ప్రాంతాల్ని దాటిన నాటి సాహితీ సామరస్యం!
ABN, Publish Date - Oct 21 , 2024 | 12:38 AM
‘‘నిజామ్ రాష్ట్రంలో కవులు పూజ్య’’మని ముడుంబ రాఘవాచార్యులు దురహంకా రాన్ని ప్రదర్శిస్తే, గోలకొండ కవుల సంచిక ద్వారా ‘సురవరం’ తెలంగాణ ప్రాంత సాహిత్య ప్రతాపాన్ని చూపించాడు...
‘‘నిజామ్ రాష్ట్రంలో కవులు పూజ్య’’మని ముడుంబ రాఘవాచార్యులు దురహంకా రాన్ని ప్రదర్శిస్తే, గోలకొండ కవుల సంచిక ద్వారా ‘సురవరం’ తెలంగాణ ప్రాంత సాహిత్య ప్రతాపాన్ని చూపించాడు. తెలంగాణ భాషను నిందించిన వారిని నిలదీ యాల్సిందే. కానీ ఇక్కడ భాషా సాహిత్యాల గురించి సమున్నతంగా స్పందించిన వారిని కూడా యాది చేసుకోవాలి. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కొంతమంది పాతతరం కవి పండితులు, తెలంగాణ ప్రాంత భాషా సాహిత్యాల ఔన్నత్యాన్ని ప్రశంసించారు. ప్రాంతాలకు అతీతంగా తెలంగాణ సారస్వత ఘనతను కీర్తించారు.
‘‘కోస్తాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంతోమంది కవులు, పండితులు, సాంస్కృతిక కార్యకర్తలు తెలంగాణ వికాసానికి నడుం బిగించారు. ఇక్కడి సాంస్కృతిక ఉద్య మాలతో మమేకమయ్యారు’’ (‘ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ’) అని గుమ్మన్నగారి బాల శ్రీనివాస మూర్తి గుర్తు చేశాడు. ‘‘ప్రాణంబైనది తెల్గుగడ్డకు ధరా ప్రాలంబమౌనీ తెలంగాణము/ విన్నాణంబైన కవిత్వసంపదలకు’’ కేంద్రబిందువని (‘కీర్తితోరణం’) డెబ్బయ్యో దశకంలోనే ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి వ్యాఖ్యానించాడు. ఈ భూమిపై కాలుపెడితే శరీరము పులకరిస్తుందని తెలంగాణ, వరంగల్ ప్రాంత సాంస్కృతిక, చారిత్రక, కళా వైశిష్ట్యానికి ఆనాడే హనుమచ్చాస్ర్తి కీర్తితోరణాలను అలంకరించాడు. ‘‘తెలుగు దేశ చరిత్రకు తెలంగాణ విత్తనమని’’ కొమర్రాజు లక్ష్మణరావు ఈ ప్రాంత ప్రాధాన్యతను ఎంతో దార్శనికతతో విశ్లేషించాడు.
ప్రాచీన కాలం నుండి తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల సాహిత్య స్వరూప స్వభావాలు విభిన్నంగా ఉన్నాయని పింగళి లక్ష్మీకాంతం ‘రంగనాథ రామాయణం’ పీఠిక (1942)లో పేర్కొన్నాడు. ఆంధ్ర ప్రాంతంలో మార్గ పద్ధతిలో, తెలంగాణలో దేశి పద్ధతిలో ప్రధా నంగా కవితా సృజన సాగిందని, లక్ష్మీకాంతం వివరించాడు. భౌగోళిక కారణాల రీత్యా సంస్కృత సాహిత్యానుకరణం, తరువాత బెంగాల్ సాహిత్య ప్రభావం ఆంధ్రప్రాంత కవుల రచనల్లో కనిపిస్తుందని ఆయన వివరించాడు. ‘‘తమ ప్రాంతంలో మహో దారమైన జీవితములు గడిపిన వీరుల చరిత్రలే’’ ఇతివృత్తాలుగా మలుచుకొని, తెలంగాణ సాహిత్య కారులు తాతల నాటి తల్లి భాషలో రచనలు చేశారని తెలంగాణ భాషా సాహిత్యాల విశిష్టతను, విలక్షణతను, అందుకు గల కారణాలను పింగళి లక్ష్మీకాంతం సముచితంగా వివేచించాడు.
కృష్ణా జిల్లా నుండి వలస వచ్చిన శేషాద్రి రమణ కవులు తెలంగాణలో స్థిరపడి ఈ ప్రాంత చరిత్ర, సాహిత్య చరిత్ర, సంస్కృతుల పరిశోధనకు తమ జీవితాలను అంకితం చేశారు. ‘‘తెలంగాణ పరిశోధనోద్యమ, శేషాద్రి రమణ కవులు పర్యాయ పదాలు అన్నా అతిశయోక్తి కాదు’’ అన్న (‘తెలంగాణ సాహిత్యవికాసం’) కె. శ్రీనివాస్ మాటల్లో శేషాద్రి రమణకవుల అపురూపమైన పరిశోధనా కృషి అర్థమవుతుంది. వందేళ్ళ క్రితమే శేషాద్రి రమణ కవులు కాలికి బలపం కట్టుకొని తెలంగాణలో పర్యటించి నిజాము రాష్ట్రంలో పరిశుద్ధమైన ఆంధ్ర భాషా స్వరూపం కనిపిస్తుందని వేయి కన్నులతో పరిశీలించి, తెలంగాణ ప్రాచీన సాహిత్య చరిత్రను తవ్వి పోశారు. ‘నిజాం రాష్ట్ర కావ్య ప్రశంస’ కావ్యంతో తెలంగాణ సాహిత్య వైభవానికి శేషాద్రి రమణ కవులు నీరాజనాలు పలికారు. ‘పరిశోధనా వ్యాస మంజరి’ గ్రంథం ద్వారా ఈ ప్రాంత చరిత్రపై కొత్త వెలుగులు ప్రసరించారు.
ఆదిపూడి సోమనాథరావు గోదావరి జిల్లా ప్రాంతానికి చెందిన కవి. వీరికి గద్వాల, మునగాల సంస్థానాలతోపాటు హైదరాబాద్ నగరంతో, శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయంతో ప్రగాఢ అనుబంధం ఉంది. ‘‘అచ్చ తెనుంగు కబ్బమునకాది పదంబయి పొల్చు భాగ్యమున్హె చ్చుగ గన్న దేశమిది’’. ఆది నుండి అచ్చ తెలుగు భాష తెలంగాణలో విలసిల్లిందని సోమనాథ రావు స్పష్టంగా ప్రకటించాడు. ‘‘ఉరుదు శారద యూరేగు ధరణి లోన/ తెలుగుబిబ్బోకవతి పేరు నిలుపు చున్న సరసులకు మీకు వలపు టంజలి ఘటింతు’’ (‘మధుకణాలు’ -జాషువ సర్వలభ్య రచనల సంక లనం) అంటూ తెలంగాణ ప్రాంత సాహిత్యానికి, కవులకు జాషువ కితాబు ఇచ్చాడు. ఉర్దూ సాహిత్యం ఊరేగుతున్న ప్రాంతంలో, తెలుగు సాహిత్యనికి సేవ చేసే సరస సాహితీవేత్తలకు జాషువ ‘వలపుటం జలి’ ఘటించాడు. ‘‘తెలంగాణలో గొప్ప త్రోవలో కవితా సంచారము సాగుతుంది’’ అని పల్లా దుర్గయ్య పాలవెల్లి కావ్యానికి రాసిన ముందు మాటలో విశ్వనాథ ప్రశంసిం చాడు. ‘‘తెలంగాణలో మాట్లాడే తెలుగుభాషకు కొన్ని ప్రత్యేకతలు, కొంత వైశిష్ట్యము ఉన్నది’’ అని తెలంగాణ రచయితల మహా సభల్లో (1953) శ్రీశ్రీ సము చితంగా ప్రకటించాడు. మిగతా ప్రాంతాలవారు పరిహసిస్తారని సందేహించకుండా తెలంగాణ రచయితలు తమ ప్రాంత ప్రజల దైనందిన జీవిత భాషనే రచనలల్లో ప్రయోగించాలని సూచించాడు. తెలుగుకు వెలుగునిచ్చింది తెలంగాణ ప్రాంతమేనని అడవి బాపిరాజు విశ్వసించాడు.
‘‘చాలా మంచి తెలుగు పదాలు తెలంగాణ, రాయలసీమ గ్రామగ్రామాల్లో ఉన్నాయి. వాటిని సాదరంగా స్వీకరించి అందరూ అందుకొని ఉపయోగించాలి’’ (పందిరి మల్లి ఖార్జున రావు శత జయంతి సంపుటం) అని జమ్మలమడుగు మాధవ రామ శర్మ కవి పండితులకు హితవు చెప్పాడు. ప్రకాశం జిల్లా ఏదుబాడు నుండి వచ్చి, నల్లగొండ జిల్లా చండూరులో స్థిరపడిన అంబటిపూడి వెంకట రత్నం ఈ ప్రాంత సాహిత్యానికి ఎనలేని సేవ చేశాడు. ‘సాహితీ మేఖల’ సంస్థను స్థాపించి, దాశరథి, దేవులపల్లి రామా నుజరావు లాంటి కవుల గ్రంథాలను ప్రచురించాడు. నైజాము రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల కొత్త తరం కవులకు సాహితీమేఖల ఒక వేదిక లాగా ఉపయోగ పడిందని రామానుజారావు అభినందించాడు. జయధీర్ తిరుమలరావు సంపాదకత్వంలో వెలువడిన ‘సురవరం ప్రతాపరెడ్డిగారి సన్నిధికి కవిపండితులు రాసిన లేఖలు’ పుస్తకం చదివితే ప్రతాపరెడ్డితో, తెలంగాణతో అప్పటి సీమాంధ్ర ప్రాంత రచయితలకు ఉండే సాహిత్య అనుబంధం అవగతమవుతుంది. అయితే రాయప్రోలు సుబ్బారావు, కురుగంటి సీతా రామయ్య ఎంతోకాలం తెలంగాణలో ఉన్నప్పటికి ఈ ప్రాంత భాషాసాహిత్యాలను గౌరవించ లేదని తెలంగాణవాదులు విమర్శించారు.
తెలంగాణలోని భాషా సాహిత్యాల విశిష్టతను అర్థం చేసుకోవడంతోపాటు ఇక్కడి పోరు తత్వానికి ఆంధ్ర ప్రాంతకవులు అక్షర జేజేలు పలికిన సందర్భాన్ని తలుచుకుం టేనే మహోన్నత స్ఫూర్తి కలుగుతుంది. ‘‘తెలంగాణ తెలంగాణ ధీరుల మొగసాల/ తెలంగాణ తెలంగాణ విప్లవోజ్వల గాథ’’ అని ఆవంత్స సోమసుందర్ సాయుధ పోరాటానికి ‘వజ్రాయుధా’న్ని అందించాడు. ‘‘తెలంగాణ, గగనాన అరుణ తారై వెలుగు/ ఆ తార వెలుగులోనే మము నడుపుమో స్వాతంత్ర్య దేవీ’’ అంటూ పులుపుల వెంకట శివయ్య ఆదర్శనీయమైన ఈ ప్రాంత ఉద్యమ సోయిని అక్షర బద్ధం చేశాడు. ఆరుద్ర, గంగినేని, బొల్లిమంత శివరామ కృష్ణ, తుమ్మల వెంకట్రామయ్య తదితర అభ్యుదయ కవులెందరో తెలంగాణ పోరాటాన్ని కలమెత్తి గళమెత్తి గానం చేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా కొంతమంది సీమాంధ్రకవులు ‘కావడి కుండలు’ సంఘీభావ కవిత్వంతో జై కొట్టిన విషయం జగద్విదితం.
అప్పటి నిజాం కాలం నుండి తెలంగాణ సాహితీవేత్తలు, సంస్థలు ఆంధ్ర ప్రాంత కవి పండితులను సమాదరించిన విషయం కూడా మరిచి పోలేనిది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన దళిత, బహుజన కవుల గురించి సంగిశెట్టి శ్రీనివాస్ ఎన్నో వ్యాసాలు రాశాడు. ఆంధ్రాలో సాగిన సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, సాహిత్య ఉద్యమాలతో తెలంగాణ కవులు కలిసి నడిచి ప్రజాచైతన్యాన్ని ప్రజ్వలింప జేశారు. ఈ దిశగా ప్రత్యేకంగా అధ్యయనం జరగవలసిన అవసరముంది.
కోయి కోటేశ్వరరావు
: 94404 80274
Updated Date - Oct 21 , 2024 | 12:38 AM