కల్తీ నెయ్యికి పరిష్కారం ఇలా!
ABN, Publish Date - Oct 04 , 2024 | 12:22 AM
తిరుమలేశుని ప్రసాదాలకు, అన్నదాన కార్యక్రమాలకు స్వచ్ఛమైన ఆవునెయ్యి వినియోగం వల్ల అనాదిగా స్వామివారి ప్రసాదాలు ముఖ్యంగా లడ్డూ ప్రసాదం రుచి, వాసన, ఎక్కువ రోజులు నాణ్యత కోల్పోని గుణం వల్ల ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి...
తిరుమలేశుని ప్రసాదాలకు, అన్నదాన కార్యక్రమాలకు స్వచ్ఛమైన ఆవునెయ్యి వినియోగం వల్ల అనాదిగా స్వామివారి ప్రసాదాలు ముఖ్యంగా లడ్డూ ప్రసాదం రుచి, వాసన, ఎక్కువ రోజులు నాణ్యత కోల్పోని గుణం వల్ల ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి. అయితే గత నాలుగైదు సంవత్సరాలుగా కల్తీ నెయ్యి, సుగంధ ద్రవ్యాల వాడకం వల్ల తిరుమల లడ్డూ నాణ్యతను కోల్పోతూ స్వామివారి భక్తులలో అసంతృప్తిని కలిగిస్తోంది. గుజరాత్‌లోని నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు వారు తిరుమల లడ్డూకు వాడిన నెయ్యిలో జంతుకొవ్వు కలిసినట్టు ధృవీకరించిన విషయం తెలిసి వేంకటేశ్వరుని భక్తులు నివ్వెరపోయారు. గత పాలకవర్గ అవినీతి నిర్ణయాల కారణంగా స్వామివారి ప్రసాదంతో పాటు ఆలయ పవిత్రతకు తీరని అపచారం జరిగింది.
ప్రతిరోజూ 10–15 వేల కిలోల నెయ్యిని కొనుగోలు చేసే టీటీడీకి నాణ్యతను శాస్త్రీయంగా పరీక్షించే ఆధునిక క్వాలిటీ కంట్రోల్ లేబరేటరీ లేకపోవడం విచిత్రం! తిరుపతిలోనే ఉన్న ఎస్‌వి వెటర్నరీ యూనివర్శిటీ శాస్త్రజ్ఞులు, సిబ్బంది సేవల్ని టీటీడీ వినియోగించుకోవచ్చు. ఇదికాక బెంగుళూరులోని ఇండియన్ డెయిరీ రీసెర్చి ఇనిస్టిట్యూట్, గుజరాత్‌లోని ఎన్‌డీడీబీ నుంచి కూడా అవసరమైన సహాయ సహకారాలు పొందవచ్చు. ఇప్పటికే టీటీడీ అవసరార్థం సుమారు 75 లక్షల రూపాయల విలువైన నాణ్యతా ప్రమాణాల తనిఖీ లేబరేటరీ ఏర్పాటుకు ఎన్‌డీడీబీ విరాళాన్ని ప్రకటించడం ప్రశంసనీయం.
టీటీడీకి వచ్చే ప్రతి నెయ్యి ట్యాంకర్ నుంచి నాలుగు నమూనాలు సేకరించి ఒకటి సొంత లేబరేటరీలోనూ, మిగిలిన మూడింటిలో రెండు వేర్వేరు గుర్తింపు పొందిన లేబరేటరీలకు పంపి, ఒక నమూనాను మాత్రం తర్వాత అవసరమయ్యే నిర్ధారణ పరీక్షలకు భద్రపరచాలి. మూడు లేబరేటరీల ఫలితాల ఆధారంగా నెయ్యి నాణ్యతను నిర్ధారించిన తర్వాత మాత్రమే కాంట్రాక్టరుకు చెల్లింపు జరపాలి. కొనుగోలు సంస్థకు, సరఫరాదారునికి తలెత్తే వివాదాల పరిష్కారానికి నిర్దిష్టమైన విధివిధానాలను కూడా రూపొందించి ప్రతి స్థాయిలోనూ పారదర్శకత పాటించాలి. సరఫరాదారుడు ఉత్పత్తి చేసే లేదా సేకరించే పాలను, నెయ్యి తయారీ విధానాన్ని అన్ని స్థాయిల్లోనూ పర్యవేక్షించే అధికారం టీటీడీకి ఉండాలి.
వాస్తవానికి మోపురాలు, గంగడోలు లేని విదేశీ, సంకరజాతి ఆవుల పాలలో దేశీ ఆవుల పాలలో ఉన్న పోషక, ఔషధ ధాతులు గానీ, రుచి – సువాసన గానీ ఉండవు. అందుకే ఆధ్యాత్మిక, హిందూ పూజా కార్యక్రమాలకు వాడే దేశీ ఆవుల పాల ధర లీటరకు వంద రూపాయలకు పైగా ఉంది. దేశీ ఆవులు, సేంద్రీయ వ్యవసాయ రంగాల పట్ల ఇటీవల సాధారణ రైతుల్లో కూడా ఆసక్తి పెరిగింది. అందువల్ల టీటీడీ వారే తిరుపతి, చిత్తూరు పరిసర జిల్లాల్లో శ్రేష్ఠమైన దేశీ పశువుల పెంపకాన్ని ప్రోత్సహించే పథకాలను రూపొందించి, ఆ పాలను సేకరించాలి. పిండ మార్పిడి పద్ధతిలో వేగంగా అత్యున్నత స్థాయి దేశీ పశుసంపదను వృద్ధి చేసే ప్రణాళికను తిరుపతిలోనే ఉన్న ఎస్‌వి పశువైద్య విశ్వవిద్యాలయం వారి సాంకేతిక భాగస్వామ్యంతో అమలు చేయవచ్చు. దీనివల్ల శ్రేష్ఠమైన ఆవునెయ్యితో పాటు అన్నదాన వితరణకు అవసరమైన చిక్కని మజ్జిగను కూడా పొందవచ్చు.
డాక్టర్ వాసిరెడ్డి హనుమంతరావు
డాక్టర్ ఎంవిజి అహోబలరావు
Updated Date - Oct 04 , 2024 | 12:22 AM