ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సుప్రీం ‘వర్గీకరణ’ తీర్పు సమన్యాయానికి సరైన దారి

ABN, Publish Date - Aug 02 , 2024 | 02:10 AM

ఎస్సీల్లో ప్రతి వెనుకబడిన కులానికి, ఎస్టీల్లో ప్రతి వెనుకబడిన తెగకు రిజర్వేషన్ల పంపిణీ న్యాయం జరగడానికి వీలుగా, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను వర్గీకరించి తీరాల్సిందేనని గురువారం నాడు...

ఎస్సీల్లో ప్రతి వెనుకబడిన కులానికి, ఎస్టీల్లో ప్రతి వెనుకబడిన తెగకు రిజర్వేషన్ల పంపిణీ న్యాయం జరగడానికి వీలుగా, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను వర్గీకరించి తీరాల్సిందేనని గురువారం నాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పునివ్వడాన్ని స్వాగతిస్తున్నాం. దేశ న్యాయ వ్యవస్థలో, సామాజిక న్యాయ కల్పనలో, ఈ తీర్పు ఒక ముఖ్య ఘట్టమవుతుంది. ఎస్సీల్లోనూ, ఎస్టీల్లోనూ అత్యంత వెనుకబడిన ఎస్సీ కులాలు, జాతులు, తెగలకు విద్య–ఉద్యోగ రంగాల్లో పంపిణీ న్యాయం కల్పించడానికి ఈ తీర్పు తొలి అడుగు అవుతుందని భావిస్తున్నాం. ఈ తీర్పు పట్ల పంపిణీ న్యాయం, సామాజిక న్యాయం కోరుకునే శక్తులు, వ్యక్తులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.


తెలుగు రాష్ట్రాల్లో అరవై ఒక్క ఎస్సీ కులాలు ఉన్నాయి. ముఫ్ఫై ఐదు ఎస్టీ తెగలు ఉన్నాయి. అలాగే దేశంలో సుమారు 1150 ఎస్సీ కులాలు, 650 ఎస్టీ తెగలు ఉన్నాయి. ఈ రెండు సాంఘిక కేటగిరీల్లోనూ అభివృద్ధి వ్యత్యాసాలు ప్రస్ఫుటంగా, తీవ్రంగా ప్రబలి ఉన్నాయి ఈ విషయం 1965లో కేంద్ర న్యాయశాఖ విచారణ కోసం నియమించిన జస్టిస్ లోకూర్ కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. విద్య, ఉద్యోగ, సంక్షేమ రాజకీయ రంగాల్లో ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన కులాలు, తెగల వారికి భారత రాజ్యాంగం రిజర్వేషన్ అవకాశాలు కల్పిస్తున్నది. కాగా సింహభాగం రిజర్వేషన్ అవకాశాలను కొన్ని ఎస్సీ కులాలు, ఎస్టీ తెగలే అనుభవిస్తుండగా, చాలా కులాలు, తెగలు ఇంకా రిజర్వేషన్లు అందుకోలేని దుస్థితిలోనే ఉన్నాయి. అభివృద్ధిలో అడుగుకి నెట్టివేయబడుతున్నాయి.


దేశ జనాభాలో దాదాపు మూడు వంతులకు పైగా ఎస్సీ, ఎస్టీ జనాభా ఉన్నారు. దేశంలో సుమారు 1780 విడివిడి సమూహాలుగా ఉన్న ఎస్సీ, ఎస్టీల్లో, కేవలం వేళ్ళపై లెక్కపెట్టగలిగే కులాలు, జాతులు, తెగల్లో కొంతమంది, కొన్ని కుటుంబాలే అధిక భాగం రిజర్వేషన్ల లబ్ధి పొందుతున్న పరిస్థితి ఉన్నది. ఈ అపసవ్య పరిస్థితులను మార్చుకోవాలని 1994 నుంచి ఎమ్మార్పీఎస్ ఉద్యమిస్తున్నది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మాదిగలు ఎన్నో చరిత్రాత్మక ఉద్యమాలు చేశారు. కర్ణాటక, తమిళనాడు మొదలైన దక్షిణాది రాష్ట్రాల్లో మాదిగలు సాగించిన ఉద్యమం, ఉత్తరాది రాష్ట్రాల్లో సాగిన వాల్మీకి ఉద్యమం అనేక చారిత్రక మలుపులు తిరిగాయి. ఈ ఉద్యమాలు రాజకీయ, సామాజిక ప్రభావాలను చూపాయి. దశాబ్దాల తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో రిజర్వేషన్ల వర్గీకరణ సమస్య ఒక పరిష్కార దశకు చేరింది.


ఎవరి వాటా విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ అవకాశాల రిజర్వేషన్లను వారు పొందగలిగే గ్యారెంటీ పరిస్థితులు ఉండగలిగినప్పుడే, ఆ పరిస్థితుల్ని కాపాడుకోగలిగినప్పుడే అంతర్గతంగా ఎస్సీ (మాదిగ–మాల) కులాల మధ్య, ఎస్సీ–ఎస్టీల మధ్య ఐక్యత సాధ్యమవుతుంది. సాంఘిక రాజకీయ అనుబంధం దృఢమవుతుంది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని సోదర మాల కులస్తులు, లంబాడి, ఎరుకల జాతి మిత్రులు ఈ తీర్పుకి కట్టుబడాలని పిలుపునిస్తున్నాం. సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన విధంగా ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను హేతుబద్ధంగా పంపిణీ చేయడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం అవసరమైన రాజ్యాంగ సవరణ చేయాలని, ఈ మేరకు రాష్ట్రాలకు అధికారాలను త్వరగా దఖలుపరచాలని కోరుతున్నాం. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సుప్రీంకోర్టు తీర్పు అమలును త్వరగా ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాం. మాదిగ ఉద్యమాన్ని బలపరిచిన సామాజిక, న్యాయ శక్తులకు, రాజకీయ పార్టీలకు, సంఘాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తదుపరి ప్రక్రియల్లోనూ అండగా నిలబడాలని, రిజర్వేషన్లలో మేము సత్వర న్యాయం పొందటానికి, తద్వారా అధికార సాధనలో భాగస్వాములు కావడానికి కలిసి రావాలని సామాజిక, న్యాయ శక్తులను కోరుతున్నాం.

కృపాకర్ మాదిగ

వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి,

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి

Updated Date - Aug 02 , 2024 | 02:10 AM

Advertising
Advertising
<