ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికే ఈ యుద్ధోన్మాదం!

ABN, Publish Date - Oct 22 , 2024 | 12:20 AM

ప్రపంచం అల్లకల్లోలంగా ఉంది. అమెరికా సామ్రాజ్యవాదుల నేతృత్వంలో పాశ్చాత్య సామ్రాజ్యవాదులు బరితెగించి ఫాసిస్టు శక్తులను ఎగదోసి ప్రపంచ యుద్ధానికి కాలు దువ్వుతున్నారు....

ప్రపంచం అల్లకల్లోలంగా ఉంది. అమెరికా సామ్రాజ్యవాదుల నేతృత్వంలో పాశ్చాత్య సామ్రాజ్యవాదులు బరితెగించి ఫాసిస్టు శక్తులను ఎగదోసి ప్రపంచ యుద్ధానికి కాలు దువ్వుతున్నారు. ప్రపంచ యుద్ధ కారుమేఘాలు దట్టంగా అలముకున్నాయి. సామ్రాజ్యవాదులు ప్రపంచ యుద్ధం ద్వారానే తీవ్రతరమవుతున్న ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలనీ ఉవ్విళ్లూరుతున్నారు. ప్రాంతీయ యుద్ధాలను రావణకాష్ఠంలా మండిస్తూ ప్రపంచ శాంతి సుస్థిరతలకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నారు.

1991లో సోవియట్‌ యూనియన్‌ కూలిపోయి, సామ్రాజ్యవాదంలో సాపేక్షిక స్థిరత్వం ఏర్పడడం వల్ల గ్లోబలైజేషన్‌ ఒక ముఖ్య పరిణామంగా ముందుకొచ్చింది. సామ్రాజ్యవాదానికి సంబంధించి ఒక రూపమే ప్రపంచీకరణ. రష్యా, చైనా వైఫల్యాల కారణంగా సామ్రాజ్యవాదులు తమకు అనుకూలంగా ఏర్పడిన పరిస్థితులను ఉపయోగించుకుని ఆర్థిక కార్యకలాపాలను విస్తరించుకుంటూనే నయా ఉదారవాద విధానాల ముసుగులో వెనుకబడిన దేశాల మీద, అక్కడి ప్రజల మీద పాశవికమైన దాడులు చేశారు. ఇరాక్‌, అఫ్ఘానిస్తాన్‌, లిబియా, యుగొస్లావియా దేశాల మీద యుద్ధాలు ప్రకటించారు. మూడవ ప్రపంచ దేశా‌ధినేతల నివాస భవనాల మీదనే బాంబుల వర్షం కురిపించి, వాటిని ధ్వంసం చేసి వాళ్లను లొంగదీసుకోవాలని, ఆ నాయకులను తరిమి కొట్టి, నిర్బంధించి, ఉరితీయడం వంటి దమనకాండలను కొనసాగించారు. కానీ ఈ దురాక్రమణ చర్యలేవీ వారిని సంక్షోభ సుడిగుండం నుంచి కాపాడలేకపోయాయి. ప్రపంచ ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా మారుతూ వస్తోంది. 2008లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మొదలైన మాంద్యం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దాని నుంచి ఇంపీరియలిజం బయటపడలేకపోవడం, సంక్షోభం రోజురోజుకూ విస్తరిస్తున్న పరిస్థితుల పూర్వరంగంలో మూడవ ప్రపంచ యుద్ధం సంభవించే దిశలో పరిణామాలు జరుగుతున్నాయి. అదే ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన ప్రధాన లక్షణం.


సోవియట్‌ యూనియన్‌ను విచ్ఛిన్నం చేయడమే గాక ఆ యూనియన్‌లోని పలు దేశాలను నాటో మిలిటరీ కూటమిలో చేర్చుకుని రష్యా ఆర్థిక వనరులను కొల్లగొట్టడానికి వీలుగా దానిని పాదాక్రాంతం చేసుకోవడం కోసం అమెరికన్‌ సామ్రాజ్యవాదులు ఉక్రెయిన్‌లో అక్రమంగా ఫాసిస్టు రాజ్యాన్నే నెలకొల్పి, రష్యాపై పాశవిక దురాక్రమణకు పాల్పడ్డారు. రెండు సంవత్సరాలకు పైగా అక్కడ భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. అమెరికా అండదండలతో ఇజ్రాయిల్‌ ఫాసిస్టు పాలకులు గత పది నెలలుగా గాజాలో కొనసాగిస్తున్న హత్యాకాండలో నలభై వేల మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అత్యధికులు నిరాయుధులైన స్త్రీలు, పిల్లలే. యుద్ధ బాధితులకు అండగా నిలిచిన ఐరాస స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలను కూడా పెద్దయెత్తున మట్టుబెట్టడం కనీవినీ ఎరుగనిది. ఇరాన్‌పై ప్రత్యక్షంగా క్షిపణులతో దాడులు చేస్తూ అది యుద్ధానికి తలపడేలా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. అమెరికన్‌ సామ్రాజ్యవాదులు చైనాను చుట్టుముట్టి దెబ్బతీయాలని శతవిధాల ప్రయత్నిస్తున్నారు. మిత్ర దేశాలతో సైనిక ఒప్పందాలు చేసుకుని అనేక సైనిక స్థావరాలను నెలకొల్పి విధ్వంసకరమైన మారణాయుధాలు పోగు చేసుకుని టెర్రరిస్టులుగా పేరొందిన ఫాసిస్టు గ్యాంగులను పెంచి పోషిస్తున్నారు. వెనుకబడిన దేశాలను తమ నయా వలసలుగా మార్చుకుని దోపిడీ పీడనలను నిరాటంకంగా కొనసాగించాలనేది వారి వ్యూహం.


అమెరికా యుద్ధోన్మాద చర్యలన్నీ కదిలిపోతున్న తమ ఏక ధృవ ప్రపంచ ప్రాబల్యాన్ని కాపాడుకోవడానికే ఉద్దేశించినవి. ప్రపంచ జీడీపీలో బ్రిక్స్‌ దేశాల వాటా గణనీయంగా వృద్ధి చెందింది. పాశ్చాత్య దేశాలకు దీటుగా చైనా బలమైన ఆర్థిక శక్తిగా పెంపొందింది. లాటిన్‌ అమెరికా దేశాలలో వామపక్ష శక్తుల విజయపరంపర కొనసాగుతోంది. మాలి, బుర్కినాఫాసో, నైజర్‌ మొదలైన ఆఫ్రికా దేశాలలో స్వాతంత్ర్య పోరాటాలు బలోపేతమవుతున్నాయి. రష్యాపై ఆంక్షలు విధించి దానిని ఆర్థికంగా కృంగదీయాలనే ప్రయత్నాలు విఫలమయ్యాయి. యూరప్‌ ప్రజలు తమ జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవడం కోసం పెద్దయెత్తున సంఘటితపడి వీధుల్లోకి వచ్చి పోరాడుతున్నారు. భారత ప్రజానీకం హిందుత్వ ఫాసిస్టు పాలకుల విధానాలను ప్రతిఘటిస్తున్నారు. చైనా, క్యూబా, వియత్నాం, ఉత్తర కొరియా దేశాలలో ప్రజలు సోషలిస్టు లక్ష్యాలకు పునరంకితమవుతున్నారు. ఒక్క దేశమేమిటి, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు నయా ఉదారవాద విధానాలను తిప్పికొడుతూ పోరాటాలలో సమైక్యమవుతున్నారు. ఈ పరిణామాలన్నీ అమెరికా, యుకె, యూరప్‌ పాశ్చాత్య సామ్రాజ్యవాదుల ప్రపంచాధిపత్యానికి తీవ్ర అవరోధంగా తయారయ్యాయి. ప్రపంచ శాంతి, సుస్థిరత, సామాజిక న్యాయం, సోషలిజం లక్ష్యాలుగా పెంపొందుతున్న ఈ ఉద్యమాలను నిర్మూలించాలనే పథకంలో భాగంగానే నేడు సామ్రాజ్యవాదులు ప్రపంచ యుద్ధ సన్నాహాలను ముమ్మరం చేస్తున్నారు.


సామ్రాజ్యవాదం అంటేనే యుద్ధం. సామ్రాజ్యవాదం ఉన్నంతవరకు ప్రపంచ యుద్ధ ప్రమాదాలు సమసిపోవు. రెండవ ప్రపంచ యుద్ధం ముందు కాలం నాటి పరిస్థితులు నేడు పునరావృతమవుతున్నాయి. గత సంవత్సరం రోమ్‌ నగరంలో 40 దేశాల కమ్యూనిస్టు నాయకులు, వర్కర్స్‌ పార్టీల ప్రతినిధులు సమావేశమై ప్రపంచ ప్రజలు సమైక్యంగా ఫాసిస్టు శక్తులను ఓడించాలనీ పిలుపునివ్వడం గమనించదగిన పరిణామం. హిట్లర్‌ నాజీ సైన్యాలను మట్టికరిపించిన సోవియట్‌ ప్రజల త్యాగాన్నీ, సాహసాన్నీ స్ఫూర్తిగా తీసుకుని ప్రపంచ కార్మికులు, కమ్యూనిస్టులు, ప్రజాస్వామికవాదులు, అభ్యుదయకాముకులు, వామపక్షీయులు సంఘటితమై మూడవ ప్రపంచ యుద్ధ ప్రమాదాన్ని నివారించడానికి ముందుకు రావాలి. అందుకు అంతర్జాతీయ ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటన ఏర్పాటు బాటలు వేస్తుంది. ఇంపీరియలిస్టు మిలిటరిజాన్నీ, నయా ఫాసిజాన్నీ, నయా వలసవాదుల యుద్ధోన్మాదాన్నీ నిరసిస్తూ కలిసివచ్చే శక్తులన్నింటినీ కలుపుకుని కమ్యూనిస్టులు అగ్రభాగాన నిలిచి పోరాడినపుడే విస్తృత ప్రజా ఐక్యసంఘటన సుసాధ్యమవుతుంది.

డాక్టర్‌ శ్రీనివాస్‌

కె.ఎస్‌. మెమోరియల్‌ కమిటీ

Updated Date - Oct 22 , 2024 | 12:20 AM