ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అసలు సమస్య ఆశ్రిత గుజరాతీవాదం!

ABN, Publish Date - Apr 02 , 2024 | 02:46 AM

ఆధునిక భారతదేశ రాజకీయ పరిణామాలకు పునాది 1857. బ్రిటీష్ వలస పాలనకు వ్యతిరేకంగా భారత స్వాతంత్ర్య ప్రథమ పోరాటం సాగిన సంవత్సరమది. ఆ పోరాటం విజయవంతం కాకపోయినప్పటికీ...

ఆధునిక భారతదేశ రాజకీయ పరిణామాలకు పునాది 1857. బ్రిటీష్ వలస పాలనకు వ్యతిరేకంగా భారత స్వాతంత్ర్య ప్రథమ పోరాటం సాగిన సంవత్సరమది. ఆ పోరాటం విజయవంతం కాకపోయినప్పటికీ, సామాజిక రంగంలో అదొక కొత్త సమీకరణల్ని ముందుకు తీసుకుని వచ్చింది. బ్రిటీష్ వలస వ్యతిరేక పోరాట కాలంలో హిందూ ముస్లీంల మధ్య ప్రగాఢ ఐక్యత ఏర్పడింది. ప్రాదేశిక జాతీయవాదం (Territorial Nationalism) అనే భావన బలంగా ముందుకు వచ్చింది. భారతదేశ సరిహద్దుల లోపల నివసించేవారందరూ ఒకే జాతి అనేది దీని సారాంశం. దాని పేరు భారతజాతి / హిందూజాతి.

హిందూ ముస్లిం సమూహాలు భారీ సంఖ్యలో ఢిల్లీ ఎర్రకోట ముందు నిలబడి, 80 యేళ్ళు దాటిన వృద్ధ చక్రవర్తి రెండవ బహదూర్ షా జాఫర్‌ను స్వాతంత్ర్య ఉద్యమంలో తమకు నాయకత్వం వహించమని ముక్తకంఠంతో కోరడం ఒక గొప్ప చారిత్రాత్మక ఘట్టం. ప్రజల కోరిక మేరకు జాఫర్ ఆ తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. అందుకు శిక్షగా రంగూన్‌లో హౌస్ అరెస్టులో ఉండి 1962లో చనిపోయాడు. ఆ తరువాత ఆరంభమైన జాతీయోద్యమం భారత స్వాతంత్ర్య ప్రథ పోరాటం నుంచి ‘ప్రాదేశిక జాతీయవాదం’ను ఆదర్శంగా స్వీకరించింది.

గతంలో ఎవరు ఎక్కడ నివాసం వున్నా ప్రస్తుతం భారతదేశంలో విలీనమై నివసిస్తున్నారు కనుక వీరందరూ భారతీయులే అనేది ప్రాదేశిక జాతీయవాదం అవగాహన. ఉర్దూ మహాకవి ముహమ్మద్‍ అల్లమా ఇక్బాల్ 1904లో ‘సారే జహా సే అచ్ఛా హిందూసితా హమారా’ (ప్రపంచంలో మహోన్నతమైనది మన హిందూదేశము) అనే పల్లవితో సుప్రసిద్ధ జాతీయ గీతాన్ని రాశారు. అందులోని ఒక చరణంలో ‘మనం హిందువులం మనది హిందూదేశము’ (హిందూ హై హమ్ – వతన్ హై హిందూస్తాన్ హమారా) అంటారు. ఇందులోని హిందూ, హిందూస్తాన్ వగయిరా పదాల్ని ప్రాదేశిక జాతీయవాద దృక్పథంతో రాశారు. ఇప్పుడు హిందూమతంగా ప్రచారంలో వున్నది అప్పట్లో సనాతనధర్మం పేరుతో వుండేది. హిందూ పదం జాతి పేరుగా వుండేది. ప్రాదేశిక జాతీయవాదం ప్రకారం దేశంలోని ముస్లింలు, క్రైస్తవులు అందరూ హిందువులే!

వినాయక్ దామోదర్ సావర్కర్ 1922లో ‘హిందూత్వ ఆవశ్యకతలు’ పేరుతో ఒక సిద్ధాంత గ్రంథాన్ని రాశారు. దీన్ని 1923లో ‘హిందూత్వ – హిందువు అంటే ఎవరూ?’ అనే పేరుతో ప్రచురించారు. సావర్కర్ పుస్తకానికి రెండు ప్రత్యేకతలున్నాయి. మొదటిది: హిందూ పదానికి ప్రాదేశిక అర్థాన్ని తొలగించి మతపరమైన అర్థాన్ని ఇచ్చారు. రెండోది: హిందూమత సమూహపు రాజకీయార్థిక సాంస్కృతిక ఆధిపత్యాన్ని సూచించడానికి ‘హిందూత్వ’ అనే కొత్త పదాన్ని ప్రయోగించారు. ఆ పదం సావర్కర్ స్వీయసృష్టి. అక్కడి నుండి మన రాజకీయాల్లో సాంస్కృతిక జాతీయవాదం (Cultural Nationalism) ప్రవేశించింది. హిందూమత ప్రాతిపదికగా జాతి నిర్మాణం దీని లక్ష్యం. అంచేత దీన్ని హిందూ జాతీయవాదం అనవచ్చు.

వి.డి. సావర్కర్ ప్రతిపాదించిన ద్విజాతి సిద్ధాంతం, హిందూ జాతీయవాదం ప్రేరణతో హిందువులకు రాజ్యాధికారాన్ని సాధించే లక్ష్యంతో 1925లో ఆరెస్సెస్ ఏర్పడింది. ఆ సంస్థ రెండవ సర్సంగ్ ఛాలక్ గురూజీ ఎంఎస్ గోల్వాల్కర్ ‘బంచ్ ఆఫ్ థాట్స్’ అనే గ్రంథంలో హిందూదేశానికి మిత్రులు ఎవరో శత్రువులు ఎవరో వివరించారు. తలనుండి పుట్టినా, ఛాతీ నుండి పుట్టినా, ఉదరభాగం నుండి పుట్టినా కాళ్ళ నుండి పుట్టినా నాలుగు వర్ణాలూ ఒకే విరాట్ పురుషుని దేహం నుండి పుట్టాయి కనుక అవన్నీ పవిత్రమైనవే అనేది వారి వివరణ. వర్ణాల్లో ఒకటి ఎక్కువ అనీ మరొకటి తక్కువ అని భావించడం, హిందూ సమాజంలో నిచ్చెనమెట్ల వ్యవస్థ వుందని చెప్పడం తప్పు అంటూ వారు హిందూ ఐక్యతను బోధించారు.

మరోవైపు, ముస్లింలు భారతదేశంలో పుట్టి, ఇక్కడే బతికి, ఇక్కడే చనిపోయినా భారతదేశం వారికి పితృభూమి, కర్మభూమి మాత్రమే అవుతుంది గానీ పుణ్యభూమి మాత్రం కాదు. కాబట్టి వారు ‘అన్యులు’ అనేది గోల్వాల్కర్ వర్గీకరణ. ఇదే ప్రమాణం క్రైస్తవులు, కమ్యూనిస్టులకు కూడ వర్తిస్తుందని వారొక సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు. అక్కడితో ఆగకుండా ‘ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులు హిందూదేశానికి అంతర్గత ముప్పు’ అని ప్రకటించారు.

సమాజంలో వ్యష్టి ప్రయోజనాలని పరిరక్షించాలనే ప్రజాస్వామ్యం, సమిష్టి ప్రయోజనాలను కాపాడాలనే సామ్యవాదం రెండూ భారత సమాజానికి పనికిరావని ఎంఎస్ గోల్వాల్కర్ ప్రగాఢ అభిప్రాయం. యజమానులు – శ్రామికులు అనే సామాజికార్థిక విభజన వారికి నచ్చేది కాదు. నాలుగు వర్ణాలవారు ఎవరి హక్కుల్ని వారు ఆస్వాదిస్తూ, ఎవరి బాధ్యతల్ని వారు నిర్వర్తించే వర్ణవ్యవస్థే ప్రపంచంలో నిలిచి వెలుగుతుందని వారు ప్రవచించారు.

దేశం బలపడడానికి ఆర్థిక రంగంలో హిందూ పెట్టుబడిదారుల్ని ప్రోత్సహించాలనే మాట గోల్వార్కర్ నాటికే వుంది. అయితే, దేశంలో సామ్యవాద భావాలు, కమ్యూనిస్టు పార్టీల ప్రభావం బలంగావున్న కారణంగా అప్పట్లో ఆరెస్సెస్ దాని రాజకీయ విభాగాలయిన జనసంఘ్, బీజేపీలు పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయాయి. 1990వ దశకం ఆరంభంలో తూర్పు యూరప్, రష్యాల్లో కమ్యూనిస్టు ప్రభుత్వాలు పతనం అయ్యాక, గ్యాట్ ఒప్పందాలు కుదిరాక, సరళీకృత ఆర్థిక విధానం రంగప్రవేశం చేశాక సాంస్కృతిక జాతీయవాదానికి ఆర్థిక జాతీయవాదాన్ని జత చేశారు. ఈ ఘనత లాల్ కిషన్ ఆడ్వాణీకి దక్కుతుంది. బడా పెట్టుబడిదారీ సంస్థలు ఆరెస్సెస్, బీజేపీలను ప్రోత్సహించడం మొదలెట్టాయి. ఈ ఫార్ములా రెండు పక్షాలకూ ప్రయోజనకారిగా మారింది. ఇరువురూ ఒక అవగాహనతో ఒకరినొకరు సమర్థించుకుంటూ ఒకరు ఆర్థిక రంగంలో, మరొకరు రాజకీయ రంగంలో బలపడ్డారు.

నరేంద్ర దామోదర్ దాస్ మోదీజీ 2001 చివర్లో గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాక సాంస్కృతిక జాతీయవాదం, ఆర్థిక జాతీయవాదం కొత్త పుంతలు తొక్కాయి. నరేంద్ర మోదీజీ చొరవతో గుజరాత్‌లో హిందూ జాతీయవాదం గుజరాత్ జాతీయవాదంగా, గుజరాత్ ఆర్థిక జాతీయవాదంగా కొత్త శక్తిని పుంజుకుంది. గుజరాత్ మోడల్‌నే భారతదేశ మోడల్‌గా మార్చడానికి గుజరాతీ మెగా కార్పొరేట్లు గుజరాత్ ముఖ్యమంత్రిని దేశప్రధానిగా మార్చుకున్నారు.

మోదీజీ ప్రధాని అయ్యాక గుజరాత్ మెగా కార్పొరేట్లకు భారీ మేళ్ళు జరిగాయన్న అభిప్రాయం బలంగా ఉంది. దీనినే చాలామంది ప్రయోజిత పెట్టుబడీదారీ వ్యవస్థ (క్రోనీ కేపిటలిజం) అంటున్నారు. అందుకు భిన్నంగా, గుజరాత్ మెగా కార్పొరేట్లే తమ ధనబలాన్నీ, మీడియా బలాన్నీ ప్రయోగించి తమకు అనుకూలురైన మోదీజీని దేశప్రధాని కుర్చీలో కూర్చోబెట్టుకున్నారనే వాదనా వుంది. దీనినే ప్రయోజిత ప్రజాస్వామ్యం (క్రోనీ డెమోక్రసీ) అంటున్నారు.

రాజకీయార్థిక రంగాల్లో ఇటీవలి పరిణామాల్ని లోతుగా గమనిస్తే దేశంలో ప్రయోజిత ప్రజాస్వామ్యం కొనసాగుతున్నదనే వాదనకే బలం చేకూరుతోంది. క్రోనీ డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యానికి నాలుగు మూల స్థంభాలయిన శాసన, కార్యనిర్వాహక, న్యాయ, మీడియా వ్యవస్థల పనితీరు ప్రాయోజిత కార్యక్రమాలుగా మారిపోయాయని అర్థం. క్రోనీ డెమోక్రసీ అనేది కొత్త సిద్ధాంతం ఏమీకాదు. మనం పెద్దగా పట్టించుకోలేదుగానీ మార్క్సిస్టు మూల సూత్రాల్లోనే ఈ ప్రస్తావన వున్నది. ‘పెట్టుబడీదారీ వ్యవస్థ తన ప్రయోజనాలకు అనుకూలమైన పార్లమెంటరీ వ్యవస్థను రూపొందించుకున్నది’ అని కార్ల్ మార్ల్స్ అన్నాడు. పెట్టుబడీదారులు తమ ప్రయోజనాలను నెరవేర్చిపెట్టే రాజకీయ నాయకుల్ని దేశాధినేతలుగా నియమించుకునేందుకు ఇది అవకాశం ఇస్తుంది. గుజరాతీ మెగా కార్పొరేట్లు తమ ప్రతినిధిని దేశాధినేత స్థానంలో పెట్టుకునే స్థాయికి ఇప్పుడు ఇది అభివృద్ధి చెందింది.

ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశాన్ని అణిచివేస్తున్నదనే వాదనలు గోల్వార్కర్ నాటికే వున్నాయి. దక్షిణాదికి చెందిన ఆదిశంకరాచార్యను తాము ఎంతగా గౌరవిస్తారో వారు చాలా వివరంగా చెప్పుకొచ్చారు. అయినప్పటికీ ఆ వివాదం మళ్ళీ రాజుకుంది. దక్షిణాది ఆరు రాష్ట్రాల్లో ఎక్కడా ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం లేకపోవడం దీనికి ఒక సంకేతం. ఇప్పుడు ఉత్తరాది వ్యతిరేకతతోపాటూ గుజరాతీ వ్యతిరేకత కూడా దేశమంతటా క్రమంగా పుంజుకుంటున్నది.

ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టుల్ని సామాజికంగా వెలివేస్తున్నాం, ఆర్థికంగా అణచివేస్తున్నాం, రాజకీయంగా దూరంగా పెడుతున్నాం అని చెప్పడం ద్వారా కరడుగట్టిన హిందూత్వవాదుల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు సంఘపరివారం చేస్తున్నది. అయోధ్యలో రామాలయ నిర్మాణం ద్వారా సామరస్య హిందువులని సంతృప్తిపరచే ప్రయత్నం చేస్తున్నది. ఇలాంటి ముసుగులు ఎన్ని కప్పినా కేంద్ర ప్రభుత్వ గుజరాతీ పక్షపాతం అందరికీ స్పష్టంగానే కనిపిస్తున్నది. జాగ్రత్తగా గమనిస్తే ఉత్తర – దక్షిణ వివాదంకన్నా, గుజరాతీ వ్యతిరేక వివాదం వేగంగా రగులుకుంటున్నది.

ఉషా ఎస్ డానీ

సామాజిక విశ్లేషకులు

Updated Date - Apr 02 , 2024 | 02:46 AM

Advertising
Advertising