థాంక్స్ గివింగ్
ABN, Publish Date - Jul 15 , 2024 | 02:03 AM
ఎవడైనా సరే రణరంగంలోనే పాఠాలు నేర్చుకోవాలి శిబిరం నుంచే తొలి పోరాటం మొదలుపెట్టాలి ఎవడి చరిత్రను వాడే రాసుకోవాలి నేల సారవంతంగా ఉన్నా భయాపహాస్యాల గుప్పెట్లో...
ఎవడైనా సరే
రణరంగంలోనే పాఠాలు నేర్చుకోవాలి
శిబిరం నుంచే తొలి పోరాటం మొదలుపెట్టాలి
ఎవడి చరిత్రను వాడే రాసుకోవాలి
నేల సారవంతంగా ఉన్నా భయాపహాస్యాల గుప్పెట్లో చేతన పెరగక
దళితోద్యమం ఎడారిలో పెరుగుతున్న చెట్టు గనక
చదవేసిన కొంపల్లో ఆత్మగౌరవోద్యమం
ఎర్ర సూర్యాస్తమయంలా కనుమరుగయ్యే లోపల
విహంగ వీక్షణ యాత్ర ఇక్కడినుంచే మొదలుపెట్టాలి...
‘మాదిగ కుక్కల్లారా!
మమ్మల్ని ఎదిరించినందుకు గుణపాఠం నేర్చుకున్నారా’ అని
సవాలు చేసిన జాతి గ్రామాలకు
గుంటూరు నగరవీధుల్లో పట్టపగలు దివిటీలతో ఊరేగిన కవికోకిల
గుర్తుకొస్తే ఎవరికెవరు గుణపాఠాలు నేర్పారో తెలుస్తుంది
కుల ఘర్షణల కుండపోతల మధ్య
విచిత్ర దేశం దాక్కుని ఆత్మగౌరవాన్ని వాగ్దానం చేసినా
నమ్మని తాటాకుల ఇళ్ళలో విజయనగర్ కాలనీలు మొలుస్తాయి..
గంజికి గతిలేని పద్దెనిమిది పేద పేటల్లో
‘పూటకో పేట’ నినాదమై ఆకలి తీర్చిన రోజుల్నీ
అన్నం దొరకని రాత్రుళ్ళు కడుపు నింపిన స్వచ్ఛమైన వాగులా
తేనెలా తీపి చేసిన తెనాలి మంచి నీళ్ళనీ ఎలా మర్చిపోతాం
నాలుగు దశాబ్దాల ఉద్యమ పుట్టనెక్కి
తెలుగు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ తలదాచుకున్న
పొన్నూరు తెలుగు లుంబినీ వనానికి తీర్థయాత్ర చేసి
శాక్యముని కత్తిని పలకరించి ‘కట్టెలమోపు’ను మొయ్యాలి
లుంబినీ వనమే గానీ దేదీప్యమానంగా వెలిగే పార్కులుండవు
స్వర్ణకుమారి నివాసమేగానీ, స్వర్ణ భస్మమే తప్ప,
లేశమాత్రం స్వర్ణం ముండదు.
రాజమాత మాయావతి భవనాలూ, బ్రాహ్మీలిపిలో శాసనాలూ..
రాతితో చెక్కిన ఠీవిగా కనబడే గొప్ప అశోక స్థంభం,
మౌర్యుల కాలం నాటి కలప నిర్మాణాల భవనాలు ఉండవు.
శ్రీనాధుడి హంస తూలికా తల్ప దృశ్యాలు చూడముగానీ
పాత మడత కుర్చీలో ఒక మూల కూర్చుని
కవిత్వమో కథో వ్యాసమో డిక్టేట్ చేస్తూ కనబడతాడుగానీ
కన్నమనీడై ఖడ్గాన్ని ధరించిన జ్ఞాపకాలింకా పచ్చిగానే ఉన్నాయి..
దుఃఖభాజనమైన నదులు చెలియలికట్టలు దాటుతాయి కాబోలు
వినడానికొక సింగిల్ విండో పథకమెప్పుడూ తెరిచే ఉంటుంది
అన్ని ట్రోల్ ఫ్రీ నంబర్లూ అక్కడ పనిచేస్తాయి
నవలల్లో తప్ప ఎవరూ ఊసెత్తని ‘మాలపల్లి’ చుండూరులో
కొన్ని బియ్యే ఎమ్మేలు మోటార్ సైకిళ్లెక్కి చక్కర్లు కొడుతున్నాయని
అంటరాని వసంతం అక్కడంతా విరగబూస్తోందని
ద్విత్వాక్షర కులాలు కత్తులు దూసిన నెత్తుటి దార్లలో ఆతను
హంసగీతంను గుర్తుచేసిన ఊరిని చూసి రావాలని ఉంది
ఇంకా కులం లేదని బుకాయించేవాళ్ళని
మోదుకూరు బ్రిడ్జి కిందకూ ట్రెక్కింగ్ చేయించాలని ఉంది
అతని స్వరం ఉద్యమానికి బలమైన సాక్ష్యంలా.
సుద్ద కళాకారుడిలా పోరాట చిత్రాల్ని వీధుల్లో గీస్తూ...
గ్రీకు ఎరితోస్తెనేస్ నీడల్ని కనుగొన్నట్లు
తుంగభద్ర కాలువలో నిర్భాగ్య మృతదేహాల బయటకు తీస్తుంది
నిద్రపుచ్చిన కథలతో మనమంతా హాయిగా నిద్రపోతున్నప్పుడు
కళ్ళు తెరిచి పాలీ ప్రాకృత హిందీ తమిళ్ మళయాళ భాషల్లో
‘న్యాయ’ పదానికి చెబుతున్న అర్థం
తెలుగు మాగాణంలో ఎందుకు లేదో ఆలోచిస్తూ ఉంటుంది...
పదేళ్ల క్రితమే పదవీ విరమణ చేసినా
కనీసం లక్షరూపాయల పెన్షన్ పట్టుకెళ్ళే ఉద్యోగాన్ని ఒదిలేశాక
నిరాశ సంకెళ్ళతనికి ఎవరు వెయ్యగలరు!
ఇంటి ముందు పడ్డ ఉద్యమాల పరకల్ని మోకు పేనుకుంటూ
బాధల క్షేత్రాల్ని వెదుక్కుంటూ వెళ్ళిపోతాడతను...
ఇంత పోరాట వారసత్వం మిగిల్చాక
తనకు చావెక్కడిదని గలగలా నవ్వుతాడు...
అవును!
ఎంతిస్తే మాత్రం అతని రుణాన్ని ఈ జాతి తీర్చుకుంటుంది గనక
అతనికి బాకీపడ్డ రుణాన్ని ఎవరు మాఫీ చేస్తారు గనక...
(నాలుగు దశాబ్దాల దళితోద్యమంపై విహంగ వీక్షణం)
తుల్లిమల్లి విల్సన్ సుధాకర్
95380 53030
Updated Date - Jul 15 , 2024 | 02:03 AM