అధికారం కోసం అగ్గిరాజేస్తారు...!
ABN, Publish Date - Aug 02 , 2024 | 02:08 AM
అధికారంలో ఏ పార్టీ ఉన్నా, రాష్ట్రంలో శాంతిభద్రతలు చక్కగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చి రాష్ట్ర యువతకు ఉద్యోగాలు రావాలని అన్ని పార్టీలూ కోరుకోవాలి...
అధికారంలో ఏ పార్టీ ఉన్నా, రాష్ట్రంలో శాంతిభద్రతలు చక్కగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చి రాష్ట్ర యువతకు ఉద్యోగాలు రావాలని అన్ని పార్టీలూ కోరుకోవాలి. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, రాష్ట్రం బాగుండాలని కోరుకోవాలి. రాజకీయాల్లో ఉన్నవారు, నాయకులైనవారు ప్రజల బాగు కోరాలి. రాష్ట్రాభివృద్ధికి ప్రతిపక్షం కూడా బాధ్యతాయుతంగా ప్రభుత్వానికి సహకరించాలి. కానీ నేడు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్‌ఎస్ వైఖరి ఇందుకు పూర్తి విరుద్ధం. అధికారం చేతిలో లేకపోతే రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలి, అల్లర్లతో రాష్ట్రం అట్టుడకాలి, అశాంతిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసి అధికారంలోకి రావాలనేది మొదటి నుంచి కేసీఆర్‌కు ఉన్న దుష్ట ఆలోచన. రాష్ట్రం పచ్చగా ఉండటం కేసీఆర్‌కు ఇష్టం ఉండదు. ఏదో ఒక సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని ఆయన నిరంతరం ఆలోచిస్తుంటారు. ప్రజలేమైనా పర్లేదు, తనకు, తన కుటుంబానికి అధికారం ఉంటే చాలు.
గతంలో చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వకపోవటంతో ఆయనను బెదిరించటానికి తెలంగాణ పాటను ఎత్తుకున్నారు. ఉద్యమం శాంతియుతంగా నడుస్తుంటే కేసీఆర్‌కు నచ్చలేదు. ఒకరోజు హఠాత్తుగా హరీష్‌రావు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ముట్టించుకోవటానికి అగ్గిపెట్టె దొరకడం లేదంటూ మీడియా ఎదుట డ్రామాలాడారు. ఇది సంచలనమై, ఇదేవిధంగా చేస్తే రాష్ట్రం సిద్ధిస్తుందని యువత భావించింది. శ్రీకాంతాచారి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవటంతో రాష్ట్రంలో అగ్గిరాజుకుంది. ఈ విషయాన్ని టీఆర్‌ఎస్ విపరీతంగా ప్రచారం చేసింది. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత భావించి ఆవేశంతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదని యువకులను శాంతింపజేయాల్సింది పోయి వారిని మరింతగా టీఆర్‌ఎస్ నాయకులు రెచ్చగొట్టిన కారణంగా వందలమంది విద్యార్థులు బలైపోయారు. నిజానికి చావునోట్లో తలపెట్టింది విద్యార్థులయితే.. అదంతా తన ఖాతాలో వేసుకొని సకుటుంబ సపరివార సమేతంగా పదవులు, భోగాలు అనుభవించారు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే తానే తెలంగాణ తెచ్చిన వీరుడినని ప్రచారం చేసుకొని విద్యార్థుల బలిదానాలను అడ్డంపెట్టుకొని, సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. వచ్చిన తరువాత బలిదానాలు చేసిన యువత కుటుంబాలను, త్యాగాలు చేసిన వారిని కేసీఆర్ విస్మరించారు. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను, నాయకులను ఫిరాయింపు చేసుకొని వారికి పదవులు ఇచ్చారు తప్ప త్యాగాలు చేసిన కుటుంబాలకు ఒక్కరికి కూడా పదవులివ్వలేదు కదా వారిని దగ్గరికి కూడా రానివ్వలేదు. దీనిని బట్టి తెలుస్తున్నదేమిటంటే.. ఉద్యమంలో విద్యార్థులను రెచ్చగొట్టింది తాను అధికారంలోకి రావటానికి తప్ప వారికి న్యాయం చేయటానికి కాదని.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తూ పోతున్నది. అయినా కరెంట్ ఉండటం లేదని, పొలాలు ఎండిపోతున్నాయని, వడ్లు కొనడం లేదని, రైతుబంధు ఇవ్వడం లేదని, రుణమాఫీ చేయడం లేదని ప్రజలను రెచ్చగొట్టడానికి బీఆర్‌ఎస్ తీవ్రంగా ప్రయత్నించింది. పార్లమెంట్ ఎన్నికలలో ఇదే అబద్ధాలను ఊరూరా ప్రచారం చేసింది. కానీ ప్రజలు ఇవేవీ నమ్మలేదు. వారు ప్రచారం చేసిన అన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చటంతో బీఆర్‌ఎస్‌కు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. పదేళ్లు అధికారం అనుభవించి వేల కోట్లు కూడబెట్టుకున్న కేసీఆర్‌ను ప్రజలు అధికారానికి దూరం చేయడంతో ఆయన నీటిలోంచి ఒడ్డున పడ్డ చేపలాగా గిలగిల కొట్టుకుంటున్నారు. రాష్ట్రంలో ఏ విధంగానైనా అశాంతి నెలకొల్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరం చేయాలని కుట్రలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లోనే 30వేల ఉద్యోగాలిచ్చి రికార్డు సృష్టించింది. ఆ వెంటనే డీఎస్సీ, గ్రూప్–1 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చింది. ఇది బీఆర్‌ఎస్ నాయకులకు కంటగింపుగా మారింది. తాము 10 సంవత్సరాల్లో చేయలేని పనిని మూడు నెలలు గడిచేటప్పటికే కాంగ్రెస్ నెరవేరుస్తుండటంతో వారు తట్టుకోలేకపోయారు. పార్లమెంట్ ఎన్నికలలో డిపాజిట్లు కోల్పోయి ఒక్క సీటు కూడా గెలుచుకోక కుదేలైపోయిన బీఆర్‌ఎస్‌కు ఏ అస్త్రం దొరకలేదు. దీనితో విద్యార్థులను రెచ్చగొట్టడానికని కేసీఆర్ తన క్రిమినల్ బ్రెయిన్‌ను వాడారు. ఉద్యమ సమయంలో యువతను రెచ్చగొట్టినట్లే ఇప్పుడు కూడా రెచ్చగొట్టడానికి ఆయన ఫామ్‌హౌస్‌లో కూర్చొని కొడుకు, అల్లుడుతో కలిసి వ్యూహం రూపొందించారు. డీఎస్సీ, గ్రూప్స్ పరీక్షలను వాయిదా వేయాలంటూ విద్యార్థులను రెచ్చగొట్టి రోడ్డెక్కించారు. గతంలో పరీక్షలు సక్రమంగా నిర్వహించాలంటూ విద్యార్థులు రోడ్డెక్కడం చూశాం. ఇప్పుడు, పరీక్షలు పెడతామంటే, కాదు వాయిదా వేయాలంటూ కొంతమంది ఆర్టిఫిషియల్ నిరుద్యోగుల చేత కేసీఆర్ ధర్నా చేయించడం చూస్తున్నాం.
కాంగ్రెస్ ప్రభుత్వం గత పాలకుల మాదిరిగా కాకుండా అన్ని పార్టీల సభ్యులకు శాసనసభలో మాట్లాడే అవకాశం కల్పిస్తున్నది. సభలో సస్పెన్షన్లు లేవు, గొడవలు లేవు. నిరాటంకంగా సభ జరుగుతున్నది. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ సభకు హాజరై మాట్లాడాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పదే పదే కోరుతున్నా ఆయన సభకు రావటం లేదు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ప్రతిపక్షం నుంచి ఎవరూ మాట్లావడద్దు అని బయటికి నెట్టివేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుడు సభకు వచ్చి మాట్లాడాలంటూ కోరుతున్నది. కానీ కేసీఆర్ సభకు హాజరుకాకుండా ఫామ్‌హౌస్‌లో ఉంటూ ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారు.
ఈ ప్రభుత్వం ఐదేళ్లు పాలన చేయవద్దని, దానిని కూల్చాలని కేసీఆర్ కోరుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగు రోజులు కాకముందే ఈ ప్రభుత్వం త్వరలో కూలిపోతుందన్నారు. రాష్ట్రంలో అస్థిరత సృష్టించాలని ప్రయత్నించారు. జగన్, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. ఇదేకాక, సభ సాఫీగా నడుస్తుంటే తట్టుకోలేక మహిళలను అవమానించారంటూ పెద్ద డ్రామాకు తెరతీశారు. సభను నడవనివ్వబోమంటూ స్పీకర్ పోడియం దగ్గర చేరి నినాదాలు చేస్తూ తీవ్ర ఆటంకం కలిగించారు. మహిళా సెంటిమెంట్ రెచ్చగొట్టాలని సభలో రచ్చ చేశారు. శాసనసభలో ప్రతిపక్షం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం పరిష్కరించకపోతే ధర్నా చేయటం ఆనవాయితీ. కానీ బీఆర్‌ఎస్‌కు ప్రజా సమస్యలేవీ కనపడకపోవటంతో వ్యక్తిగత సమస్యలకు సభను వేదికగా మార్చారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్య యుతంగా సభను నడుపుతున్నది. ప్రతిపక్షానికి మాట్లాడటానికి కావాల్సినంత సమయం ఇస్తున్నది. అయినా సభామర్యాదలను పాటించకుండా బీఆర్‌ఎస్ నాయకులు అనుచితంగా ప్రవర్తించారు. గురువారంనాడు స్కిల్ యూనివర్సిటీ బిల్లు, ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అనే రెండు అంశాలపై శాసనసభలో చర్చ జరిగింది. ముఖ్యమైన ఈ అంశాలపై మాట్లాడవలసిందిగా బీఆర్‌ఎస్ సభ్యులను పదేపదే కోరినా, పెడచెవిన పెట్టి నినాదాలు, అల్లర్లతో ఇతర సభ్యులు మాట్లాడకుండా ఆటంకం కలిగించారు.
ఎస్సీ వర్గీకరణపై సభ్యులు మాట్లాడుతుంటే అరుస్తూ అంతరాయం కలిగించటాన్ని సభలోని అన్ని పక్షాలు తప్పుబట్టాయి. అయినా బీఆర్‌ఎస్ సభ్యులు తమ మొండి వైఖరి వీడలేదు. ఎంత అల్లరి చేసినా సస్పెండ్ చేయకపోవటంతో నిరాశకు గురై వారంతట వారే సభనుంచి వాకౌట్ చేశారు. వారు వాకౌట్ చేసింది ఎస్సీ వర్గీకరణ బిల్లుకు వ్యతిరేకంగానా? లేక స్కిల్ యూనివర్సిటీకి బిల్లుకు వ్యతిరేకంగానా? అనే అనుమానం కలుగుతోంది. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో వారు వాకౌట్ చేశారంటే దానికి వ్యతిరేకంగానే వారు వాకౌట్ చేశారనే అభిప్రాయం కలుగుతోంది.
మహిళలను అడ్డంపెట్టుకొని బీఆర్‌ఎస్ నీచ రాజకీయానికి దిగింది. ఏదో ఒక సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి శాంతిభద్రతలకు భంగం కలిగించి లబ్ధిపొందాలనేది కేసీఆర్ వికృత ఆలోచన. ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి వారి చరిత్ర గమనిస్తే ఇదే అర్థమవుతున్నది. రాష్ట్ర, ప్రజా ప్రయోజనాలతో వారికి సంబంధం ఉండదు. అధికారమే వారికి పరమావధి. ఇది గ్రహించే ప్రజలు కేసీఆర్‌ను ఫామ్‌హౌస్‌కు పంపించారు. ఈ విషయాన్ని కేసీఆర్ ఎంత తొందరగా గ్రహిస్తే రాష్ట్రానికి అంత మంచిది.
బోరెడ్డి అయోధ్యరెడ్డి
సీపీఆర్‌ఓ–తెలంగాణ ముఖ్యమంత్రి
Updated Date - Aug 02 , 2024 | 02:08 AM