ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వారి చరిత్ర ‘తడిసె రక్తమున, కాకుంటే కన్నీళులతో’...

ABN, Publish Date - Oct 27 , 2024 | 01:04 AM

ఐరోపా సందర్శకులకు అనేక నగరాల్లో కథెడ్రల్స్, మ్యూజియంలతో పాటు తప్పకుండా చూడాల్సిన టూరిస్టు ఆకర్షణల్లో యూదులు నివసించిన కాలనీలు, వాళ్ళ ప్రార్థనా స్థలాలు, వారి స్మశానాలు ఉంటాయి. ముఖ్యంగా...

ఐరోపా సందర్శకులకు అనేక నగరాల్లో కథెడ్రల్స్, మ్యూజియంలతో పాటు తప్పకుండా చూడాల్సిన టూరిస్టు ఆకర్షణల్లో యూదులు నివసించిన కాలనీలు, వాళ్ళ ప్రార్థనా స్థలాలు, వారి స్మశానాలు ఉంటాయి. ముఖ్యంగా మధ్య యూరోప్ నగరాలయిన ప్రాగ్, బుడాపెస్ట్, వియెన్నా, జెర్మనీలోని పలు పట్టణాల్లో వాటిని సందర్శించటం అనేకమంది యూరోపియన్లకు, యూదులకు, ఇతర తెల్లజాతి ప్రజలకు దాదాపు ఒక పుణ్య కార్యం. ఐరోపా దేశాలు ప్రపంచవ్యాప్తంగా అనేక ఖండాల్లో జరిపిన లెక్కలేనన్ని హింసాకాండల్లో తాము యూదులపై జరిపిన నరమేధానికి చాలా ప్రత్యేక స్థానం ఇస్తారని వలస దేశాల నుండి వెళ్లే నల్లజాతి ప్రజలకి కొట్టొచ్చినట్లు అర్థమవుతుంది. వాటిని సందర్శించినప్పుడే పోలాండ్, ఆస్ట్రియా, హంగేరి, చెకోస్లోవేకియా లాంటి ఎన్నో దేశాలు తమ దగ్గరి యూదులను హిట్లర్‌కు అప్పగించి తమ చేతులకి మట్టి అంటకుండా అతని మారణహోమంలో తమ వంతు సహాయం చేశాయని, పారిశ్రామిక పద్ధతుల్లో నిర్వహించిన ఆ జాతి సంహారాన్ని సాధ్యమయినంత సులభతరం చేశాయని కూడా తెలుస్తుంది. కొంచెం లోతుకి వెళ్లి చూస్తే యూదుల పట్ల ద్వేషం అనేక శతాబ్దాలు యథేచ్ఛగా కొనసాగిందని మనకి అర్థమవుతుంది. హిట్లర్ పెద్ద ఎత్తున చేసాడు కాబట్టి ప్రపంచ చరిత్రలోకి ఎక్కింది తప్ప యూదులని వేధించటం అతడు కొత్తగా కనిపెట్టింది కాదని స్పష్టమవుతుంది.


జర్మనీలోని తురింగియా రాష్ట్రంలో, బెర్లిన్‌కు సమీపంలో ఉన్న ఎర్ఫర్టు అనే చారిత్రక పట్టణంలో ఫెలోషిప్‌పై ఉండటానికొచ్చిన నాకు ఈ చరిత్ర గురించి ప్రత్యక్షంగా తెలుసుకోవటానికి ఒక అవకాశం లభించింది. నేనుండే హాస్టల్ పక్కనే ఆల్ట్ సినగాగ్ యూరోపులోనే ఇప్పటికీ నిలిచి ఉన్న అత్యంత పురాతన యూదుల ప్రార్థనా స్థలం. 11వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు అంటే అంతకు ముందు నుండే ఇక్కడ యూదు సమూహం ఉండేదని అర్థమవుతుంది. ఈ పట్టణం, మధ్య ఐరోపాలో మత పరంగా, వ్యాపార పరంగా ప్రాముఖ్యత కలిగి, స్వతంత్ర ప్రతిపత్తితో ఏ రాజ్యంలో భాగం కాకుండా ఉండేది కాబట్టి ఐరోపాలో అనేక కట్టుబాట్ల మధ్య బ్రతికిన యూదుల సమూహం తమ జీవనం కోసం ఇక్కడ స్థిరపడ్డానికి చాలాసార్లు ప్రయత్నించారు. జర్మనీ లోని మొదటి విశ్వవిద్యాలయం 1300ల్లో ఈ పట్టణంలోనే ఏర్పాటయింది. ప్రధానంగా వివిధ చర్చిలలో సభ్యులయిన మగ విద్యార్థులు ఆ విశ్వవిద్యాలయంలో చదువుకునేవాళ్ళు. ప్రొటెస్టెంట్ సంస్కర్త మార్టిన్ లూథర్ ఇక్కడే చదివి చాలా కాలం ఈ పట్టణంలోనే నివసించారు. వివిధ చర్చీల్లో ఆయన ప్రబోధాలు చేసేవాడు. ఎర్ఫర్టు ప్రొటెస్టెంట్ సంస్కరణలో భాగమై క్రైస్తవ మత ప్రజాస్వామ్యీకరణ జరిగిన పట్టణాల్లో బహుశా ఒకటని చెప్పుకోవచ్చు.


మిగతా నగరాలతో పోలిస్తే ఇక్కడి యూదు సమూహం పెద్దదిగా ఉండేది. కొంత తక్కువ కట్టుబాట్లతో బ్రతికిందని అంటారు. వారి అవసరం పట్టణ వాసులకి ఉండటంతో కొన్నిసార్లు వారికి ప్రత్యేక సదుపాయాలు కల్పించి ఇక్కడ ఉండేలా చేశారు. అయితే ప్రత్యేకంగా కేటాయించిన స్థలంలోనే వాళ్ళు బ్రతకాలి. మిగతా చోట్ల కంటే భిన్నంగా ఇక్కడ నగరం మధ్యలో కొంత ప్రాంతాన్ని వీరికి కేటాయించారు. పరిశోధకులు కూడగట్టిన వివరాల ప్రకారం ఆ స్థలం చిన్నది. క్రైస్తవుల ఇళ్లతో పోలిస్తే యూదుల ఇళ్ళు చిన్నవిగా ఉండేవి. వాళ్ళు నగరంలో ఏ చేతి పని గిల్డ్‌ల్లో భాగం అవ్వటం నిషేధం. కేవలం అప్పులివ్వటం, ఫైనాన్స్ చేసుకోవటానికి మాత్రమే వారికి పర్మిషన్ వుండేది. అనేకసార్లు వాళ్ళని ప్రత్యేక బ్యాడ్జి పెట్టుకోవాలనే నిబంధన తెచ్చారు. యూదులపై ప్రత్యేక పన్నులు ఉండేవి. అప్పుడప్పుడు కొన్ని పనులు చేసుకునే వెసులుబాటు ఇచ్చేవాళ్ళు. ఇక్కడ ముద్రణ, మాంసం కోసి అమ్ముకోవటం, బేకర్లుగా కొంత మంది యూదులు పనిచేసుకుని సంపాదించుకోవచ్చని పర్మిట్ ఇచ్చారు. తమ మత ఆచారాల ప్రకారం ఒక జంతువు నుండి కోషెర్ మాంసం కోసుకున్న తర్వాత మిగిలిన మాంసాన్ని ప్రత్యేక స్థలాల్లో మాత్రమే అమ్మాలి. ఎర్ఫర్ట్‌లో వాళ్లకి కేటాయించిన ఒక చిన్న గల్లీని పరిశోధకులు గుర్తించారు. అయితే క్రైస్తవులు వాళ్ళని యూదులని గుర్తించే విధంగా ప్రత్యేక టోపీలు పెట్టుకుని ఆ మాంసం అమ్ముకోవాలనే నిబంధన ఉండింది. ఎప్పుడు ఎవరు తరుముతారో తెలియక తమ దగ్గరున్న ధనాన్ని భూమిలో దాచి పెట్టుకుంటే, అది ఈ మధ్యనే బయటపడింది. అనేక అందమైన ఆభరణాలు, వందలాది వెండి ఫ్రెంచి నాణాలు సినగాగ్‌లో భద్రపరిచిన ఈ ఎర్ఫర్టు నిధిలో భాగం.


వివిధ నిబంధనలు, వివక్షలు, కట్టుబాట్లతో పాటు యూదులను మూడుసార్లు ఇక్కడి నుండి వెళ్లగొట్టడం జరిగింది. 1221లో మొదటిసారి ఒక క్రైస్తవుణ్ణి చంపి రక్తం తాగారనే నెపంతో క్రూసేడర్లు దాడుల్లో 22 మంది చనిపోయారు. యూదు మతాన్ని వదిలి క్రైస్తవాన్ని తీసుకోవాలని తెచ్చిన ఒత్తిడిని తట్టుకోలేక కొంతమంది తమని తామే చంపుకున్నారు. 1349లో ప్లేగు వ్యాధి భయాలు ప్రబలిన సమయంలో యూదులే బావుల్లో విషం కలిపారని దానివల్లే ప్లేగు వ్యాధి ప్రబలుతోందని దాడి చేసినప్పుడు దాదాపు 900 మంది హతమయ్యారు. కొంత మంది సినగాగ్‌లో పోరాడుతూ చనిపోతే, మరికొంత మంది ఆత్మాహుతి చేసుకుని చనిపోయారు. 1450ల్లో ప్రొటెస్టెంట్ సంస్కరణ ఉద్యమం, దానికి వ్యతిరేక ఉద్యమం వల్ల యూదులపై వివక్ష, పన్నులు తీవ్రం చెయ్యటంతో పాటు, వారికి ఉండే ప్రత్యేక రక్షణని వెనక్కి తీసుకోవటంతో ఇక్కడి నుండి మళ్ళా అందరూ తూర్పు ఐరోపాకి, లేకుంటే గ్రామీణ ప్రాంతాలకి పారిపోయారు. మళ్ళా 300 ఏళ్ల తర్వాత 1800ల మొదట్లో, ఫ్రాన్సు ఈ నగరాన్ని ఆక్రమించుకున్నప్పుడు మాత్రమే తిరిగొచ్చారు. 1800 చివర్లో వాళ్లకి కొన్ని హక్కులు లభించాయి. అయితే హిట్లర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 1938లో ప్రార్థనా మందిరాన్ని ధ్వంసం చేసి దాన్ని ఒక సామాన్ల కొట్టుగా మార్చారు. 1940ల్లో తురింగియాలోని అన్ని ప్రాంతాల యూదులతో పాటు ఎర్ఫర్ట్‌ నుంచి కూడా 500 మంది యూదులను మృత్యు శిబిరాలకు పంపించారు.


క్రైస్తవులు ఎన్ని దాడులు చేసి ఎంత మంది యూదులను చంపినా సరే, వాళ్లకి ఏ శిక్షలు పడలేదు. ఇక్కడే కాదు, ఎక్కడా పడినట్లు దాఖలా లేదు. వారు యూదులకు బాకీలు ఉన్న అప్పులు అన్నీ మాఫీ చేసేవాళ్ళు. ఇరుగు పొరుగువాళ్ళు పారిపోయిన యూదుల ఇళ్ళూ, సామాన్లూ నాశనం చేసింది చెయ్యగా, మిగిలింది దోచుకునేవాళ్ళు. అలా ఈ పురాతన ప్రార్థనా స్థలం దూలాలు, ముక్కలు కూడా ఎర్ఫర్ట్‌లోని ఇళ్లల్లో కనిపించాయి. అయితే, ఈ శతాబ్దాల హింసకి 1945లో హిట్లర్ చనిపోయిన తర్వాత మొదటిసారి విరామం లభించింది. ఇక్కడికి ఒక అతి చిన్న యూదు సమూహం తిరిగొచ్చి పడిపోయిన ప్రార్థనా స్థలాన్ని తిరిగి కట్టించి, సామాన్ల కొట్టుగా మార్చిన ఇంకొక ప్రార్థనా స్థలాన్ని మ్యూజియంగా మార్చి యునెస్కో మాన్యుమెంట్‌గా గుర్తింపు తెచ్చేందుకు అర్జీ పెట్టుకున్నారు. పరిశోధనకు డబ్బిచ్చి అన్ని విషయాలూ తవ్వి తీయించారు. వీటిల్లో అనేక డాక్యుమెంట్లు బయటపడ్డాయి. మధ్య ఐరోపాలోనే అతి పెద్ద సుందరమైన హీబ్రూ బైబిళ్లు, పవిత్ర యూదు గ్రంధమైన తోరా అరుదయిన కాపీలు నాలుగయిదు బయటకొచ్చాయి.


ఇది కేవలం ఎర్ఫర్ట్ చరిత్ర మాత్రమే కాదు. దాదాపు తురింగియా రాష్ట్రంలో 60కి పైగా పట్టణాలు, గ్రామాల్లో పరిశోధకులు తవ్వి తీసిన వివరాలు చూస్తే అన్ని చోట్లా ఇదే చరిత్ర చిన్న చిన్న మార్పులతో మనకి కన్పిస్తుంది. అన్ని చోట్లా 200 ఏళ్ల నుండి 1000 ఏళ్ల పాటు యూదులు బ్రతికిన ఆనవాళ్లు ఉన్నాయి. ప్రతి చోటా క్రైస్తవ సమాజం వారిని అనేక కారణాలతో వేధించి, అనేకసార్లు బహిష్కరించి, తీవ్రమైన పన్నులు వేసి, వివక్ష చూపటం, అప్పుడప్పుడూ భౌతికంగా నిర్మూలించటం, తరిమేయటం ఇదే జరిగింది. అప్పిచ్చే వ్యాపారం చెయ్యటం వల్ల యూదులు వందల సార్లు తరమబడినా మళ్ళా నిలబడ్డారు కానీ ప్రధానంగా తమకంటూ ఒక చోటు లేకుండా శతాబ్దాల పాటు తిరిగారు. ఒక రాజ్యం బహిష్కరిస్తే ఇంకో చోటికి పారి పోవటం, పట్టణాలు బహిష్కరిస్తే గ్రామాలకి పారిపోవటం చేశారు. ఆస్తులు, ఇళ్లు, సమాధి స్థలాలు, విద్యాలయాలు, పవిత్ర గ్రంథాల ప్రతులు, ప్రార్థనా స్థలాలు అన్నింటినీ అనేకసార్లు పోగొట్టుకున్నారు. వాటిని క్రైస్తవ అధికారులు, పట్టణ అధికారులు, ఇరుగు పొరుగు వాళ్ళు స్వాహా చేసుకున్నారు. అనేకసార్లు నిందించబడ్డారు. ఆత్మహత్యలు చేసుకున్నారు. చివరికి హిట్లర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మృత్యు శిబిరాలకు లక్షల సంఖ్యలో పంపించబడ్డారు.


మధ్య ఐరోపాతో సహా అనేక ప్రాంతాల్లో కూడా ఇదే రకమైన చారిత్రక జ్ఞాపకాలు దొరుకుతాయి. ప్రాగ్, బుడాపెస్ట్, వియెన్నాలలో కొంత వెనకా ముందూ ఇదే పరిస్థితి ఉండేదని టూరిస్టు గైడ్లు మనకి చూపిస్తారు. ఎవరెవరు ఎక్కడెక్కడ నుండి ఎట్లా పారిపోయారు, ఎట్లా చంపబడ్డారో అనే సూక్ష్మ చరిత్రలు కూడా చాలా రాయబడి వున్నాయి. ప్రాగ్ నగరంలో కాఫ్కా నివసించిన చిన్న ఇల్లు, ఆ నగరంలో 500 గజాల స్థలంలో 10,000 మందికి పైగా సమాధులు, ఖాళీ అయిన ఇళ్ళు... ఇవన్నీ ఎన్నెన్నో విషాద చరిత్రలను జ్ఞాపకం చేస్తాయి. యూరోపు అంతా ఏదో విధంగా నిండిన ఈ జ్ఞాపక చిహ్నాలు చూసి, వాటి గురించి చదువుతున్నప్పుడు, తెలుసుకుంటున్నప్పుడు మనలో అనేక ప్రశ్నలు ఉదయిస్తాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూదులకు సమాన హక్కులు ఇచ్చినా ఐరోపా నుండి వారు ఎందుకు వెళ్లిపోయారు? ప్రజాస్వామిక, ఉదారవాద జాతి రాజ్యాలుగా ప్రసిద్ధి పొందిన ఐరోపా దేశాలు, అమెరికా యూదులకు అటువంటి రక్షణ కల్పిస్తామనే భరోసా ఇచ్చి తమ సమాజాలలోనే వారిని ఎందుకు నిలుపుకోలేదు? అసలు యూదులు ఐరోపా నుండి వెళ్ళిపోవటం అంటేనే ఐరోపా దేశాలన్నీ క్రైస్తవ రాజ్యాలని మళ్ళా నిరూపించటమే కదా? అన్నింటి కన్నా ముఖ్యంగా, ఐరోపాలోని తమ తోటి తెల్ల జాతి క్రైస్తవుల చేతుల్లో అమానుష హింస అనుభవించిన యూదులు తమని ఏ హింసకు గురిచెయ్యని, తమతో ఏ సంబంధం లేని అరబ్బు పాలస్తీనా ప్రజల పట్ల క్రూరమైన పీడకులుగా ఎట్లా మారారు?

ఎ.సునీత

Updated Date - Oct 27 , 2024 | 01:04 AM