ఏనుగమ్మా ఏనుగు!
ABN, Publish Date - Sep 02 , 2024 | 02:48 AM
అటునుంచి మనవడు ఇటునుంచి నేను గట్టిగా కావలించుకున్నాం ఏనుగుని వాడి కేరింతల్ని అది చెవులాడిస్తూ వింది...
అటునుంచి మనవడు
ఇటునుంచి నేను
గట్టిగా కావలించుకున్నాం ఏనుగుని
వాడి కేరింతల్ని అది చెవులాడిస్తూ వింది
ఒక్కసారి తల విదిలించి ఘీంకరించింది
చక్కెర రెక్కల ఏనుగుతోసహా మేం మాయం
వంటిమీద చక్కెర చల్లుకున్న హిమ పర్వతాల్లోకి
పాలధారల పంచధారల జలపాతాల మధ్యకి
తేనె రశ్మి కురిసే లోయల్లోకి
సీతాకోకలు ఉన్మత్తంగా తిరిగే వనాల్లోకి
పూలగానాల మాధుర్యాలమై
తెల్లమబ్బులు తేలే
నిశ్చల సరస్సుల మధుపాత్రల్లోకి
సూరీడు ఆరేసిన బంగారు రంగు
ఉల్లిపొర వస్త్రాల కెరటాల్లోకి
నేనూ.. ఏనుగూ.. మనవడూ
తీయని కాలం అరమోడ్పు రెప్పల మాటున
ఆకాశాల్లోకి... ఉన్మత్త కాంతి సంవత్సరాల్లోకి
గ్రహాల మధ్య శూన్యంలో
మహాజనని విరబోసుకున్న
ధూళికేశాలు దులిపినపుడు
విశ్వగర్భంలో ఆకృతులు దాలుస్తున్న
సృష్టి రహస్యాల్లోకి నేనూ మనవడూ
చక్కెర రెక్కల ఏనుగునెక్కి
పరిభ్రమించే మహాగోళాల చుట్టూ తిరుగుతూ
స్వప్నగోళాల నారింజపళ్ల తొనలు వలుస్తూ
మెలకువల అంచులు దాటి
ఆకలి తెలియని గ్రహాంతరాల సంచరిస్తూండగా
మెరుపుల్ని దాటుకుని
ఉరుముల్ని చీల్చుకుని
నల్లమబ్బులకు ఆవలి నుండి
వాయు సముద్రం అలల
తెలతెల్లని మబ్బు నురుగులు దాటుకుని
ఏడురంగుల పొరల్లోంచి దూసుకుని
విన్పిస్తుంది కన్నా అనే పిలుపు
చేతిలో బువ్వతో పాలిండ్ల అమృతంతో
పెదవుల మీద తేనె చిరుహాసంతో
ఎదురుచూసే తల్లి నుండి
విన్పిస్తుంది నిశ్శబ్దంగా ఒరే కన్నా అనే పిలుపు
అంతే... వచ్చేస్తాం.. ముగ్గురం
బొమ్మలోకి ఏనుగు
నేను తాత లోకి
మనవడు అమ్మచంక లోకి
ముగ్గురం అమ్మ ఒడిలోంచి అమ్మ ఒడిలోకి
అమ్మ ఒడిలో అటునుంచి ఇటువైపుకి
వసీరా
91777 27076
Updated Date - Sep 02 , 2024 | 02:48 AM