ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘‘నవల వందల ఎకరాల వ్యవసాయ క్షేత్రం లాంటిది’’

ABN, Publish Date - Sep 16 , 2024 | 04:53 AM

తనను తాను ‘ఈ నేలకు ఆస్థాన లేఖకుడి’నని ప్రకటించుకున్న రాయలసీమ నవలా కారుడు సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి. ఆ మాటలో లేశమాత్రమైనా అతిశయం లేదు. వారి రచనలన్నీ ఆ పుత్తడి పుడమి చుట్టే తిరుగుతాయి. సగటు మనిషి జీవితాన్ని...

నవలా శిల్పం

తనను తాను ‘ఈ నేలకు ఆస్థాన లేఖకుడి’నని ప్రకటించుకున్న రాయలసీమ నవలా కారుడు సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి. ఆ మాటలో లేశమాత్రమైనా అతిశయం లేదు. వారి రచనలన్నీ ఆ పుత్తడి పుడమి చుట్టే తిరుగుతాయి. సగటు మనిషి జీవితాన్ని పట్టితూచినట్టుగా వారి రచనలు ఉంటాయి. ‘తానా’ బహుమతి పొందిన ‘కొండ పొలం’ వంటి నవల రాయడం వేరొకరికి దుస్సాధ్యం. గొల్ల కాపర్లలో ఒక కాపరిగా, మూగజీవాల మనసు చదివే పెద్దకాపరిగా మారిన తరువాతనే అలాంటి మేలైన రచనను ఆయన చేయగలిగారు. తొమ్మిది నవలలు రాసిన సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డితో ‘నవలా శిల్పం’ శీర్షక కోసం జరిపిన సంభాషణ ఇది.

ఒక ఇతివృత్తం గాని, ఐడియా గానీ స్ఫురించినప్పుడు ‘ఇది కథ కాదు నవలే అవుతుంది’ అని మీరు ఎలా గుర్తు పడతారు?

నేను వ్యవసాయ కుటుంబంలో పుట్టినవాడిని. ఇప్పటికీ రైతుల, రైతు కూలీల మధ్యన బతుకుతూ ఉన్నవాడిని. ఓవైపు రైతుగా విత్తనాల్ని, మరోవైపు రచయితగా అక్షరాల్ని విత్తి పంటలు పండించే సృజనకారుడిని. విత్తనాలు చేతిలోకి తీసుకోగానే అర్థమైపోతుంది– అవి దీర్ఘకాలిక పంటకు సంబంధించినవా, స్వల్పకాలిక పంటకు సంబంధించినవా? అని. ఎదురైన సంఘటన విస్తృతిని బట్టి మనస్సులో ఇంకేటప్పుడే అది కథగానో నవలగానో దాని రూపానికి సంబంధించిన సంకేతాలు ఇస్తుంది.


కవిత, కథ, నవల... మీరు ఈ మూడు ప్రక్రియల్లోనూ రాస్తారు. ఆయా ప్రక్రియల్ని మీరు అప్రోచ్ అయ్యే తీరు ఏ రకంగా భిన్నంగా ఉంటుంది?

ఇన్నేళ్ల సాహిత్య జీవితంలో భిన్న ప్రక్రియలుగా పరిచయమైన సాహిత్యం ఇప్పుడు ఒకే రూపంతో వచ్చి పక్కన కూచుంటోంది. ఏ ప్రక్రియ అయినా చేతుల్లో ఒదుగుతోంది. నాకిప్పటికీ కవిత రాయడమంటే ఇష్టం. కష్టం కూడా. నాకు కవిత ఫ్రేములో బిగించినట్టుండాలి. ఒక పదం ఎక్కువా ఉండకూడదు, తక్కువా ఉండకూడదు. వాక్యం అదిమిపెట్టిన స్ప్రింగ్‌లా ఉండాలి. ఎదురుగా నిలుచుంటే అందులో నేను కనిపించాలి. నేనే కాదు జన సమూహమంతా నిలుచున్నా కనిపించగలగాలి. అంత ఖచ్చితమైన కొలతలు ఉన్నాయి కాబట్టి నేను ఇప్పటిదాకా వందకు మించి కవితలు రాయలేదు. కథకు కూడా హద్దులు ఉన్నాయి. నాలుగు గట్ల మధ్య మడికయ్యలో నాటిన పైరు లాంటిది కథ. దానికి గెట్ల హద్దులుంటాయి. నేలను వృథా కానీని పొదుపరితనం ఉంటుంది. కథ రాయటం కవితంత కష్టం కాదు. కొంత వెసులుబాటు ఉంటుంది.

నవల వందల ఎకరాల వ్యవసాయ క్షేత్రం లాంటిది. ఉద్యానవనాల సాగు లాంటిది. మొక్కల మధ్యన చాళ్ళ వెంట వాహనాల్లో విహరించవచ్చు. తెలిసిన జీవితాల గురించిన నవల రాయటం నాకు కొంత సులభంగా ఉంటుంది. వయస్సుపెరిగేకొద్దీ అనుభవాలు తోడయ్యేకొద్దీ నవల రాయడాన్నే ఎక్కువ ఎంజాయ్ చేస్తాం.


నవలలో భిన్న పాత్రల స్వభావాలను చిత్రించేటప్పుడు మీరు ఎలాంటి ఘర్షణను ఎదుర్కొంటారు? ముఖ్యంగా పురుష రచయితగా స్త్రీ పాత్రల స్వభావాలు చిత్రించటంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?

నవలలోని పాత్రలు మనం తయారు చేసినట్టు ఉండకూడదు. జనాల్లోంచి పేజీల మీదకు నడిచి వచ్చినట్లు ఉండాలి. చదివే పాఠకుడు అలాంటి నమూనాను తనలోనో, తన చుట్టుపట్లనో పోల్చుకోగలగాలి. ఆ పాత్ర సాధారణ పాఠకుడిలో అంతర్గతంగా చైతన్యాన్ని ప్రేరేపించేదిగా ఉండాలి. రోజూ వెళుతోన్న దారిలో పాఠకుడు ఏ కారణం వల్లనో తను చూడలేని, ఏ భయం వల్లనో చూసేందుకు ఇష్టపడని, సహాయం చేయవలసి వస్తుందనే ఏ పిరికితనం వల్లనో చూడబుద్ధిగాని దృశ్యాల్ని ఆ పాత్ర చూపించగలగాలి. అలాంటి పాత్రను సృష్టించినపుడు నేను కూడా పాఠకుడిగా మారిపోయి సదరు సంఘటన చదివినప్పుడు నాకు కూడా ఆ సమస్య ఎదురవుతుంది. ఆ చూడలేని తనం, ఆ పిరికితనం, ఆ భయం నాలో కూడా ఉన్నట్లు అర్థమవుతుంది. నన్ను నేను ప్రక్షాళన చేసుకుంటే గాని ముందుకు సాగలేని పరిస్థితి కలుగుతుంది.

నేను ఎన్నుకొన్న అలాంటి పాత్రలవల్ల రచయితగా చాలా సంఘర్షణకు గురయ్యాను. స్త్రీలు, దళితులు, బహుజనులు, కులాలు, మతాల విషయంలో నా రక్తంలో ఇంకివున్న పాత వాసనల నెన్నింటినో నా సాహిత్యం వేలెత్తి చూపించింది. స్త్రీల విషయంలో తరతరాలుగా అనువంశికంగా వెంట వస్తోన్న మగ అహంకారపు అవలక్షణాలు నాలోనూ ఉన్నాయి. వాటి ఉనికిని గురించిన స్పృహ సాహిత్యమే నాకు ఇచ్చింది. నన్ను నేను సంస్కరించుకునే క్రమంలోనే నా చుట్టూ ఉన్న సమాజంలోని మహిళలకు సంబంధించిన ఎన్నో సంఘటనలు అర్థమయి, అవి కథలుగా, నవలల్లోని సంఘటనలుగా రూపొందాయి. అలాగే దళితులు బడుగు బలహీన వర్గాల గురించిన కథలు కూడా.


నవల మనసులో రూపుదిద్దుకునే, రాసే ప్రక్రియ గురించి చెప్పండి? నవల పూర్తి కావటానికి ఎంత కాలం పడుతుంది? రివైజ్ చేసే ప్రక్రియ ఎలా జరుగుతుంది?

నాకైతే నవల రాయడం అనేది ఒక దీర్ఘకాలపు వ్యూహం. అప్పటికప్పుడు ఏదో ఒక విషయాన్ని ఊహించుకొని, కాగితాలు ముందేసుకొని రాయటం మొదలుపెట్టిన పరిస్థితి అయితే ఎప్పుడూ లేదు. చాలాకాలంగా రకరకాల విషయాలు మనసులో రగులుతూ ఉంటాయి. వాటికి సంబంధించిన అనేక సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. అవన్నీ నాలో జ్ఞాపకాలుగా మారిపోతుంటాయి. మనస్సులో నవలకు సంబంధించిన స్వరూపం ఒకటి రూపుదిద్దుకుంటూ ఉంటుంది. అప్పటికీ రాసేందుకు సిద్ధపడను. ప్రారంభమూ, కథా పరిణామమూ, ముగింపుకు సంబంధించిన దృశ్యము మెదడులో ఖాయమైన తర్వాత దానికి అవసరమయ్యే సంఘటనల్ని జ్ఞాపకాల్లోంచి ఏరుకొని నోట్స్ రాసుకొంటాను. ఎప్పుడూ జనాల్లో ఉంటాను కాబట్టి వాళ్ళ జ్ఞాపకాల తేనె తుట్టెలను కూడా కదిలిస్తాను. ఏ చిన్న విషయం దొరికినా దాచుకొంటాను. తర్వాత నవల రాయడానికి కూచుంటాను. నవలకు సంబంధించిన కాలంలోకి, వ్యక్తుల సమూహంలోకి, వాళ్ళ మాండలికాల్లోకి, వాళ్ళ జీవన విధానంలోకి వెళ్లిపోయినప్పుడు బయట ప్రపంచంతో చాలావరకు సంబంధాలు తెంచుకొంటాను. రచనా ప్రపంచంలోనే బతుకుతాను. నిద్రాహార సమయపాలన కూడా గతి తప్పుతుంది. నవల పూర్తయ్యేసరికి మోచేయి లేదా వెన్నెముకనొప్పిని మొదటి పురస్కారంగా అందుకొంటాను. ఈ పనంతా వేసవి సెలవుల్లో పూర్తి చేస్తాను.

ఇంతా చేసి ఇదొక ముడి సరుకు మాత్రమే. ఇప్పుడు నేను పాఠకుడిగా రెండవ రూపంలోకి మారతాను. రచయితగా భావోద్వేగానికి గురై చూపించిన దశ్యాన్ని పాఠకుడిగా అదే స్థాయిలో అనుభూతిస్తున్నానో లేదో పరీక్షించుకొంటాను. నేను తృప్తిపడేదాకా అనవసరతను కత్తిరించుకొంటూ, అవసరాన్ని చేర్చుకొంటూ, రెండవసారి రాస్తాను. అప్పటికీ తృప్తి పడకుంటే, మూడోసారి రాసేందుకు కూడా వెనకాడను. రాసేందుకు సిద్ధం కావడానికి ఏళ్ళు పడుతుంది. రాయడం మొదలు పెట్టిన తర్వాత కొన్నిరోజుల్లోనే పూర్తవుతుంది. నాకు టైప్ చేయడం రాదు. ఇప్పటికీ చేత్తోనే రాస్తుంటాను.


‘కొండపొలం’ వంటి పరిశోధనాత్మక నవల రాయడంలో మీకు ఎదురైన సవాళ్ళేమిటి?

నాది కాని జీవితం కొండపొలం. గొర్ల కాపర్ల తోటి నాకు జీవితకాలపు పరిచయం వుండొచ్చు. కష్టాలు పంచుకొనేంత దగ్గరితనం వుండొచ్చు. వాళ్ళు వాటితో మాట్లాడే భాష గురించి, చేసే ప్రయాణం గురించి, కలిసి జీవించే సాన్నిహిత్యం గురించి, గొర్లను పోషించేందుకు ఎదుర్కొనే కష్టాల గురించి సంపూర్ణ అవగాహన వుండొచ్చు. కానీ అవన్నీ ‘గొర్లకాపరుల’ గురించి మంచి వ్యాసం రాసుకోవడానికి పనికొస్తాయి. వాళ్లను పాత్రను చేసి నవల రాయాలంటే గొల్లవాడిగా మారితే తప్ప కుదరదు. నవల రాసే సమయంలో నేను అనుభవించిన మానసిక వేదనంతా గొర్లకాపరిగా మార్పు చెందేటందుకు పడిన యాతనే.

గొర్రెల మంద వెనక బొట్టెకట్టె భుజాల మీద పెట్టుకొని నడుస్తూ వుంటే వాటి కాళ్ల కింద లేచిన దుమ్మును పీల్చుకొని ఊపిరితిత్తులు లబలబలాడ్డం, చీదిన చీమిడి రాల్చిన పెంటికల మదపు వాసనకు ముక్కుపుటాలు కుంచించుక పోవడం, దుమ్ము తెరలు కళ్లనిండా చేరి పుసులు కట్టడం, తక్కువ నీళ్ళతో శరీరం అలవాటు పడక రాత్రిళ్ళు మూత్రం చుక్కలు చుక్కలుగా మండుతూ కారటం, ఈ వెతలన్నీ అనుభవించే గొర్ల కాపరిగా మారితే గాని నవల ముందుకు సాగలేదు. నలభై కిలోమీటర్ల పరిధిలోని కొండలన్నీ తిరిగాను. నీళ్శ తావులు చూశాను. రాత్రుళ్ళు మంటలు తగిలించి పక్కన పడుకొని భయం భయంగా నిద్ర పొలం చేశాను. మైళ్ళకొద్దీ దూరాన్ని ఏకబిగిన ఎక్కుతూ దిగుతూ ప్రయాణించాను. నల్లమల అడవులతో, గొర్ల కాపరులతో నాకు ప్రత్యక్ష అనుభవాలు లేకుంటే ఆ నవల రాయగలిగి ఉండేవాన్ని కాదు.


కొత్త రచయితలు నవలా రచనను చేపట్టాలంటే... మీరిచ్చే సూచనలు సలహాలేమిటి?

బాగా రాయాలనుకున్న వాళ్లు బాగా చదవాలి. చదవటం అనేది ఒక తీరని దప్పికగా మారాలి. ఒకప్పుడు చదవాలనుకొన్నా పుస్తకాలు దొరికేటివి కాదు. ఇప్పుడు అరుదైన పుస్తకాలు కూడా సులభంగా దొరుకుతున్నాయి. కానీ తీరిక సమయాన్ని చదవడానికి కేటాయించే వాళ్ళు తక్కువయ్యారు.

తొలకరింపుల్లో మా వూరి రైతులు కొందరు కృష్ణాజిల్లాలోని కంచికచెర్ల, కోదాడ సంతలకు పోతారు. వారం పదిరోజులు పల్లెలన్నీ తిరిగి ఎద్దుల్ని బేరంజేసి తెచ్చుకొంటారు. ఆ ప్రయాణాన్ని గురించి చిన్న విషయాన్ని కూడా వదలకుండా వాళ్ళు యేడాది పొడవునా చెబుతూనే వుంటారు. మనం బస్సెక్కి ఢిల్లీకి వెళ్ళి వచ్చినా మన పక్క సీట్లో కూచున్న వాన్ని పలకరించము. రచనలు చేసే వాళ్ళెపుడూ రైతుల్లాగా వుండాలి. మన చుట్టూ వున్న జీవజాలంతోటి సత్సంబంధాలే సాహిత్య సృజనకు ప్రధాన వనరు.

ఇంటర్వ్యూ : కమల్‌

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

Updated Date - Sep 16 , 2024 | 04:53 AM

Advertising
Advertising