భారతీయ దృక్కోణంలో శ్వేతసౌధ పోటీ
ABN, Publish Date - Oct 29 , 2024 | 12:51 AM
నవంబర్ 5.. సరిగ్గా వారం రోజులు ఉంది. ఆ రోజున ప్రపంచ పరిణామాలను అమితంగా ప్రభావితం చేసే నిర్ణయాన్ని అమెరికా ప్రజలు తీసుకోనున్నారు. అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల గురించి నేను ప్రస్తావిస్తున్నాను. అవును, ప్రపంచ అగ్రరాజ్య ప్రభుత్వాధినేతగా ఎవరు ఎన్నికవనున్నారు?...
నవంబర్ 5.. సరిగ్గా వారం రోజులు ఉంది. ఆ రోజున ప్రపంచ పరిణామాలను అమితంగా ప్రభావితం చేసే నిర్ణయాన్ని అమెరికా ప్రజలు తీసుకోనున్నారు. అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల గురించి నేను ప్రస్తావిస్తున్నాను. అవును, ప్రపంచ అగ్రరాజ్య ప్రభుత్వాధినేతగా ఎవరు ఎన్నికవనున్నారు? ఇదే సర్వత్రా అందరూ ఆసక్తిదాయకంగా, ఉత్కంఠభరితంగా చర్చించుకుంటున్న అంశం. డెమొక్రాట్లు, రిపబ్లికన్లు మధ్యనే దోబూచులాడుతూ ఉండే ఈ అత్యున్నత, మహా శక్తిమంతమైన అధ్యక్ష పీఠం ఈసారి ఎవరికి దక్కనున్నది? ఈ రెండు పార్టీలు కూడా తమ తమ సంప్రదాయ సిద్ధాంత భావజాలం నుంచి కొద్దిగా పక్కకు జరిగి, కొత్త ఓటర్లను కూడా తమకు అనుకూలంగా మలుచుకోవాలనే దృష్టితో వ్యవహరిస్తున్న సమయంలో విజయంపై అనిశ్చితి నెలకొని ఉంది. గతంలో ఎన్నడూ లేనంత పోటాపోటీగా ఈ దఫా అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ఎవరు విజయం సాధిస్తారనేది– కేవలం ఆ దేశ ప్రజలకు మాత్రమే కాదు, తమ భవిష్యత్తు పట్ల ఎన్నో ఆశలను అమెరికాతో ముడిపెట్టుకుంటున్న కొన్ని లక్షల మంది భారతీయులు, ప్రత్యేకించి తెలుగు యువతరం కుటుంబాలకు కూడా చెందిన వ్యవహారం!
సంప్రదాయంగా భారతీయ అమెరికన్లు డెమొక్రాట్ పార్టీకి అనుకూలంగా ఉంటారు. ఇప్పుడు ఈ పరిస్థితులు మారుతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్య సన్నిహిత స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఇరువురి పాలన కాలంలో భారత్–అమెరికా ద్వైపాక్షిక సంబంధాలలో సంభవించిన అనేక పరిణామాల నేపథ్యంలో ఈ సారి ఏకపక్షమైన మొగ్గు డెమొక్రాట్ల వైపు లేదు. ‘ట్రంప్ ఈజ్ మై ఫ్రెండ్’ అని ప్రకటించిన మోదీ అమెరికాలోని భారతీయ సమాజాన్ని ఎంతో కొంత ప్రభావితం చేయగలరు. ఆయనను అమితంగా ఆరాధించే అమెరికాలోని ఉత్తరాది భారతీయులు ట్రంప్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఎక్కువగా ఉండే గుజరాతీలు నరేంద్ర మోదీ మీద అభిమానంతో ట్రంప్‌కు మద్దతు పలుకుతున్నారు. సాధారణంగా మధ్యతరగతి, పేద వర్గాలు డెమొక్రాట్ల వైపు ఉంటారు. భారతీయుల సంప్రదాయ మొగ్గు అటువైపు ఏర్పడడానికి కారణం కూడా అదే. అయితే ఇటీవలి కాలంలో ప్రవాస భారతీయుల్లో సంపన్నులు పెరుగుతున్నారు. వీరు అమెరికన్ ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని కోరుకుంటారు. మొగ్గు రిపబ్లికన్ల వైపు మారడానికి ఇది ఒక కారణం. భారతీయుల్లో ప్రత్యేకించి డాక్టర్లు, ఐటీ రంగంలో ఉన్నవారు, పారిశ్రామికవేత్తలు రిపబ్లికన్ల వైపు మొగ్గే అవకాశం కనిపిస్తోంది. వ్యక్తిగా ట్రంప్ మీద ఎలాంటి అభిప్రాయాలు, పలుచన భావం ఉన్నప్పటికీ గతంలో ఆయన అధ్యక్షుడుగా ఉన్నప్పుడు అనుసరించిన సరళీకృత ఆర్థిక విధానాల పట్ల అందరికీ ఏకీభావం ఉన్నది. డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధ్యక్షుడు అయితే అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందనే విశ్వాసం చాలా మందిలో ఉన్నది. ఇప్పుడున్న సంక్షోభ పరిస్థితులు తొలగిపోతాయని నమ్ముతున్నారు. భారతీయులకు సంబంధించినంత వరకు ప్రధానంగా ఆధారపడే ఐటీ రంగం తిరిగి గాడిన పడి పరుగులు పెడుతుందని నమ్ముతున్నారు.
తెలుగువారి అభిప్రాయాలూ భిన్న రీతుల్లో ఉన్నాయి. సంప్రదాయిక డెమొక్రాట్ అనుకూలత పలచబడింది. కొన్ని వర్గాలు మాత్రం ట్రంప్ అధ్యక్షుడు అయితే అమెరికన్ ఎకానమీ బాగుపడుతుందని, జాబ్ మార్కెట్ మళ్లీ పుంజుకుంటుందనే ఆశతో ఉన్నారు. కేవలం తెలుగువారే కాదు.. మొత్తంగా అమెరికాలోని భారతీయ సమూహాన్నే పరిగణనలోకి తీసుకున్నప్పుడు.. ఇక్కడి అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసే స్థాయిలో మన బలం లేదు. సమస్త భారతీయ ఓటర్లు 1 శాతం కంటే తక్కువ మందే ఉంటారు. వారందరూ కూడా కచ్చితంగా ఓటింగుకు వస్తారనే నమ్మకం లేదు. ఇటీవలి కాలంలో అమెరికాలో బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారతీయ సమాజం ఓట్ల పరంగా గెలుపును శాసించలేకపోవచ్చు గానీ.. పార్టీలకు ఆర్థిక దన్నుగా నిలవగల స్థితికి చేరుకుంది. అంతో ఇంతో భారతీయ సమాజానికి ఆశావహ పరిణామం ఇది.
భారతీయ సమూహంతో ఉన్న మరో ఇబ్బంది ఏమిటంటే.. అమెరికాలో స్థిరపడిన వారిలో చాలామందికి అర్హతలు ఉన్నప్పటికీ.. ఓటరుగా నమోదు చేయించుకోరు. ఓటరుగా నమోదు అయిన వారిలో కూడా అనేకమంది ఓటు వేయడానికి వెళ్లరు. కేవలం భారతీయులే కాకుండా.. మొత్తంగా చూసినా ఓటింగ్ శాతం తక్కువగానే ఉంటుంది. తెలుగువాళ్లు ఓటింగును ఏ రకంగానూ ప్రభావితం చేయలేరు. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటారు. విద్యావంతుల దేశమైన అమెరికాలో సైతం ఓటింగ్ శాతం ఎక్కువ స్థాయిలో నమోదు కాదు. అగ్రరాజ్యం, విద్యావంతులు ఉండే పెద్దదేశం అనుకునే అంచనాలకు తగినంత ఓటింగ్ జరగదు. తమ ఓటు కేవలం దేశభవిష్యత్తునే కాకుండా, యావత్తు ప్రపంచాన్నీ శాసించే నిర్ణయం అవుతుందని అమెరికన్ ఓటర్లకు బాగా తెలిసినా ఓటింగ్ శాతం తక్కువే నమోదు అవుతుంది. ఎక్కువగా ఓటింగ్ ఉండే గ్రామీణ ప్రాంతాల్లో ట్రంప్‌కు అనల్పమైన ఆదరణ ఉంటుంది. డెమొక్రాట్లను ఆదరించే నగరజీవుల్లో ఓటింగుకు గైర్హాజరీలు ఎక్కువ.
డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలాహారిస్ తల్లి భారతీయురాలు. ఈ ఎన్నికలో ఆమెకు ఆ కారణం గొప్ప సానుకూలత అవుతుందని చెప్పలేం. ముందే చెప్పుకున్నట్టు భారతీయ ఓటర్లు డెమొక్రాట్లను అభిమానించే వారే అయినా.. ఇప్పుడు పరిస్థితి మారుతోంది. దక్షిణ భారతదేశానికి చెందిన ఎన్నారైలలో కమలాహారిస్‌కు కచ్చితంగా మొగ్గు కనిపించే అవకాశం ఉంది. మెజారిటీ తమిళులు ఆమెను తమ సొంత మనిషిగా చూస్తున్నారు. కేరళ కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారిలో సానుకూలత పరవాలేదు. కానీ ఈ వర్గాల ఓటింగ్ శాతం చాలా చాలా తక్కువ. డెమొక్రాట్లు అనుసరిస్తున్న వలస విధానాలు భారతీయులకు ప్రతిబంధకంగా మారుతున్నాయి. చట్టబద్ధంగా ఇక్కడకు వచ్చిన భారతీయులు కూడా కొన్ని సందర్భాలలో ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కోసారి భారతీయులను కూడా చట్టవిరుద్ధంగా వచ్చిన వలసదారులుగా పొరబడుతున్న సందర్భాలు ఉన్నాయి. మరి వలసదారుల విషయంలో ట్రంప్ విధానాలకే ఆదరణ ఉంది.
కరోనా ఉపద్రవం తరువాత ఐటీ రంగం ఒడిదుడుకులకు లోనవ్వడం భారతీయులకు ఆందోళన ఎంతైనా కలిగిస్తోంది. ముఖ్యంగా జాబ్ మార్కెట్ ఎన్నడూ లేని రీతిలో అథమ స్థాయికి పడిపోయింది. లక్షలాది భారతీయులు ఉద్యోగాలు కోల్పోయారు. అదే విధంగా వేలాది విద్యార్థులు ఎంఎస్ చదువులు పూర్తిచేసి ఉద్యోగాలు లేక రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వాతావరణం ఏర్పడడానికి గత నాలుగు సంవత్సరాలుగా డెమొక్రాట్లు అధికారంలో ఉండడం కూడా ఒక కారణం అని భావిస్తున్నవారు లేకపోలేదు.
స్థూలంగా చూసినప్పుడు.. ఈసారి అమెరికా అధ్యక్ష పదవీ ఎన్నిక చాలా క్లిష్టంగా ఉంది. ఏడు స్వింగ్ రాష్ట్రాల ప్రభావం చాలా ముఖ్యం. అందునా పెన్సిల్వేనియా కీలకం. ఆ ఒక్క రాష్ట్రంలో 19 ఎలక్టోరల్ ఓట్లు ఉండడం ప్రధానంగా గమనించాలి. ఏడు స్వింగ్ స్టేట్స్‌లో అందరూ పెన్సిల్వేనియా మీదనే దృష్టి పెడుతున్నారు. ప్రజల ఓట్లతో సంబంధం లేకుండా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లే గెలిపించే ఎన్నికలు ఇవి. మరో కీలకాంశం ఏమిటంటే.. డెమొక్రాట్ అభ్యర్థిగా బైడెన్ తప్పుకున్నాక కమలా హారిస్‌కు బాగా బలం పెరిగింది. కేవలం ఓట్ల పరంగా కాకుండా, ధనరూపంగా కూడా సాయం పెరిగింది. కానీ ఈ బలాన్ని ఆమె ఎంత మేరకు విజయం దిశగా నడిపించగలరనే సందేహాలు పలువురిలో ఉన్నాయి. శ్వేతసౌధం (అమెరికా అధ్యక్షుని అధికార నివాసం) ఆసామీగా ఎవరు వచ్చినప్పటికీ భారతీయ సమాజం కోరుకునేది ఒక్కటే. భారత్– అమెరికా సంబంధాలు కుదురుగా ఉండాలి. అమెరికాలోని భారతీయ సమాజానికి, అమెరికా మీద ఆశలు పెంచుకుంటున్న భారతీయ యువతరానికి ప్రోత్సాహకరంగా, సహాయకరంగా ఉండాలి. ఇందుకు ఎవరు కృషిచేస్తారో వారికే భారతీయ సమూహం మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది.
కృష్ణమోహన్ దాసరి
డల్లాస్, అమెరికా
Updated Date - Oct 29 , 2024 | 07:04 AM