం.

జయమోహన్ అన్నారూ, ప్రతి కథకూ ఆయన మనసులో, బలమైన ఆధారం లాంటి వాక్యం ఒకటుంటుందిట. ఉదాహరణకు, ఆ వంద కుర్చీల కథలో, ఆఫీసర్ వంద కుర్చీలు కావాల్సిందే అనుకోవడం. కూటి ఋణంలో అతను మొత్తాన్నీ సాయిబు దగ్గర ఇచ్చేయడం, అతడు కళ్ళెత్తి కూడా చూడకపోవడం - ఇలా. ఒకసారి ఆ మలుపు, ఆ వాక్యం దగ్గరికి వచ్చామంటే, కథ అయిపోయినట్టే. అక్కడి దాకా ఎన్ని పేజీలన్నది ఆయనకు లెక్క లేదు. కానీ ఆ మలుపు తర్వాత ఆ కథలో ఇక చెప్పడానికేమీ లేదు. కాబట్టి ఇవన్నీ కథలయ్యాయి. నవల అంటే, ఆయన దృష్టిలో ఇలాంటి సందర్భాలు, కథనిట్లా మలుపులు తిప్పగల వాక్యాలు ఇంకా ఎన్నో ఉండచ్చు, ఉండాలి. కనుక ఇవి కథలే తప్ప నవలలు కాలేవన్నది ఆయన జవాబు.


జయమోహన్ కథల్లో ఏళ్ళకేళ్ళ జీవితాలు పరుచుకుని ఉంటాయి. ఇంత విశాలమైన జీవితాన్ని కాన్వాస్‌గా ఎందుకు తీసుకుంటారు, కథను చెప్పడం తేలిక చేస్తుందనా? అంత పెద్ద జీవితంలో నుండి ఏ తునకలనైనా ఎంచి చెప్పే వీలుంటుందనా? అని అడిగాను.

ఆదర్శాలకు నిలబడే పాత్రలను చూపించడం ముఖ్యం

ఆయనకు మనిషి ‘ఎథికల్ కన్సిస్టెన్సీ’ మీద దృష్టి పెట్టడం ఇష్టమట. అంటే ఏదో పుణ్యానికి ఓ రోజు మంచి చెయ్యడం, స్నేహమో సాయమో చెయ్యడం– ఇలా కాదు. ఏళ్ళ తరబడి నడిచే జీవితంలో ఆ పాత్ర ఏ ఆదర్శాలను నమ్ముకుని జీవిస్తుందో చెప్పడం, వాటికి నిలబడిందో లేదో చూపించడం ఆయనకు ముఖ్యమని చెప్పారు. (పుస్తకం మొదటి పేజీ లోనే చెప్తారు - ధర్మం మూలాలకు సంబంధించిన ప్రశ్నలతో మొదలైన ఈ కథలన్నీ మానవత్వపు గెలుపును చాటి చెబుతాయని).

జయమోహన్ కథలకు భాస్కర్ అనువాదాలు చదివిన రీడర్స్‌లో చాలామంది, మళ్ళీ వెనక్కు వెళ్ళి మరీ మూల రచయిత పేరు కూడా గమనించడం నాకు తెలుసు. చిన్నచిన్న కథలు, సంఘటనలు అందరి మీదా అన్నిసార్లూ బలమైన ముద్రను వేస్తాయని ఆశించలేం. కానీ నిడివి పెరిగే కొద్దీ, కథ బాగుంటే పాఠకుడు ఆ కథాజగత్తులో లీనమై పోతాడు. కొన్ని నిమిషాలపాటో, గంటలపాటో వేరే ప్రపంచంలోకి ట్రాన్స్‌పోర్ట్ అయిన పాఠకుడు, మళ్ళీ ఈ లోకంలోకొచ్చాక, ఆ ప్రభావం నుండి బయటపడ్డాక, రచయిత పేరు గమనించకుండా ఉండలేడు. ఆయన పేరు తెలుగు నాట కూడా ఇంత బలంగా నాటుకోవడానికి, ఈ కథల నిడివి ఒక కారణమంటే– ఆయన ఆ గమనింపుని ఒప్పుకున్నారు. రచయిత అట్లాంటి సాంద్రమైన పఠనానుభవం పాఠకులకు అందించా లన్నట్టు మాట్లాడారు.


‘‘డెలిబరేట్‌గా చేస్తారా,’’ అన్నాను.

తల అడ్డంగా ఊపుతూ అలా చేయాలని కూడా ఎప్పుడూ అనుకోనన్నారు. ఆయనకు కథ ఆర్గానిక్‌గా క్రియేట్ అవ్వాలి. అలాగే నడవాలి.

దిద్దుకుంటూ కూర్చోను!

కరోనా లాక్‌డౌన్‌లో ‘కథల తిరనాళ్ళు’ అంటూ ‘వంద రోజులు, రోజుకో కథ’ అని ప్రకటించి మరీ వెబ్‌సైట్‌లో ప్రచురిస్తూ వచ్చారు. పరుగు పందేల్లో ఫినిష్ లైన్ చేరుకున్నాక కూడా మరికొంతదూరం పరుగెత్తినట్టు, ప్రకటించిన వంద కథలతో ఆగకుండా నూట ముప్పై కథలు రాశారు. అక్కడా నిడివితో నిమిత్తం లేదు.

రాజిరెడ్డీ నేనూ మళ్ళీ అడ్డు కొట్టేశాం. అలా ఎలా సాధ్యపడుతుంది? పోనీ గాలి మేడల్లాంటి కథలా అంటే అదీ కాదు. మంచి వస్తువూ ఉంటుంది. బలమైన చిత్రణా ఉంటుంది. ఆ ఊహకూ, అల్లికకూ, రాతకూ సమయమెలా సరిపోతుంది? ప్రత్యేకించి కథ బాగా రాబోతోందని తెలిసినప్పుడు ఇంకొంచం శ్రద్ధగా రాయాలనిపించడమూ రచయితలకు అనుభవమవుతూంటుంది కదా? అలాంటిదేమీ ఉండదా? అని అడిగాం. మరీ ముఖ్యంగా ఎడిటింగ్?

ఆయన చాలా అయిష్టంగా తిరస్కరించారు. ఎడిటింగ్ మొదలెడితే దానికిక ముగింపెక్కడ? ఏదో ఒకటి చెయ్యాలనిపిస్తూనే ఉంటుందిక. నేను ఆ పని పెట్టుకోను. అంత నచ్చకపోతే డిలీట్ చేసేస్తాను తప్ప దిద్దుకుంటూ కూర్చోనన్నారు.

‘‘డిలీట్? డ్రాఫ్ట్స్ లో కూడా ఉంచరా? మళ్ళీ ఇంకోసారి చూసుకోరా?’’

‘‘నో. చూడను. అవి దిద్దే టైంలో కొత్త కథ రాసేసుకోవచ్చు’’ అన్నారు నవ్వి.

‘‘ఎప్పటికప్పుడు కొత్తవి రాసేందుకు సమయమెలా సరిపోతుంది?’’ –- మా అనుమానం తీరలేదు.

మెదడుని తిట్టకూడదు. పిచ్చిగా వాడకూడదు.

‘‘నాకింకో వ్యాపకం లేదు. రైటింగ్ ఈజ్ డ్రీమింగ్ విత్ లెటర్స్. నాకది ఇష్టం. తిరువనంతపురంనుండి బెంగళూరు రావాలంటే ఫ్లైట్‍లో ఒక నవల ఊహించుకుంటాను. నేనది రాయక్కరలేదు. ఊహగా నాలో మెదిలినా చాలు. ఆ ఊహలు నాకిష్టం. ఆ చిత్రణ ఇష్టం. అందుకని సమయం సరిపోలేదనో కష్టమనో ఇన్నేళ్ళలో ఎప్పుడూ అనుకోలేదు.’’


ఎప్పుడూ రాయాలనే ఉంటుందా?

‘‘ఆహా! ఇదుగో ఇక్కడ ఉందే (మెదడుని చూపిస్తూ) -దీనిని తిట్టకూడదు. పిచ్చిగా వాడకూడదు. ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అల్లోపతి మందులు తినేసి శరీరాన్ని పాడుచేసుకోకూడదు. ఇవి రెండూ బాలేదంటే రాయాలనే అనిపించదు. కాబట్టి అవి ముఖ్యం. నిద్ర ముఖ్యం.

‘‘మా అబ్బాయికి కరోనా వచ్చి హాస్పిటల్‌లో అడ్మిట్ చేసామొకసారి. రాత్రికి ఇంటికి చేరాక- ఒక్కణ్ణే ఉన్నానప్పుడు– ఒళ్ళంతా ఒకటే సంతోషం. నరాల్లోకి పాకిన తియ్యదనం. నాకు తెలుస్తోంది ఆ పొంగు. 36 గంటలు లేవకుండా కూర్చుని ఒక నవలిక రాశాను –- ‘కుమరితుఱైవి’. ఎంతా ఏమిటీ అని కూడా చూడలేదు. సైట్‌లో మర్నాడు పబ్లిష్ అయ్యేలా సెట్ చేసి నిద్రపోయాను. అది చదివి మా అబ్బాయి ‘నాన్నా, నువ్వొక కవివి’ అన్నాడు.

‘‘రాసే ఉధృతిలో ఎన్ని గంటలైనా కూర్చోవచ్చు, పర్లేదు. రాసేశాక మాత్రం కంటి నిండా నిద్రపోవాలి.’’

తరువాతి సెషన్‌కి వేళయి అందరం బయటకు వచ్చేశాక మాకు అనిపించిందొక్కటే. జీవితం ముఖ్యం. ఈ రాత మొత్తం దాని కొనసాగింపు. ఆయన జీవితాన్ని అనుభవిస్తున్నాడు. రాతనిట్లా ఆస్వాదిస్తున్నాడు.

ఆయన కథలింత బాగుండడంలో ఆశ్చర్యం ఏముంది?

మానస చామర్తి

7975468091

జయమోహన్‌తో మానస చామర్తి

Updated Date - Aug 19 , 2024 | 12:39 AM

Advertising
Advertising
<